సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీకి కసరత్తు మొదలైంది. ఈ మేరకు బ్యాంకర్లు ప్రభుత్వానికి లెక్కలు సమర్పించినట్లు సమాచారం. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి(ఎస్‌ఎల్‌బీసీ) ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో 48 లక్షల మంది రుణమాఫీకి అర్హత సాధించినట్లు తెలిసింది. వారందరికీ కలిపి రూ.30 వేల కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుందని ఎస్‌ఎల్‌బీసీ అధికారులు వెల్లడించారు. రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేశాక మరింత స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా పంటల రుణమాఫీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ.6 వేల కోట్లు కేటాయించింది. గతేడాది డిసెంబర్ 11లోపు రుణాలు తీసుకున్నవారికే రుణమాఫీ వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రూ.6 వేల కోట్లు కేటాయించిందంటే, ఐదు విడతల్లో రుణాలను బ్యాంకులకు చెల్లించే అవకాశముంది. ఏ సంవత్సరం నుంచి లెక్కలోకి తీసుకుంటుందోనన్న విషయంపై స్పష్టత రావడంలేదు.
గతం కంటే 12.69 లక్షల మంది అదనం
తెలంగాణ ఏర్పాటు అనంతరం జరిగిన ఎన్నికల్లో లక్ష రూపాయల రుణాలను మాఫీ చేస్తామని టీఆర్‌ఎస్ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత 35.31 లక్షల మంది రైతులకు సంబంధించి రూ. 16,138 కోట్ల రుణాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం మాఫీ చేసింది. ఆ సొమ్మును ప్రభుత్వం నాలుగు విడతలుగా నాలుగు బడ్జెట్లలో కేటాయించి మాఫీ చేసింది. అప్పటి కంటే ఈసారి అదనంగా మరో 12.69 లక్షల మంది రుణమాఫీకి అర్హత సాధించనున్నారని బ్యాంకర్లు అంటున్నారు. సొమ్ము కూడా దాదాపు రూ.14 వేల కోట్లు అధికంగా కేటాయించాల్సి వస్తోంది.
రెండేళ్లలో రైతులు తీసుకున్న రుణాలు
గత రెండు సీజన్లలో తీసుకున్న పంటరుణాలను పరిగణనలోకి తీసుకొని రుణమాఫీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఆ ప్రకారం ఒక్కో రైతు సరాసరి రూ. 50 వేల నుంచి రూ. 60 వేల వరకు రుణం తీసుకొని ఉంటారని భావిస్తున్నారు. రెండు సీజన్ల లెక్క ప్రకారం 2017–18 ఖరీఫ్, రబీల్లో 39.11 లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. ఆ ఏడాది రూ. 31,410 కోట్ల రుణాలను బ్యాంకులు రైతులకు ఇచ్చాయి. 2018–19లో ఇప్పటివరకు 26.45 లక్షల మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. వారికి బ్యాంకులు మొత్తం రూ. 23,488 కోట్ల రుణాలు ఇచ్చాయి. అందులో ఈ ఖరీఫ్‌లో 22.21 లక్షల మంది రైతులు రూ. 19,671 కోట్లు తీసుకున్నారు. ప్రస్తుత రబీలో ఇప్పటివరకు 6 లక్షల మంది రైతులు రూ. 5 వేల కోట్ల రుణాలు తీసుకున్నారు. కొందరు రెండుసార్లు తీసుకొని ఉండొచ్చు. అలా మొత్తం రుణమాఫీకి అర్హులయ్యే వారు 48 లక్షలు ఉన్నారని అంచనా వేశారు.
ఎన్నికల్లో ప్రచారాస్త్రం...
రుణమాఫీని ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నారు. ఎన్నికల తర్వాత రుణమాఫీ జరుగుతుందని చెబుతున్నారు. దాంతోపాటు వచ్చే మే, జూన్ నెలల్లో రైతుబంధు సొమ్ము కూడా రైతుల ఖాతాలో వేస్తామని చెబుతున్నారు. పైగా గతంలో ఏడాదికి ఎకరానికి రూ. 8 వేలు రైతుబంధు సొమ్ము ఇస్తే, ఈసారి నుంచి ఏడాదికి రూ. 10 వేలు ప్రభుత్వం ఇస్తుందని చెబుతున్నారు.
48 లక్షల మంది రైతులకు రుణమాఫీ!
Published Fri, Mar 29 2019 12:48 AM | Last Updated on Fri, Mar 29 2019 12:48 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment