SLBC టన్నెల్ ప్రమాదం: వీడని ఉత్కంఠ.. 13 రోజులైనా జాడే లేదు | 13th Day Rescue Operation In Slbc Tunnel Updates | Sakshi
Sakshi News home page

SLBC టన్నెల్ ప్రమాదం: వీడని ఉత్కంఠ.. 13 రోజులైనా జాడే లేదు

Published Thu, Mar 6 2025 10:44 AM | Last Updated on Thu, Mar 6 2025 11:55 AM

13th Day Rescue Operation In Slbc Tunnel Updates

సాక్షి, నాగర్‌ కర్నూల్‌/మహబూబ్‌నగర్‌: ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల వెలికితీతపై ఉత్కంఠ వీడటం లేదు. 13 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నా కార్మికుల ఆచూకీ లభించలేదు. మూడు షిప్టుల్లో 24 గంటలూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 13 రోజులు గడుస్తున్నా 8 మంది కార్మికుల ఆచూకీ ఇంకా దొరకలేదు. అనుమానిత ప్రాంతాల్లో ముమ్మరంగా తవ్వకాలు చేపట్టారు. టీబీఎం మిషన్‌పై బుర తొలగింపునకు వాటర్‌ గన్స్‌ ఉపయోగిస్తున్నారు. రోబోల వినియోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

కాగా, కొన్ని రోజులుగా కష్టపడి పునరుద్ధరించిన కన్వేయర్‌ బెల్టు మళ్లీ తెగిపోయింది. సొరంగంలోని మట్టి, ఇతర వ్యర్థాలను లోకో ట్రైన్‌ ద్వారానే తరలిస్తున్నారు. సొరంగం పైకప్పు కూలిన ప్రదేశంలో నీటి ఊట ఏ మాత్రం తగ్గలేదు. టన్నెల్‌లో ఉబికి వస్తున్న నీటి ఊటతో డ్రిల్లింగ్‌ పనులు ముందుకు సాగడం లేదు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, సింగరేణి, ర్యాట్‌ హోల్‌ మైనర్స్, ఇతర సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి. జీపీఆర్‌ ద్వారా మానవ అవశేషాలను గుర్తించిన ప్రాంతాల్లో బురద, మట్టి ఇతర వ్యర్థాల తొలగింపు ప్రక్రియ చేపడుతున్నారు.

అయితే సహాయక బృందాల మధ్య సమన్వయం కొరవడటంతో, ఎవరికి వారు ఇక్కడ.. అక్కడ అన్నట్టుగా పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు ఇలాగే కొనసాగితే మరో 10 రోజులైనా సొరంగంలో చిక్కుకున్న వారిని బయటికి తెచ్చే పరిస్థితి కనిపించడం లేదు. లోకో ట్రైన్‌ 13.5 కిలోమీటర్ల వరకు వెళ్తుండటంతో మట్టి, రాళ్లతో పాటు కట్‌చేసిన టీబీఎం మెషీన్‌ విడి భాగాలను బయటకు తరలిస్తున్నారు. కాగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్దకు వచ్చి వెళ్లిన నాటి నుంచి అధికారుల హడావుడి అంతగా కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

టన్నెల్‌ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను బయటికి తీసుకు రావడం కష్టతరంగా మారుతోంది. టన్నెల్‌లో దుర్వాసన వస్తుండటంతో సహాయక చర్యలు చేపట్టలేని పరిస్థితిలో సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పేరుకుపోయిన మట్టి, శిథిలాలకు తోడు నీటి ఊట ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో ఒక అడుగు ముందుకు పడితే.. రెండు అడుగులు వెనక్కి పడుతున్నాయని రెస్క్యూ బృందాలు వాపోతున్నాయి. గతనెల 22 నుంచి వివిధ విభాగాలకు చెందిన సహాయక బృందాలు సొరంగంలో జల్లెడ పడుతున్నా కార్మికుల ఆనవాళ్లు లభించడం లేదు. సొరంగం కూలిన ప్రాంతంలో భూ ప్రకంపనలకు గల అవకాశాలను నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ ప్రతినిధుల బృందం పరిశీలించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement