
సాక్షి, నాగర్‌కర్నూల్: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో పదో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నెల్‌లో టీబీఎం మిషన్ కటింగ్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. అలాగే, నేడు కన్వేయర్ బెల్టు పునరుద్దరణ చర్యలను అధికారులు చేపట్టారు. పిల్లర్ వేసి కన్వేయర్ బెల్టును విస్తరించనున్నారు. ఇక, టన్నెల్‌లో ఊరుతున్న నీటితో పనులకు ఆటంకం కలుగుతోంది.
👉మరోవైపు.. టన్నెల్‌లో ఏడు మీటర్ల లోతు తవ్వినా కూడా కార్మికుల ఆచూకీ లభ్యం కావడం లేదు. జీపీఆర్ టెక్నాలజీ విఫలం కావడంతో గందరగోళం ఏర్పడుతోంది. పది రోజులుగా టన్నెల్‌లో ఉన్న వారి కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.
👉ఇదిలా ఉండగా సీఎం రేవంత్ రెడ్డి ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు ఆదివారం సాయంత్రం వెళ్లారు. అక్కడ జరుగుతున్న సహాయక చర్యలను పరిశీలించారు. రెస్క్యూ ఆపరేషన్ ఎలా జరుగుతుందని ఆరా తీసి.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సొరంగంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకువచ్చేందుకు అవసరమైతే రోబోల సాయం తీసుకోవాలని అధికారులకు సూచించారు. సొరంగంలో చిక్కుకున్న వాళ్లు ఎక్కడున్నారో.. బతికి ఉన్నారో లేదో అంచనాకు రాలేదన్న సీఎం.. మరో రెండు రోజుల్లో కొలిక్కి వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రకృత్తి విపత్తులు జరిగినప్పుడు.. అండగా నిలవాల్సిన విపక్షాలు రాజకీయ విమర్శలు చేయడం తగదన్నారు.
👉సహాయక చర్యలు, తవ్వకాలకు నిరంతర నీటి ఊట అడ్డంకిగా మారుతోంది. పూడిక, కత్తిరించిన టీబీఎం భాగాలను తరలించడంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కన్వేయర్ బెల్ట్ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. షిఫ్ట్‌కు 120 మంది చొప్పున రోజుకు మూడు షిఫ్టుల్లో సహాయక బృందాలు పనిచేస్తున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, హైడ్రా, సింగరేణి రెస్క్యూ బృందాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. సహాయక చర్యల్లో 18 ఏజెన్సీలు, 700 మందికి పైగా సిబ్బంది పాల్గొంటున్నారు.
అనుమానిత ప్రాంతాలు తాజాగా గుర్తింపు
👉ఎస్‌ఎల్‌బీసీ సొరంగం కుప్పకూలిన ఘటనలో గల్లంతైన కార్మికుల జాడ ఉన్నట్టుగా అనుమానిస్తున్న ఇతర ప్రాంతాలను.. గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) టెక్నాలజీ సహాయంతో నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్జీఆర్‌ఐ) తాజాగా గుర్తించింది. నలుగురు కార్మీకులు టన్నెల్ బోరింగ్ యంత్రం (టీబీఎం)కు వెనుక మట్టిదిబ్బల కింద కూరుకుపోయి ఉన్నట్టు అనుమానిస్తుండగా, మరో నలుగురు టీబీఎం ఉన్న ప్రాంతంలోనే శిథిలాల కింద ఉన్నారని అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ఎన్‌జీఆర్‌ఐ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఎన్డీఆర్‌ఎఫ్ నిపుణులు ఆదివారం ఊహా చిత్రం రూపొందించారు. దీని ఆధారంగా డయాగ్రామ్‌ను తయారు చేసి, దాని ఆధారంగా మూడు దశల్లో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించేందుకు వ్యూహం సిద్ధం అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment