వాస్తవ సాగుదారులకే పంటరుణాలు | Crop loans to real cultivators Andhra Pradesh | Sakshi
Sakshi News home page

వాస్తవ సాగుదారులకే పంటరుణాలు

Published Mon, Nov 1 2021 3:12 AM | Last Updated on Mon, Nov 1 2021 3:12 AM

Crop loans to real cultivators Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఆరుగాలం శ్రమిస్తూ వ్యవసాయం చేసేవారికి.. వాస్తవ సాగుదారులకు మాత్రమే పంటరుణాలు అందనున్నాయి. సాగు చేస్తున్న భూ యజమానులతో సహా ప్రతి రైతు వివరాలను ప్రభుత్వం ఈ–క్రాప్‌లో నమోదు చేస్తోంది. దీని ఆధారంగా పంటరుణాలు మంజూరు చేయాలన్న ప్రభుత్వ అభ్యర్థనను అంగీకరించిన రాష్ట్రస్థాయి బ్యాంకర్స్‌ కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ).. ఇక ఈ–క్రాప్‌ డేటా ఆధారంగానే పంటరుణాలు ఇస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో ఏటా ఖరీఫ్‌ సీజన్‌లో 90 లక్షల ఎకరాలు, రబీలో 60 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతులతో పాటు పెద్ద ఎత్తున భూములు కలిగిన రైతుల సంఖ్య 70 లక్షలకుపైగా ఉంటే.. వాస్తవ సాగుదారుల సంఖ్య మాత్రం 45 లక్షల నుంచి 50 లక్షలే. 60 నుంచి 70 శాతం సాగుభూములు కౌలుదారుల చేతుల్లోనే ఉన్నాయి. వీరిసంఖ్య 20 లక్షలకు పైగానే ఉంటుందని అంచనా. ఉభయ గోదావరి, కోస్తా జిల్లాల్లో సాగుచేస్తున్న వారిలో భూ యజమానులకన్నా కౌలుదారులే ఎక్కువ.

ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం పట్టాదారు పాస్‌పుస్తకాలు, టైటిల్‌ డీడ్స్‌ కుదవపెట్టి పొందిన పంటరుణాలపై బ్యాంకులు 7 శాతం వడ్డీ వసూలు చేస్తాయి. ఆ వడ్డీలో కేంద్రం 3 శాతం రాయితీ ఇస్తుంది. సెంటు భూమి కూడా సాగుచేయని భూ యజమానులు సైతం వ్యవసాయం పేరిట పెద్దమొత్తంలో రుణాలు తీసుకుని కేంద్రం ఇచ్చే రాయితీని వినియోగించుకుంటూ లబ్ధిపొందుతున్నారు. వారు ఏటా రెన్యువల్‌ చేయించుకోవడం లేదా కొత్త రుణాలు పొందడం పరిపాటిగా మారింది. బ్యాంకులకు నిర్దేశించిన రుణలక్ష్యంలో 60 నుంచి 70 శాతం వరకు ఈ రెన్యువల్స్‌ ఉంటున్నాయి. రుణాలు దక్కని వాస్తవ సాగుదారులు పంటరుణాల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులపై ఆధారపడేవారు. పంటల బీమాతోసహా ఇతర రాయితీలు వారికి దక్కేవికాదు. ఈ పరిస్థితికి చెక్‌ పెడుతూ ఈ–క్రాప్‌ ప్రామాణికంగా వాస్తవ సాగుదారులకు మాత్రమే సంక్షేమ ఫలాలు, రాయితీలు దక్కేలా గడిచిన రెండేళ్లుగా ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయి. 

వైఎస్సార్‌ సున్నావడ్డీ రాయితీతో అండ
చిన్న, సన్నకారు రైతులపై ఆర్థికభారాన్ని తగ్గించే లక్ష్యంతో 2019లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వైఎస్సార్‌ సున్నావడ్డీ పంటరుణాల పథకం కింద రూ.లక్ష లోపు పంటరుణాలు పొంది సకాలంలో తిరిగి చెల్లించిన వారికి వడ్డీ రాయితీ ఇస్తోంది. ఈ విధంగా ఖరీఫ్‌–2020 సీజన్‌కు సంబంధించి ఎన్‌ఐసీ రూపొందించిన పోర్టల్‌లో బ్యాంకర్స్‌ అప్‌లోడ్‌ చేసిన జాబితా ప్రకారం 11.03 లక్షలమంది రైతులకు రూ.6,389.27 కోట్ల మేర రూ.లక్ష లోపు పంటరుణాలు మంజూరయ్యాయి. వారికి 4 శాతం చొప్పున రు.232.35 కోట్ల వడ్డీ రాయితీ చెల్లించాల్సి వస్తుందని అంచనా వేశారు. ఈ జాబితాను ఈ–క్రాప్‌లో ఆధార్‌ నంబర్‌తో సరిపోల్చి చూడగా 6.67 లక్షల మంది మాత్రమే వాస్తవ సాగుదారులని తేలింది. సాగుచేసిన విస్తీర్ణం, స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం పొందిన రుణాన్ని బట్టి చూస్తే వారికి చెల్లించాల్సిన వడ్డీ రాయితీ రూ.112.71 కోట్లు. ఈ మొత్తాన్ని రెండురోజుల కిందట ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారి ఖాతాల్లో జమచేశారు.

ప్రభుత్వ ఒత్తిడికి దిగొచ్చిన బ్యాంకర్స్‌ కమిటీ
రుణాల మంజూరు, వడ్డీ రాయితీ చెల్లింపుల్లో తలెత్తుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇక నుంచి రైతులతోపాటు కౌలుహక్కు ధ్రువీకరణపత్రం (సీసీఆర్‌సీ) పొందిన కౌలుదారులు, జేఎల్‌జీ గ్రూపులకు ఈ–క్రాప్‌ ఆధారంగానే స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం పంటరుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం బ్యాంకర్ల కమిటీని కోరింది. రూ.లక్ష లోపు పంటరుణాలు మంజూరు చేసి సకాలంలో చెల్లించినవారి వివరాలను మాత్రమే ఇకనుంచి వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంటరుణాల (ఎస్‌వీపీఆర్‌) పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించింది. ప్రభుత్వ ఒత్తిడి ఫలితంగా ప్రస్తుత రబీ సీజన్‌ నుంచి ఈ–క్రాప్‌ ఆధారంగా లక్ష్యం మేరకు పంటరుణాల మంజూరు, పాత రుణాల నవీకరణ చేసేందుకు బ్యాంకర్ల కమిటీ సంసిద్ధత వ్యక్తం చేసింది.

ఈ–క్రాప్‌ ఆధారంగా రుణాలిస్తాం
ఈ–క్రాప్‌ ఆధారంగా వాస్తవ సాగుదారులకు రుణాలివ్వడానికి మాకెలాంటి అభ్యంతరం లేదు. మావద్ద రుణాలు పొందిన భూ యజమానుల వివరాలు మాత్రమే ఉంటాయి. ముందుగా మా వద్ద ఉన్న లోన్‌చార్జి రిజిస్టర్, ఈ–కర్షక్, ఈ–క్రాప్‌ పోర్టల్స్‌ను అనుసంధానించాలి. ఇందుకు ప్రభుత్వ సహకారం అవసరం. సాధ్యమైనంత త్వరగా ఈ పోర్టల్స్‌ను అనుసంధానించిన తర్వాత ఈ–క్రాప్‌ ఆధారంగా పంటరుణాల మంజూరుకు శ్రీకారం చుడతాం.
– వి.బ్రహ్మానందరెడ్డి, కన్వీనర్, ఎస్‌ఎల్‌బీసీ

ఆర్బీకేల్లో రుణాలు పొందినవారి జాబితాలు
ఈ–క్రాప్‌ ఆధారంగా రుణాలు మంజూరు చే సేందుకు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ అంగీకరించింది. సోషల్‌ ఆడిట్‌లో భాగంగా అర్హత ఉండి రుణాలు రానివారి వివరాలు ప్రదర్శిస్తాం. సాగుదార్లతో జేఎల్‌జీ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నాం. సీసీఆర్‌సీ కార్డులు జారీచేస్తున్నాం. రుణార్హత ఉన్న కౌలుదారుల జాబితాను కూడా లోన్‌చార్జ్‌ రిజిస్టర్‌కి అనుసంధానం చేస్తాం.
– హెచ్‌.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయశాఖ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement