E crop
-
ఈ–క్రాప్ నమోదు 10కి పూర్తిచేయాలి
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్ ముగిసినందున ఈ–క్రాప్ నమోదు ప్రక్రియను ఈ నెల 10వ తేదీకల్లా పూర్తిచేయాలని వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయశాఖ జిల్లా అధికారులతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఇప్పటికే 97 శాతం ఈ–క్రాప్ నమోదు, 70 శాతం రైతుల ఈ–కేవైసీ నమోదు పూర్తయ్యాయని చెప్పారు. మిగిలిన 30 శాతం మంది రైతులతో ఈ నెల10వ తేదీ కల్లా ఈ–కేవైసీ పూర్తిచేయాలన్నారు. అధికారులందరూ ఈ–క్రాప్, ఈ–కేవైసీ నమోదులో వాస్తవికతను ధ్రువీకరించేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. ఈ–క్రాప్ నమోదు ముగిసిన తర్వాత ఆర్బీకేల్లో సామాజిక తనిఖీ నిర్వహించాలన్నారు. గ్రామసభలో ముసాయిదా జాబితాలోని ప్రతి రైతు పంట వివరాలను విత్తిన తేదీతో సహా చదివి ధ్రువీకరించాలని సూచించారు. సామాజిక తనిఖీ అనంతరం ఈ నెల 20వ తేదీన తుది జాబితా ప్రదర్శించాలన్నారు. అక్టోబర్ రెండోవారంలో జమచేయనున్న పీఎం కిసాన్ 15వ విడత సాయం కోసం.. అర్హతగల రైతులందరూ ఆధార్‌తో భూమి రికార్డులు, బ్యాంకు ఖాతాలు, ఈ–కేవైసీ తప్పనిసరి చేసినందున ఈ నెల 15వ తేదీకల్లా వాటిని సరిచేసుకోవాలని కోరారు. యూరియా వ్యవసాయేతర అవసరాలకు తరలిపోకుండా విక్రయాలపై నిఘా పెట్టాల న్నారు. ప్రతి మండలంలో నెలవారీగా అత్యధిక యూరియా అమ్మకాలు జరిపే కొనుగోలు దారులను, డీలర్లను పరిశీలించి లోటుపాట్లపై నివేదికలు పంపించాలని ఆదేశించారు. ప్రతి మండలానికి కిసాన్ డ్రోన్ల ఏర్పాటులో భాగంగా గుర్తించిన రైతు పైలట్ల శిక్షణ కోసం జారీచేసిన మార్గదర్శకాలను మరింత సులభతరం చేస్తామని చెప్పారు. పాస్‌పోర్ట్ ఉండాలనే నిబంధనను తొలగించామన్నారు. ఆర్బీకేల వారీగా గుర్తించిన సీహెచ్‌సీల్లోని రైతులతో అంగీకారపత్రాలను సిద్ధం చేసుకోవా లన్నారు. గ్యాప్ పొలంబడులకు ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడ్యూసర్స్ సర్టిఫికేషన్ అథారిటీ (ఏపీఎస్‌ఓపీసీఏ)తో రైతు ఉత్పత్తి సంఘాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన చెప్పారు. -
పక్కాగా.. పారదర్శకంగా ఈ–క్రాప్
సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్లో ఈ–పంట (ఎలక్ట్రానిక్ క్రాప్) నమోదును వ్యవసాయ శాఖ వేగవంతం చేసింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఒడిదుడుకుల మధ్య ఖరీఫ్ సాగవుతుండగా.. సాగైన ప్రతి పంటను నమోదు చేసేలా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. సంక్షేమ ఫలాలు ఈ–క్రాప్ నమోదే ప్రామాణికం కావడంతో పకడ్బందీగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. గత సీజన్ మాదిరిగానే పంటల నమోదుతోపాటు నూరు శాతం ఈకేవైసీ నమోదే లక్ష్యంగా ముందుకెళ్తోంది. 78 లక్షల ఎకరాల్లో ఖరీఫ్ ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు లక్ష్యం 1.10 కోట్ల ఎకరాలు కాగా.. ఇప్పటివరకు 78 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. ప్రధానంగా 38.36 లక్షల ఎకరాల్లో వరి సాగవ్వాల్సి ఉండగా.. ఇప్పటివరకు 29.48 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇతర పంటల విషయానికి వస్తే.. 2.56 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 3.30 లక్షల ఎకరాల్లో కందులు, 7.19 లక్షల ఎకరాల్లో వేరుశనగ, సుమారు లక్ష ఎకరాల చొప్పున ఆముదం, చెరకు పంటలు సాగయ్యాయి. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక కింద 80 శాతం సబ్సిడీపై విత్తన సరఫరాతోపాటు సెప్టెంబర్‌లో ఆశాజనకంగా వర్షాలు కురుస్తుండటంతో ఖరీఫ్ సాగు లక్ష్యం దిశగా వెళ్తోంది. ఈ నేపథ్యంలో ఖరీఫ్‌లో సాగైన పంటల నమోదుపై వ్యవసాయ శాఖ దృష్టి సారించింది. వెబ్‌ల్యాండ్, సీసీఆర్సీ డేటా నమోదుతో పాటు తొలిసారి జియో ఫెన్సింగ్ ఆధారంగా జూలైలో ఈ–క్రాప్ నమోదుకు శ్రీకారం చుట్టారు. తొలుత తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో నమోదు చేపట్టగా, ఆ తర్వాత మిగిలిన జిల్లాల్లో శ్రీకారం చుట్టారు. నమోదులో అగ్రస్థానంలో కర్నూలు ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు 78 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు సాగవగా.. 46.50 లక్షల ఎకరాల్లో సాగైన పంటల వివరాలను నమోదు చేశారు. 84.98 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు లక్ష్యం కాగా.. 55.95 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇప్పటికే 31.50 లక్షల ఎకరాల్లో సాగైన పంటల వివరాలను నమోదు చేశారు. 22 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవ్వాల్సి ఉండగా.. 21 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇప్పటికే 15 లక్షల ఎకరాల్లో పంటల వివరాలను ఈ క్రాప్‌లో నమోదు చేశారు. 17.53 లక్షల ఎకరాల్లో వరి, 5.52 లక్షల ఎకరాల్లో పత్తి, 3.53 లక్షల ఎకరాల్లో మామిడి, 2.86 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 2.10 లక్షల ఎకరాల్లో కంది, 2.13 లక్షల ఎకరాల్లో మిరప, 1.60 లక్షల ఎకరాల్లో మొక్క జొన్న, 1.50 లక్షల ఎకరాల్లో జీడిమామిడి, 1.35 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్, 1.29 లక్షల ఎకరాల్లో బత్తాయి, 99 వేల ఎకరాల్లో కొబ్బరి, 75 వేల ఎకరాల్లో ఆముదం, 61 వేల ఎకరాల్లో అరటి, 52 వేల ఎకరాల్లో నిమ్మ, 46 వేల ఎకరాల్లో టమోటా పంటలు నమోదు చేశారు. జిల్లాల వారీగా చూస్తే కర్నూలు, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాలు నూరు శాతం నమోదుతో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. జియో ఫెన్సింగ్ ద్వారా హద్దులు నిర్ధారించి.. నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) సౌజన్యంతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన యాప్‌లో ఆధార్, వన్‌బీ, జాతీయ చెల్లింపుల సహకార సంస్థ (ఎన్పీసీఐ), ఆధార్‌తో లింక్ అయిన బ్యాంక్ ఖాతా వివరాలు, ఫోన్ నంబర్, సీసీఆర్సీ కార్డు వివరాలను నమోదు చేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత జియో ఫెన్సింగ్ ద్వారాæ సరిహద్దులు నిర్ధారించి, రైతు ఫోటోను ఆర్బీకే సిబ్బంది అప్లోడ్ చేస్తున్నారు. గిరి భూమి వెబ్సైట్లో నమోదైన వివరాల ఆధారంగా అటవీ భూముల్లో ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు సాగు చేస్తున్న పంటల వివరాలను ఈ–క్రాప్‌లో నమోదు చేస్తున్నారు. మరోవైపు పంటసాగు హక్కు పత్రం (సీసీఆర్సీ) కలిగిన రైతులతో పాటు సీసీఆర్సీ కార్డుల్లేని రైతుల వివరాలను నమోదు చేస్తున్నారు. ఖాళీగా ఉంటే నో క్రాప్ జోన్ అని, ఆక్వా సాగవుతుంటే ఆక్వాకల్చర్ అని, వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తుంటే నాన్ అగ్రిల్యాండ్ యూజ్ అని నమోదు చేసి లాక్ చేస్తున్నారు. 30 నాటికి తుది జాబితాలు ఈ–క్రాప్ నమోదు ప్రక్రియ సెప్టెంబర్ 25 నాటికి పూర్తి చేసి సామాజిక తనిఖీ కోసం ఆర్బీకేల్లో ఈ–పంట జాబితాలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. అభ్యంతరాల పరిశీలన తర్వాత సెప్టెంబర్ 30న ఆర్బీకేల్లో తుది జాబితాలను ప్రదర్శించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ డూప్లికేషన్‌కు తావులేకుండా.. డూప్లికేషన్‌కు తావు లేకుండా ఈ–ఫిష్ డేటాతో జోడించారు. ఈ–క్రాప్‌తో పాటు ఈ–కేవైసీ (వేలి ముద్రల) నమోదు ప్రక్రియ పూర్తి కాగానే ప్రతీ రైతుకు భౌతికంగా రసీదు అందజేస్తున్నారు. ఈ క్రాప్ ప్రక్రియ పూర్తయిన తర్వాత 10 శాతం ఎంఏవోలు–తహసీల్దార్లు, 5 శాతం జిల్లా వ్యవసాయ, ఉద్యాన శాఖాధికారులు, 3 శాతం సబ్ కలెక్టర్లు, 2 శాతం జాయింట్ కలెక్టర్లు, 1 శాతం చొప్పున కలెక్టర్ ర్యాండమ్ చెక్ చేస్తున్నారు. -
ఏపీ సహకారంతో ఇథియోపియాలో ఈ–క్రాప్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సాగవుతున్న వ్యవసాయ, ఉద్యాన పంటలను గుర్తించే ఎలక్ట్రానిక్ క్రాపింగ్ (ఈ–క్రాప్) అద్భుతంగా ఉందని, ఈ సాంకేతికతను తమ దేశంలో అమలు చేసేందుకు అవసరమైన సహకారాన్ని అందించాలని ఇథియోపియా ప్రతినిధి బృందం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర పర్యటనలో భాగంగా మూడో రోజైన గురువారం ఇథియోపియా ప్రతినిధి బృందం మంగళగిరిలోని వ్యవసాయ శాఖ కమిషనరేట్ క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ ఉన్నతాధికారులతో భేటీ అయింది. ఈ సందర్భంగా ఏపీలో రైతు సంక్షేమం కోసం అమలు చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని తమ దేశంలో రైతులకు కూడా అందించేందుకు ఆసక్తిగా ఉన్నామని ఇథియోపియా ప్రతినిధి బృందం స్పష్టం చేసింది. ముఖ్యంగా ఈ–పంట నమోదుతోపాటు యంత్రసేవా పథకం, పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్సార్ రైతు భరోసా వంటి పథకాలను తమ రైతులకు అందించాలని భావిస్తున్నామన్నారు. వీటి అమలు కోసం అవసరమైన సాంకేతికతను అందించేందుకు చేయూతనివ్వాలని కోరారు. ఇథియోపియా దేశానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కమిషనర్ చేవూరు హరికిరణ్ వెల్లడించారు. ఎరువులు, పురుగు మందులపై ఆరా ఆర్బీకేల ద్వారా రైతులకు పంపిణీ చేస్తున్న ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను ఎక్కడ నుంచి కొనుగోలు చేస్తున్నారు, ఎలా కొనుగోలు చేస్తున్నారనే విషయాలను ఇథియోపియా ప్రతినిధి బృందం ఆరా తీసింది. కాగా, వ్యవసాయ రంగంలో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బృందానికి వివరించారు. ఈ–క్రాప్ నమోదు, ఉచిత పంటల బీమా, ఆర్బీకేల ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ఇతర ఇన్పుట్స్ పంపిణీ, ఆర్బీకేలకు అనుబంధంగా ఏర్పాటు చేసిన వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలు (కస్టమ్‌హైరింగ్ సెంటర్స్), డ్రోన్ టెక్నాలజీ, ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్, వైఎస్సార్ అప్లికేషన్ సాంకేతికతను, పొలం బడుల ద్వారా గ్యాప్ సర్టిఫికేషన్ జారీ అంశాలను వివరించారు. ఏపీ మార్క్‌ఫెడ్ ఎండీ రాహుల్‌పాండే, వ్యవసాయ శాఖ జేడీ వల్లూరి శ్రీధర్ వివిధ అంశాలపై మాట్లాడారు. -
రైతుకు అసలైన భరోసా
సాక్షి, అమరావతి : వ్యవసాయం దండగ అన్నవాళ్ల నోళ్లను మూయిస్తూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవసాయ రంగాన్ని పండుగలా మార్చారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ సర్కారు ఏర్పాటైన తరువాత దేశంలోనే ఎక్కడా లేనివిధంగా వ్యవసాయ రంగంలో సీఎం జగన్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ ఉచిత పంటల బీమా, వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ, పంట నష్టపరిహారం, వైఎస్సార్ యంత్ర సేవ, ఉచిత వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ పథకాలతోపాటు రైతులు పండిస్తున్న పంటలను నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేయడం, విత్తన సబ్సిడీ, సూక్ష్మ సేద్యం, పండ్ల తోటల అభివృద్ధి, ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ, ఆయిల్‌పామ్ రైతులకు సబ్సిడీ, పగటి పూటే 9 గంటల విద్యుత్ సరఫరా కోసం ఫీడర్ల సామర్ధ్యం పెంపు, విత్తు నుంచి పంట విక్రయం వరకు రైతుకు అండదండలు అందించేదుకు రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే)ల ఏర్పాటు వంటి ఎన్నో కీలక నిర్ణయాలతో వ్యవసాయ రంగాన్ని ఉరకలెత్తిస్తున్నారు. ప్రాజెక్టులు నిండుకుండలు.. నిండా పంటలు పాలించే మారాజు మనసున్న వాడైతే.. ప్రకృతి పులకిస్తుందని రుజువైంది. నాలుగేళ్లుగా కరువుతీరా కురుస్తున్న వర్షాలతో సాగునీటి ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. భూగర్భ జలాలు ఎగసిపడుతున్నాయి. ఆహార ధాన్యాల ఉత్పత్తి 2014–19 మధ్య ఏటా సగటున 153.95 లక్షల టన్నులు నమోదు కాగా.. 2019–23 మధ్య ఏటా సగటున 165.40 లక్షల టన్నులకు పెరగడం విశేషం. ఇదే సందర్భంలో ఉద్యాన పంటల దిగుబడులు సైతం పెరిగాయి. 2014–15లో 305 లక్షల టన్నులుగా ఉన్న ఉద్యాన పంటల దిగుబడులు.. ప్రస్తుతం 368.83 లక్షల టన్నులకు పెరిగింది. మూడు రెట్లు పెరిగిన కేటాయింపులు టీడీపీ ఐదేళ్ల పాలనలో వ్యవసాయ, దాని అనుబంధ రంగాలకు రూ.61,758 కోట్లు వెచ్చించగా.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక రూ.1,70,571.62 కోట్లను వెచ్చించింది. మరో ఏడాదికి కేటాయించే మొత్తాన్ని కలిపితే గత ప్రభుత్వం కంటే.. మూడు రెట్లకు పైగా నిధులు కేటాయించినట్టు తేటతెల్లమవుతోంది. కరోనా విపత్కర పరిస్థితులకు ఎదురొడ్డి మరీ రూ.1.49 లక్షల కోట్ల సాయాన్ని నేరుగా రైతులకు అందించి రైతులకు అన్ని విధాలుగా అండగా నిలవడం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తేటతెల్లం చేసింది. సున్నా వడ్డీ.. ఉచిత బీమా సున్నా వడ్డీకే పంట రుణాలివ్వడంతోపాటు ప్రతి పంటను ఈ క్రాప్‌లో నమోదు చేస్తూ పైసా భారం పడకుండా పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే బీమా కల్పిస్తోంది. కోతలకు ముందే ప్రతి పంటకు కనీస మద్దతు ధర ప్రకటిస్తోంది. ధరల స్థిరీకరణ నిధి ద్వారా కనీస మద్దతు ధర దక్కని పంటలను కొనుగోలు చేస్తోంది. విపత్తుల వల్ల నష్టపోయే రైతులకు సీజన్ ముగిసేలోగానే పంట నష్టపరిహారంతో పాటు బీమా సొమ్ము సైతం అందిస్తోంది. సేంద్రియ సాగుతోపాటు చిరుధాన్యాలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రత్యేక పాలసీలను తీసుకొచ్చింది. మెట్టప్రాంత పంటలకు పగటిపూట 9 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను నిరాటంకంగా అందిస్తోంది. పల్లెసీమల రూపురేఖలు మార్చిన ఆర్బీకేలు గతంలో విత్తనాల కోసం రైతులు పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చేది. ఎరువుల కోసం ప్రైవేట్ డీలర్లు అంటగట్టే అవసరం లేని పురుగుమందులను కొనాల్సి వచ్చేది. ఎండల్ని తట్టుకోలేక అన్నదాతలు ఏటా పదుల సంఖ్యలో రైతులు మతిచెందేవారు. అదునులోపు విత్తనం దొరక్క దళారుల వద్ద నకిలీ, నాసిరకం వాటిని అధిక ధరలకు కొనుగోలు చేసేవారు. విత్తనాల కోసం రైతుల పాట్లు పత్రికల్లో పతాక శీర్షికల్లో కథనాలు వచ్చేవి. ఆర్బీకేల రాకతో రైతుల కష్టాలు తొలగిపోయాయి. ఇప్పుడు సీజన్‌కు ముందే రెడీ సాగు ఉత్పదకాలను రైతుల ముంగిటకు తీసుకెళ్లాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలతో రైతుల వెతలకు చెక్ పడింది. సీజన్‌కు ముందుగానే సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలను గ్రామస్థాయిలో నిల్వ చేసి రైతులకు నేరుగా పంపిణీ చేస్తున్నారు. ఆర్బీకేల్లోని కియోస్‌్కల్లో బుక్ చేసుకున్న 24 గంటల్లోపే వారి ముంగిట అందిస్తున్నారు. ఆర్బీకేలు ఏర్పాటైన మూడేళ్లలో 63.50 లక్షల మంది రైతులకు 37.04 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేశారు. వరి, అపరాలు, చిరుధాన్యాలు, నూనెగింజలు, పచ్చిరొట్ట విత్తనాలే కాదు పత్తి, మిరప వంటి నాన్ సబ్సిడీ విత్తనాలను సైతం ఆర్బీకేల ద్వారా అందిస్తున్నారు. 10,778 ఆర్బీకేల ద్వారా దుక్కి పనులు ప్రారంభం కాకముందే రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుతున్నాయి. ముందుగానే అగ్రి ల్యాబ్స్‌లో టెస్ట్ చేసి మరీ నాణ్యమైన సీడ్‌ను పంపిణీ చేస్తున్నారు. మూడేళ్లుగా చూద్దామంటే విత్తనాల కోసం ఎక్కడా బారులు తీరే పరిస్థితి కనిపించడం లేదు. విత్తనం దొరుకుతుందో లేదోననే చింత ఎవరిలోనూ కనిపించడం లేదు. నకిలీల ఊసే ఎక్కడా వినిపించడం లేదు. మూడేళ్లలో ఆర్బీకేల ద్వారా రూ.953.53 కోట్ల విలువైన 8.69 లక్షల టన్నుల ఎరువులను 23.47 లక్షల మంది రైతులకు పంపిణీ చేశారు. మార్కెట్లో ధరలు పతనమైన ప్రతిసారి మార్కెట్లో జోక్యం చేసుకుని ఆర్బీకేల ద్వారా ఆయా పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. పంట రుణాలు, ఈ–క్రాప్ నమోదు, పంటల బీమా, పంట నష్టపరిహారం ఇలా ప్రతి ఒక్కటి అర్హత ఉన్న ప్రతి రైతుకు అందేలా ఆర్బీకే సిబ్బంది కృషి చేస్తున్నారు. గతంలో పశువుకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా మండల కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం ఫోన్ చేయగానే క్షణాల్లో వీహెచ్ఏ ఇంటికి వచ్చి మరీ సేవలందిస్తున్నారు. ఉచితంగా మందులిస్తున్నరు. నాణ్యమైన ధ్రువీకరించిన మిశ్రమ దాణా, పశుగ్రాసం సరఫరా చేస్తున్నారు. ఫలితంగా గతంతో పోలిస్తే పాల దిగుబడి రెట్టింపయ్యిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆర్బీకేల ద్వారా ఆక్వా సాగు చేస్తున్న ప్రతి రైతుకు లైసెన్సు జారీతో పాటు నాణ్యమైన ఫీడ్‌ను అందజేస్తున్నారు. అగ్రి ల్యాబ్‌లు.. యంత్ర సేవా కేంద్రాలు.. గోదాములు అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో 147 చోట్ల వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్‌ను నెలకొల్పుతోంది. ఇందుకోసం ఒక్కొక్క ల్యాబ్‌కు రూ.81 లక్షల చొప్పున వెచ్చిస్తోంది. రూ.6.25 కోట్ల అంచనా వ్యయంతో జిల్లా స్థాయిలో 13 ల్యాబ్‌లు, రూ.75 లక్షల అంచనా వ్యయంతో రీజనల్ స్థాయిలో నాలుగు సమన్వయ కేంద్రాలను, గుంటూరులో రాష్ట్రస్థాయిలో రూ.8.50 కోట్ల అంచనాతో విత్తన జన్యు పరీక్ష కేంద్రాన్ని డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీతో ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 70 అగ్రి ల్యాబ్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కాగా.. చిన్న, సన్నకారు రైతులకు అవసరమైన యంత్ర పరికరాలను స్వల్ప అద్దె ప్రాతిపదికన వారి ముంగిటకే తీసుకెళ్లాలన్న సంకల్పంతో రూ.691 కోట్లతో 6,525 ఆర్బీకే, 391 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆర్బీకేలకు అనుబంధంగా రూ.1,584.61 కోట్లతో 2,536 బహుళ ప్రయోజన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్కటి రూ.40 లక్షల అంచనాతో 500 టన్నుల సామర్థ్యంతో 1021, రూ.75లక్షల అంచనాతో 100 టన్నుల సామర్థ్యంతో 113 గోదాముల నిర్మిస్తున్నారు. వీటిలో రూ.166.33 కోట్ల ఖర్చుతో వివిధ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇప్పటికే వెయ్యి గోదాములు నిర్మాణం పూర్తి కాగా.. వచ్చే నెలలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. -
అన్నదాతకు అండ.. గింజగింజకూ మద్దతు
అన్నదాతలు పండించే ప్రతీ పంటకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) దక్కేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఎమ్మెస్పీ కన్నా తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఏ ఒక్క రైతన్న కూడా ఫిర్యాదు చేసేందుకు ఆస్కారం లేకుండా పంటల కొనుగోళ్ల సమయంలో వారికి అన్ని విధాలా అండగా నిలవాలి. – అధికార యంత్రాంగానికి సీఎం జగన్ ఆదేశం సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పంటనూ ఈ–క్రాపింగ్ చేయడం వల్ల ఏ రైతు ఎంత విస్తీర్ణంలో ఏ పంట వేశారు? ఎంత దిగుబడి వస్తుందనే విషయంలో స్పష్టత వచ్చిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లలో పూర్తి స్థాయిలో పారదర్శకత వచ్చిందన్నారు. పంటల నమోదు నూరు శాతం పూర్తి కాగా, వీఏఏ, వీఆర్వోల ద్వారా ఈ – కేవైసీ 99 శాతం పూర్తైనందున ఈనెల 15వ తేదీలోగా రైతుల ఈ – కేవైసీ (వేలిముద్రలు) పూర్తిచేసి ప్రతి రైతుకు డిజిటల్, ఫిజికల్ రశీదులివ్వాలని సూచించారు. పంటల కొనుగోళ్ల సందర్భంగా ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకుండా నిర్దేశించుకున్న షెడ్యూల్ ప్రకారం సోషల్ ఆడిట్ పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలతో పాటు ఖరీఫ్ ధాన్యం సేకరణ ఏర్పాట్లపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ మంగళవారం సమీక్షించి అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలివీ.. సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం ఖరీఫ్ సీజన్ దాదాపుగా పూర్తైంది. కోతలు మొదలయ్యేలోగా కొనుగోలు కేంద్రాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలి. కొనుగోళ్ల సందర్భంగా ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదు. గన్నీ బ్యాగులు, కూలీలు, రవాణా సదుపాయాలను అవసరమైన మేరకు సమకూర్చుకోవాలి. ధాన్యం కొనుగోళ్లపై ఆర్బీకేల ద్వారా రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. ధాన్యం కొనుగోళ్ల కోసం చేసిన ఏర్పాట్లు, నిబంధనలు, సూచనలు, సలహాలతో ఆర్బీకేల్లో పోస్టర్లు ప్రదర్శించాలి. ఆర్బీకేలకు అనుసంధానించిన వలంటీర్లు ఆర్బీకే మిత్రలుగా, ధాన్యం కొనుగోళ్లలో సహాయం కోసం తీసుకుంటున్న వలంటీర్లు రైతు సహాయకులుగా వ్యవహరించాలి. బియ్యం ఎగుమతులపై దృష్టి రాష్ట్రంలో వరి విస్తారంగా సాగు అవుతున్నందున బియ్యం ఎగుమతులపై దృష్టి సారించాలి. దేశీయంగా డిమాండ్ లేని పరిస్థితుల్లో విదేశాలకు ఎగుమతి చేసే అవకాశాలను పరిశీలించాలి. ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఎగుమతుల రంగంలో ఉన్న వారితో కలిసి పని చేయాలి. బియ్యం ఎగుమతిదారులకు, రైతులకు ఉభయ తారకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. రంగు మారిన ధాన్యం, బ్రోకెన్ రైస్ (నూకలు)ఇథనాల్ తయారీకి వినియోగించడంపై దృష్టి పెట్టాలి. ఇప్పటికే ఇఫ్కో ద్వారా ఒక ప్లాంటు, మహీంద్రా ద్వారా మరో ప్లాంటు నుంచి ఇథనాల్ తయారు కానుంది. సీఎం యాప్‌తో ధరల పర్యవేక్షణ ఎక్కడైనా పంటలకు ఎమ్మెస్పీ కంటే తక్కువ ధర ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే జోక్యం చేసుకుని మద్దతు ధరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలి. పంట ఉత్పత్తుల ధరలను ఎప్పటికప్పుడు సీఎం యాప్ ద్వారా సమీక్షిస్తుండాలి. ఎక్కడైనా ధర పతనమైనట్లు సీఎం యాప్ ద్వారా గుర్తిస్తే వెంటనే కొనుగోళ్లకు శ్రీకారం చుట్టాలి. ధర పతనమైన సందర్భాల్లో రైతులను ఎలా ఆదుకుంటామనే విషయంలో సర్వీస్ లెవల్ అగ్రిమెంట్ (ఎస్ఎల్ఏ) పకడ్బందీగా ఉండాలి. కొనుగోలు చేసిన పంట ఉత్పత్తులను నిల్వచేసే ప్రాంతంలో జియో ఫెన్సింగ్, ప్రతి ఉత్పత్తికి ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ ఉండేలా పౌర సరఫరాల శాఖ ఏర్పాట్లు చేయాలి. రైతులను ఆదుకునేందుకు మార్కెట్లో నిరంతరం జోక్యం చేసుకోవాలి. దీనివల్ల ధరలు పతనం కాకుండా అన్నదాతలకు మేలు జరుగుతుంది. పొగాకు రైతులకు నష్టం జరగకుండా తగిన రీతిలో చర్యలు తీసుకోవాలి. ఖరీఫ్‌కు ముందే భూసార పరీక్షలు.. పంటల సంరక్షణకు ప్లాంట్ డాక్టర్ ఏటా ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాకముందే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో భూసార పరీక్షలు నిర్వహించి పూర్తి వివరాలను సాయిల్ హెల్త్ కార్డుల్లో నమోదు చేయాలి. ఆ ఫలితాల ఆధారంగా పంటల సాగుకు సంబంధించి సిఫార్సులు చేయాలి. ఏ నేలలో ఎలాంటి పంటలు వేయాలి? ఎంత మోతాదులో ఎరువులు వాడాలనే అంశంపై రైతులకు పూర్తి అవగాహన కల్పించాలి. ఇందుకోసం ప్రతి ఆర్బీకేలో సాయిల్ టెస్టింగ్ పరికరాలను అందుబాటులో ఉంచాలి. మధ్యలో ఏవైనా చీడపీడలు, తెగుళ్లు లాంటివి పంటలకు సోకితే ఫోటోలు తీసి శాస్త్రవేత్తల సహకారంతో నిర్మూలించేలా చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం ప్లాంట్ డాక్టర్ విధానాన్ని తేవాలి. విచ్చలవిడిగా క్రిమి సంహారక మందుల వాడకాన్ని నివారించాలి. ఇలా క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహిస్తూ సిఫార్సుల మేరకు పంటలను సాగు చేస్తే విచక్షణా రహితంగా ఎరువులు, రసాయనాల వాడకం తగ్గుతుంది. తద్వారా రైతన్నలకు పెట్టుబడి వ్యయం తగ్గడంతోపాటు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను సాధించేందుకు దోహదం చేస్తుంది. ఈదఫా 1.15 కోట్ల ఎకరాల్లో సాగు ఖరీప్ సీజన్లో ఇప్పటివరకూ 1.10 కోట్ల ఎకరాల్లో పంటలు సాగైనట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా అక్కడక్కడా వరి నాట్లు కొనసాగుతున్నందున ఈదఫా ఖరీఫ్ సాగు 1.15 కోట్ల ఎకరాలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు సీఎం దృష్టికి తెచ్చారు. మూడేళ్లలో 3.5 లక్షల ఎకరాల్లో ఉద్యాన సాగు పెరిగిందని, సాధారణ పంటల నుంచి రైతులు వీటి వైపు మళ్లినట్లు తెలిపారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 14.10 లక్షల హెక్టార్లలో వరి నాట్లు వేశారని చెప్పారు. నవంబర్ మొదటి వారం నుంచి ధాన్యం కొనుగోళ్ల కోసం 3,423 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మాయిశ్చరైజర్ మీటర్, అనాలసిస్ కిట్, హస్క్ రిమూవర్, పోకర్స్, ఎనామెల్ ప్లేట్స్, జల్లించే పరికరాలను సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. రానున్న రబీ సీజన్లో 57.31 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కానున్నట్లు అంచనా వేసి 96 లక్షల టన్నుల విత్తనాలను సిద్ధం చేసినట్లు చెప్పారు. వైఎస్సార్ యంత్రసేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచిన పరికరాలు, అద్దెల వివరాలతో ఆర్బీకేల్లో పోస్టర్లను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది రైతు భరోసా రెండో విడత సాయాన్ని అక్టోబరు 17న అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. భూసార పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు బాంబే, కాన్పూర్ ఐఐటీల సాంకేతిక విధానాలను పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. సమీక్షలో పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీయస్ నాగిరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, మార్కెటింగ్, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఆర్ధికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, వ్యవసాయ, పౌరసరఫరాలు, మార్కెటింగ్ శాఖల కమిషనర్లు చేవూరు హరికిరణ్, హెచ్.అరుణ్‌కుమార్, పీఎస్ ప్రద్యుమ్న, పౌరసరఫరాల సంస్థ ఎండీ జి.వీరపాండియన్, ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ గెడ్డం శేఖర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
Photo Feature: పుడమితల్లి ఒడిలో.. అంతులేని ఆనందం
డైనింగ్ టేబుల్ లేదు.. వడ్డించే వారూ ఉండరు.. కూర్చొనేందుకు సరైన సౌకర్యమూ ఉండదు. అయితేనేం.. తినే ప్రతీ మెతుకులోను అంతులేని ఆనందం వారి సొంతం. పుడమితల్లి ఒడిలో.. చేలగట్లపై సమయానికి తినే పట్టెడు అన్నమే వారికి బలం. ఆ శక్తితోనే ఎంతో మందికి అన్నం పెట్టేందుకు పొలంలో శ్రమిస్తారు. శ్రమైక జీవన సౌందర్యానికి మించినది లేదని చాటిచెబుతారు. విజయనగరం జిల్లా కుమిలి రోడ్డులో పొలం గట్లపై సామూహికంగా భోజనాలు చేస్తూ సోమవారం ‘సాక్షి’ కెమెరాకు చిక్కిన మహిళా రైతుల చిత్రమే దీనికి సజీవ సాక్ష్యం. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం చకచకా ఈ–క్రాప్ జిల్లాలో ఈ–క్రాప్ నమోదు చకచకా సాగుతోంది. సచివాలయ వ్యవసాయ సహాయకులు, వ్యవసాయ, రెవెన్యూ అధికారుల సమక్షంలో పంటల నమోదు ప్రక్రియ జరుగుతోంది. ఉచిత పంటల బీమా, సున్నావడ్డీ, పంట రుణాలు, నష్ట పరిహారం, రైతు భరోసా, ధాన్యం కొనుగోలు వంటి ప్రయోజనాలు రైతులకు చేరాలంటే ఈ–క్రాప్ నమోదు తప్పనిసరి. రైతులు కూడా బాధ్యతగా ఈ నెల 31లోగా ఈ క్రాప్ నమోదు చేయించుకునేందుకు చొరవచూపాలని అధికారులు సూచిస్తున్నారు. – నెల్లిమర్ల రూరల్ ముందస్తు వైద్యం వర్షాలు కురిసే వేళ.. కలుషిత మేత, నీరు తాగడంతో జీవాలు వ్యాధుల భారిన పడే అవకాశం ఉంది. జీవాల సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ముందస్తుగా ఉచిత వైద్యసేలందిస్తోంది. ఊరూరా పశువైద్య శిబిరాలు నిర్వహించి నట్టల నివారణ మందు వేయిస్తోంది. జిల్లా వ్యాప్తంగా 6,04,665 జీవాలు ఉండగా వీటిలో గొర్రెలు 4,48,154, మేకలు 1,56,511 ఉన్నాయి. జీవికి రూ.2.50 పైసల చొప్పున సుమారు రూ.18 లక్షల విలువైన డోసులను సరఫరా చేసింది. ఈ నెల 16న ప్రారంభమైన నట్టనివారణ మందు వేసే ప్రక్రియ ఈ నెల 31 వరకు సాగనుందని పశుసంవర్థకశాఖ జేడీ వైవీ రమణ తెలిపారు. – రామభద్రపురం ఐదు అడుగుల అరటిగెల.. చీపురుపల్లిరూరల్(గరివిడి): అరటిగెల సాధారణంగా 3 నుంచి నాలుగు అడుగుల పొడవు ఉంటుంది. అయితే, గరివిడి పట్టణంలోని బద్రీప్రసాద్ కాలనీలో ఓ విశ్రాంత ఫేకర్ ఉద్యోగి ఇంటి పెరటిలోని అరటిచెట్టు ఐదు అడుగుల గెల వేసింది. 300కు పైబడిన పండ్లతో చూపరులను ఆకర్షిస్తోంది. (క్లిక్: మొబైల్ మిస్సయ్యిందా..? జస్ట్ ఇలా చేస్తే చాలు.. మీ ఫోన్ సేఫ్!) -
వడివడిగా ఈ-పంట నమోదు
కడప అగ్రికల్చర్: రైతుకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో రైతు భరోసా కేంద్రాలు(ఆర్బీకే) ఏర్పాటు చేసి విత్తనం మొదలుకుని పంట దిగుబడి చేతికొచ్చే వరకు అన్ని రకాల సేవలందిస్తోంది. అలాగే అర్హులైన రైతులకు ప్రభుత్వ పథకాలను అందించాలనే లక్ష్యంలో ఈ క్రాప్ పేరుతో పారదర్శకతకు పెద్దపీట వేస్తోంది.ఇందులో భాగంగా రైతులు ఏయే పంటలు సాగు చేశారు..ఎంత విస్తీర్ణంలో సాగు చేశారనే వివరాలను వ్యవసాయ అధికారులు ఈ క్రాప్‌లో నమోదు చేస్తున్నారు. ఖరీఫ్‌లో సాగైన పంటల వివరాలు జిల్లాలో 36 మండలాల పరిధిలోని 432 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 91,741 హెక్టార్లలో సాధారణ వ్యవసాయ సాగు భూమి ఉంది. ఈ ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఇప్పటి వరకు 38,592 హెక్టార్లలో వివిధ పంటలను సాగుచేశారు. ఇందులో 3,398 హెక్టార్లలో వరి, 531 హెక్టార్లలో సజ్జ, 236 హెక్టార్లలో మొక్కజొన్న, కంది 968 హెక్టార్లలో, మినుము 1687 హెక్టార్లలో, వేరుశనగ 2601 హెక్టార్లలో, పొద్దుతిరుగుడు 1385 హెక్టార్లలో, సోయాబీన్ 2,706 హెక్టార్లలో సాగైంది. వీటిలో ఏయే పంటలు ఎంతమేర సాగయ్యాయనే వివరాలను విలేజ్ అగ్రికల్చర్, హార్టీకల్చర్ సెరీకల్చర్ అసిస్టెంట్లు నేరుగా రైతుల పొలం వద్దకే వెళ్లి ఈ క్రాపులో నమోదు చేస్తున్నారు. జోరుగా నమోదు ప్రక్రియ జిల్లాలో అగ్రికల్చర్, హార్టీకల్చర్, సెరీకల్చర్‌కు సంబంధించి సాధారణ సాగు విస్తీర్ణం 1,90, 727 ఎకరాలు ఉంది. ఇందులో పలు రకాల పంటలు దాదాపు 60 వేల ఎకరాలకు పైగా సాగైంది. వీటికి సంబంధించి ప్రస్తుతం ఈ పక్రియ చురుగ్గా సాగుతోంది. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా మూడు పంటలు కలుపుకుని దాదాపు 40 వేల ఎకరాల్లో ఈ–క్రాప్ నమోదు జరిగింది. ఈ క్రాపు నమోదులో రాష్ట్రంలో వైఎస్సార్‌జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఈ క్రాపు నమోదు కోసం రైతులు ఆధార్, బ్యాంకు ఖాతా, ఫోన్‌నంబర్లు, భూమికి సంబంధించిన వివరాలు ఇవ్వాలి. వీఏఏలు ఆధార్ బేస్ డేటాను అనుసంధానం చేసి ఈ క్రాప్‌లో నమోదు చేస్తున్నారు. ఈ పక్రియను సహాయ వ్యవసాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇవీ ప్రయోజనాలు... పంట నమోదు వల్ల వరదలు, తుపాన్ల సమయంలో పంటలకు ఏదైనా నష్టం జరిగితే ప్రభుత్వం నుంచి ఇన్పుట్ సబ్సిడీ అందుతోంది. పంటల బీమా కావాలన్నా, సున్నా వడ్డీకి పంట రుణాలు కావాలన్నా రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు తీసుకోవాలన్నా ఈ క్రాప్‌లో నమోదు తప్పనిసరి. పండించిన పంట ఉత్పత్వులను ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవాలన్నా ఈ క్రాప్ చేసి ఉండాలి. కౌలు రైతులు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లకు తమ వివరాలు అందజేసి పంట నమోదు చేసుకోవచ్చు. రైతులందరూ ఈ క్రాప్ నమోదు చేసుకోవాలి జిల్లాలో రైతులందరూ ఈ క్రాప్ నమోదు చేయించుకుంటే ప్రభుత్వ ప్రయోజనాలకు అర్హత లభిస్తుంది.జిల్లాలో ఈ ప్రక్రియ పక్రియ పకడ్బందీగా జరుగుతోంది. వరదలు, తుపాన్లు వచ్చి పంట నష్టపోయిన సమయంలో ఈ క్రాప్ చేయించుకుని ఉంటే ప్రభుత్వం నుంచి ఇన్పుట్ సబ్సిడీ అందుతుంది. పంటలు సాగు చేసిన ప్రతి రైతు కచ్చితంగా ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలి. – అయితా నాగేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి -
AP: పక్కాగా ఈ-పంట
ఆర్బీకే స్థాయిలో డ్రోన్స్ ఏర్పాటుకు త్వరితగతిన రైతు కమిటీలు ఏర్పాటు చేయాలి. ప్రతి కమిటీలో ఇంటర్ ఆ పై చదువుకున్న రైతు ఉండేలా చూడాలి. వారిని డ్రోన్ పైలెట్లుగా గుర్తించి.. డ్రోన్ల నిర్వహణ, మరమ్మతుపై శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. నియోజకవర్గ స్థాయిలో ఐటీఐ/పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు డ్రోన్ల వినియోగం, నిర్వహణ, మరమ్మతులపై సంపూర్ణ శిక్షణ ఇప్పించాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. సాక్షి, అమరావతి: ఖరీఫ్ సీజన్లో ఈ–పంట నమోదు పక్కాగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎక్కడా చిన్నపాటి లోపాలకు కూడా ఆస్కారం ఇవ్వని రీతిలో వంద శాతం పంట నమోదు జరిగేలా చూడాలన్నారు. శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)తో అనుసంధానిస్తూ ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచే అమలు చేస్తున్నందున రైతులకు గరిష్టంగా లబ్ధి చేకూర్చేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఈ–క్రాప్ నమోదు ప్రక్రియను ప్రతి రోజూ నిశితంగా పరిశీలించాలని, నమోదైన తర్వాత ప్రతి రైతుకు భౌతిక, డిజిటల్ రశీదులు ఇవ్వాలని చెప్పారు. ఈ– పంట నమోదుతో పాటు వేలి ముద్రలు తీసుకోవడానికి ఉపయోగిస్తున్న ఈకేవైసీని ఇక నుంచి నో యువర్ క్రాప్ (మీ పంట తెలుసుకోండి) అంటూ ప్రచారం చెయ్యాలని సూచించారు. వెబ్‌ల్యాండ్‌లో ఏక్కడైనా పొరపాట్లు ఉంటే వాటిని వెంటనే సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్లాలని, ఆర్బీకేల్లోని వ్యవసాయ, రెవెన్యూ సహాయకులు ఈ–పంట నమోదు ప్రక్రియను సెప్టెంబర్ మొదటి వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. ఇన్పుట్స్ నాణ్యతపై దృష్టి సారించండి – ఆర్బీకేల ద్వారా రైతులకు పంపిణీ చేస్తున్న విత్తనాల నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు జరిపించాలి. ప్రస్తుత సీజన్లో ఎరువుల కోసం ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలి. ఎరువుల పంపిణీలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలి. – ఆర్బీకేల ద్వారా విత్తనాల పంపిణీ, ఎరువుల సరఫరా ఇన్పుట్స్ పంపిణీ, అందిస్తోన్న సేవలు, వ్యవసాయ ఉత్పత్తులకు అందుతున్న ధరలు తదితర అంశాలపై వ్యవసాయ సహాయకుల నుంచి ప్రతి రోజూ సమాచారం తెప్పించుకోవాలి. ఆర్బీకేల్లో ప్రతి కియోస్క్ పని చేసేలా చర్యలు తీసుకోవాలి. వాటికి సవ్యంగా ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా? లేదా? అన్న దానిపై నిరంతరం పరిశీలన చేయాలి. అవి సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులదే. – వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాల ద్వారా రైతులకు మరిన్ని పరికరాలు ఇవ్వాలి. వ్యక్తిగత పరికరాల పంపిణీ కోసం అవసరమైన ఏర్పాట్లు చేయ్యాలి. – మండలానికి 3 ఆర్బీకేల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశలో 2 వేల ఆర్బీకేల పరిధిలో డ్రోన్లు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలి. తొలుత మాస్టర్ ట్రైనర్లను తయారు చేయాలి. 18.8 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ పంటలు – ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు రాష్ట్రంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైందని అధికారులు సీఎంకు వివరించారు. ఆగష్టు 3 నాటికి 16.2 శాతం అధిక వర్షపాతం నమోదైందని చెప్పారు. ఖరీఫ్ సీజన్లో 36.82 లక్షల హెక్టార్ల మేర పంటలు సాగు చేయాలని లక్ష్యంగా నిర్ధేశించగా, ఇప్పటికే 18.8 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయని వివరించారు. – ఖరీఫ్ సీజన్‌కు సరిపడా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఆర్బీకేల ద్వారా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఎన్ఐసీ (నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్) ద్వారా ఈ–క్రాప్ నమోదు చేస్తున్నామని, సాగవుతున్న ప్రతి పంటను సాగు విస్తీర్ణంతో సహా జియో ట్యాగింగ్ చేయడమే కాకుండా, వెబ్ ల్యాండ్‌తో అనుసంధానిస్తున్నామని వివరించారు. – ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి, సీఎస్ సమీర్ శర్మ, వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి.సాయిప్రసాద్, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, వ్యవసాయ శాఖ కమిషనర్ చేవూరు హరికిరణ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: మంచి మార్పుతో చరిత్ర లిఖిద్దాం.. మీతోడు అవసరం: రాజాం కార్యకర్తలతో సీఎం జగన్ -
ఈ–పంటతోపాటే ఈ–కేవైసీ నమోదు
సాక్షి, అమరావతి: ఈ–పంట నమోదులో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలవల్ల పంట కొనుగోలు.. సంక్షేమ పథకాల వర్తింపు విషయంలో ఏ ఒక్క రైతు ఇబ్బందిపడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఈ–పంట ఆధారంగానే వైఎస్సార్ రైతుభరోసా, ఇన్పుట్ సబ్సిడీ, ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ పంట రుణాలు వంటి సంక్షేమ ఫలాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. అలాగే, దీని ప్రామాణికంగానే పంట ఉత్పత్తులను కనీస మద్దతుకు కొనుగోలు చేస్తున్నారు. ఇందుకోసం ఉపయోగిస్తున్న ఆర్బీ యూడీపీ (రైతుభరోసా యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్) గడిచిన రబీ సీజన్లోనే నవీకరణ (అప్డేట్) చేసినప్పటికీ పూర్తిస్థాయిలో ఆచరణలోకి తీసుకురాలేకపోయారు. దీంతో పంట వివరాల నమోదు ఒకసారి, ఈకేవైసీ నమోదు మరోసారి చేసేవారు. ఈ విధానంవల్ల పంట కొనుగోలు ఇతర పథకాల అమలు సందర్భంలో ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ పరిస్థితికి చెక్‌పెడుతూ ఇక నుంచి పంట వివరాల నమోదు సమయంలోనే ఈకేవైసీ (వేలిముద్రలు) తీసుకోవాలని నిర్ణయించారు. వెబ్‌ల్యాండ్ ఆధారంగానే ఈ–క్రాపింగ్ వెబ్‌ల్యాండ్ ఆధారంగా పంట సాగు వివరాలతోపాటు రైతు బ్యాంకు, సామాజిక వివరాలను కూడా అనుసంధానిస్తున్నారు. తొలుత ఆధార్ నెంబర్ కొట్టగానే రైతుల వ్యక్తిగత వివరాలన్నీ డిస్ప్లే అవుతాయి. ఆ తర్వాత సీజన్లో అతను సాగుచేసే పంట వివరాలు నమోదుచేస్తారు. అవన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత ఈకేవైసీ నమోదుచేస్తారు. ఇక ప్రస్తుత ఖరీఫ్ సీజన్ నుంచి వ్యవసాయ, రెవెన్యూ సిబ్బంది జాయింట్ అజమాయిషీ ద్వారా ఈ–పంట నమోదు చేయనున్నారు. ఇప్పటికే ప్రారంభమైన ఖరీఫ్ సీజన్లో ఆగస్టు నెలాఖరు వరకు జాయింట్ అజమాయిషీ కొనసాగిస్తారు. రబీ సీజన్లో అక్టోబర్ 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు, మూడో పంటకు సంబంధించి మార్చి 1 నుంచి మే 31వరకు నిర్వహించనున్నారు. ఈ జాయింట్ అజమాయిషీలో తొలుత రెవెన్యూ గ్రామాలను ఆర్బీకేలతో అనుసంధానిస్తారు. ఆ తర్వాత వీఆర్వో, గ్రామ సర్వేయర్లు (రెవెన్యూ)తో పాటు గ్రామ వ్యవసాయ, ఉద్యాన సహాయకులతో బృందాలను ఏర్పాటుచేస్తారు. వారికి మండల స్థాయిలో శిక్షణనిస్తారు. షెడ్యూల్ ప్రకారం గ్రామాల వారీగా ఈ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట వివరాలను నిర్దేశిత ఫార్మాట్లో నమోదు చేస్తారు. అన్నీ సక్రమంగా ఉంటే వెంటనే సంబంధిత రైతు వేలిముద్రలు (ఈకేవైసీ) కూడా నమోదుచేసి రశీదు ఇస్తారు. పంట వివరాల నమోదుకు మార్గదర్శకాలు పరిష్కారంకాని ఇనాం, ఎస్టేట్, సర్వేకాని గ్రామాల్లోని భూములు, చుక్కల భూములు, పీఓటీ ఉల్లంఘనలు, దేవదాయ, వక్ఫ్, సీజేఎఫ్ఎస్, ఆర్ఓఎఫ్ఆర్ భూములు, సాదాబైనామా కేసులు, మ్యుటేషన్ కోసం పెండింగ్‌లో ఉన్న భూములు, సీసీఆర్సీ కార్డుదారులు, నమోదుకాని కౌలుదారులు, ప్రభుత్వ ఆక్రమిత భూముల్లో సాగుచేస్తున్న వారు, ఏపీఐఐసీ/ఏలినేటెడ్, సేకరించిన భూములు, వాటర్ బాడీలకు చెందిన భూములు, లంక భూముల్లో సాగుచేస్తున్న పంటల వివరాల నమోదుకు మార్గదర్శకాలు జారీచేశారు. నమోదైన ఈ–పంట వివరాలను మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, డిప్యూటీ తహసీల్దార్లు, తహసీల్దార్లు విధిగా క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలి. సెప్టెంబర్ 1 నుంచి 14వరకు ఈ–పంట, ఈకేవైసీ వివరాలను విధిగా ఆర్బీకేలు, వార్డు, గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలి. సెప్టెంబర్ 15న ఆర్బీకే అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ పంట వివరాలను తుది జాబితాలను ప్రచురించాలి. పకడ్బందీగా పంటల నమోదు కొనుగోలు సందర్భంలో ఏ ఒక్క రైతు సాంకేతిక లోపాలతో ఇబ్బందిపడకూడదన్న సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జాయింట్ అజమాయిషీ ద్వారా రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యాన శాఖల సిబ్బంది సంయుక్తంగా ఈ–పంటతో పాటు ఈకేవైసీ ఒకేసారి నమోదు చేయనున్నారు. వివిధ రకాల ప్రభుత్వ, ఆక్రమిత భూముల్లో సాగుచేస్తున్న పంట వివరాలను ఏ విధంగా నమోదు చేయాలో మార్గదర్శకాలిచ్చాం. – పూనం మాలకొండయ్య, స్పెషల్ సీఎస్ వ్యవసాయ శాఖ -
రైతుల నష్ట పరిహారం పై ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేస్తోంది
-
ఎల్లోమీడియా కథనాలు.. ఆ మేధావులకు నా నమస్కారాలు: మంత్రి కాకాణి
సాక్షి, నెల్లూరు: రైతులకు పంట నష్ట పరిహారంపై ఎల్లో మీడియా అసత్య కథనాలను వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఖండించారు. ఈ క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులందరికీ నష్టపరిహారం అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు నెల్లూరులో మంత్రి కాకాణి మీడియాతో మాట్లాడుతూ.. పంటల బీమా పథకాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. రైతు ఒక్క రూపాయి కుడా కట్టకుండా ప్రీమియం చెల్లించేలా చర్యలు చేపట్టాం. ఈ క్రాప్‌లో నమోదు చేసుకొంటే చాలు.. రూ.3 వేల కోట్ల బీమా రైతులకు చెల్లిస్తున్నాము. నష్టపరిహారంపై తప్పుడు రాతలు రాస్తున్నారు. విషయ పరిజ్ఞానం లేకుండా ఎల్లో మీడియాలో కథనాలు సిగ్గుచేటు. ఆ మేధావులకు నా నమస్కారాలు అని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు.. 'విలేజ్‌ని యూనిట్‌గా తీసుకొని పారదర్శకంగా బీమా పథకాన్ని అమలు చేస్తున్నాము. 31 పంటల్లో 5 పంటలకు నష్టం జరగ లేదని అధికారులు నివేదిక ఇచ్చారు. నష్టపోయిన ప్రతీ రైతుకూ పరిహారం అందిస్తున్నాము. టీడీపీ హయాంలో రూ.596 కోట్ల బకాయిలు ఎగ్గొట్టి పోయారు. రైతులు జోరుగా ఉంటే చంద్రబాబు బేజారు అయిపోతాడు. చంద్రబాబు రైతులకు ఏమి చేశారో చెప్పాలి. దోపిడీ పథకాలు తప్ప ప్రజలకు ఉపయోగపడేది ఒక్కటి కూడా టీడీపీ చేయలేదు. రుణమాఫీ విషయంలో రైతులను టీడీపీ మోసం చేసింది. ఇప్పుడు సిగ్గులేకుండా రైతు యాత్ర అంటున్నాడు. చంద్రబాబు చేసిన పాపాలు రాష్ట్రానికి శాపాలుగా మారాయని' మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. చదవండి: (గోరంట్ల వెర్సెస్ ఆదిరెడ్డి.. సిటీ సీట్ హాట్ గురూ..!) -
ఈ క్రాప్‌లో సాంకేతిక సమస్యలకు చెక్
సాక్షి, అమరావతి: అన్నదాతలకు ఇకపై ఏ ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రాప్ సమస్యలకు చెక్ పెట్టింది. పంటల నమోదు కోసం ఉపయోగిస్తున్న ఆర్బీ యూడీపీ (రైతు భరోసా యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్)యాప్‌ను అప్డేట్ చేసింది. ఇందుకోసం గడిచిన 45 రోజులుగా నిలిపి వేసిన పంటల నమోదును మంగళవారం తిరిగి ప్రారంభించింది. పంటల నమోదును ఈనెలాఖరుకల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు యాప్‌లో గ్రామం పేరు కొట్టగానే కొన్ని సందర్భాల్లో ఇతర జిల్లాల్లో అదే పేరుతో ఉన్న గ్రామాల జాబితా ప్రత్యక్షమవుతుండటంతో రైతు ఏ గ్రామానికి చెందిన వారో తెలుసుకోవడం కష్టంగా ఉండేది. ఈ క్రాప్ డేటా–సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ డేటాతో పూర్తి స్థాయిలో అనుసంధానంకాకపోవడం వల్ల కూడా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఇలా గడిచిన ఖరీఫ్ సీజన్లో రైతులు, సిబ్బందికి ఎదురైన వివిధ రకాల సాంకేతిక సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తూ ఆర్బీ యూడీపీ యాప్‌ను అప్డేట్ చేశారు. ఇలా చేశారు.. ► ఆర్బీకేల పరిధిలోని రెవెన్యూ గ్రామాలను గుర్తించేందుకు రెవెన్యూ వెబ్‌ల్యాండ్ మాస్టర్ డేటాతో ఆర్బీకేలను మ్యాపింగ్ చేశారు. ► యాప్‌లో జిల్లా, మండలం, గ్రామం పేర్లు సెలక్ట్ చేయగానే భూమి ఖాతా, సర్వే నంబర్ల వారీగా వ్యవసాయ భూముల వివరాలు వచ్చేలా మార్పుచేశారు. ► ఆయా వివరాలను ఎంపిక చేసుకున్న తర్వాత రైతు పేరు నమోదు చేసి ఏ రకం పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారో కూడా నమోదు చేయొచ్చు. ► మనుగడలో ఉన్న వంగడాల వివరాలతో సహా ఉద్యాన, వ్యవసాయ పంటల వివరాలు నమోదుచేసేలా డేటా బేస్‌లో వాటి వివరాలను పొందుపర్చారు. ► సంప్రదాయ, సేంద్రియ, ప్రకృతి, సహజ ఇలా ఏ తరహా వ్యవసాయ పద్ధతులైనా నమోదు చేసేలా ఈక్రాప్‌లో మార్పు చేశారు. ► భూ వివాదాల నేపథ్యంలో వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాని వ్యవసాయ భూములను యాడ్‌ల్యాండ్ ఆప్షన్లో నాన్‌వెబ్‌ల్యాండ్ కేటగిరి కింద నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ► వెబ్‌ల్యాండ్‌తో అనుసంధానించిన ఈక్రాప్ డేటాను సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ రూపొందించిన కొనుగోలు యాప్‌తో అనుసంధానిస్తున్నారు. ► రబీలో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పంటలు తొలుత కోతకొచ్చే అవకాశం ఉన్నందున ఆ జిల్లాల్లో పంటల నమోదుకు తొలుత ప్రాధాన్యతనిస్తారు. మిగిలిన జిల్లాల్లో కూడా నెలాఖరులోగా పంటల నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పగడ్బందీగా పంటల నమోదు సాంకేతికలోపాలతో కొనుగోలు సందర్భంలో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదన్న ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎలాంటి లోపాలకు ఆస్కారంలేని రీతిలో ఆధునీకరించిన యాప్ ద్వారా పంటల నమోదును పగడ్బందీగా చేపడుతున్నారు. – కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి క్షేత్రస్థాయిలో పంట నమోదు రసీదు గడిచిన ఖరీఫ్ సీజన్లో మాదిరిగా కాకుండా ప్రతి వాస్తవ సాగుదారుడి వివరాలు నమోదు చేసేలా యాప్‌ను అప్డేట్ చేసాం. ఈకేవైసీ నమోదు చేసుకున్న రైతులు ఆర్బీకేలకు వెళ్లనవసరం లేదు. క్షేత్ర స్థాయి పరిశీలనలోనే ప్రతీ రైతుకు పంట నమోదు రసీదు ఇస్తారు. పంటల నమోదును వేగవంతం చేసేందుకు వీలుగా ప్రతీ ఆర్బీకేకు ఓ కంప్యూటర్, ప్రింటర్, స్కానర్ అందజేస్తున్నాం. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయ శాఖ -
వాస్తవ సాగుదారులకే పంటరుణాలు
సాక్షి, అమరావతి: ఆరుగాలం శ్రమిస్తూ వ్యవసాయం చేసేవారికి.. వాస్తవ సాగుదారులకు మాత్రమే పంటరుణాలు అందనున్నాయి. సాగు చేస్తున్న భూ యజమానులతో సహా ప్రతి రైతు వివరాలను ప్రభుత్వం ఈ–క్రాప్‌లో నమోదు చేస్తోంది. దీని ఆధారంగా పంటరుణాలు మంజూరు చేయాలన్న ప్రభుత్వ అభ్యర్థనను అంగీకరించిన రాష్ట్రస్థాయి బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్బీసీ).. ఇక ఈ–క్రాప్ డేటా ఆధారంగానే పంటరుణాలు ఇస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో ఏటా ఖరీఫ్ సీజన్లో 90 లక్షల ఎకరాలు, రబీలో 60 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతులతో పాటు పెద్ద ఎత్తున భూములు కలిగిన రైతుల సంఖ్య 70 లక్షలకుపైగా ఉంటే.. వాస్తవ సాగుదారుల సంఖ్య మాత్రం 45 లక్షల నుంచి 50 లక్షలే. 60 నుంచి 70 శాతం సాగుభూములు కౌలుదారుల చేతుల్లోనే ఉన్నాయి. వీరిసంఖ్య 20 లక్షలకు పైగానే ఉంటుందని అంచనా. ఉభయ గోదావరి, కోస్తా జిల్లాల్లో సాగుచేస్తున్న వారిలో భూ యజమానులకన్నా కౌలుదారులే ఎక్కువ. ఆర్బీఐ నిబంధనల ప్రకారం పట్టాదారు పాస్‌పుస్తకాలు, టైటిల్ డీడ్స్ కుదవపెట్టి పొందిన పంటరుణాలపై బ్యాంకులు 7 శాతం వడ్డీ వసూలు చేస్తాయి. ఆ వడ్డీలో కేంద్రం 3 శాతం రాయితీ ఇస్తుంది. సెంటు భూమి కూడా సాగుచేయని భూ యజమానులు సైతం వ్యవసాయం పేరిట పెద్దమొత్తంలో రుణాలు తీసుకుని కేంద్రం ఇచ్చే రాయితీని వినియోగించుకుంటూ లబ్ధిపొందుతున్నారు. వారు ఏటా రెన్యువల్ చేయించుకోవడం లేదా కొత్త రుణాలు పొందడం పరిపాటిగా మారింది. బ్యాంకులకు నిర్దేశించిన రుణలక్ష్యంలో 60 నుంచి 70 శాతం వరకు ఈ రెన్యువల్స్ ఉంటున్నాయి. రుణాలు దక్కని వాస్తవ సాగుదారులు పంటరుణాల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులపై ఆధారపడేవారు. పంటల బీమాతోసహా ఇతర రాయితీలు వారికి దక్కేవికాదు. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ ఈ–క్రాప్ ప్రామాణికంగా వాస్తవ సాగుదారులకు మాత్రమే సంక్షేమ ఫలాలు, రాయితీలు దక్కేలా గడిచిన రెండేళ్లుగా ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయి. వైఎస్సార్ సున్నావడ్డీ రాయితీతో అండ చిన్న, సన్నకారు రైతులపై ఆర్థికభారాన్ని తగ్గించే లక్ష్యంతో 2019లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వైఎస్సార్ సున్నావడ్డీ పంటరుణాల పథకం కింద రూ.లక్ష లోపు పంటరుణాలు పొంది సకాలంలో తిరిగి చెల్లించిన వారికి వడ్డీ రాయితీ ఇస్తోంది. ఈ విధంగా ఖరీఫ్–2020 సీజన్‌కు సంబంధించి ఎన్ఐసీ రూపొందించిన పోర్టల్‌లో బ్యాంకర్స్ అప్లోడ్ చేసిన జాబితా ప్రకారం 11.03 లక్షలమంది రైతులకు రూ.6,389.27 కోట్ల మేర రూ.లక్ష లోపు పంటరుణాలు మంజూరయ్యాయి. వారికి 4 శాతం చొప్పున రు.232.35 కోట్ల వడ్డీ రాయితీ చెల్లించాల్సి వస్తుందని అంచనా వేశారు. ఈ జాబితాను ఈ–క్రాప్‌లో ఆధార్ నంబర్‌తో సరిపోల్చి చూడగా 6.67 లక్షల మంది మాత్రమే వాస్తవ సాగుదారులని తేలింది. సాగుచేసిన విస్తీర్ణం, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పొందిన రుణాన్ని బట్టి చూస్తే వారికి చెల్లించాల్సిన వడ్డీ రాయితీ రూ.112.71 కోట్లు. ఈ మొత్తాన్ని రెండురోజుల కిందట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారి ఖాతాల్లో జమచేశారు. ప్రభుత్వ ఒత్తిడికి దిగొచ్చిన బ్యాంకర్స్ కమిటీ రుణాల మంజూరు, వడ్డీ రాయితీ చెల్లింపుల్లో తలెత్తుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఇక నుంచి రైతులతోపాటు కౌలుహక్కు ధ్రువీకరణపత్రం (సీసీఆర్సీ) పొందిన కౌలుదారులు, జేఎల్‌జీ గ్రూపులకు ఈ–క్రాప్ ఆధారంగానే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం పంటరుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం బ్యాంకర్ల కమిటీని కోరింది. రూ.లక్ష లోపు పంటరుణాలు మంజూరు చేసి సకాలంలో చెల్లించినవారి వివరాలను మాత్రమే ఇకనుంచి వైఎస్సార్ సున్నా వడ్డీ పంటరుణాల (ఎస్వీపీఆర్) పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని సూచించింది. ప్రభుత్వ ఒత్తిడి ఫలితంగా ప్రస్తుత రబీ సీజన్ నుంచి ఈ–క్రాప్ ఆధారంగా లక్ష్యం మేరకు పంటరుణాల మంజూరు, పాత రుణాల నవీకరణ చేసేందుకు బ్యాంకర్ల కమిటీ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ–క్రాప్ ఆధారంగా రుణాలిస్తాం ఈ–క్రాప్ ఆధారంగా వాస్తవ సాగుదారులకు రుణాలివ్వడానికి మాకెలాంటి అభ్యంతరం లేదు. మావద్ద రుణాలు పొందిన భూ యజమానుల వివరాలు మాత్రమే ఉంటాయి. ముందుగా మా వద్ద ఉన్న లోన్‌చార్జి రిజిస్టర్, ఈ–కర్షక్, ఈ–క్రాప్ పోర్టల్స్‌ను అనుసంధానించాలి. ఇందుకు ప్రభుత్వ సహకారం అవసరం. సాధ్యమైనంత త్వరగా ఈ పోర్టల్స్‌ను అనుసంధానించిన తర్వాత ఈ–క్రాప్ ఆధారంగా పంటరుణాల మంజూరుకు శ్రీకారం చుడతాం. – వి.బ్రహ్మానందరెడ్డి, కన్వీనర్, ఎస్ఎల్బీసీ ఆర్బీకేల్లో రుణాలు పొందినవారి జాబితాలు ఈ–క్రాప్ ఆధారంగా రుణాలు మంజూరు చే సేందుకు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ అంగీకరించింది. సోషల్ ఆడిట్లో భాగంగా అర్హత ఉండి రుణాలు రానివారి వివరాలు ప్రదర్శిస్తాం. సాగుదార్లతో జేఎల్‌జీ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నాం. సీసీఆర్సీ కార్డులు జారీచేస్తున్నాం. రుణార్హత ఉన్న కౌలుదారుల జాబితాను కూడా లోన్చార్జ్ రిజిస్టర్కి అనుసంధానం చేస్తాం. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, వ్యవసాయశాఖ -
వడివడిగా ‘ఈ పంట’ నమోదు
సాక్షి, అమరావతి: ప్రభుత్వం నుంచి ఏ రాయితీ పొందాలన్నా ‘ఈ క్రాప్’ తప్పనిసరి కావడంతో రైతు భరోసా కేంద్రాల వద్ద పంటల నమోదుకు రైతన్నలు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. రాష్ట్రంలో సాగవుతున్న ప్రతీ ఎకరం వివరాలను నమోదు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పంట నమోదును చేపట్టింది. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల కొనుగోలుతోపాటు పంట రుణాలు, పంట నష్టపరిహారం, పంటల బీమా పొందేందుకు ఈ క్రాపే ప్రామాణికం. అన్నిటికీ అదే ఆధారం కావడంతో ప్రాధాన్యం సంతరించుకున్న ఈ పంట నమోదు వేగం పుంజుకుంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 92.21 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం కాగా ఇప్పటివరకు 57.88 లక్షల ఎకరాల్లో పంటలు సాగులోకి వచ్చాయి. 39.97 లక్షల ఎకరాల్లో వరి సాగు లక్ష్యం కాగా ఇప్పటికే 22.05 లక్షల ఎకరాల్లో వరి సాగును చేపట్టారు. ఇప్పటివరకు ఈ క్రాప్ ఇలా.. వ్యవసాయ పంటల విషయానికి వస్తే 13 లక్షల ఎకరాల్లో వరి, 2.17 లక్షల ఎకరాల్లో ముతక ధాన్యాలు, 2.80 లక్షల ఎకరాల్లో అపరాలు, 9.91 లక్షల ఎకరాల్లో నూనెగింజలు, 6.74 లక్షల ఎకరాల్లో ఇతర పంటల వివరాల నమోదు (ఈ క్రాపింగ్) పూర్తి చేశారు. మొత్తమ్మీద ఇప్పటి వరకు 34.62 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలతో పాటు 7.53 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలతో కలిపి మొత్తం 42.15 లక్షల ఎకరాల్లో ఈ క్రాప్ పూర్తయింది. ఆర్బీ యూడీపీ యాప్‌లో ఎన్నో ప్రత్యేకతలు మరింత సాంకేతికత జోడించి కొత్తగా తెచ్చిన రైతుభరోసా యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఈ క్రాప్ నమోదు చేస్తున్నారు. యూడీపీ యాప్ ద్వారా ఈ–కేవైసీ చేస్తున్నారు. ఏ పంట వేశారు? ఎప్పుడు కోతకు వస్తుందో కూడా తెలిసేలా యాప్‌ను డిజైన్ చేశారు. పంట వివరాలను నమోదు చేయగానే డిజిటల్ కాపీని రైతులకు అందిస్తున్నారు. ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తున్నారు. ముందుగానే రైతులు వివరాలను నమోదు చేసుకోవడం వలన ఎన్ని సర్వే నెంబర్లలో ఈ పంట నమోదు చేశారు? ఇంకా ఎన్ని చేయాల్సి ఉందో వెంటనే తెలుస్తుంది. ఇప్పటివరకు ఈ పంట నమోదుకు దూరంగా ఉన్న భూముల వివరాలను కూడా ఇప్పుడు నమోదు చేస్తున్నారు. వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాని భూములు, పట్టాదారు పాసుపుస్తకాలు పొందలేనివి, పూర్వీకుల నుంచి డాక్యుమెంట్ల ద్వారా వారసులకు దాఖలైనవి, నోటిమాట ఒప్పందాల ప్రకారం వారసులు సాగు చేస్తున్నవి, కౌలు, దేవదాయ, చుక్కల భూముల వివరాలను సైతం ఈ పంటలో నమోదు చేస్తుండడంతో లక్షలాది మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఎలా నమోదు చేసుకోవాలంటే.. యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ యాప్‌పై రైతు భరోసా కేంద్రాల స్థాయిలో విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. విత్తనం వేయగానే ప్రతీ రైతు ఆర్బీకేలో పంట వివరాలను నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకున్న 15 రోజుల తర్వాత గ్రామ వ్యవసాయ, ఉద్యాన, పట్టు సహాయకుల్లో ఒకరు క్షేత్రస్థాయికి వెళ్లి పంటల ఫొటోలను తీస్తున్నారు. ఆ వివరాలతో కూడిన డిజిటల్ సర్టిఫికెట్‌ను రైతు స్మార్ట్ ఫోన్‌కు పంపిస్తున్నారు. గ్రామ పరిధిలో ఎంతమంది రైతులున్నారు? ఎవరు, ఎంత విస్తీర్ణంలో ఏ పంట సాగు చేస్తున్నారో యా‹ప్లో కనిపిస్తుంది. ఈ క్రాప్‌పై అవగాహన కల్పించి దశల వారీగా నమోదును పెంచడానికి వ్యవసాయ శాఖ వినూత్న మార్గాలను ఎంచుకుంటోంది. ఈ క్రాప్ ఆవశ్యకతపై దండోరా వేయిస్తున్నారు. యాప్‌లో ఒకసారి నమోదు చేస్తే సీజన్ ముగిసే వరకు అన్ని రకాల ప్రయోజనాలు పొందేందుకు ఉపకరిస్తుంది. పంట నమోదు తప్పనిసరి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రాయితీలు పొందాలంటే పంటల నమోదు (ఈ క్రాప్) తప్పనిసరి. ఈ సారి కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఆర్బీ యూడీïపీ యాప్‌లో నమోదు చేసుకుంటే రసీదు కూడా ఇస్తారు. ఈ రసీదు ఉంటే చాలు పంట రుణం, పంటల బీమా, పరిహారం ఏదైనా పొందొచ్చు. కనీస మద్దతు ధరకు దర్జాగా అమ్ముకోవచ్చు. ఖరీఫ్‌లో రైతులందరూ విధిగా తమ పంట వివరాలను ఆర్బీకే సిబ్బంది వద్ద నమోదు చేసుకోవాలి. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్ వ్యవసాయ శాఖ -
ఈ-క్రాప్‌తో రైతు సంక్షేమం
భీమవరం: రైతు శ్రేయస్సే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలుచేస్తూ అండగా నిలుస్తోంది. దీనిలో భాగంగానే పథకాలను రైతులకు మరింత చేరువ చేయడానికి చేపట్టిన ఈ–క్రాప్ నమోదు భీమవరం నియోజకవర్గంలో వేగంగా జరుగుతోంది. ఈ–క్రాప్ ద్వారా గ్రామాల్లో పండించిన అన్నిరకాల వ్యవసాయ, ఉద్యాన పంటలు, పట్టు పరిశ్రమ, పశుగ్రాసం, సామాజిక అటవీశాఖ, మత్స్యశాఖలకు సంబంధించిన వివరాలు నమోదు చేస్తారు. ఈ క్రాప్‌లో నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే ప్రభుత్వం రైతులకు అందించే అన్ని సంక్షేమ పథకాలు, వైఎస్సార్ సున్నావడ్డీ, పంట రుణాలు, వైఎస్సార్ ఉచిత పంట బీమా, ఇన్‌ఫుట్ సబ్సిడీ, కనీస మద్దతు ధర వంటివి దక్కుతాయి. గతంలో ప్రభుత్వం రైతుల కోసం అమలుచేసే పథకాలు భూస్వాములకు మాత్రమే దక్కేవి. జిల్లాలో సుమారు 3 లక్షలకు పైగా కౌలు రైతులున్నారు. వీరిని పరిగణలోనికి తీసుకుని ప్రభుత్వ పథకాలు పంట సాగుచేసే రైతులకే అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే ఈ క్రాప్ విధానం చేపట్టారు. ఈ క్రాప్‌లో భూయజమానులు, కౌలు రైతులు, ఈనాం రైతులు వంటి వారిని కూడా నమోదుచేస్తారు. ఈ క్రాప్ నమోదు కార్యక్రమం భీమవరం నియోజకవర్గంలో ముమ్మరంగా సాగుతోంది. వీరవాసరం మండలంలో సుమారు 14 వేల ఎకరాల్లో సాగు చేస్తుండగా ఇప్పటివరకు 5 వేల ఎకరాల్లో నమోదు చేశారు. భీమవరం మండలంలో 11 వేల ఎకరాలకు గాను 5వేల ఎకరాల్లో నమోదు ప్రక్రియ పూర్తి చేశారు. మిగిలిన విస్తీర్ణంలో కూడా నమోదు కార్యక్రమాన్ని వేగంగా చేస్తున్నారు. పంట అమ్మకాలకు ఎంతో మేలు నియోజకవర్గంలో ప్రధానంగా వరి అమ్మకాలకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్మే సమయంలో రిజిస్టర్ కాకపోవడంతో కొనుగోలు కేంద్రాల వద్ద అభ్యంతరాలు చెబుతున్నారు. పండిన పంటను తీరా కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లాక నమోదు ఇబ్బందులతో అమ్మకంలో జాప్యం జరుగుతోంది. దీనిని అధిగమించడానికి పంట వేసిన సమయంలోనే ఈ క్రాప్ నమోదు చేయించుకుంటే.. అమ్మే సమయంలో ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే అమ్మకాలు చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. వేగంగా ఈ క్రాప్ నమోదు భీమవరం వ్యవసాయ సబ్‌డివిజన్ పరిధిలోని, వీరవాసరం, భీమవరం, పాలకోడేరు మండలాల్లో ఈ క్రాప్ నమోదు వేగంగా జరుగుతోంది. ఇప్పటికే దాదాపు 50 శాతం వరకు పూర్తయ్యింది. ఈ క్రాప్ వల్ల రైతులకు ఎంతో ప్రయోజనం ఉంది. రైతులంతా తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి. పి.ఉషారాజకుమారి, ఏడీఏ, భీమవరం -
ఏపీ పంటల ప్రణాళిక
ఖరీఫ్ పంట చేతికి వచ్చే నాటికి ప్రతి రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే) పరిధిలో గ్రేడింగ్, ప్యాకింగ్ సదుపాయాలు సిద్ధం కావాలి. రాష్ట్రంలోని 10,641 ఆర్బీకేలలో ఈ ఏర్పాట్లుండాలి. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కోసం ఇ–ప్లాట్‌ఫామ్ ఏర్పాటు చేయాలి. – సీఎం వైఎస్ జగన్ ఇ–ప్లాట్‌ఫామ్ ఏర్పాటు ► రైతులు పండించిన పంటల్లో 30 శాతం కొనుగోలు చేయడం ద్వారా మార్కెట్లో పోటీతత్వాన్ని పెంచి, రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించే ప్రయత్నాలను ప్రభుత్వం చేస్తుంది. మిగిలిన 70 శాతం పంటకు కూడా కనీస గిట్టుబాటు ధర కల్పించే ప్రయత్నాలు చేయాలి. ► ఇందుకోసం ఇ–మార్కెటింగ్ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేయాలి. దీనిపై పంటలను అమ్మాలంటే నాణ్యత అనేది చాలా ముఖ్యం. దీనికోసం గ్రేడింగ్, ప్యాకింగ్, ప్రాసెసింగ్ లాంటి సదుపాయాలు కల్పించాలి. ► ఇ–మార్కెటింగ్ ప్లాట్‌ఫాం విజయవంతమవ్వాలంటే రవాణా సదుపాయాలు, సకాలంలో రైతులకు చెల్లింపులు, వ్యవసాయ ఉత్పత్తుల్లో నాణ్యత పాటించడం ముఖ్యం. వీటిపై సమర్థవంతమైన ఆలోచన చేయాలి. సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాన్ని యూనిట్‌గా తీసుకుని, దాని పరిధిలో ఏయే పంటలు వేయాలనే దానిపై ప్రణాళికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఏ రైతు ఏ పంట వేస్తున్నారన్న దానిపై ఇ–క్రాపింగ్ కోసం విధివిధానాలను మరింత సమగ్రంగా తయారు చేయాలన్నారు. వాటిని రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే), గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలని చెప్పారు. రైతులు పండించిన పంటలను విక్రయించేందుకు ఇ–ప్లాట్‌ఫాంను కూడా సిద్ధం చేయాలని ఆదేశించారు. పంటల ప్రణాళిక, ఇ–క్రాపింగ్ అంశాలపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ముఖ్యమంత్రి తీసుకున్న కీలక నిర్ణయాలు ఇలా ఉన్నాయి. పంటల ప్రణాళిక, ఇ–క్రాపింగ్ అంశాలపై సోమవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మ్యాపింగ్ చేయాలి ► వీలైనంత త్వరగా పంటల ప్రణాళిక, ఇ– క్రాపింగ్‌పై విధి విధానాలను రూపొందించాలి. వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాన్ని యూనిట్‌గా తీసుకుని, దాని పరిధిలో ఏ పంటలు వేయాలనే దానిపై మ్యాపింగ్ చేయాలి. ► జిల్లా, మండల స్థాయిల్లో వ్యవసాయ సలహా బోర్డులను వెంటనే ఏర్పాటు చేయాలి. మార్కెటింగ్ చేయలేని పంటలు వేస్తే.. రైతులకు నష్టం కలుగుతుంది. పంటల ప్రణాళికకు అనుగుణంగా విత్తనాలు అందుబాటులో ఉంచాలి. ► ఇ– క్రాపింగ్ మీద సమగ్ర విధివిధానాలను, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)లను వెంటనే తయారు చేయాలి. ఇ– క్రాపింగ్ విధివిధానాలను సచివాలయాల్లో, ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచాలి. విధివిధానాలు వివాదాలు లేకుండా, పారదర్శకంగా ఉండాలి. గ్రేడింగ్, ప్యాకింగ్ జనతా బజార్లకూ ఉపయోగం ► వచ్చే సీజన్లో ఏర్పాటు చేయదలచిన జనతా బజార్లకూ గ్రేడింగ్, ప్యాకింగ్ విధానాలు దోహద పడతాయి. తర్వాత దశలో గ్రామాల్లో గోడౌన్లు, కోల్డ్ స్టోరేజీలపై దృష్టి పెట్టాలి. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు కావాలి. ► అధికారులు వీటికి అవసరమైన అనుమతులు వెంటనే ఇవ్వాలని, ఈ మేరకు మార్గదర్శక ప్రణాళిక రూపొందించి తనకు నివేదించాలని సీఎం ఆదేశించారు. సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
ఈ-మార్కెటింగ్ పై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
ఈ-మార్కెటింగ్ పై సీఎం జగన్ సమీక్ష
సాక్షి, తాడేపల్లి: ఈ-క్రాపింగ్ మీద సమగ్ర విధివిధానాలను, ఎస్ఓపీలను వెంటనే తయారుచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం పంటల ప్రణాళిక, ఈ-మార్కెటింగ్ ఫ్లాట్‌ఫాంపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులకు కొన్ని మార్గదర్శకాలు చేశారు. ఆర్జీకే(రైతు భరోసా కేంద్రాలు)పరిధిలో ఏ పంటలు వేయాలన్నదానిపై మ్యాపింగ్ చేయాలన్నారు. జిల్లా, మండల స్థాయిల్లో అగ్రికల్చర్ సలహా బోర్డులను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వైయస్సార్ రైతు భరోసాకేంద్రాన్ని యూనిట్‌గా తీసుకుని దాని పరిధిలో ఏయే పంటలు వేయాలన్నదానిపై పంటల ప్రణాళికను సిద్ధంచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏయే రైతు ఏ పంట వేస్తున్నారన్నదానిపై ఈ- క్రాపింగ్ కోసం విధివిధానాలను మరింత సమగ్రంగా తయారుచేసి, వాటిని వైయస్సార్ రైతు భరోసాకేంద్రాలు, గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. మార్కెటింగ్ చేయలేని పంటలు వేస్తే రైతులు నష్టపోతారన్నారు. (‘ఆ విషయంలో ఏపీ ఏజీ ఓ సూచన చేశారు’) పంటల ప్రణాళికకు అనుగుణంగా విత్తనాలు అందుబాటులో ఉండేలా చూడాలని జగన్ ఆదేశించారు. రైతులు పండించిన పంటలను విక్రయించేందుకు ఈ-ప్లాట్‌ఫాంను కూడా సిద్ధంచేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రభుత్వం 30 శాతం పంటలను కొనుగోలుచేయాలని నిశ్చయించిందని, మిగతా 70 శాతం పంట కూడా అమ్ముడయ్యేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలన్నారు. దీనికోసం ఈ- మార్కెటింగ్ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేయాలన్నారు. గ్రామస్థాయిలో గ్రేడింగ్, ప్యాకింగ్ సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలని, ఈ- మార్కెటింగ్ పద్దతిలో పంటను అమ్మాలంటే నాణ్యత అనేది చాలా ముఖ్యమని జగన్ పేర్కొన్నారు. గ్రేడింగ్, ప్యాకింగ్, ప్రాసెసింగ్ లాంటి ప్రయత్నాలు చేయకపోతే నాణ్యతాప్రమాణాలను పాటించలేమని, ఈ ఖరీఫ్ పంట చేతికి వచ్చే సమయానికి గ్రేడింగ్, ప్యాకింగ్ అందుబాటులోకి తీసుకు రావాలన్నారు. ఈ-మార్కెటింగ్ ఫ్లాట్పాం విజయవంతం కావాలంటే సరైన రవాణా సదుపాయాలు, సకాలంలో రైతులకు చెల్లింపులు, వ్యవసాయ ఉత్పత్తుల్లో నాణ్యత పాటించడం అనే మూడు అంశాలు అత్యంత కీలకమని సీఎం జగన్ అన్నారు. ఈ మూడు అంశాలపై సమర్థవంతమైన ఆలోచనలు చేయాలని సీఎం ఆదేశించారు. ముందుగా ప్రతి ఆర్బీకే పరిధిలో గ్రేడింగ్, ప్యాకింగ్ సుదుపాయాలు కల్పించాలని, ఈ ఖరీఫ్ పంట చేతికి వచ్చేనాటికి గ్రేడింగ్, ప్యాకింగ్ సిద్ధంకావాలని సీఎం అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. 10,641 ఆర్బీకేలలో గ్రేడింగ్, ప్యాకింగ్ సదుపాయాలను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. వచ్చే కాలంలో ఏర్పాటు చేయబోయే జనతా బజార్లకూ ఈ విధానాలు దోహదపడతాయని సీఎం అన్నారు. గ్రేడింగ్, ప్యాకింగ్ తర్వాత గ్రామాల్లో గోడౌన్లు, కోల్డ్‌స్టోరేజీలపై దృష్టిపెట్టాలని సీఎం అన్నారు. గోడౌన్స్, కోల్డు స్టోరేజీలకు ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలు కావాలన్నారు. వీటికి అవసరమైన అనుమతులు వెంటనే ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. మార్గదర్శక ప్రణాళిక రూపొందించి తనకు నివేదించాలని సీఎం అధికారులను ఆదేశించారు. క్యాంపు క్యారాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ యమ్‌వీఎస్ నాగిరెడ్డి, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ్ కల్లాం, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. (ఢిల్లీ పర్యటనకు సీఎం జగన్: అమిత్ షాతో భేటీ) -
ఇక ఈ క్రాప్
ఇంతవరకూ అమలులో ఉన్న పంటల గుర్తింపు, గణన , ఆదాయం తదితర వివరాల సేకరణలో పాత పద్ధతికి స్విస్తి చెప్పి, ఈ-కాప్ ్రద్వారా కొత్త విధానానికి శ్రీకారం చట్టునున్నారు. ఇందుకోసం ట్యాబ్‌లను వినియోగించున్నారు. వీఆర్వోల నుంచి కలెక్టర్ వరకూ అందరికీ ట్యాబ్‌లను అందజేయనున్నారు. ట్యాబ్‌ల వినియోగించి వీఆర్వోలు నమోదు చేసిన గణాంకాలను ఆయా స్థాయిల్లోని జిల్లా అధికారులు పరిశీలించవచ్చు. విజయనగరం కంటోన్మెంట్: జిల్లాలో ఆరులక్షల పట్టాదారులున్నారు. ఇందులో వ్యవసాయం చేసే పట్టాదారులు ఐదు లక్షల మంది ఉండగా, అనుభవదారులు 21 లక్షల మంది ఉన్నారు. వీరు సాగు చేసే అన్ని పంటలను వీర్వోలు తమకు అందజేసిన ట్యాబ్‌ల సహాయంతో క్షేత్ర స్థాయిలోకి వెళ్లి రికార్డు చేసి వెంటనే ఉన్నతాధికారులకు అప్లోడ్ చేస్తారు. ఇందుకోసం ముందుగా వీఆర్వో తమ పేరును ఐడీని రిజిస్టర్ చేసుకున్న వెంటనే ట్యాబ్‌లో వీఆర్వో పరిధిలోని గ్రామంలో ఉన్న భూముల వివరాలు వస్తాయి. ఒక వీఆర్వోకు రెండు మూడు గ్రామాలు ఇన్చార్జిగా ఉన్నా... ఒకే ట్యాబ్ ఇస్తారు. మొదట ఒక గ్రామానికి సంబంధించిన పంటల సాగు వివరాలను అప్లోడ్ చేశాక, తరువాత తాను ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్న గ్రామం తరఫున మరోసారి రిజిస్టర్ అయితే ఆ గ్రామానికి సంబంధించిన వివరాలు ట్యాబ్‌లో ప్రత్యక్షమవుతాయి. వెంటనే లాగిన్ అయి ఈ గ్రామంలోని భూముల వివరాలను, పంటల సాగును నమోదు చేస్తారు. ఖరీఫ్ సీజన్లో జిల్లాలో సాగు చేస్తున్న పంటలను పరిశీలించి ఫొటో తీస్తారు. వీలును బట్టి సంబంధిత రైతు ఫొటో కూడా అక్కడ అప్లోడ్ అవుతుంది. జిల్లాకు 760 ట్యాబ్‌లు ఈ ఏడాది ఖరీఫ్ నుంచి అమలు చేస్తున్న ఈ-క్రాప్ విధానం కోసం అవసరమైన ట్యాబ్‌లను కేఆర్సీ అధికారులు జిల్లాకు తీసుకువచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వీఆర్వోలు, తహశీల్దార్లకు 760 ట్యాబ్‌లను ఉన్నతాధికారులు పంపించారు. ఈ ట్యాబ్‌లను వీఆర్వోలకు సంబంధిత అధికారులకు శుక్రవారం నుంచి అందజేయనున్నారు. వీటికి సంబంధించి 3జీ, 2జీ సిమ్‌లను అందజేస్తారు. వీటి సహాయంతో పంటల చిత్రాలను అప్లోడ్ చేసి సాగును, స్థూల ఉత్పత్తి వివరాలు తెలుసుకుంటారు. 20 నుంచి శిక్షణనిస్తాం: కేఆర్సీ డి ప్యూటీ కలెక్టర్ శ్రీలత ఈ -క్రాప్ విధానంపై ఈనెల 20 నుంచి శిక్షణ ఇవ్వనున్నామని కోనేరు రంగారావు సిఫార్సుల అమలు కమిటీ డిప్యూటీ కలెక్టర్ ఆర్ శ్రీలత చెప్పారు. ఇటీవల జిల్లా నుంచి తనతో పాటు ఈడీఎం శ్రావణ్, ఎన్ఐసీ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ అధికారి నరేంద్రలతో పాటు ఓ తహశీల్దార్, ఒక వ్యవసాయాధికారి, ఓ ఆర్ఐ, వీఆర్వోకు హైదరాబాద్‌లో శిక్షణనిచ్చారన్నారు. తామంతా ఇప్పుడు క్షేత్ర స్థాయిలోని వీఆర్వోలు, ఏఓలు, తహశీల్దార్లు, ఆర్ఐలకు శిక్షణ ఇస్తామన్నారు. 20న విజయనగరం, 21వ తేదీ ఉదయం నెల్లిమర్ల, మధ్యాహ్నం చీపురుపల్లి, 22వ తేదీ ఉదయం గజపతినగరం, మధ్యాహ్నం ఎస్‌కోట, 23వ తేదీ ఉదయం బొబ్బిలి, మధ్యాహ్నం సాలూరు, 24వ తేదీ ఉదయం పార్వతీపురం, మధ్యాహ్నం కురుపాం నియోజకవర్గాలకు చెందిన వీఆర్వోలు, అధికారులకు శిక్షణ ఇస్తామన్నారు.