ఈ–క్రాప్‌ నమోదు 10కి పూర్తిచేయాలి | E CROP registration should be completed by 10 | Sakshi
Sakshi News home page

ఈ–క్రాప్‌ నమోదు 10కి పూర్తిచేయాలి

Published Fri, Oct 6 2023 5:07 AM | Last Updated on Fri, Oct 6 2023 5:07 AM

E CROP registration should be completed by 10 - Sakshi

సాక్షి, అమరావతి: ఖరీఫ్‌ సీజన్‌ ముగిసినందున ఈ–క్రాప్‌ నమోదు ప్రక్రియను ఈ నెల 10వ తేదీకల్లా పూర్తిచేయాలని వ్యవసాయశాఖ స్పెషల్‌ కమిషనర్‌ చేవూరు హరికిరణ్‌ అధికారులను ఆదేశించారు. వ్యవసాయశాఖ జిల్లా అధికారులతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఇప్పటికే 97 శాతం ఈ–క్రాప్‌ నమోదు, 70 శాతం రైతుల ఈ–కేవైసీ నమోదు పూర్తయ్యాయని చెప్పారు. మిగిలిన 30 శాతం మంది రైతులతో ఈ నెల10వ తేదీ కల్లా ఈ–కేవైసీ పూర్తిచేయాలన్నారు. అధికారులందరూ ఈ–క్రాప్, ఈ–కేవైసీ నమోదులో వాస్తవికతను ధ్రువీకరించేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. ఈ–క్రాప్‌ నమోదు ముగిసిన తర్వాత ఆర్బీకేల్లో సామాజిక తనిఖీ నిర్వహించాలన్నారు.

గ్రామసభలో ముసాయిదా జాబితాలోని ప్రతి రైతు పంట వివరాలను విత్తిన తేదీతో సహా చదివి ధ్రువీకరించాలని సూచించారు. సామాజిక తనిఖీ అనంతరం ఈ నెల 20వ తేదీన తుది జాబితా ప్రదర్శించాలన్నారు. అక్టోబర్‌ రెండోవారంలో జమచేయనున్న పీఎం కిసాన్‌ 15వ విడత సాయం కోసం.. అర్హతగల రైతులందరూ ఆధార్‌తో భూమి రికార్డులు, బ్యాంకు ఖాతాలు, ఈ–కేవైసీ తప్పనిసరి చేసినందున ఈ నెల 15వ తేదీకల్లా వాటిని సరిచేసుకోవాలని కోరారు. యూరియా వ్యవసాయేతర అవసరాలకు తరలిపోకుండా విక్రయాలపై నిఘా పెట్టాల న్నారు. ప్రతి మండలంలో నెలవారీగా అత్యధిక యూరియా అమ్మకాలు జరిపే కొనుగోలు దారులను, డీలర్లను పరిశీలించి లోటుపాట్లపై నివేదికలు పంపించాలని ఆదేశించారు.

ప్రతి మండలానికి కిసాన్‌ డ్రోన్ల ఏర్పాటులో భాగంగా గుర్తించిన రైతు పైలట్‌ల శిక్షణ కోసం జారీచేసిన మార్గదర్శకాలను మరింత సులభతరం చేస్తామని చెప్పారు. పాస్‌పోర్ట్‌ ఉండాలనే నిబంధనను తొలగించామన్నారు. ఆర్బీకేల వారీగా గుర్తించిన సీహెచ్‌సీల్లోని రైతులతో అంగీకారపత్రాలను సిద్ధం చేసుకోవా లన్నారు. గ్యాప్‌ పొలంబడులకు ఏపీ స్టేట్‌ ఆర్గానిక్‌ ప్రొడ్యూసర్స్‌ సర్టిఫికేషన్‌ అథారిటీ (ఏపీఎస్‌ఓపీసీఏ)తో రైతు ఉత్పత్తి సంఘాల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement