రైతుకు అసలైన భరోసా | YS Jagan government to support the farmers | Sakshi
Sakshi News home page

రైతుకు అసలైన భరోసా

Published Tue, May 30 2023 5:00 AM | Last Updated on Tue, May 30 2023 5:00 AM

YS Jagan government to support the farmers - Sakshi

సాక్షి, అమరావతి :  వ్యవసాయం దండగ అన్నవాళ్ల నోళ్లను మూయిస్తూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవసాయ రంగాన్ని పండుగలా మార్చారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ సర్కారు ఏర్పాటైన తరువాత దేశంలోనే ఎక్కడా లేనివిధంగా వ్యవసాయ రంగంలో సీఎం జగన్‌ అనేక సంస్కరణలు తీసుకొచ్చారు.

వైఎస్సార్‌ రైతు భరోసా, వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా, వైఎస్సార్‌ సున్నా వడ్డీ రాయితీ, పంట నష్టపరిహారం, వైఎస్సార్‌ యంత్ర సేవ, ఉచిత వ్యవసాయ విద్యుత్‌ సబ్సిడీ పథకాలతోపాటు రైతులు పండిస్తున్న పంటలను నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేయడం, విత్తన సబ్సిడీ, సూక్ష్మ సేద్యం, పండ్ల తోటల అభివృద్ధి, ఆక్వా రైతులకు విద్యుత్‌ సబ్సిడీ, ఆయిల్‌పామ్‌ రైతులకు సబ్సిడీ, పగటి పూటే 9 గంటల విద్యుత్‌ సరఫరా కోసం ఫీడర్ల సామర్ధ్యం పెంపు, విత్తు నుంచి పంట విక్రయం వరకు రైతుకు అండదండలు అందించేదుకు రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే)ల ఏర్పాటు వంటి ఎన్నో కీలక నిర్ణయాలతో వ్యవసాయ రంగాన్ని ఉరకలెత్తిస్తున్నారు. 

ప్రాజెక్టులు నిండుకుండలు.. నిండా పంటలు 
పాలించే మారాజు మనసున్న వాడైతే.. ప్రకృతి పులకిస్తుందని రుజువైంది. నాలుగేళ్లుగా కరువుతీరా కురుస్తున్న వర్షాలతో సాగునీటి ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. భూగర్భ జలాలు ఎగసిపడుతున్నాయి.

ఆహార ధాన్యాల ఉత్పత్తి 2014–19 మధ్య ఏటా సగటున 153.95 లక్షల టన్నులు నమోదు కాగా.. 2019–23 మధ్య ఏటా సగటున 165.40 లక్షల టన్నులకు పెరగడం విశేషం. ఇదే సందర్భంలో ఉద్యాన పంటల దిగుబడులు సైతం పెరిగాయి. 2014–15లో 305 లక్షల టన్నులుగా ఉన్న ఉద్యాన పంటల దిగుబడులు.. ప్రస్తుతం 368.83 లక్షల టన్నులకు పెరిగింది.  

మూడు రెట్లు పెరిగిన కేటాయింపులు 
టీడీపీ ఐదేళ్ల పాలనలో వ్యవసాయ, దాని అనుబంధ రంగాలకు రూ.61,758 కోట్లు వెచ్చించగా.. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక రూ.1,70,571.62 కోట్లను వెచ్చించింది. మరో ఏడాదికి కేటాయించే మొత్తాన్ని కలిపితే గత ప్రభుత్వం కంటే.. మూడు రెట్లకు పైగా నిధులు కేటాయించినట్టు తేటతెల్లమవుతోంది.

కరోనా విపత్కర పరిస్థితులకు ఎదురొడ్డి మరీ రూ.1.49 లక్షల కోట్ల సాయాన్ని నేరుగా రైతులకు అందించి రైతులకు అన్ని విధాలుగా అండగా నిలవడం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తేటతెల్లం చేసింది.  

సున్నా వడ్డీ.. ఉచిత బీమా 
సున్నా వడ్డీకే పంట రుణాలివ్వడంతోపాటు ప్రతి పంటను ఈ క్రాప్‌లో నమోదు చేస్తూ పైసా భారం పడకుండా పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే బీమా కల్పిస్తోంది. కోతలకు ముందే ప్రతి పంటకు కనీస మద్దతు ధర ప్రకటిస్తోంది. ధరల స్థిరీకరణ నిధి ద్వారా కనీస మద్దతు ధర దక్కని పంటలను కొనుగోలు చేస్తోంది.

విపత్తుల వల్ల నష్టపోయే రైతులకు సీజన్‌ ముగిసేలోగానే పంట నష్టపరిహారంతో పాటు బీమా సొమ్ము సైతం అందిస్తోంది. సేంద్రియ సాగుతోపాటు చిరుధాన్యాలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రత్యేక పాలసీలను తీసుకొచ్చింది. మెట్టప్రాంత పంటలకు పగటిపూట 9 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను నిరాటంకంగా అందిస్తోంది.  

పల్లెసీమల రూపురేఖలు మార్చిన ఆర్బీకేలు 
గతంలో విత్తనాల కోసం రైతులు పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చేది. ఎరువుల కోసం ప్రైవేట్‌ డీలర్లు అంటగట్టే అవసరం లేని పురుగుమందులను కొనాల్సి వచ్చేది. ఎండల్ని తట్టుకోలేక అన్నదాతలు  ఏటా పదుల సంఖ్యలో రైతులు మతిచెందేవారు. అదునులోపు విత్త­నం దొరక్క దళారుల వద్ద నకిలీ, నాసి­రకం వాటిని అధిక ధరలకు కొనుగోలు చేసే­­­వారు. విత్తనాల కోసం రైతుల పాట్లు పత్రికల్లో పతాక శీర్షికల్లో కథనాలు వచ్చేవి. ఆర్బీకేల రాకతో రైతుల కష్టాలు  తొలగిపోయాయి.

ఇప్పుడు సీజన్‌కు ముందే రెడీ 
సాగు ఉత్పదకాలను రైతుల ముంగిటకు తీసుకెళ్లాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలతో రైతుల వెతలకు చెక్‌ పడింది. సీజన్‌కు ముందుగానే సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలను గ్రామస్థాయిలో నిల్వ చేసి రైతులకు నేరుగా పంపిణీ చేస్తున్నారు. ఆర్బీకేల్లోని కియోస్‌్కల్లో బుక్‌ చేసుకున్న 24 గంటల్లోపే వారి ముంగిట అందిస్తున్నారు. ఆర్బీకేలు ఏర్పాటైన మూడేళ్లలో 63.50 లక్షల మంది రైతులకు 37.04 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేశారు.

వరి, అపరాలు, చిరుధాన్యాలు, నూనెగింజలు, పచ్చిరొట్ట విత్తనాలే కాదు పత్తి, మిరప వంటి నాన్‌ సబ్సిడీ విత్తనాలను సైతం ఆర్బీకేల ద్వారా అందిస్తున్నారు. 10,778 ఆర్బీకేల ద్వారా దుక్కి పనులు ప్రారంభం కాకముందే రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుతున్నాయి. ముందుగానే అగ్రి ల్యాబ్స్‌లో టెస్ట్‌ చేసి మరీ నాణ్యమైన సీడ్‌ను పంపిణీ చేస్తున్నారు. మూడేళ్లుగా చూద్దామంటే విత్తనాల కోసం ఎక్కడా బారులు తీరే పరిస్థితి కనిపించడం లేదు. విత్తనం దొరుకుతుందో లేదోననే చింత ఎవరిలోనూ కనిపించడం లేదు. నకిలీల ఊసే ఎక్కడా వినిపించడం లేదు.

మూడేళ్లలో ఆర్బీకేల ద్వారా రూ.953.53 కోట్ల విలువైన 8.69 లక్షల టన్నుల ఎరువులను 23.47 లక్షల మంది రైతులకు పంపిణీ చేశారు. మార్కెట్‌లో ధరలు పతనమైన ప్రతిసారి మార్కెట్‌లో జోక్యం చేసుకుని ఆర్బీకేల ద్వారా ఆయా పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. పంట రుణాలు, ఈ–క్రాప్‌ నమోదు, పంటల బీమా, పంట నష్టపరిహారం ఇలా ప్రతి ఒక్కటి అర్హత ఉన్న ప్రతి రైతుకు అందేలా ఆర్బీకే సిబ్బంది కృషి చేస్తున్నారు.

గతంలో పశువుకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా మండల కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం ఫోన్‌ చేయగానే క్షణాల్లో వీహెచ్‌ఏ ఇంటికి వచ్చి మరీ సేవలందిస్తున్నారు. ఉచితంగా మందులిస్తున్నరు. నాణ్యమైన ధ్రువీకరించిన మిశ్రమ దాణా, పశుగ్రాసం సరఫరా చేస్తున్నారు. ఫలితంగా గతంతో పోలిస్తే పాల దిగుబడి రెట్టింపయ్యిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆర్బీకేల ద్వారా ఆక్వా సాగు చేస్తున్న ప్రతి రైతుకు లైసెన్సు జారీతో పాటు నాణ్యమైన ఫీడ్‌ను అందజేస్తున్నారు.  

అగ్రి ల్యాబ్‌లు.. యంత్ర సేవా కేంద్రాలు.. గోదాములు 
అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో 147 చోట్ల వైఎస్సార్‌ ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్స్‌ను నెలకొల్పుతోంది. ఇందుకోసం ఒక్కొక్క ల్యాబ్‌కు రూ.81 లక్షల చొప్పున వెచ్చిస్తోంది. రూ.6.25 కోట్ల అంచనా వ్యయంతో జిల్లా స్థాయిలో 13 ల్యాబ్‌లు, రూ.75 లక్షల అంచనా వ్యయంతో రీజనల్‌ స్థాయిలో నాలుగు సమన్వయ కేంద్రాలను, గుంటూరులో రాష్ట్రస్థాయిలో రూ.8.50 కోట్ల అంచనాతో విత్తన జన్యు పరీక్ష కేంద్రాన్ని డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీతో ఏర్పాటు చేస్తున్నారు.

ఇప్పటికే 70 అగ్రి ల్యాబ్స్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కాగా.. చిన్న, సన్నకారు రైతులకు అవసరమైన యంత్ర పరికరాలను స్వల్ప అద్దె ప్రాతిపదికన వారి ముంగిటకే తీసుకెళ్లాలన్న సంకల్పంతో రూ.691 కోట్లతో 6,525 ఆర్బీకే, 391 క్లస్టర్‌ స్థాయి యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆర్బీకేలకు అనుబంధంగా రూ.1,584.61 కోట్లతో 2,536 బహుళ ప్రయోజన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.

ఒక్కొక్కటి రూ.40 లక్షల అంచనాతో 500 టన్నుల సామర్థ్యంతో 1021, రూ.75లక్షల అంచనాతో 100 టన్నుల సామర్థ్యంతో 113 గోదాముల నిర్మిస్తున్నారు. వీటిలో రూ.166.33 కోట్ల ఖర్చుతో వివిధ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇప్పటికే వెయ్యి గోదాములు నిర్మాణం పూర్తి కాగా.. వచ్చే నెలలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement