SLBC: నేడు మరో రెండు మృతదేహాలు వెలికితీత! | SLBC Tunnel Rescue operation continue On 10th March live updates | Sakshi
Sakshi News home page

SLBC: నేడు మరో రెండు మృతదేహాలు వెలికితీత!

Published Mon, Mar 10 2025 9:21 AM | Last Updated on Mon, Mar 10 2025 11:03 AM

SLBC Tunnel Rescue operation continue On 10th March live updates

సాక్షి, మహబూబ్‌నగర్‌: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద సహాయక చర్యలు 17వ రోజు కొనసాగుతున్నాయి. సొరంగంలో చిక్కుకున్న వారిని ఒక్కొక్కరికిగా గుర్తిస్తున్నారు. సహాయక చర్యల్లో భాగంగా ఆదివారం ఎట్టకేలకు ఒక మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. ఎత్తు, చేతి కడియం తదితర ఆనవాళ్లను బట్టి పంజాబ్‌కు చెందిన టీబీఎం ఆపరేటర్‌ గుర్‌ప్రీత్‌సింగ్‌ (40)గా గుర్తించారు. గురుప్రీత్‌ సింగ్‌ మృతదేహాం లభ్యమైన చోటే మరో ఇద్దరి ఆనవాళ్లు గుర్తించినట్టు తెలుస్తోంది. నేడు ఇద్దరి మృతదేహాలను వెలికి తీసే అవకాశం ఉంది.

గత నెల 22న ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చోటుచేసుకున్న ప్రమాదం కారణంగా ఎనిమిది మంది టన్నెల్లో చిక్కుకుపోయారు. అప్పటి నుంచి సొరంగంలో సహాయచర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం టీబీఎం ఆపరేటర్‌ గుర్‌ప్రీత్‌సింగ్‌ మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం, బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల పరిహారం అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించనున్నట్లు తెలిపారు.

సహాయచర్యల్లో భాగంగా సొరంగం లోపల పేరుకుపోయిన మట్టి, టీబీఎం యంత్రం దిగువన డాప్లర్‌ సంకేతాలతో కొన్ని ప్రాంతాలను గుర్తించారు. కేరళకు చెందిన క్యాడవర్‌ డాగ్స్‌ (స్నిఫర్స్‌) కూడా పలువురి ఆనవాళ్లను పసిగట్టాయి. దీంతో, శనివారం రాత్రి సహాయక బృందాలు టీబీఎం ఎడమవైపు భాగంలో తవ్వుతుండగా ఆరు అడుగుల లోతులో మొదట కుడిచేతి వేళ్లు, చేతి కడియం కనిపించాయి. అధికారుల సూచనల మేరకు గురుప్రీత్‌ సింగ్‌ మృతదేహాన్ని వెలికితీశారు.  దాదాపు 12 గంటల పాటు శ్రమించి మృతదేహాన్ని జాగ్రత్తగా వెలికితీశారు. ఇంజినీర్‌ ఆచూకీని కనుగొన్న ప్రాంతానికి కొంచెం అటూ ఇటూ మరో ముగ్గురి జాడ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈరోజు మరో ఇద్దరి జాడ లభించే అవకాశం ఉందని సహాయ బృందాలు తెలిపాయి. మిగిలినవారు సొరంగం చిట్టచివరి భాగం వద్ద టీబీఎం కట్టర్‌ సమీపంలో చిక్కుకుని ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

మూడేళ్లుగా గుర్‌ప్రీత్‌సింగ్‌ విధులు 
ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో మృతదేహం లభ్యమైన గుర్‌ప్రీత్‌సింగ్‌ స్వస్థలం పంజాబ్‌ రాష్ట్రంలోని తరన్‌తరాన్‌. రాబిన్స్‌ సంస్థలో 2022 నుంచి టీబీఎం ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య రాజేందర్‌ కౌర్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్యాపిల్లలు స్వస్థలంలో ఉండగా.. గుర్‌ప్రీత్‌సింగ్‌ మూడేళ్లుగా దోమలపెంటలోని రాబిన్స్‌ క్యాంపులో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు. ప్రమాదం జరిగాక బంధువులు వచ్చి కొన్ని రోజులు వేచిచూశారు. ఆచూకీ తెలియకపోవడంతో స్వస్థలానికి వెళ్లిపోయారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement