aqua cultivation
-
రైతుకు అసలైన భరోసా
సాక్షి, అమరావతి : వ్యవసాయం దండగ అన్నవాళ్ల నోళ్లను మూయిస్తూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యవసాయ రంగాన్ని పండుగలా మార్చారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ సర్కారు ఏర్పాటైన తరువాత దేశంలోనే ఎక్కడా లేనివిధంగా వ్యవసాయ రంగంలో సీఎం జగన్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ ఉచిత పంటల బీమా, వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ, పంట నష్టపరిహారం, వైఎస్సార్ యంత్ర సేవ, ఉచిత వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ పథకాలతోపాటు రైతులు పండిస్తున్న పంటలను నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేయడం, విత్తన సబ్సిడీ, సూక్ష్మ సేద్యం, పండ్ల తోటల అభివృద్ధి, ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ, ఆయిల్‌పామ్ రైతులకు సబ్సిడీ, పగటి పూటే 9 గంటల విద్యుత్ సరఫరా కోసం ఫీడర్ల సామర్ధ్యం పెంపు, విత్తు నుంచి పంట విక్రయం వరకు రైతుకు అండదండలు అందించేదుకు రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే)ల ఏర్పాటు వంటి ఎన్నో కీలక నిర్ణయాలతో వ్యవసాయ రంగాన్ని ఉరకలెత్తిస్తున్నారు. ప్రాజెక్టులు నిండుకుండలు.. నిండా పంటలు పాలించే మారాజు మనసున్న వాడైతే.. ప్రకృతి పులకిస్తుందని రుజువైంది. నాలుగేళ్లుగా కరువుతీరా కురుస్తున్న వర్షాలతో సాగునీటి ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. భూగర్భ జలాలు ఎగసిపడుతున్నాయి. ఆహార ధాన్యాల ఉత్పత్తి 2014–19 మధ్య ఏటా సగటున 153.95 లక్షల టన్నులు నమోదు కాగా.. 2019–23 మధ్య ఏటా సగటున 165.40 లక్షల టన్నులకు పెరగడం విశేషం. ఇదే సందర్భంలో ఉద్యాన పంటల దిగుబడులు సైతం పెరిగాయి. 2014–15లో 305 లక్షల టన్నులుగా ఉన్న ఉద్యాన పంటల దిగుబడులు.. ప్రస్తుతం 368.83 లక్షల టన్నులకు పెరిగింది. మూడు రెట్లు పెరిగిన కేటాయింపులు టీడీపీ ఐదేళ్ల పాలనలో వ్యవసాయ, దాని అనుబంధ రంగాలకు రూ.61,758 కోట్లు వెచ్చించగా.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక రూ.1,70,571.62 కోట్లను వెచ్చించింది. మరో ఏడాదికి కేటాయించే మొత్తాన్ని కలిపితే గత ప్రభుత్వం కంటే.. మూడు రెట్లకు పైగా నిధులు కేటాయించినట్టు తేటతెల్లమవుతోంది. కరోనా విపత్కర పరిస్థితులకు ఎదురొడ్డి మరీ రూ.1.49 లక్షల కోట్ల సాయాన్ని నేరుగా రైతులకు అందించి రైతులకు అన్ని విధాలుగా అండగా నిలవడం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తేటతెల్లం చేసింది. సున్నా వడ్డీ.. ఉచిత బీమా సున్నా వడ్డీకే పంట రుణాలివ్వడంతోపాటు ప్రతి పంటను ఈ క్రాప్‌లో నమోదు చేస్తూ పైసా భారం పడకుండా పంటలకు రాష్ట్ర ప్రభుత్వమే బీమా కల్పిస్తోంది. కోతలకు ముందే ప్రతి పంటకు కనీస మద్దతు ధర ప్రకటిస్తోంది. ధరల స్థిరీకరణ నిధి ద్వారా కనీస మద్దతు ధర దక్కని పంటలను కొనుగోలు చేస్తోంది. విపత్తుల వల్ల నష్టపోయే రైతులకు సీజన్ ముగిసేలోగానే పంట నష్టపరిహారంతో పాటు బీమా సొమ్ము సైతం అందిస్తోంది. సేంద్రియ సాగుతోపాటు చిరుధాన్యాలను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రత్యేక పాలసీలను తీసుకొచ్చింది. మెట్టప్రాంత పంటలకు పగటిపూట 9 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను నిరాటంకంగా అందిస్తోంది. పల్లెసీమల రూపురేఖలు మార్చిన ఆర్బీకేలు గతంలో విత్తనాల కోసం రైతులు పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చేది. ఎరువుల కోసం ప్రైవేట్ డీలర్లు అంటగట్టే అవసరం లేని పురుగుమందులను కొనాల్సి వచ్చేది. ఎండల్ని తట్టుకోలేక అన్నదాతలు ఏటా పదుల సంఖ్యలో రైతులు మతిచెందేవారు. అదునులోపు విత్తనం దొరక్క దళారుల వద్ద నకిలీ, నాసిరకం వాటిని అధిక ధరలకు కొనుగోలు చేసేవారు. విత్తనాల కోసం రైతుల పాట్లు పత్రికల్లో పతాక శీర్షికల్లో కథనాలు వచ్చేవి. ఆర్బీకేల రాకతో రైతుల కష్టాలు తొలగిపోయాయి. ఇప్పుడు సీజన్‌కు ముందే రెడీ సాగు ఉత్పదకాలను రైతుల ముంగిటకు తీసుకెళ్లాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలతో రైతుల వెతలకు చెక్ పడింది. సీజన్‌కు ముందుగానే సర్టిఫై చేసిన నాణ్యమైన విత్తనాలను గ్రామస్థాయిలో నిల్వ చేసి రైతులకు నేరుగా పంపిణీ చేస్తున్నారు. ఆర్బీకేల్లోని కియోస్‌్కల్లో బుక్ చేసుకున్న 24 గంటల్లోపే వారి ముంగిట అందిస్తున్నారు. ఆర్బీకేలు ఏర్పాటైన మూడేళ్లలో 63.50 లక్షల మంది రైతులకు 37.04 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేశారు. వరి, అపరాలు, చిరుధాన్యాలు, నూనెగింజలు, పచ్చిరొట్ట విత్తనాలే కాదు పత్తి, మిరప వంటి నాన్ సబ్సిడీ విత్తనాలను సైతం ఆర్బీకేల ద్వారా అందిస్తున్నారు. 10,778 ఆర్బీకేల ద్వారా దుక్కి పనులు ప్రారంభం కాకముందే రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుతున్నాయి. ముందుగానే అగ్రి ల్యాబ్స్‌లో టెస్ట్ చేసి మరీ నాణ్యమైన సీడ్‌ను పంపిణీ చేస్తున్నారు. మూడేళ్లుగా చూద్దామంటే విత్తనాల కోసం ఎక్కడా బారులు తీరే పరిస్థితి కనిపించడం లేదు. విత్తనం దొరుకుతుందో లేదోననే చింత ఎవరిలోనూ కనిపించడం లేదు. నకిలీల ఊసే ఎక్కడా వినిపించడం లేదు. మూడేళ్లలో ఆర్బీకేల ద్వారా రూ.953.53 కోట్ల విలువైన 8.69 లక్షల టన్నుల ఎరువులను 23.47 లక్షల మంది రైతులకు పంపిణీ చేశారు. మార్కెట్లో ధరలు పతనమైన ప్రతిసారి మార్కెట్లో జోక్యం చేసుకుని ఆర్బీకేల ద్వారా ఆయా పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. పంట రుణాలు, ఈ–క్రాప్ నమోదు, పంటల బీమా, పంట నష్టపరిహారం ఇలా ప్రతి ఒక్కటి అర్హత ఉన్న ప్రతి రైతుకు అందేలా ఆర్బీకే సిబ్బంది కృషి చేస్తున్నారు. గతంలో పశువుకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా మండల కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం ఫోన్ చేయగానే క్షణాల్లో వీహెచ్ఏ ఇంటికి వచ్చి మరీ సేవలందిస్తున్నారు. ఉచితంగా మందులిస్తున్నరు. నాణ్యమైన ధ్రువీకరించిన మిశ్రమ దాణా, పశుగ్రాసం సరఫరా చేస్తున్నారు. ఫలితంగా గతంతో పోలిస్తే పాల దిగుబడి రెట్టింపయ్యిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆర్బీకేల ద్వారా ఆక్వా సాగు చేస్తున్న ప్రతి రైతుకు లైసెన్సు జారీతో పాటు నాణ్యమైన ఫీడ్‌ను అందజేస్తున్నారు. అగ్రి ల్యాబ్‌లు.. యంత్ర సేవా కేంద్రాలు.. గోదాములు అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో 147 చోట్ల వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్స్‌ను నెలకొల్పుతోంది. ఇందుకోసం ఒక్కొక్క ల్యాబ్‌కు రూ.81 లక్షల చొప్పున వెచ్చిస్తోంది. రూ.6.25 కోట్ల అంచనా వ్యయంతో జిల్లా స్థాయిలో 13 ల్యాబ్‌లు, రూ.75 లక్షల అంచనా వ్యయంతో రీజనల్ స్థాయిలో నాలుగు సమన్వయ కేంద్రాలను, గుంటూరులో రాష్ట్రస్థాయిలో రూ.8.50 కోట్ల అంచనాతో విత్తన జన్యు పరీక్ష కేంద్రాన్ని డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీతో ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 70 అగ్రి ల్యాబ్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కాగా.. చిన్న, సన్నకారు రైతులకు అవసరమైన యంత్ర పరికరాలను స్వల్ప అద్దె ప్రాతిపదికన వారి ముంగిటకే తీసుకెళ్లాలన్న సంకల్పంతో రూ.691 కోట్లతో 6,525 ఆర్బీకే, 391 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆర్బీకేలకు అనుబంధంగా రూ.1,584.61 కోట్లతో 2,536 బహుళ ప్రయోజన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్కటి రూ.40 లక్షల అంచనాతో 500 టన్నుల సామర్థ్యంతో 1021, రూ.75లక్షల అంచనాతో 100 టన్నుల సామర్థ్యంతో 113 గోదాముల నిర్మిస్తున్నారు. వీటిలో రూ.166.33 కోట్ల ఖర్చుతో వివిధ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఇప్పటికే వెయ్యి గోదాములు నిర్మాణం పూర్తి కాగా.. వచ్చే నెలలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. -
అర్బన్ రొయ్యల చెరువు!
వాడేసిన కార్గో కంటెయినర్లలో లెట్యూస్ వంటి ఆకు కూరలు, కూరగాయలను హైడ్రోపోనిక్స్ లేదా ఆక్వాపోనిక్స్ పద్ధతుల్లో, మట్టి వాడకుండా కేవలం పోషక జలంతో సాగు చేసే అర్బన్ ఫార్మర్స్ చాలా దేశాల్లో ఉన్నారు. అయితే, నగరాల్లో ఆకాశ హర్మ్యాల మధ్య ఐరన్ కంటెయినర్లలో మంచినీటి రొయ్యల సాగు చేయటం.. అందులోనూ పర్యావరణానికి హాని కలిగించని కాలుష్య రహిత సుస్థిర అర్బన్ ఆక్వా సాగు పద్ధతులను అనుసరించడం సుసాధ్యమేనని రుజువు చేస్తోంది ‘అతర్రాయ’ అనే సంస్థ. కొద్దిపాటి శిక్షణతోనే కాలుష్య రహిత పద్ధతిలో కంటెయినర్ రొయ్యల సాగును సులువుగా నేర్పిస్తోంది ఈ సంస్థ. కంటెయినర్లో బయోఫ్లాక్ పద్ధతిలో రొయ్యల సాగు చేసే ‘ష్రింప్ బాక్స్’ సాంకేతికతపై పేటెంట్ పొందిన ఈ సంస్థ మెక్సికో కేంద్రంగా పనిచేస్తోంది. సాధారణ పద్ధతుల్లో సాగే రొయ్యల సాగులో యాంటీబయోటిక్స్, రసాయనాలు, గ్రోత్ హోర్మోన్స్ వాడుతున్నారు. వ్యర్థ జలాలతో సముద్రం కలుషితమవుతోంది. ‘మేం ఈ సమస్యలేవీ లేకుండా ఎథికల్ ఆక్వాకల్చర్ పద్ధతిలో ఎక్కడ కావాలంటే అక్కడే కంటెయినర్లో సులభంగా రొయ్యలు సాగు చేసే అత్యాధునిక సాంకేతికతను ప్రపంచంలో తొలిగా అందుబాటులోకి తెచ్చామ’ని అతర్రాయ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి డేనియల్ రసెక్ అంటున్నారు. రసెక్ మెక్సికోలో కాలేజీ విద్యను పూర్తి చేసుకొని 2005లో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి మత్స్యకారుల జీవితాలను మెరుగుపరచేందుకు కృషి చేశారు. ఆక్వాకల్చర్‌ను సుస్థిర సేద్య పద్ధతులపై పనిచేయడానికి ఓ స్టార్టప్ సంస్థను స్థాపించారు. ‘మెక్సికో ప్రభుత్వ ఆర్థిక తోడ్పాటుతో విస్తారమైన చెరువుల్లో సాగు పరిస్థితులను మెరుగుపరచడంతో పాటు అతి తక్కువ చోటులో తక్కువ కాలుష్యం కలిగించే సుస్థిర సాగు పద్ధతులపై అధ్యయనం చేపట్టాం. 2019లో ఇతర వనరుల నుంచి ఆర్థిక సహాయం అందిన తర్వాత సాఫ్ట్వేర్, ఆటోమేషన్ ఉపకరణాలను కూడా సమకూర్చుకొని పర్యావరణానికి, ప్రజారోగ్యానికి నష్టం కలిగించని ఆరోగ్యదాయకమైన రీతిలో రొయ్యల సాగు చేపట్టే సమగ్ర అత్యాధునిక సాంకేతికతకు తుదిమెరుగులు దిద్దాం’ అని రసెల్ చెబుతున్నారు. కంటెయినర్ రొయ్యల సాగులో మూడు సాంకేతికతలను ఉపయోగిస్తున్నారు. బయోఫ్లాక్.. రొయ్యలకు వ్యాధులు సోకకుండా ఉండే వాతావరణాన్ని కల్పిస్తుంది. అందువల్ల యాంటీబయోటిక్స్ లేదా హానికరమైన రసాయనాల అవసరమే రాదు. ఈ ష్రింప్ బాక్స్‌లో అన్ని పనులనూ సాఫ్ట్వేర్ ద్వారా ఎక్కడి నుంచైనా నియంత్రించుకునే అవకాశం ఉంది. నీటి నాణ్యత, ఉష్ణోగ్రత, ఆక్సిజన్ స్థాయి, రొయ్యల ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు గమనిస్తూ గణాంకాలను అందించే వ్యవస్థను ఏర్పాటు చేశారు. కృత్రిమ మేధను ఉపయోగించి మేతను ఎక్కడి నుంచైనా అందించే సాంకేతికతను జోడించటం విశేషం. డేటాను బట్టి వర్క్‌ఫ్లో మాపింగ్ చేశారు. కాబట్టి, కంటెయినర్లో రొయ్యల సాగులో ఎవరికైనా అతి సులభంగా శిక్షణ ఇవ్వటం సాధ్యమవుతోంది. ఎలా పండించారో తెలియని, ఎప్పుడో పట్టుకుని నిల్వ చేసిన రొయ్యలను నగరవాసులు తినాల్సిన అవసరం లేదు. తమ ‘ష్రింప్ బాక్స్’ను నగరం నడిబొడ్డునైనా ఏర్పాటు చేసుకొని రొయ్యలను పెంచుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు తాజాగా ఆరోగ్యదాయకమైన రొయ్యలను ఆరగించవచ్చు అంటున్నారు రసెక్. కంటెయినర్లో 1.5 టన్నుల రొయ్యలు అత్యాధునిక రొయ్యల చెరువుగా మేము రూపుదిద్దిన కార్గో కంటెయినర్ విస్తీర్ణం 50 చదరపు మీటర్లు. దీనిలో ఏటా 1.5 టన్నుల రొయ్యలను ఉత్పత్తి చేస్తున్నాం. సాధారణ చెరువుల్లో ఇన్ని రొయ్యలు పెంచాలంటే కనీసం రెండు హెక్టార్ల భూమి కావాలి. తక్కువ వనరులతో, తక్కువ ఖర్చుతోనే రొయ్యలను పెంచడానికి ‘ష్రింప్ బాక్స్’ ఉపయోగపడుతోంది. 70% పనులు ఆటోమేటిక్‌గా జరుగుతాయి. ‘ష్రింప్ బాక్స్’లో రొయ్యలు పెంచడానికి డాక్టరేట్ ఏమీ అక్కర్లేదు. 2–4 వారాల శిక్షణతో ఎవరైనా రొయ్యల రైతుగా మారొచ్చు. అమెరికా, ఐరోపా దేశాల్లో వ్యాపార విస్తరణే మా లక్ష్యం. – డేనియెల్ రసెక్, ‘ష్రింప్ బాక్స్’ ఆవిష్కర్త, మెక్సికో – పంతంగి రాంబాబు prambabu.35@gmail.com -
రొయ్య రైతుకు వెన్నుదన్ను: దేశంలో అత్యధిక రేట్లు ఏపీలోనే
సాక్షి, అమరావతి: అంతర్జాతీయంగా రొయ్యల ధరలు తగ్గుతున్న ప్రస్తుత తరుణంలో రైతులకు ప్రభుత్వం బాసటగా నిలుస్తూ, వారికి మద్దతు ధర లభించేలా అహరహం కృషి చేస్తోందనడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న చర్యల ఫలితంగా రొయ్య రైతులకు దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనూ దక్కనంత ధర ఒక్క ఏపీలోనే లభిస్తోంది. ఓ పక్క అంతర్జాతీయంగా రొయ్యల మార్కెట్ తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. వివిధ కారణాలతో ఎగుమతులు తగ్గుతున్నాయి. మరో పక్క మేత ధరలు పెరిగిపోతున్నాయి. వీటన్నింటినీ తట్టుకోవడం రాష్ట్రంలో రొయ్య రైతుకు కష్టంగా ఉంది. ఈ సమయంలో ఏ ఒక్క రైతూ ఆర్థికంగా నష్టపోకూడదన్న సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల సీనియర్ మంత్రులతో ఆక్వా సాధికారత కమిటీని నియమించారు. రొయ్య రైతులకు మేలు చేయడానికి చర్యలు చేపట్టారు. పెరిగిన ఫీడ్ ధరలను నియంత్రించడంతోపాటు రొయ్య ధరలను క్రమబద్ధీకరించేందుకు కమిటీకి పూర్తిస్థాయి అధికారాలను అప్పగించారు. కమిటీ నిర్ణయాలు, చర్యలపై సీఎం వైఎస్ జగన్ నిరంతరం సమీక్షిస్తూనే ఉన్నారు. ప్రభుత్వ కృషి ఫలితంగా రెండుసార్లు పెంచిన ఫీడ్ ధరలను కంపెనీలు వెనక్కి తీసుకున్నాయి. ఇటీవల టన్నుకు రూ.2,600 చొప్పున పెంచగా, సీఎం ఆదేశాలతో సాధికారత కమిటీ ఆ కంపెనీలతో చర్చలు జరిపింది. ఫలితంగా పెంచిన ధరలను కంపెనీలు తగ్గించాయి. ఇది రైతులకు చాలా మేలు చేసింది. నెల రోజులుగా ప్రభుత్వ ధరకే కొనుగోలు ప్రాసెసింగ్ యూనిట్లతోనూ మంత్రుల కమిటీ చర్చలు జరిపింది. రొయ్య రైతులకు గిట్టుబాటు అయ్యేలా ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన రీతిలో ధరలను నిర్ణయించారు. వంద కౌంట్ రొయ్యలను రూ.210కు, 30 కౌంట్ రూ.380కు తక్కువ కాకుండా కొనాలని కమిటీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నెల రోజులుగా ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. ఫలితంగా ఇంతటి తీవ్ర సంక్షోభ సమయంలో కూడా దేశంలో మరెక్కడా లేని విధంగా ఒక్క ఏపీలోనే రొయ్యల ధరలు నిలకడగా ఉన్నాయి. రోజూ ప్రభుత్వం నిర్దేశించిన రేట్లు, మార్కెట్లో రేట్లను సమీక్షించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ప్రభుత్వం నియమించింది. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్‌తో కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ధరల క్రమబద్ధీకరణకు ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) చట్టం ద్వారా «ప్రత్యేకంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్వోపీ) రూపొందిస్తున్నారు. 14న మరోసారి భేటీ... ఆక్వా రైతులను ఆదుకునే క్రమంలో సీఎం ఆదేశాల మేరకు ఈ నెల 14వ తేదీన ఆక్వా ఫీడ్, సీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులతో సాధికారత కమిటీ మరోసారి భేటీ కానుంది. సమీప భవిష్యత్‌లో ధరల క్రమబద్ధీకరణకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనుంది. రైతులకు మేలు చేసే అంశాలపై చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోనుంది. . నాడు జోన్లుగా విభజించి... నేడు రాజకీయాలు టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలో ఉండగా ఆక్వా రంగాన్ని, రైతులను ఏనాడూ పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్‌గా విభజిస్తూ 2018, ఏప్రిల్ 20వ తేదీన జీవో ఎంఎస్ నం.16 జారీ చేసింది చంద్రబాబు ప్రభుత్వమే. ఆహారం పండిస్తున్న భూములను కాపాడుకోవడం, కాలుష్యాన్ని నివారించడం, లవణీయత (సెలనిటీ) పెరగడం వల్ల భూములు నిరుపయోగంగా కాకుండా చూడడం, పర్యావరణ పరిరక్షణ తదితర కారణాలతో ఈ జోన్ల వర్గీకరణ జరిగింది. ఆక్వా జోనింగ్ చేయకపోతే భవిష్యత్ తరాలకు ముప్పు వాటిల్లడమే కాదు, ఆహార ఉత్పత్తులు పండించే భూములు తగ్గిపోయి, ఆహారం కొరత ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు పరిస్థితుల్లో వచ్చిన మార్పులేమిటి? అప్పట్లో చంద్రబాబు చేతిలో దగా పడ్డ ఆక్వా రైతులు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలతో మరింత మేలు పొందుతున్నారు. చంద్రబాబు జోన్ వ్యవస్థను మధ్యలోనే వదిలేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక జోన్ వ్యవస్థను పూర్తిచేసి, రైతులకు మేలు చేసేలా నిర్ణయం తీసుకున్నారు. అధికారంలో ఉండగా జోన్లతో సంబంధం లేకుండా ఆక్వా రైతులందరికీ రూ.3.86కు విద్యుత్‌ను సరఫరా చేసిన చంద్రబాబు, మళ్లీ అధికారంలోకి వస్తే తగ్గిస్తానంటూ కొత్త రాగం అందుకున్నారు. వైఎస్ జగన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత మూడున్నరేళ్లుగా ఆక్వా జోన్ పరిధిలోని రైతులకు విద్యుత్ ధరలు తగ్గించి, యూనిట్ రూ.1.50కే సరఫరా చేస్తోంది. నాన్ ఆక్వాజోన్‌లో అప్పటి నుంచి ఉన్న రేట్లు యథాతథంగా కొనసాగిస్తోంది. చంద్రబాబు హయాంలో ఉన్న మాదిరిగా ఇప్పుడూæ యూనిట్ రూ.3.86కే విద్యుత్ సరఫరా చేస్తోంది. పైగా, రైతులకు నాణ్యమైన ఫీడ్, సీడ్ తక్కువకు దొరికేలా చూస్తోంది. ఇంకోపక్క రైతులకు ఎక్కువ ధర దక్కేలా చర్యలు తీసుకుంటోంది. ఈ వాస్తవాలను మరిచిన చంద్రబాబు.. ఇప్పుడు ఎన్నికలు వస్తుండటంతో రాజకీయాలు చేయడానికి దీన్ని అజెండాగా తీసుకున్నారు. అబద్ధాలతో ప్రజలను వంచించే ప్రయత్నం చేస్తున్నారు. -
ఆక్వా రైతుల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతర కృషి
కాకినాడ సిటీ: ఆక్వా రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని, రైతులెవరూ అధైర్య పడవద్దని అప్సడా (ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ) రాష్ట్ర వైస్ చైర్మన్ వడ్డి రఘురామ్ చెప్పారు. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన రాష్ట్ర ఆక్వా రైతుల అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ఆక్వా రైతులు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు. ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు వారికి అనుకూలమైన రేట్లు నిర్ణయించే వారన్నారు. ఆక్వా రైతుల కష్టాలు తెలుసుకున్న 24 గంటల్లోనే సీఎం వైఎస్ జగన్‌రొయ్యలకు గిట్టుబాటు ధర లభించేందుకు మంత్రులు, మత్స్యశాఖ అధికారులు, రైతులతో కలసి ఎంపవర్ కమిటీని వేయడంతో ఎన్నడూలేని విధంగా రైతులు పంటను అమ్ముకోగలుగుతున్నారని తెలిపారు. ఆక్వా రైతుల సమస్యలపై చర్చించి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలన్న సీఎం ఆదేశాల మేరకు ప్రోసెసింగ్ ప్లాంట్ల యాజమానులతో ఇప్పటికే ఐదు సార్లు సమావేశమై గిట్టుబాటు ధరకు రొయ్యలు కొనేలా చర్యలు తీసుకున్నామన్నారు. గత ప్రభుత్వంలో రొయ్య 100 కౌంట్ రూ. 80కు కొనే వారని, ఇప్పుడు అదే కౌంట్ రూ. 210కి కొనాలని స్పష్టం చేశారు. రూపాయి తగ్గినా వెంటనే ఎంక్వైరీ కమిటీలో పెట్టి రైతులు, రైతు సంఘాల నాయకులు సమక్షంలోనే నిలదీసే పరిస్థితి ఉందన్నారు. ఏలూరు జిల్లా గణపవరంలో జరిగిన సమావేశంలో రైతుల వినతి మేరకు ఆక్వాజోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు ఉన్న రైతుకి రూ.1.50కే యూనిట్ విద్యుత్ ఇస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్ అక్కడికక్కడే ప్రకటించారన్నారు. గత ప్రభుత్వంలో జోన్ వ్యవస్థ మధ్యలో వదిలేస్తే, సీఎం సుదీర్ఘమైన జోన్ల వ్యవస్థను ఏర్పాటు చేశారని చెప్పారు. దీని వల్ల 1,08,864 మంది రైతులు ఆక్వా జోన్లోకి వచ్చారన్నారు. వీరందరికీ యూనిట్ విద్యుత్ రూ. 1.50కే అందిస్తున్నట్లు తెలిపారు. పదిరోజులే రొయ్యల కొంటారంటూ కొందరు గుత్తేదారులు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, 365 రోజులూ ప్రాసెసింగ్ ప్లాంట్లు రొయ్యలు కొంటాయని లేల్చి రెప్పారు. ఏ విధమైన అపోహలకు తావులేకుండా రైతులు నిర్భయంగా పంటలు పండించాలని సూచించారు. -
రాష్ట్రమంతా ఒకేలా కొనుగోలు చేయాలి
సాక్షి, అమరావతి: ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు రాష్ట్రమంతా ఒకేరీతిలో రొయ్యల కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, డాక్టర్ సీదిరి అప్పలరాజు అధికారులను ఆదేశించారు. 100 కౌంట్ రొయ్యల ధర రూ.210కి తగ్గడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఈ ధర కంటే తక్కువగా కొనుగోలు చేసే ప్రాసెసింగ్ కంపెనీలను ఉపేక్షించబోమన్నారు. ఆక్వా సాధికారత కమిటీ సమావేశం బుధవారం మంత్రి పెద్దిరెడ్డి క్యాంప్ కార్యాలయంలో జరిగింది. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు తీరును అధికారులు మంత్రులకు వివరించారు. ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ వడ్డి రఘురాం మాట్లాడుతూ 100 కౌంట్ రూ.210 చొప్పున కొనుగోలు చేయాలన్న గత కమిటీ భేటీలో నిర్ణయాన్ని మెజార్టీ ప్రాసెసింగ్ కంపెనీలు పాటిస్తున్నాయని, కొన్ని కంపెనీలు మాత్రం నేటికీ రూ.190 నుంచి రూ.200 చొప్పున కొనుగోలు చేస్తున్నాయని చెప్పారు. అటువంటి కంపెనీలు, వ్యాపారులతో నిత్యం సంప్రదిస్తూ ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, కమిషనర్ కన్నబాబు మాట్లాడుతూ సాధికారత కమిటీ సమావేశాల్లో మంత్రులు ఇచ్చిన ఆదేశాల మేరకు సీడ్, ఫీడ్ రేట్లు, ఆక్వా ఉత్పత్తుల కొనుగోలు ధరలపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ రూపొందించినట్లు చెప్పారు. సీడ్, ఫీడ్ రేట్లను ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్ పోర్టల్‌లో ఉంచుతున్నామన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌తోపాటు దేశీయంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న ధరలను కూడా పోర్టల్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఆక్వారంగానికి ప్రభుత్వం చేయూత మంత్రులు మాట్లాడుతూ ఆక్వా రంగానికి ప్రభుత్వం చేయూతనిస్తోందని చెప్పారు. ఆక్వా రైతులు, ప్రాసెసింగ్ యూనిట్లు, సీడ్, ఫీడ్ తయారీదారులు సమన్వయంతో ముందుకు సాగితేనే ఆక్వారంగానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందన్నారు. ఆక్వారంగం సమస్యల పరిష్కారం కోసమే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు సాధికారత కమిటీ ఏర్పాటైందని చెప్పారు. ధరల విషయంలో నిరంతరం అధికారుల పర్యవేక్షణ ఉండాలని, సమస్య ఏర్పడిన వెంటనే స్పందించాలని ఆదేశించారు. రొయ్యల ధరల స్థిరీకరణ, సీడ్, ఫీడ్ రేట్లు, నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థలను కలిగి ఉన్న రాష్ట్రం మనదేనని చెప్పారు. అత్యధికంగా ఆక్వా ఎగుమతులు చేస్తున్న రాష్ట్రంగా గుర్తింపు తెచ్చుకున్నామన్నారు. అంతర్జాతీయ మార్కెట్ల కారణంగా మన రాష్ట్రంలో ఆక్వారేట్లు కొన్నిసార్లు తగ్గిపోతున్నాయని, స్టోరేజీ అవకాశాలను పరిశీలించి అటువంటి సమయాల్లో ధరలను స్థిరీకరించేందుకు పరిశీలించాలని వారు సూచించారు. ఈ సమావేశంలో పర్యావరణం, అటవీ సైన్స్, సాంకేతిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్‌కుమార్‌ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
‘ఆక్వా’లో ఏమిటీ దందా?
సాక్షి, అమరావతి: ఆక్వా రైతుల ఫిర్యాదులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీరియస్‌గా స్పందించారు. ఆక్వా ధరల పతనం, ఆక్వా ఫీడ్ ధర పెంపుపై రైతులు, రైతు సంఘాల నేతలు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గించేస్తున్నారని వాపోయారు. ఈ ఫిర్యాదులను తీవ్రంగా పరిగణించిన సీఎం.. ముగ్గురు మంత్రులు, సీనియర్ అధికారులతో సాధికారత కమిటీ ఏర్పాటు చేశారు. వారంలోగా సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఎవరైనా సరే రైతులకు నష్టం కలిగిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఆక్వా రైతులకు అండగా నిలిచేందుకు ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చినా, సిండికేట్‌గా మారి రైతులను నష్టపరచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం ఆదేశాల మేరకు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజుతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పర్యావరణ, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పశు సంవర్ధక, మత్స్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, మత్స్యశాఖ కమిషనర్లతో సాధికారత కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. మత్స్యశాఖ కమిషనర్ కమిటీ సభ్య కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఈ కమిటీ ఆక్వా ఫీడ్ సరఫరా, ఆక్వా ఫీడ్ ధర, ఆక్వా కొనుగోలు ధర.. సంబంధిత అంశాలను అధ్యయనం చేయడంతో పాటు రైతులు నష్టపోకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై వారంలోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి. నాణ్యత, ధరల పర్యవేక్షణకూ చట్టం ► ఆక్వా రైతుల ప్రయోజనాలను పరిరక్షించడమే లక్ష్యంగా కొత్తగా ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (ఏపీఎస్డీఏ) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చట్టం చేసింది. ఈ చట్టం ద్వారా ఆక్వాకల్చర్‌కు సంబంధించిన అన్ని రకాల కార్యకలాపాలు, ఉత్పత్తులు, సేవల ఏకీకృత డెలివరీ మెకానిజం ఒకే గొడుకు కిందకు తీసుకు వచ్చింది. ► ఆక్వాకల్చర్ ఇన్పుట్ల (విత్తనం, మేత) నాణ్యత, ధర, ఉత్పత్తుల ధరల పర్యవేక్షణ, నియంత్రణను ఈ అథారిటీ చూస్తుంది. ఆక్వాకల్చర్ వాటాదారులకు ఆన్లైన్ ప్రక్రియ ద్వారా లైసెన్స్‌లు, ఎండార్స్మెంట్ల జారీని సులభతరం చేస్తుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా ఆక్వా ఉత్పత్తుల వాణిజ్యం, ఎగుమతి కోసం అనుకూలమైన వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది. ప్రత్యేకంగా యూనివర్సిటీ ► మత్స్య పరిశ్రమ, ఆక్వాకల్చర్ సమగ్రాభివృద్ధి కోసం ఆ రంగంలో నిపుణుల అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది. ఇందులో భాగంగా అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీని పశ్చిమ గోదావరి జిల్లాలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ఆక్వా రంగ అభివృద్ధికి ఈ యూనివర్సిటీ ఎంతగానో దోహదపడుతుంది. ► కోవిడ్ సంక్షోభ సమయంలో కూడా 2020లో ప్రభుత్వం ఆక్వా రైతులకు అండగా నిలబడేందుకు పలు చర్యలు తీసుకుంది. రొయ్యలు దిగుమతి చేసుకునే దేశాల్లో నిషేధం కారణంగా.. ధరలు గణనీయంగా పడిపోవడంతో పాటు రైతులు తమ ఉత్పత్తులను అమ్ముకోలేని పరిస్థితి తలెత్తింది. ఆ పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని, శీతల గిడ్డంగులను, ప్రాసెసింగ్ ప్లాంట్లను వెంటనే తెరిపించడంతో పాటు రైతుల ఉత్పత్తులకు తగిన ధరలను నిర్ణయించింది. బ్యాంకుల ద్వారా భరోసా ► ప్రైవేట్ రంగంలో అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకునే పరిస్థితి లేకుండా.. ఆక్వా రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ. మత్స్య శాఖ ఆధ్వర్యంలో బ్యాంకుల నుంచి రుణాలు. ఈ– మత్స్యకార పోర్టల్‌లో అందుబాటులో జిల్లాలు, సెక్టార్, బ్యాంకుల వారీగా రుణాలు పొందిన వారి వివరాలు. ఇప్పటి వరకు 19,059 కిసాన్ క్రెడిట్ కార్డుల జారీ. రూ.2,673 కోట్ల రుణం మంజూరు. ► కొత్తగా 27 ఇంటిగ్రేటెడ్ ఆక్వా కల్చర్ ల్యాబ్‌లు. ఇప్పటికే ఉన్న మరో 8 ల్యాబ్‌ల ఆధునికీకరణ. తద్వారా అన్ని కోస్తా జిల్లాల్లోని 35 ప్రాంతాల్లో ల్యాబ్‌లు. నీరు, మట్టి విశ్లేషణ చేయడంతోపాటు వివిధ రకాల పరీక్షల కోసం రూ.50 కోట్లు కేటాయింపు. ఈ ల్యాబ్‌ల్లో 14 ఆక్వా ల్యాబ్‌లు కాగా, 3 మొబైల్.. మిగతావి ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్‌లు. 2022 ఆఖరుకు అందుబాటులోకి ఆక్వా ల్యాబ్‌లు. ఆక్వా రైతుల కోసం, ఫిష్ ఫీడ్ కోసం ప్రత్యేక చట్టం ► ఆక్వా రైతుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ‘ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ సీడ్ (క్వాలిటీ కంట్రోల్) చట్టం–2020ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ఆక్వా సీడ్లో నకిలీకి ఆస్కారం లేకుండా నాణ్యమైన సీడ్‌ను మాత్రమే రైతులకు సరఫరా చేసేలా చర్యలు చేపట్టింది. నకిలీ, అక్రమ పద్ధతుల్లో సాగుతున్న సీడ్ వ్యాపారాలను నిరోధించేందుకు చట్టం ద్వారా చర్యలు తీసుకుంది. ► ఫిష్ ఫీడ్ నాణ్యతకు ప్రత్యేక చట్టం చేసింది. ఆక్వా కల్చర్ నిర్వహణ వ్యయంలో 60 శాతం ఫీడ్‌కు ఖర్చు అవుతుంది. దేశం మొత్తం మీద ఫిష్ ఫీడ్‌లో క్వాలిటీ కంట్రోల్ కోసం ఎలాంటి నియంత్రణ యంత్రాంగం అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో ఫిష్ ఫీడ్‌కు సంబంధించి.. అధిక ధరలు, సిండికేట్ వ్యవహారాలను నియంత్రించడానికి, మత్స్య పరిశ్రమ మనుగడ కోసం ఏపీ ప్రభుత్వం ఏకంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రత్యేకంగా చేపల మేత పరిశ్రమల్లో అనైతిక, చట్టవిరుద్ధమైన పద్ధతులను నిరోధించడానికి, చేపల మేత వ్యాపారంలో నాణ్యత నియంత్రణ చర్యలను అమలు చేయడానికి దేశంలోనే తొలిసారిగా ఫిష్ ఫీడ్ (క్వాలిటీ, కంట్రోల్ ) చట్టం–2020 తీసుకువచ్చింది. ఆక్వా రైతుల సంక్షేమ కోసం ఎన్నో నిర్ణయాలు ► ఆక్వా రైతులకు అండగా నిలబడేందుకు ఉత్పాదక వ్యయాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్‌ను 24 గంటల పాటు యూనిట్ రూ.1.50 చొప్పున సరఫరా చేస్తోంది. ► 2016లో ఆక్వా రైతులకు పవర్ టారిఫ్ యూనిట్ రూ.4.63 నుంచి రూ.7 కాగా.. 2016 నుంచి 2018 మే వరకు యూనిట్ రూ.3.86 చొప్పున సరఫరా చేశారు. 2108 జూన్ నుంచి 2019 జూన్ వరకు రూ.2కే యూనిట్ సరఫరా చేయగా, జూలైలో ప్రస్తుత ప్రభుత్వం యూనిట్ ధరను రూ.1.50కి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2019–20 నుంచి 2021–22 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ కింద రూ.2,377.52 కోట్లు ఇచ్చింది. ► గ్రామ స్థాయిలో రైతు భరోసా కేంద్రాల ద్వారా అండగా నిలుస్తోంది. రాయితీతో కూడిన ఫీడ్ వంటి ఇన్పుట్స్ అందించడంతో పాటు, ఆక్వా సాగులో అత్యాధునిక, వినూత్న విధానాల్లో శిక్షణ. దీనికోసం ఆర్బీకే స్థాయిలో దాదాపు 732 మంది విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్లను నియామకం. ► ఆక్వా రైతుల ఉత్పత్తులకు లాభదాయకమైన ధర కల్పించేందుకు ఈ–క్రాప్ (ఇ–ఫిష్) బుకింగ్ సౌకర్యం. ఈ–ఫిష్ యాప్ సహకారంతో సుమారు 4.02 లక్షల హెక్టార్లలో మత్స్య, రొయ్యల సాగు విస్తీర్ణం నమోదు. ► ఇ–మత్స్యకార పోర్టల్ సహాయంతో ఫార్మర్ ఫీల్డ్ స్కూల్ ఏర్పాటు. తద్వారా ఆక్వా సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంతో పాటు, అత్యాధునిక సౌకర్యాల వినియోగంపైన శిక్షణ. ఆర్బీకేల ద్వారా రూ.13.27 కోట్ల విలువైన 2,473 మెట్రిక్ టన్నుల ఫీడ్ సరఫరా. -
పదెకరాల్లోపు ఆక్వా రైతులకు.. వచ్చే నెల1 నుంచి విద్యుత్ రాయితీ
సాక్షి, అమరావతి: ఆక్వాజోన్ పరిధిలో పదెకరాల్లోపు సాగుచేసే సన్న, చిన్నకారు ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీని వర్తింపజేసేందుకు చేపట్టిన సర్వే ఈ నెలాఖరుతో ముగియనుంది. అర్హతగల వారికి సెప్టెంబర్ 1 నుంచి విద్యుత్ రాయితీని వర్తింపజేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లుచేస్తోంది. రాష్ట్రంలో 1.40 లక్షల ఎకరాల్లో ఉప్పునీటి, 3.89లక్షల ఎకరాల్లో మంచినీటి ఆక్వా సాగు జరుగుతోంది. వీటికి 63,343 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఈ–క్రాప్ బుకింగ్ ప్రకారం 1,35,842 మంది ఆక్వా రైతులుండగా, 2.5 ఎకరాల లోపు 95,277 మంది, 2.5 నుంచి ఐదెకరాల్లోపు 22,358 మంది, 5–10 ఎకరాల్లోపు 11,809 మంది, పదెకరాలకు పైబడి 6,398 మంది ఉన్నారు. కానీ, నాన్ ఆక్వాజోన్ పరిధిలో సాగుచేస్తున్న వారు సైతం విద్యుత్ రాయితీ ద్వారా లబ్ధిపొందుతున్నారు. అలాగే, కొన్నిచోట్ల కనెక్షన్ ఒకరి పేరిట ఉంటే, సాగు మరొకరు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తొలుత జోన్ పరిధిలో ఐదెకరాల్లోపు సన్న, చిన్నకారు ఆక్వా రైతులకు మాత్రమే విద్యుత్ రాయితీ వర్తింపజేయాలని నిర్ణయించిన ప్రభుత్వం ఆ తర్వాత ఆ పరిమితిని పదెకరాలకు పెంచింది. అనంతరం ఆక్వాజోన్ పరిధిలో వాస్తవంగా సాగుచేసే పదెకరాల్లోపు రైతులను గుర్తించేందుకు విద్యుత్, రెవెన్యూ, మత్స్య శాఖలతో సర్వే చేపట్టింది. విద్యుత్ కనెక్షన్ ఎవరి పేరిట ఉంది? ఆ కనెక్షన్ పరిధిలో ఎంత విస్తీర్ణం ఉంది? ప్రతీనెలా ఎంత విద్యుత్ వినియోగమవుతోంది? ఆ చెరువుకు లైసెన్సు ఉందా.. లేదా? వంటి వివరాలను ఈ సర్వేలో సేకరించారు. మేలో చేపట్టిన ఈ సర్వే ఇప్పటికే 95 శాతం పూర్తికాగా.. మిగిలింది ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాత జోన్, నాన్‌జోన్ పరిధిలో ఎంత విస్తీర్ణం ఉంది? వాటి పరిధిలో ఎన్ని విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి.. జోన్ వారీగా ఎంతమంది ఆక్వా రైతులు ఉన్నారో గుర్తించి ఆ జాబితాలను ఆయా డిస్కంలకు పంపిస్తారు. ప్రభుత్వాదేశాల మేరకు జోన్ పరిధిలోకి వచ్చే పదెకరాల్లోపు ఆక్వా రైతులకు సెప్టెంబర్ 1 నుంచి విద్యుత్ రాయితీని వర్తింపజేసేలా ఏర్పాట్లుచేస్తున్నారు. అర్హులందరూ నమోదు చేయించుకోవాలి విద్యుత్ రాయితీ పొందాలంటే జోన్ పరిధిలో అర్హతగల ఆక్వా రైతులు తాము సాగుచేస్తున్న భూముల భూరికార్డు, వన్ బీ అడంగల్, లీజ్ అగ్రిమెంట్ కాపీ, వీఆర్వో నుంచి పొందిన సర్టిఫికెట్ ఆఫ్ కల్చర్లతో ఆర్బీకేల్లోని మత్స్య సహాయకులు లేదా మత్స్య అభివృద్ధి అధికారిని సంప్రదించాలి. వివరాలను నమోదు చేయించుకుని విద్యుత్ రాయితీకి అర్హత పొందాలి. – వడ్డి రఘురాం, వైస్‌చైర్మన్, ఏపీ ఆక్వా కల్చర్ అథారిటీ -
విరివిగా మత్స్యసంపద
సాక్షి, మచిలీపట్నం: రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహకారం, సబ్సిడీలు, ప్రోత్సాహకాలతో ఆక్వా ఉత్పత్తి అనూహ్యంగా పెరిగింది. రాష్ట్రంలో 974 కి.మీ. తీర ప్రాంతం విస్తరించి ఉండటంతో మత్స్య సంపద విరివిగా ఉత్పత్తి అవుతోంది. వెనామీ రొయ్యలు, పండుగప్ప వంటి ఉత్పత్తులు రాష్ట్రం నుంచి విదేశాలకూ ఎగుమతి అవుతున్నాయి. మత్స్య పరిశ్రమపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది జీవనం సాగిస్తున్నారు. మత్స్య పరిశ్రమకు ప్రభుత్వం చేయూతనివ్వడంతో పాటు దానికి మరింత భద్రత కల్పించేలా ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ(ఏపీఎస్ఏడీఏ) చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తోంది. ఆక్వా పరిశ్రమకు గుర్తింపునిచ్చి రైతులకు అండగా నిలవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం గతేడాది ఈ చట్టం చేసింది. దీని ప్రకారం ఆక్వా సాగు కోసం చెరువులు, ఉత్పత్తికి, విక్రయానికి, ఐస్ ఫ్యాక్టరీల ఏర్పాటుకు తప్పనిసరిగా మత్స్యశాఖ నుంచి లైసెన్స్‌లు తీసుకోవాల్సి ఉంటుంది. దీనిపై మత్స్యశాఖా ధికారులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి సకాలంలో లైసెన్సులు జారీ చేస్తున్నారు. లైసెన్స్‌లు పొందితే.. బినామీలు, నకిలీల బెడద తప్పుతుంది. నాణ్యమైన ఉత్పత్తుల అమ్మకానికి అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో 5 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతుంటే.. ఇప్పటి వరకు 90 వేల ఎకరాలకు రిజిస్ట్రేషన్లు చేసి లైసెన్స్‌లు జారీచేశారు. మరింత పెంచేలా.. గతం కంటే బాగా మత్స్యసాగు పెరిగింది. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహమే దీనికి కారణం. వేట నిషేధ భృతి, సబ్సిడీ డీజిల్ తీర ప్రాంత మత్స్యకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. మత్స్య సంపదను మరింత పెంచేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారు. – లాల్ మహమ్మద్, జాయింట్ డైరెక్టర్, మత్స్యశాఖ ప్రభుత్వ ప్రోత్సాహంతోనే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఆక్వా ఉత్పత్తి అనూహ్యంగా పెరిగింది. మత్స్యకారులకు సబ్సిడీపై డీజిల్‌ను సరఫరా చేస్తున్నారు. పెద్ద బోట్లు(మెకనైజ్డ్)కు నెలకు 3,000, చిన్న బోట్లు(మోటరైజ్డ్)కు నెలకు 300 లీటర్ల డీజిల్‌ను సబ్సిడీపై అందిస్తున్నారు. టీడీపీ హయాంలో లీటర్‌కు రూ.6.03 పైసలే సబ్సిడీ ఇచ్చేవారు. ఆ డబ్బులూ సకాలంలో వచ్చేవి కావు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక లీటరుకు రూ.9 సబ్సిడీ ఇస్తోంది. ఇలా ఏడాదికి సుమారుగా రూ.7.12 కోట్లను సబ్సిడీ రూపంలో ప్రభుత్వం బోటు యజమానులకు అందిస్తోంది. వేట సమయంలో ప్రమాదవశాత్తు మత్స్యకారుడు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం ఇస్తోంది. ఏటా వేసవిలో 60 రోజుల పాటు సముద్రంపై వేట నిషేధాన్ని అమలు చేస్తారు. ఆ సమయంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం రూ.4 వేలు మాత్రమే జీవన భృతిగా ఇచ్చారు. ఆ పంపిణీ విధానం కూడా సరిగా లేకపోవడంతో వాటిని దాదాపుగా దళారులే మింగేసేవారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక జీవన భృతిని రూ.10 వేలకు పెంచి.. మత్స్యకారుల బ్యాంక్ ఖాతాల్లో జమచేస్తోంది. ఇలా అనేక రకాలుగా ప్రభుత్వం సాయం చేయడం వల్ల రాష్ట్రంలో ఆక్వా ఉత్పత్తి పెరిగింది. 2014–15 నాటికి రాష్ట్రంలో 103 లక్షల మెట్రిక్ టన్నులుంటే.. 2020–21 నాటికి 150 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంది. దేశంలో ఉత్పత్తి అవుతున్న మత్స్య సంపదలతో పోలిస్తే.. ప్రస్తుతం 31 శాతం వాటా మన రాష్ట్రానిదే కావడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైందని మత్స్యకారులు చెబుతున్నారు. -
ఏపీకి ఎనిమిదేళ్లుగా అన్యాయం.. సభే సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ఎనిమిదేళ్లుగా కేంద్రం అన్యాయం చేస్తూనే ఉందని, దీనికి సభే సాక్షి అని వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగంలో ఈశాన్య రాష్ట్రాల అభివృది గురించి ప్రస్తావించారుగానీ ఏపీకి ప్రత్యేకహోదా అంశం కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా న్యాయంగా రాష్ట్ర ప్రజలకు నెరవేర్చాల్సిన హామీ అని గుర్తుచేశారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్రం విస్మరించిందన్నారు. లోక్‌సభలో మంగళవారం బడ్జెట్‌పై జరిగిన సాధారణ చర్చలో ఆయన మాట్లాడారు. ఏపీ పరంగా చూస్తే ఈ బడ్జెట్ నిరుత్సాహపరిచిందని చెప్పారు. విభజన హామీలేవీ అమలు కాలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా రూ.55 వేల కోట్లు అయితే ఇప్పటికీ రూ.13 వేల కోట్లు మాత్రమే ఖర్చయిందని చెప్పారు. రూ.11 వేల కోట్లు మాత్రమే రాష్ట్రానికి రీయింబర్స్ చేశారని, సుమారు రూ.2 వేల కోట్లు విడుదల చేయాల్సి ఉందని గుర్తుచేశారు. టీడీపీ చేసిన తప్పులకు ప్రస్తుత ప్రభుత్వాన్ని శిక్షించడం తగదన్నారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఒక్కో వ్యక్తికి రూ.428 చొప్పున లెక్కిస్తే బుందేల్ ఖండ్‌కు మాత్రం పదిరెట్లు ఎక్కువగా ఇస్తున్నారని చెప్పారు. కెన్–బెత్వా ప్రాజెక్టుకు నిధులు కేటా యించినట్లే ఏపీలో నదుల అనుసంధానానికి చేసిన రాష్ట్రం చేసిన ఖర్చు తిరిగి ఇవ్వాలని కోరారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో జరిగిన దాడిని ఖండించారు. కడియం పూలపెంపకం ప్రాంతీయ స్టేషన్లో ఐదుగురు శాస్త్రవేత్తలు ఆంధ్రప్రదేశ్‌లోని కడియం నర్సరీల్లో సాంకేతిక సిబ్బందికి సహకరించడానికి పూలపెంపకం (ఫ్లోరీకల్చర్) ప్రాంతీయ స్టేషన్లో ఐదుగురు శాస్త్రవేత్తలను నియమించినట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ మంగళవారం లోక్‌సభలో తెలిపారు. కడియం నర్సరీ పరిశ్రమను దృష్టిలో ఉంచుకుని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చి (ఐకార్) కడియం మండలంలోని వేమగిరిలో ఐకార్–డైరెక్టరేట్ ఆఫ్ ఫ్లోరీకల్చర్ రీసెర్చి ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఏపీలో 266 ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఆంధ్రప్రదేశ్‌లో 266 ఎలక్ట్రిక్ వెహికల్స్ చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయని కేంద్ర భారీపరిశ్రమలశాఖ సహాయమంత్రి క్రిషన్‌పాల్ గుర్జర్ చెప్పారు. మరో 65 రిటైల్ అవుట్లెట్లు ఈ ఏడాది జనవరి 1వ తేది నుంచి అందుబాటులోకి వచ్చినట్లు వైఎస్సార్సీపీ ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, సంజీవ్‌కుమార్ అడిగిన ప్రశ్నకు జవాబుగా తెలిపారు. ఎన్జీరంగా వర్సిటీకి రూ.135 కోట్లు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీ ప్రధాన కార్యాలయం, కళాశాలలు, సదుపాయాలు తదితరాలకు రూ.135 కోట్లు మూడు దశలుగా విడుదల చేసినట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీలు మద్దిళ్ల గురుమూర్తి, వంగా గీతావిశ్వనాథ్, చింతా అనూరాధ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. వర్సిటీ ఏర్పాటుకు సంబంధించి నిధుల విడుదలలో పెండింగ్ లేదని చెప్పారు. పీఎంఎఫ్ఎంఈలో ఏపీకి రూ.20.72 కోట్లు విడుదల ప్రధానమంత్రి మైక్రో, ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థల (పీఎంఎఫ్ఎంఈ) ఏర్పాటులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు రూ.20.72 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఫుడ్‌ప్రాసెసింగ్, పరిశ్రమలశాఖ సహాయమంత్రి ప్రహ్లాద్‌సింగ్ పటేల్ తెలిపారు. 2021–22 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌లోని 96 మంది లబ్ధిదారులకు ఈ పథకంలో భాగంగా రుణాలు పొడిగించినట్లు వైఎస్సార్సీపీ ఎంపీలు తలారి రంగయ్య, బి.వి.సత్యవతి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మహిళా వ్యాపారవేత్తలకు అదనంగా రుణాలివ్వడం ఈ పథకం మార్గదర్శకాల్లో లేదని తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. పథకంలో భాగంగా 2020–21లో కృష్ణాజిల్లాలో 23 మంది వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకుంటే ఒకరికి బ్యాంకు రుణం మంజూరు చేయగా క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ అందుతోందని, 2021–22లో 98 మంది దరఖాస్తు చేసుకుంటే 17 మందికి బ్యాంకు రుణాలు దక్కాయని, ఎనిమిది మందికి క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ అందుతోందని వివరించారు. ట్రాన్స్జెండర్ల జనాభాలో ఏపీది రెండోస్థానం 2011 జనాభా లెక్కల ప్రకారం ట్రాన్స్జెండర్లు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీది రెండోస్థానమని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారతశాఖ సహాయమంత్రి ఎ.నారాయణస్వామి.. వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఏపీలో అత్యధికంగా చేపల ఉత్పత్తి దేశవ్యాప్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌లోనే చేపల ఉత్పత్తి అత్యధికమని కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలా తెలిపారు. 2018–19లో 39.91 లక్షల టన్నులు ఉత్పత్తి అయితే, 2020–21లో 46.23 లక్షల టన్నులు ఉత్పత్తి అయినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ బి.వి.సత్యవతి ప్రశ్నకు జవాబుగా చెప్పారు. కోల్డ్ చైన్ యూనిట్లతో 38,208 మంది రైతులకు లబ్ధి ఆంధ్రప్రదేశ్‌లోని 38,208 మంది రైతులు 2021–22లో కోల్డ్ చైన్ యూనిట్ల ద్వారా లబ్ధిపొందుతున్నారని కేంద్ర ఫుడ్‌ప్రాసెసింగ్‌శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్‌సింగ్ పటేల్ తెలిపారు. ఏపీలో నాలుగు ప్రాజెక్టులు అమల్లో ఉండగా రెండు ప్రాజెక్టులు వేర్వేరు దశల్లో ఉన్నాయని వైఎస్సార్సీపీ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఏపీలో ఆక్వా అభివృద్ధికి రూ.108.95 కోట్లు విడుదల ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా అభివృద్ధికి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్వై) ద్వారా 2020–21, 2021–22 సంవత్సరాలకు రూ.657.11 కోట్లు అనుమతించి రూ.108.95 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలా తెలిపారు. రాష్ట్రంలో చేపల రిటైల్ మార్కెట్లను ఆక్వాహబ్‌ల పేరిట అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం, పాలకొండ, పలాసలను సంభావ్యత ప్రాంతాలుగా గుర్తించిందని వైఎస్సార్సీపీ ఎంపీలు గొడ్డేటి మాధవి, గోరంట్ల మాధవ్ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
నిరంతర విద్యుత్‌తో ‘వెలుగు’తున్న ఆక్వా
జాలాది శ్రీమన్నారాయణ, జయలక్ష్మి.. ఆక్వా సాగుకోసం 2018–19లో 1,400 లీటర్ల డీజిల్‌ను వినియోగించారు. 2019–20లో అది 540 లీటర్లకు తగ్గింది. 2020–21లో 180 లీటర్లు సరిపోయింది. పామర్తి బాలకోటేశ్వరరావు ఆక్వా సాగుకోసం 2018–19లో 32 లీటర్ల డీజిల్ వినియోగించారు. 2019–20లో 12 లీటర్లకు తగ్గింది. 2020–21లో కేవలం 10 లీటర్లు మాత్రమే వినియోగించారు. సాక్షి, అమరావతి: చేప ఎండకుండా ఉండాలంటే మోటారుతో నీటిని తోడి చెరువు నింపాలి. చెరువులో రొయ్య బతికుండాలంటే నిరంతరం విద్యుత్ అందుబాటులో ఉండాలి. ఈ రెండిటిలో ఏది జరగకపోయినా ఆక్వా రైతు ఆస్తులు అమ్ముకున్నా తీర్చలేనంత అప్పులపాలవడం ఖాయం. అందుకే ఆక్వా రైతులు ఖర్చెంతైనా పర్లేదనుకుంటూ డీజిల్ మోటార్లు వాడుతుంటారు. పెట్రోల్‌తో సమానంగా డీజిల్ ధరలు పెరుగుతూనే ఉండటంతో పెట్టుబడులకు భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి సమయంలో నేనున్నానంటూ ఆదుకున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. చేపలు, రొయ్యల చెరువుల విద్యుత్ సర్వీసులకు రూ.3.85 ఉన్న క్రాస్ సబ్సిడీని రూ.2.35కు తగ్గించారు. 60,472 సర్వీసులకు సబ్సిడీపై యూనిట్ విద్యుత్ రూ.1.50కే అందేలా చేశారు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.720 కోట్ల భారం పడుతోంది. అయినా ప్రభుత్వం ఆక్వా రైతుల సంక్షేమం కోసం ఈ భారాన్ని భరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో విద్యుత్ పంపిణీ సంస్థలు ఆక్వాసాగుకు నిరంతర విద్యుత్‌ను సమకూరుస్తున్నాయి. ఫలితంగా డీజిల్ వాడకం కొన్ని ప్రాంతాల్లో సగానికిపైగా, మరికొన్ని ప్రాంతాల్లో దాదాపు పూర్తిగా తగ్గిపోయింది. ఆర్థికభారం తగ్గింది నేను ఆలపాడులో రొయ్యలు సాగుచేశాను. గతంలో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉండటంతో ఎకరానికి రోజుకు 40 లీటర్ల డీజిల్ అవసరం ఉండేది. దానికి నెలకు రూ.86,800 ఖర్చుపెట్టాల్సి వచ్చేది. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆక్వా రైతులకు యూనిట్ కరెంటును రూ.1.50కి అందించారు. దీంతో ఇప్పుడు ఎకరానికి నెలకు కేవలం విద్యుత్ బిల్లు రూ.5,800 వస్తోంది. సబ్సిడీ లేకపోతే ఇదే బిల్లు నెలకు రూ.25 వేలకుపైనే వచ్చేది. విద్యుత్‌ను సబ్సిడీతో నిరంతరం ఇవ్వడం వల్ల నాలాంటి ఆక్వా రైతులందరూ సంతోషంగా ఉన్నారు. – ముంగర నరసింహారావు, ఆక్వా రైతు, వడ్లకూటితిప్ప, కైకలూరు మండలం ఆక్వా రైతులకు వరం దేశంలోనే ఆక్వా ఉత్పత్తుల్లో మన రాష్ట్రం అగ్రగామిగా ఉంది. నేను పెంచికమర్రు గ్రామంలో రొయ్యలు సాగుచేశాను. ఒక పంట సాగుకు నాలుగు నెలలు సమయం పట్టేది. 2019 ప్రారంభంలో నాలుగు నెలలకు ఒక ఎకరం రొయ్యల సాగుకు డీజిల్ కోసం రూ.3,47,200 ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ఒక్కో ఎకరానికి రోజుకు కనీసం 40 లీటర్ల డీజిల్ వినియోగించాలి. ఇప్పుడు విద్యుత్ ధర రూ.1.50 చేయడం వల్ల నాలుగు నెలలకు కరెంటు బిల్లు రూ.24 వేలు మాత్రమే వస్తోంది. లక్షల్లో ఖర్చు మిగులుతోంది. – జయమంగళ కాసులు, రొయ్యల రైతు, పెంచికలమర్రు, కైకలూరు మండలం -
మీసం మెలేసేందుకు ‘టైగర్’ రెడీ
సాక్షి, అమరావతి: రెండు దశాబ్దాల క్రితం వరకు అంతర్జాతీయ ఆక్వా మార్కెట్లో మీసం మెలేసిన ‘ఆంధ్రా టైగర్’ రొయ్యలకు పూర్వవైభవం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాధిరహిత (స్పెసిఫిక్ పాత్ జోన్ ఫ్రీ బ్రూడర్స్) తల్లి రొయ్యలను దిగుమతి చేసుకుని.. వాటిద్వారా సీడ్ ఉత్పత్తి చేసేందుకు రాష్ట్రంలో ఐదు హేచరీలకు అనుమతి లభించింది. వీటినుంచి డిమాండ్‌కు సరిపడా సీడ్ అందుబాటులోకి రానుండడంతో సమ్మర్ క్రాప్ (వేసవి పంట)లో కనీసం 50 వేల ఎకరాల్లో టైగర్ రొయ్యలు సాగవుతాయని అంచనా వేస్తున్నారు. ఏపీలో 5 హేచరీలకు అనుమతి అమెరికాలోని హవాయికి చెందిన ఓ సంస్థ అభివృద్ధి చేసిన ఎస్పీఎఫ్ బ్రూడర్స్ దిగుమతికి పచ్చజెండా ఊపిన కేంద్ర ప్రభుత్వం వాటిని కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ (సీఏఏ) ద్వారా నెల్లూరులోని వైష్ణవి ఆక్వాటెక్, తమిళనాడులోని యూని బయో (ఇండియా) హేచరీలకు ఇచ్చేందుకు అనుమతించింది. ఇక్కడ ఉత్పత్తి చేసిన సీడ్‌తో గతేడాది గుంటూరు, నెల్లూరు, ఒంగోలు ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా సాగు చేపట్టి సత్ఫలితాలు సాధించడంతో వనామీ రొయ్యల సాగుకు టైగర్ ప్రత్యామ్నాయంగా మారింది. డిమాండ్‌కు తగ్గ సీడ్ అందుబాటులో లేకపోవడంతో రెండో పంట సమయంలో నకిలీల బారినపడి రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వైల్డ్ బ్రూడర్స్ (సముద్రంలో సహజసిద్ధంగా దొరికే తల్లి రొయ్యల) నుంచి ఉత్పత్తి చేసిన సీడ్‌తోపాటు నకిలీ సీడ్‌ను ఎస్పీఎఫ్ బ్రూడర్ సీడ్‌గా అంటగట్టి దళారులు సొమ్ము చేసుకున్నారు. వీరికి అడ్డుకట్ట వేసేందుకు రంగంలోకి దిగిన సీఏఏ రాష్ట్ర మత్స్య శాఖతో కలిసి ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం చేయాల్సి వచ్చింది. నకిలీలకు చెక్ పెట్టడంతోపాటు టైగర్ రొయ్యల సాగును ప్రోత్సహించాలన్న సంకల్పంతో మరిన్ని హేచరీలకు అనుమతి ఇవ్వాలని సీఏఏ నిర్ణయించింది. కొత్తగా ఏపీకి చెందిన రెండు హేచరీలు, రెండు లార్వా రేరింగ్ హేచరీలకు అనుమతి ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో టైగర్ బ్రూడర్స్ దిగుమతి, సీడ్ ఉత్పత్తి కోసం అనుమతి పొందిన హేచరీల సంఖ్య మూడుకు చేరింది. ఇక్కడ ఉత్పత్తి చేసిన నౌప్లీ (లార్వా) నుంచి సీడ్ ఉత్పత్తి చేసే రెండు యూనిట్లకు కొత్తగా అనుమతినివ్వడంతో టైగర్ సీడ్ ఉత్పత్తి, సాగులో దేశంలోనే ఏపీ కేరాఫ్ అడ్రస్‌గా మారబోతుంది. ప్రస్తుతం అనుమతి పొందిన హేచరీలన్నీ వంద మిలియన్ సీడ్ ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగినవే. అయితే, నిబంధనలకు లోబడే ఇవన్నీ సీడ్ ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. సీఏఏ అనుమతి లేకుండా ఇతర హేచరీల్లో సీడ్ ఉత్పత్తి చేసినా, అమ్మినా లైసెన్సులు రద్దు చేయడంతోపాటు క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. బ్రూడర్స్ దిగుమతి.. సీడ్ ఉత్పత్తికి అనుమతి పొందిన హేచరీలివీ.. యూని బయో (ఇండియా) హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్, ముగైయూర్, తమిళనాడు వైష్ణవి ఆక్వా టెక్, దుగరాజపట్నం, వాకాడు మండలం, నెల్లూరు జిల్లా మున్నంగి హేచరీస్, రామచంద్రరావుపేట పంచాయతీ, నెల్లూరు జిల్లా గాయత్రి బయో మెరైన్ యూనిట్–2, కొత్త ఓడరేవు, బాపట్ల మండలం, గుంటూరు జిల్లా శ్రీ వైజయంతీ హేచరీస్ ఎల్ఎల్పీ, కారేడు, ఉలవపాడు మండలం, ప్రకాశం జిల్లా బీకేఎంఎన్ ఆక్వా, రాముడుపాలెం, ఇందుకూరుపేట, నెల్లూరు జిల్లా -
రిపబ్లిక్ చిత్రంపై కొల్లేరు ప్రజల ఆగ్రహం
ఏలూరు రూరల్/కైకలూరు: ‘రిపబ్లిక్’ చిత్ర ప్రదర్శనపై పశ్చిమగోదావరి జిల్లా కొల్లేరు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మనోభావాలను కించపరిచేలా సినిమాను చిత్రీకరించిన దర్శకుడు, నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఏలూరులో ర్యాలీ నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్, ఎస్పీ రాహుల్దేవ్శర్మను కలిసి వినతిపత్రం అందజేశారు. వడ్డి కుల సంక్షేమ సంఘం నాయకుడు ముంగర సంజీవ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. కొల్లేరు ప్రజలు విషపూరిత రసాయనాలతో చేపల సాగు చేస్తున్నట్లుగా సినిమాలో చూపించడం దారుణమన్నారు. దీనివల్ల చేపల సాగుపై ఆధారపడి జీవిస్తున్న స్థానిక ప్రజలు ఆర్థికంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్వా రంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంటే.. అసత్యాలతో సినిమా తీయడం దారుణమని రాష్ట్ర వడ్డి కుల కార్పొరేషన్ చైర్మన్ సైదు గాయత్రి సంతోషి అన్నారు. వెంటనే తమ ప్రాంతం గురించి చిత్రీకరించిన అభ్యంతరకర సన్నివేశాలను తొలిగించాలని రాజన్న కొల్లేరు సంఘం చైర్మన్ మండల కొండలరావు డిమాండ్ చేశారు. చిత్ర ప్రదర్శన నిలిపివేయకపోతే ఆందోళన చేస్తామని ఏపీ ఫారెస్ట్ కార్పొరేషన్ డైరెక్టర్ పల్లెం ప్రసాద్ హెచ్చరించారు. సినిమా అనేది ప్రజల జీవన స్థితిగతులు పెంచేలా ఉండాలని ఎంపీపీ పెనుమత్స శ్రీనివాసరాజు సూచించారు. కొల్లేరు ప్రజలను కించపరిచేలా సినిమాలు తీస్తే గట్టిగా బుద్ధి చెబుతామని కలకుర్రు, ప్రత్తికోళ్లలంక, పైడిచింతపాడు సర్పంచ్‌లు ఘంటసాల నాగప్రసాద్, ఘంటసాల మహలక్ష్మీరాజు, ముంగర తిమోతి, ప్రసాద్ తదితరులు హెచ్చరించారు. కైకలూరు, కొల్లేటి కోటలో కూడా ఆందోళన చేపట్టారు. రిపబ్లిక్ సినిమా ప్రదర్శిస్తున్న వెంకటరమణ థియేటర్ వద్ద హైవేపై నిరసన తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు, తహసీల్దారు సాయి కృష్ణకుమారికి కొల్లేరు సంఘ జిల్లా అధ్యక్షుడు రాంబాబు ఆధ్వర్యంలో వినతి పత్రాలిచ్చారు. నిరసనల్లో నాయకులు జయమంగళ కాసులు, మల్లికార్జునరావు పాల్గొన్నారు. -
ఆహా.. ఆక్వా హబ్‌లు!
సాక్షి, అమరావతి: మత్స్య ఉత్పత్తుల వినియోగాన్ని పెంచి ప్రజలకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోన్న ఆక్వా హబ్‌లు సిద్ధమవుతున్నాయి. దేశంలో తొలిసారిగా సర్టిఫై చేసిన మత్స్య ఉత్పత్తులను ‘ఫిష్ ఆంధ్రా’ పేరిట వినియోగదారులకు అందుబాటులోకి తెస్తున్నారు. బతికి ఉన్న చేపలే కాదు.. ఐస్‌లో భద్రపర్చిన ఫ్రెష్ ఫిష్‌తో పాటు దేశంలోనే తొలిసారిగా వ్యాక్యూమ్ ప్యాక్డ్ ఫిష్‌లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. కూరగాయలు, చికెన్ మాదిరిగా అన్ని వేళల్లో అన్ని రకాల మత్స్య ఉత్పత్తులు తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయి. దేశంలో తొలిసారిగా చేపలు, రొయ్యల పచ్చళ్లతోపాటు నేరుగా వండుకునేందుకు మసాలాతో దట్టించి చేసిన మత్స్య ఉత్పత్తులను కూడా అందించబోతున్నారు. వంద ఆక్వా హబ్‌లు.. ఏటా దాదాపు 46.23 లక్షల మెట్రిక్ టన్నుల మత్స్య ఉత్పత్తులతో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్న ఏపీలో వార్షిక తలసరి వినియోగం కేవలం 8.07 కిలోలు మాత్రమే ఉంది. స్థానిక వినియోగం పెంచడమే లక్ష్యంగా 2022 కల్లా రాష్ట్రవ్యాప్తంగా వంద ఆక్వా హబ్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. తొలి విడతగా డిసెంబర్ నెలాఖరులోగా రూ.325.15 కోట్లతో 25 హబ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. పైలెట్ ప్రాజెక్టుగా పులివెందులతో పాటు పెనమలూరులో ఏర్పాటు చేస్తోన్న హబ్‌లను సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హబ్‌ల్లో ప్రత్యేకతలెన్నో హబ్‌ల్లో 20 టన్నుల సామర్థ్యంతో ప్రాసెసింగ్ యూనిట్, 3 టన్నుల సామర్థ్యంలో చిల్డ్, కోల్డ్ స్టోరేజీలు, టన్ను సామర్థ్యంతో 2 లైప్ ఫిష్ ట్యాంకులు ఏర్పాటు చేస్తారు. ఆక్వా, సముద్ర ఉత్పత్తులను సేకరించే ముందు తొలుత శాంపిళ్లను ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్‌కు పంపి పరీక్షించిన తర్వాత హబ్, రిటైల్ అవుటలెట్స్కు తరలిస్తారు. హబ్‌ల్లో కోల్డ్ చైన్ సప్లై సిస్టమ్ ద్వారా చేపలు, రొయ్యలను వృథా కాకుండా కట్ చేసి కనీసం వారం రోజుల పాటు నిల్వచేసే విధంగా వ్యాక్యూమ్డ్ ప్యాకింగ్ చేస్తారు. వాటిని రోటోమోల్డెడ్ ఐస్ బాక్సుల్లో రిటైల్ అవుట్‌లెట్స్‌కు సరఫరా చేస్తారు. నేరుగా వండుకునేందుకు వీలుగా మసాలాలు దట్టించిన ఉత్పత్తులను ఇక్కడ నుంచి అవుట్‌లెట్స్‌కు సరఫరా చేస్తారు. బతికి ఉన్న చేపలను చెరువుల నుంచి హబ్‌లతో పాటు రిటైల్ అవుట్‌లెట్స్‌కు సరఫరా చేస్తారు. రెస్టారెంట్ మాదిరిగా .. హబ్‌కు అనుబంధంగా పట్టణ ప్రాంతాల్లో మార్కెటింగ్‌కు అవకాశం ఉన్న ప్రదేశాల్లో సర్వే చేసి డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో వాల్యూయాడెడ్ యూనిట్లు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ బతికున్న చేపలతో పాటు రోటోమోల్డెడ్ ఐస్ బాక్సుల్లో వేస్ట్ లేకుండా కట్ చేసిన చేపలు(ఫ్రెష్ ఫిష్)లతో పాటు ఫ్రోజెన్ ఫిష్, మ్యారినెట్ చేసిన చేపలను కూడా అందుబాటులో ఉంచుతారు. రెస్టారెంట్ మాదిరిగా ఓ వైపు డైనింగ్ ఫెసిలిటీ కల్పిస్తారు. తమకు నచ్చిన చేపలను కోరుకున్నట్లుగా వండుకుని తినే అవకాశం కల్పిస్తారు. ఇక్కడ నుంచి నేరుగా బతికున్న చేపలతో పాటు మ్యార్నెట్ చేసిన వాటిని తీసుకెళ్లే సదుపాయం ఉంటుంది. లైవ్ ఫిష్ యూనిట్లలో బతికున్న చేపలను ఆన్లైన్లో బుక్ చేసుకుంటే డోర్ డెలివరీ చేస్తారు. ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసే కియోస్క్‌లో కూడా తక్కువ సామర్థ్యంతో లైవ్షిఫ్ను అందుబాటులో ఉంచుతారు. మొబైల్ ఫిష్ వెండింగ్ ఫుడ్ కోర్టుల్లో తినేందుకు వీలుగా చేపలు, రొయ్యలతో తయారైన స్నాక్స్ అందుబాటులో ఉంచుతారు. ఈ– కార్ట్స్ ద్వారా కూరగాయల మాదిరిగా తాజా నాణ్యమైన చేపలను ప్రజలకు ఇళ్ల వద్దే విక్రయిస్తారు. సచివాలయానికొకటి చొప్పున ఏర్పాటు చేస్తున్న మినీ రిటైల్ అవుట్‌లెట్స్ ద్వారా ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు అందుబాటులో ఉంచుతారు. ఈ అవుట్‌లెట్స్ ద్వారా డోర్ డెలివరీ చేస్తారు. ఈ కామర్స్ సిస్టమ్ ద్వారా ప్రతీ వినియోగదారుడి నుంచి అభిప్రాయాలు సేకరించి అందుకు తగ్గట్టుగా మత్స్య ఉత్పత్తులను సరఫరా చేస్తారు. సచివాలయానికో మినీ రిటైల్ అవుట్లెట్ నాలుగు వేల చదరపు అడుగుల వీస్తీర్ణంలో రూ.1.67 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఆక్వా హబ్‌లకు అనుబంధంగా ప్రతి హబ్ పరిధిలో రూ.50 లక్షల ఖర్చుతో వ్యాల్యూ యాడెడ్ యూనిట్, రూ.20 లక్షల అంచనాతో ఐదు లైవ్ ఫిష్ యూనిట్లు, రూ.10 లక్షల వ్యయంతో 8 ఫిష్ కియోస్క్‌లు, రూ.10 లక్షలతో మొబైల్ ఫిష్ వెండింగ్ ఫుడ్ కోర్టులు, బజార్లలో విక్రయించేందుకు రూ.3 లక్షల అంచనాతో 10 ఎలక్ట్రికల్ ఈ కార్ట్స్ వాహనాలు ఏర్పాటు చేస్తారు. ఇక హబ్‌కు అనుబంధంగా సచివాలయానికి ఒకటి చొప్పున ఒక్కొక్కటి రూ.1.45 లక్షల అంచనా వ్యయంతో 100–120 మినీ రిటైల్ అవుట్‌లెట్స్ ఏర్పాటు చేస్తారు. -
టైగర్ తిరిగొస్తోంది
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ ఆక్వా మార్కెట్లో మీసం మెలేసిన ఆంధ్రా టైగర్ రొయ్యలు తిరిగి సాగులోకి వస్తున్నాయి. సుమారు రెండు దశాబ్దాల క్రితం వరకూ ఆక్వా రంగంలో తిరుగులేని రారాజుగా వెలుగొందిన టైగర్ రొయ్యలపై వివిధ రకాల వైరస్లు ముప్పేట దాడితో మూలన పడ్డాయి. దాంతో ఆ స్థానాన్ని వెనామీ రొయ్యల రొయ్యలు ఆక్రమించాయి. తాజాగా వెనామీ సాగులోనూ వైరస్ల దాడి పెరగటం, వివిధ రకాల వ్యాధులు విజృంభిస్తుండటంతో నష్టాల పాలవుతున్న రైతులకు టైగర్ రొయ్యలు తిరిగి ఆశాదీపంలా కనిపిస్తున్నాయి. వెనామీకి ప్రత్యామ్నాయంగా టైగర్ సాగు ద్వారా సిరుల పంట పండించేందుకు రైతులు ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లాలోని సముద్ర తీర ప్రాంత రైతులు 4,500 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా టైగర్ రొయ్యల సాగుకు శ్రీకారం చుట్టి మంచి ఫలితాలు సాధించారు. గుంటూరు జిల్లాతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని తీరప్రాంత ఆక్వా రైతులు సైతం టైగర్ రొయ్యల సాగు వైపు ఇప్పటికే అడుగులు వేశారు. నష్టాల సాగు నుంచి గట్టెక్కేలా.. దేశవ్యాప్తంగా ఏటా 8.64 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తి అవుతుంటే.. అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 6.34 లక్షల టన్నుల (74 శాతం) రొయ్యలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో సింహభాగం వెనామీ రొయ్యలదే. అంతకు ముందు మన ప్రాంత నాటు రొయ్య (టైగర్) హవా నడిచింది. ఆ తరువాత టైగర్ రొయ్యలకు వైట్ స్పాట్ (తెల్ల మచ్చ) వైరస్, ఇతరత్రా వ్యాధులు సోకడం, వ్యాధి రహిత తల్లి రొయ్యల (స్పెసిఫిక్ పాత్ జోన్ ఫ్రీ బ్రూడర్స్) ఉత్పత్తి లేకపోవడంతో ‘టైగర్’ శకం ముగిసింది. అదే సమయంలో విదేశాల నుంచి స్పెసిఫిక్ పాత్ జోన్ ఫ్రీ (ఎస్పీఎఫ్) వెనామీ బ్రూడర్స్ (తల్లి రొయ్యలు) రావడం, విస్తృత స్థాయిలో సీడ్ అందుబాటులోకి రావడంతో ఆక్వా రంగం పూర్తిగా వెనామీ వైపు మళ్లింది. ప్రస్తుతం వెనామీ రొయ్యలకు సైతం వైట్ స్పాట్, వెబ్రియా తదితర వైరస్లు, వ్యాధుల కారణంగా 40 కౌంట్‌లో పట్టాల్సిన 80–100 కౌంట్‌లో పట్టేయాల్సి వస్తోంది. దీంతో వెనామీ సాగు చేస్తున్న రొయ్యల రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తిరిగి టైగర్ రొయ్యలు అందుబాటులోకి వస్తున్నాయి. గుజరాత్లో తల్లి రొయ్యల పునరుత్పత్తి అమెరికాలోని హవాయికి చెందిన ఓ సంస్థ ఎస్పీఎఫ్ టైగర్ తల్లి రొయ్యలను అభివృద్ధిపర్చడంతో తిరిగి టైగర్ శకం ప్రారంభమైనట్టయ్యింది. వాటి దిగుమతికి 2019లో కేంద్రం అనుమతి ఇవ్వడంతో ఓ ప్రైవేట్ సంస్థ టైగర్ బ్రూడర్స్‌ను దిగుమతి చేసుకుని నెల్లూరు జిల్లాలో హేచరీ ద్వారా సీడ్ (రొయ్య పిల్లల)ను ఉత్పత్తి చేసింది. ఆ సీడ్‌తో గుంటూరు, నెల్లూరు, ఒంగోలు ప్రాంత రైతులు ప్రయోగాత్మకంగా సాగు చేపట్టి సత్ఫలితాలు సాధించారు. దేశీయ అవసరాలకు సరిపడా బ్రూడర్స్ దిగుమతికి అవకాశాలు తక్కువగా ఉండటంతో తల్లి రొయ్యల పునరుత్పత్తి కోసం గుజరాత్లో బ్రూడర్ మల్టిప్లికేషన్ సెంటర్ (బీఎంసీ)ను ఆ ప్రైవేటు సంస్థ ఏర్పాటు చేస్తోంది. తల్లి రొయ్యల నుంచి ఉత్పత్తయ్యే సీడ్‌ను ఇక్కడ 4 నెలల పాటు పెంచి.. వాటిద్వారా తిరిగి తల్లి రొయ్యలను పునరుత్పత్తి చేస్తారు. వైట్స్పాట్తో పాటు ఇతర వ్యాధులను సైతం తట్టుకునేలా వాటిని అభివృద్ధి చేస్తారు. ప్రస్తుతం ఒక్కో రొయ్య పిల్ల 99 పైసలకు అందుబాటులో ఉంది. ప్రయోగం సక్సెస్ ఈ ఏడాది జనవరిలో ప్రైవేట్ సంస్థ ఏపీ మార్కెట్లోకి తీసుకొచ్చిన సీడ్‌ను గుంటూరు జిల్లా నిజాంపట్నం, రేపల్లె, కర్లపాలెం, పీవీ పాలెం ప్రాంత రైతులు ప్రయోగాత్మకంగా 4,500 ఎకరాల్లో సాగు చేశారు. రొయ్యలు ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా ప్రతిరోజు 0.3 గ్రాముల నుంచి 0.5 గ్రాముల వరకు పెరుగుతూ 120 రోజుల్లోనే 20 కౌంట్లోపే పంట చేతికొచ్చింది. ఊహించని రీతిలో ఫలితాలు రావడంతో సీడ్‌కు డిమాండ్ ఏర్పడింది. 70 ఎకరాల్లో రూ.1.40 కోట్ల ఆదాయం నిజాంపట్నం మండలం లంకవానిదిబ్బలోని 70 ఎకరాల్లో టైగర్ రొయ్యలు సాగు చేశా. రూ.1.90 కోట్లు పెట్టుబడి పెట్టా. 13–15 కౌంట్‌లో 62 టన్నుల దిగుబడి వచ్చింది. వైట్ స్పాట్‌ను తట్టుకుంది. ఎలాంటి మందులు వాడలేదు. పెట్టుబడి పోను రూ.1.40 కోట్ల ఆదాయం వచ్చింది. – కొక్కిలిగడ్డ ఐజాక్, ఆక్వా రైతు, నిజాంపట్నం, గుంటూరు తీర ప్రాంత ఆక్వా రైతులకు వరం టైగర్ రొయ్యలు తీరప్రాంత ఆక్వా రైతులకు వరం. వెనామీకి ప్రత్యామ్నాయంగా మారుతుంది. పెట్టుబడి తక్కువగా ఉండే టైగర్ సాగు సన్న, చిన్నకారు రైతులకు అనుకూలం. వెనామీ సాగుకు అనుకూలంగా లేని ఇసుక భూముల్లో టైగర్ సాగు లాభదాయకం. టైగర్ రొయ్యల పెంపకం విజయవంతం కొనసాగితే సాగు విస్తీర్ణం, ఉత్పత్తితోపాటు ఎగుమతులు కూడా గణనీయంగా పెరుగుతాయి. – డాక్టర్ పి.సురేష్‌కుమార్, డిప్యూటీ డైరెక్టర్, మత్స్య శాఖ -
ఆక్వా.. అనుమతులు చకచకా
సాక్షి, అమరావతి: ఆక్వా కల్చర్ అభివృద్ధికి చేయూతనందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన ప్రాంతాల్లో సాగు విస్తీర్ణాన్ని పెంచేలా చర్యలు చేపట్టింది. నిబంధనలను అనుసరించి కొత్తగా చేపలు, రొయ్యల చెరువుల తవ్వకాలకు చకచకా అనుమతులు జారీ చేస్తోంది. మరోవైపు సాగర తీరంలోని ఉప్పునీటి భూముల్లోనూ ఆక్వా కల్చర్‌ను ప్రోత్సహించే దిశగా అడుగులేస్తోంది. రాష్ట్రంలో 974 కిలోమీటర్ల మేర సముద్ర తీరం విస్తరించి ఉంది. ఇందులో 352 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మడ అడవులున్నాయి. సుమారు 75 వేల హెక్టార్లలో ఉప్పునీటి (బ్రాకిష్ వాటర్) భూములు ఉండగా.. ఇవన్నీ ఆక్వా కల్చర్ సాగుకు అనుకూలమైనవి. ఇందులో ప్రస్తుతం 54,477 హెక్టార్లలో ఆక్వా సాగవుతోంది. మరో 21 వేల హెక్టార్లు సాగుకు అనుకూలంగా ఉంది. ఆ భూముల్లోనూ ఆక్వా సాగును విస్తరించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సీఏఏ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటుతో.. మంచినీటి చెరువుల్లో ఆక్వా సాగు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా)ద్వారా లైసెన్సులు తీసుకోవచ్చు. అదే సముద్ర తీరంలోని ఉప్పునీటి భూముల్లో ఆక్వా సాగు చేపట్టాలంటే కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ (సీఏఏ) నుంచి అనుమతులు పొందాలి. తూర్పు తీరానికి సంబంధించి ఈ కేంద్రం చెన్నైలో మాత్రమే ఉండటంతో రాష్ట్రం నుంచి సిఫార్సు చేసిన దరఖాస్తులను పరిశీలించి అనుమతులు జారీ చేయడంలో తీవ్ర జాప్యం జరిగేది. ఈ కారణంగా దరఖాస్తులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండేవి. రాష్ట్రంలో 54,477 హెక్టార్లలో ఉప్పునీటి ఆక్వా చెరువులు ఉండగా.. వాటిలో కేవలం 25,217 హెక్టార్ల (46 శాతం)లోని చెరువులకు మాత్రమే గుర్తింపు ఉంది. గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఆ భూముల్లో అనధికారిక సాగు పెరిగిపోతూ వచ్చింది. ఈ పరిస్థితిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సీఏఏ తొలి ప్రాంతీయ ఫెసిలిటీ సెంటర్‌ను ఏపీకి మంజూరు చేయించింది. ఈ సెంటర్‌ను మార్చి 18న విజయవాడలోని మత్స్యశాఖ కమిషనరేట్ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ కార్యాలయం ఏర్పాటుతో ఉప్పునీటిలో ఆక్వా సాగు చేసే రైతులకు రిజిస్ట్రేషన్‌లో ఎదురవుతున్న ఇబ్బందులకు చెక్ పడింది. సాగులో ఉన్న చెరువుల రిజిస్ట్రేషన్ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఉప్పునీటి కింద 39,570 హెక్టార్లలో వనామీ, 3,796 హెక్టార్లలో మోనోడోన్ రొయ్యలు సాగవుతుండగా, 6,300 హెక్టార్లలో పసుపు పీత(మడ్ క్రాబ్), 4,811హెక్టార్లలో పండుగప్ప (సీ బాస్) సాగవుతోంది. బ్రాకిష్ వాటర్‌లో కొత్త రకాలకు ప్రోత్సాహం ఇదిలావుంటే.. తీరంలో సాగుకు అనుకూలంగా ఉన్న మరో 21వేల హెక్టార్ల విస్తీర్ణంలోని ఉప్పునీటి భూముల్లో ఆక్వా కల్చర్‌ను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2020–21లో కొత్తగా కనీసం 8 వేల హెక్టార్లలో బ్రాకిష్ వాటర్ ఆక్వా సాగును విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే ఐదువేల హెక్టార్లలో సాగు కోసం రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కొత్తగా సాగులోకి తీసుకొస్తున్న ఉప్పునీటి చెరువుల్లో సిల్వర్ పాంపనో (తెల్ల సందువా), రెడ్ స్నాప్పర్, గ్రౌవర్, పి.ఇండిసియస్ రొయ్యల సాగును ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సీఏఏ రాకతో రొయ్యల హేచరీల్లో బ్రూడర్, సీడ్ నాణ్యతను పెంపొందించేందుకు.. ఆక్వా కల్చర్ ఇన్పుట్స్ ధ్రువీకరించేందుకు మార్గం సుగమమైంది. మరోవైపు విచ్చలవిడిగా వినియోగిస్తున్న యాంటీ బయోటిక్స్‌కు సీఏఏ కేంద్రం ద్వారా అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది. ఉప్పునీటిలో ఆక్వా సాగును ప్రోత్సహించేందుకు ఆన్లైన్ ద్వారా వచ్చే దరఖాస్తులను సీఏఏ ఫెసిలిటీ సెంటర్‌కు పంపించి 6 నుంచి 15 రోజుల్లో అనుమతులు మంజూరయ్యేలా చర్యలు చేపట్టినట్టు మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. -
YSR Aqua Labs: శరవేగంగా వైఎస్సార్ ఆక్వా ల్యాబ్స్
సాక్షి, అమరావతి: నాణ్యమైన సీడ్, ఫీడ్, ఇతర ఆక్వా ఉత్పత్తులను రైతులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్ ఏర్పాటు చేస్తోంది. వైఎస్సార్ అగ్రి ల్యాబ్స్ లో అంతర్భాగంగా 27 ల్యాబ్‌ల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. మే నెలాఖరులోగా వీటిని రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాకినాడలోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ (ఎస్‌ఐఎఫ్‌టీ) ఆధ్వర్యంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, కైకలూరు, ఒంగోలు, నెల్లూరులో ప్రస్తుతం 8 ఆక్వా ల్యాబ్స్ పని చేస్తున్నాయి. వీటిలో కొన్ని శిథిలావస్థకు చేరుకోగా.. చాలాచోట్ల పరికరాలు పనిచేయని పరిస్థితి. ఆక్వా రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 8 రాష్ట్ర ప్రభుత్వం తో పాటు ఆక్వా సాగు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మరో 27 ల్యాబ్స్ ను ఏర్పాటు చేస్తోంది. నియోజకవర్గానికి ఒకటి చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 162 వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వీటిలో ఆక్వా సాగు విస్తారంగా ఉన్న 27 ప్రాంతాల్లో అగ్రి ల్యాబ్స్‌లోనే అంతర్భాగంగా 1,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆక్వా ల్యాబ్స్ నిర్మిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో అగ్రి ల్యాబ్, పై ఫ్లోర్లో ఆక్వా ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.50.30 కోట్లు కేటాయించింది. ఈ మొత్తంలో రూ.20 కోట్లను అత్యాధునిక పరికరాల కోసం, రూ.30.30 కోట్లను భవనాలను సమకూర్చుకునేందుకు ఖర్చు చేస్తున్నారు. తీర ప్రాంతం ఉన్న 9 జిల్లాల్లో నిర్మిస్తున్న ఈ ల్యాబ్‌లలో స్థానిక అవసరాలకు తగ్గట్టుగా 35 చోట్ల వాటర్, సాయిల్ అనాలసిస్, 35 చోట్ల మైక్రో బయాలజీ, 14 చోట్ల ఫీడ్ అనాలసిస్, 17 చోట్ల పీసీఆర్, 14 చోట్ల క్వాలిటీ కంట్రోల్ పరీక్షలు అందుబాటులోకి రాబోతున్నాయి. పాత, కొత్త ల్యాబ్స్ కలిపి శ్రీకాకుళంలో 5, విజయనగరంలో 1, విశాఖ, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మూడేసి చొప్పున, తూర్పు గోదావరి జిల్లాలో 7, పశ్చిమ గోదావరి జిల్లాలో 6, కృష్ణా జిల్లాలో 5, నెల్లూరులో రెండు చొప్పున ఆక్వా ల్యాబ్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. నిర్మాణ బాధ్యతలు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌కు.. ల్యాబ్‌లకు అవసరమైన భవన నిర్మాణ బాధ్యతలను ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌కు అప్పగించారు. దాదాపు 80 శాతం భవన నిర్మాణాలు పూర్తి కావచ్చాయి. మిగిలిన పనులను మే 15 నాటికల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ల్యాబ్స్ కు అవసరమైన అత్యాధునిక పరికరాలను కూడా ఏర్పాటు చేసి మే నెలాఖరులోగా అగ్రి ల్యాబ్‌్సతో కలిపి వీటి సేవలను కూడా అందుబాటులోకి తీసుకు రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అవసరమైన సిబ్బంది నియామకం కూడా పూర్తయింది. వారికి శిక్షణ కార్యక్రమాలు కూడా చేపట్టారు. రైతులకు అందుబాటులో ఆక్వా సేవలు ఇప్పటివరకు వాటర్, సాయిల్ తదితర టెస్ట్‌ల కోసం తీసుకున్న శాంపిల్స్‌ను ల్యాబ్‌లున్న ప్రాంతాలకు పంపి టెస్టింగ్ చేయించే వాళ్లం. ఫలితాలు వచ్చేందుకు కొంత సమయం పట్టేది. ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్స్ అందుబాటులోకి వస్తే రైతులు కోరుకున్న సేవలను స్థానికంగానే పొందవచ్చు. సీడ్, ఫీడ్‌ను ఈ ల్యాబ్‌లలో పరీక్షించిన తర్వాతే పంపిణీ చేస్తాం కాబట్టి నాణ్యమైనవి దొరుకుతాయి. – కోటేశ్వరరావు, ప్రిన్సిపాల్, ఎస్‌ఐఎఫ్‌టీ, కాకినాడ -
తల్లి రొయ్యలకూ.. ఓ క్వారంటైన్ సెంటర్
సాక్షి, అమరావతి: రొయ్యల కోసం క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు కాబోతుంది. విశాఖ జిల్లా నక్కపల్లి మండలం బంగారమ్మపేట వద్ద ఏర్పాటు చేయతలపెట్టిన ఆక్వాటిక్ క్వారంటైన్ ఫెసిలిటీ సెంటర్ కోసం రంగం సిద్దమైంది. 2023 నాటికి ఈ కేంద్రం సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రొయ్యల సాగు చేపట్టాలంటే నాణ్యమైన సీడ్ (రొయ్య పిల్ల) చాలా ముఖ్యం. నాణ్యమైన సీడ్ కావాలంటే జన్యుపరమైన సమస్యలు, రోగాల్లేని బ్రూడర్స్ (తల్లి రొయ్యలు) అవసరం. ఆర్గనైజేషన్ ఫర్ ఇంటర్నేషనల్ ఎపిడ్యూజిస్ (ఓఐఈ) గుర్తించిన 8 రకాల వ్యాధులు బ్రూడర్స్ ద్వారా వాటి సంతతికి సంక్రమించవని నిర్ధారించేందుకు నిర్వహించే పరీక్షల్లో నెగిటివ్ అని వస్తేనే బ్రూడర్స్‌ను సీడ్ ఉత్పత్తికి అనుమతిస్తారు. దేశం మొత్తం చెన్నైకి క్యూ యానిమల్ ఇంపోర్ట్ యాక్ట్–1898 ప్రకారం విదేశాల నుంచి ఏ రకం లైవ్ స్టాక్ (జీవాల)ను దిగుమతి చేసుకున్నా.. వాటిద్వారా వాటి సంతతికి, మానవాళి సహా ఇతర జీవ రాశులకు ఎలాంటి రోగాలు సోకవని నిర్ధారించుకునేందుకు వాటిని క్వారంటైన్ చేయాల్సిందే. అదేవిధంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే తల్లి రొయ్యలను కూడా క్వారంటైన్లో ఉంచి పరీక్షిస్తారు. ఇలా పరీక్షించేందుకు ఇప్పటివరకు దేశవ్యాప్తంగా చెన్నైలో మాత్రమే ఆక్వా క్వారంటైన్ ఫెసిలిటీ సెంటర్ ఉంది. దీన్ని మెరైన్ ప్రోడక్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (ఎంపెడా), రాజీవ్‌గాంధీ సెంటర్ ఫర్ ఆక్వాకల్చరిక్స్ (ఆర్జీసీఏ) నిర్వహిస్తున్నాయి. ఏపీతో సహా దేశంలోని ఆక్వా హేచరీలన్నీ ఈ కేంద్రానికి క్యూ కట్టాల్సిందే. ఇక్కడ 400 తల్లి రొయ్యలను ఒక క్యారంటైన్ క్యూబికల్లో ఉంచి ఐదారురోజుల పాటు వివిధ రకాల పరీక్షలు నిర్వహిస్తారు. ఒక క్వారంటైన్ క్యూబికల్‌కి డిమాండ్‌ను బట్టి రూ.95 వేల నుంచి రూ.1.25 లక్షల వరకు వసూలు చేస్తారు. ఏటా 1.50 లక్షల బ్రూడర్స్ దిగుమతి రొయ్య పిల్లల్ని ఉత్పత్తి చేసే హేచరీలు దేశవ్యాప్తంగా మొత్తం 560 ఉంటే.. వాటిలో 389 హేచరీలు ఒక్క ఏపీలోనే ఉన్నాయి. ఇక్కడ ఏటా 65 వేల మిలియన్ల సీడ్ ఉత్పత్తి అవుతోంది. ఇందుకోసం ఏటా సింగపూర్, హవాయ్, ఫ్లోరిడా తదితర ప్రాంతాల నుంచి 1.50 లక్షల బ్రూడర్స్‌ను హేచరీలు దిగుమతి చేసుకుంటాయి. వీటిని క్వారంటైన్ చేసేందుకు ఏటా రూ.కోట్లలో ఖర్చు చేస్తుంటారు. దేశం మొత్తమ్మీద ఒకే ఒక్క క్యారంటైన్ కేంద్రం ఉండటంతో సకాలంలో క్వారంటైన్ పూర్తికాక, సీజన్‌కు నాణ్యమైన సీడ్ ఉత్పత్తి చేయలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు అదును దాటిపోతుందన్న ఆందోళనతో నాసిరకం సీడ్‌పై ఆధారపడి ఆక్వా రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. ఈ పరిస్థితికి చెక్ పెట్టేందుకు విశాఖ జిల్లా నక్కపల్లి మండలం బంగారమ్మపేట వద్ద ఆక్వాటిక్ క్వారంటైన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం 30 ఎకరాలను సేకరించారు. దీని నిర్మాణానికి రూ.36.55 కోట్లను కేటాయించి ఇటీవలే టెండర్లు ఖరారు చేశారు. దీనిని 2023 నాటికి అందుబాటులోకి తీసుకురానున్నారు. నాణ్యమైన సీడ్ ఉత్పత్తే లక్ష్యం నాణ్యమైన సీడ్ ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. దేశంలో ఇది రెండో క్వారంటైన్ కేంద్రం. ఏడాదికి 1,23,750 బ్రూడర్స్‌ను పరీక్షించే సామర్ధ్యం ఈ కేంద్రానికి ఉంటుంది. ఒకేసారి 625 తల్లి రొయ్యలను పరీక్షించవచ్చు. వీటిద్వారా 10 బిలియన్ల సీడ్‌ను ఉత్పత్తి చేయొచ్చు. ఆక్వా సాగు విస్తరణకు ఈ కేంద్రం ఎంతగానో దోహదపడుతుంది. – కె.కన్నబాబు, కమిషనర్, మత్స్యశాఖ -
'రొయ్య'లసీమ
ప్రొద్దుటూరు: రాళ్లురప్పలతో కరువు ప్రాంతాన్ని తలపించే రాయలసీమ.. నేడు రొయ్యలు, చేపలు వంటి మత్స్యసంపదతో కళకళలాడుతోంది. వైఎస్సార్ జిల్లా చాపాడు మండలమైతే చేపల చెరువులతో కోనసీమను తలపిస్తోంది. ఒక్క రైతుతో 30 ఎకరాల్లో మొదలైన సాగు క్రమంగా వందల ఎకరాలకు విస్తరిస్తోంది. వివిధ రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్ వంటి దేశాలకు సైతం ఇక్కడి రొయ్యలు, చేపలను ఎగుమతి చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రజాప్రతినిధుల సహకారంతో మరింత మంది రైతులు ఆక్వా సాగుకు ముందుకు వస్తున్నారు. భీమవరం టూ వైఎస్సార్ జిల్లా.. ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్రలో భాగంగా మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించారు. ఆ సందర్భంగా అక్కడి రైతులతో రొయ్యలు, చేపల సాగు గురించి ఆరా తీశారు. అదే సమయంలో పోరుమామిళ్ల మండలం ఎరసాల గ్రామానికి చెందిన కల్లూరి భాస్కర్‌రెడ్డి భీమవరం ప్రాంతంలో చేపలు, రొయ్యలు సాగు చేస్తున్నాడని తెలుసుకుని ఎమ్మెల్యే ఆయన ఇంటికి వెళ్లారు. మన ప్రాంతంలో వీటిని సాగు చేస్తే బాగుంటుందని, ఇందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని భాస్కర్‌రెడ్డికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆ మేరకు చాపాడు మండలంలోని అనంతపురం–కుచ్చుపాప గ్రామాల మధ్య తనతో పాటు తన బంధువులు, గ్రామస్తులకున్న భూములను భాస్కర్‌రెడ్డికి ఎమ్మెల్యే లీజుకు ఇప్పించారు. ఆయన తొలుత 30 ఎకరాల్లో చేపలు, రొయ్యల సాగును ప్రారంభించి ప్రస్తుతం 100 ఎకరాలకు పైగా విస్తీర్ణానికి పెంచారు. రొయ్యల సాగును కూడా చేపట్టి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. రూప్‌చంద్, కట్ల, శీలావతి, మోస్, పండుగప్ప, సీతల్ రకాల చేపలను సాగు చేస్తున్నారు. కుందూనది పరీవాహక ప్రాంతలో ఈ భూములు ఉండగా నీటి లభ్యత కోసం మోటార్లను ఏర్పాటు చేసుకున్నారు. ఆరు అడగుల మేర నీరు నింపి.. పలు చోట్ల చెరువులను తయారు చేశారు. దూర ప్రాంతాల నుంచి కార్మికులను తెచ్చుకోనవసరం లేకుండా ఈ ప్రాంతంలోని వారికే శిక్షణ ఇచ్చి నియమించుకున్నారు. ఇక్కడ 8 కిలోల వరకు చేపలు పెరుగుతున్నాయి. ఇతర రాష్ట్రాలతో పాటు సీతల్ రకం చేపలను బంగ్లాదేశ్‌కు ఎగుమతి చేశారు. కడపలో చేపల చెరువులా! కేవలం 9వ తరగతి చదువుకున్న భాస్కర్‌రెడ్డి సాగులో కొత్త మెళకువలను పాటించి అధిక ఉత్పత్తిని సాధిస్తున్నారు. తన కుమార్తెను గుజరాత్లో పీజీ ఫిషరీసైన్స్ చదివించారు. ఆమె డిగ్రీ, పీజీల్లో గోల్డ్ మెడల్ సాధించారు. ఇటీవల మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డితో పాటు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, కడప పార్లమెంట్ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కె.సురేష్‌బాబు ఈ చేపల చెరువులను సందర్శించారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి చేపల చెరువుల సాగు విషయాన్ని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు దృష్టికి తీసుకెళ్లారు. ‘కడపలో చేపల చెరువులా..’ అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు ఎమ్మెల్యే ‘సాక్షి’కి తెలిపారు. ఆక్వా బిల్లుతో సాగుకు ముందుకొస్తున్న రైతులు.. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏపీ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా రాష్ట్రంలో చేపలు, రొయ్యల సాగు అభివృద్ధి, ఎగుమతులు తదితరాలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని మరికొన్ని చోట్ల కూడా చేపలు, రొయ్యలు సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. చేపలు, రొయ్యల సాగుకు సహకారం అందిస్తున్నా.. నా స్వగ్రామం పరిధిలోని అనంతపురం గ్రామం వద్ద చేపలు, రొయ్యల సాగు విస్తీర్ణానికి సహకారం అందిస్తున్నాను. ఇక్కడ కుందూ నీరు వస్తేనే పంటలు పండే అవకాశముంది. లేని రోజుల్లో కౌలు కూడా రాని పరిస్థితిని చూశాం. ఈ కారణంతోనే చేపల చెరువులను సాగు చేయడం మంచిదని భావించా. ప్రస్తుతం రైతులకు మంచి కౌలు వస్తోంది. చెరువులను పరిశీలించి.. ఎగుమతులకు తగిన సహకారం అందించాలని కలెక్టర్‌ను కూడా కోరాను. – శెట్టిపల్లె రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే, మైదుకూరు. ఆశాజనంగా ఉంది భీమవరంలో పొందిన అనుభవంతో ఇక్కడ చేపలు, రొయ్యల చెరువులను సాగు చేస్తున్నా. ఇప్పటివరకు సాగు ఆశాజనకంగా ఉంది. అధికారుల నుంచి పూర్తి సహాయ సహకారాలు అందితే మరింత వేగంగా వృద్ధి చెందే అవకాశముంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజల కోరిక మేరకు ఆదివారం ఉదయం చేపలు విక్రయిస్తున్నా. – కల్లూరి భాస్కర్‌రెడ్డి, రైతు -
పండుగప్ప.. హెక్టారు.. 15 టన్నులు!
దేశ విదేశీ మార్కెట్లలో మంచి గిరాకీ ఉండటమే కాకుండా.. మంచి నీటిలో, ఉప్పు నీటిలో, సముద్రపు నీటిలో కూడా పెరిగే అరుదైన చేప.. పండుగప్ప (సీబాస్). రొయ్యలకు ప్రత్యామ్నాయంగా రైతులు సాగు చేయదగిన సలక్షణమైన చేప ఇది. ముళ్లు తీసేసిన పండుగప్ప మాంసం ముక్కలకు దేశీయ సూపర్ మార్కెట్లలో మంచి గిరాకీ ఉంది. కిలో రూ. 400–500 వరకు పలుకుతోంది. విదేశాల్లో దీనికి ఉన్న డిమాండ్ సరేసరి. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే.. సముద్ర ఉత్పత్తుల ఎగుమతి ప్రోత్సాహక సంస్థ ఎంపెడా ఇటీవల పండుగప్ప సాగులో అధిక దిగుబడి సాధించింది. ఉప్పునీటి చెరువులో హెక్టారుకు 15 టన్నుల పండుగప్ప చేపల దిగుబడి తీయడం విశేషం. చెరువుల్లో సాగయ్యే రకాల్లో రొయ్యలకు అన్ని విధాలా దీటైన ‘రారాజు పండుగప్ప’ అని ‘ఎంపెడా’ చైర్మన్ కె.ఎస్. శ్రీనివాస్ అభివర్ణించారు. ఆక్వా సాగు అంటే కేవలం రొయ్యల సాగే అని భావించే రైతులు పండుగప్ప సాగుపై దృష్టి సారించడానికి తాజా ప్రయోగాత్మక సాగు ఫలితాలు ఉత్తేజాన్నిస్తాయని ఆయన అన్నారు. ఆక్వా సాగులో సరికొత్త ప్రయోగాలకు ‘రాజీవ్‌గాంధీ ఆక్వాకల్చర్ సెంటర్’(ఆర్.జి.సి.ఎ.)లు వేదికలుగా నిలిచాయి. ఎంపెడా ఆధ్వర్యంలో దేశంలోని అనేక చోట్ల ఆర్.జి.సి.ఎ.లు ఏర్పాటయ్యాయి. కృష్ణాజిల్లాలో కూడా ఒక ఆర్.జి.సి.ఎ. విభాగం ఉంది. పాండిచ్చేరిలోని కరైకల్ వద్ద ఏర్పాటైన ఆర్.జి.సి.ఎ.లోని ప్రదర్శనా క్షేత్రంలో ప్రయోగాత్మకంగా పండుగప్పను సాగు చేసి, 10 నెలల్లో హెక్టారుకు 15 టన్నుల దిగుబడి సాధించారు. 1.5–2.0 సెం.మీ. చేప పిల్లలను చెరువులో వదిలారు. పది నెలల్లో ఒక్కోచేప 1200 గ్రాముల నుంచి 1500 గ్రాముల బరువు పెరిగాయి. తేలాడే పెల్లెట్లను మేతగా వేశారు. కిలో మేతకు 1.8 కిలోల దిగుబడి సాధించడం విశేషం. అన్నీ కలిపి కిలోకు రూ. 300 ఉత్పత్తి ఖర్చు అయింది. వ్యాపారులు చెరువు దగ్గరకే వచ్చి రూ. 420–450 ధర ఇచ్చి కొనుక్కెళ్లారు. రూ. 17 లక్షల లాభం వచ్చినట్లు ఎంపెడా అధికారులు ప్రకటించారు. పండుగప్ప సాగుకు కీలకం నాణ్యమైన విత్తనం. తమిళనాడు నాగపట్నం జిల్లా తోడువాయి వద్ద గల ఆర్.జి.సి.ఎ.లోని హేచరీలో అత్యంత నాణ్యమైన పండుగప్ప విత్తనాన్ని ఉత్పత్తి చేసి రైతులకు అందిస్తున్నారు. ఇప్పటికే కోటి 80 లక్షల సీడ్‌ను ఉత్పత్తి చేసి రైతులకు అందించినట్లు ఎంపెడా చెబుతోంది. ప్రజలు మక్కువతో ఆరగించే పండుగప్ప చేపలను రొయ్యలకు బదులుగా ఆక్వా రైతులు సాగు చేయాలని ఎంపెడా సూచిస్తోంది. పండుగప్ప విత్తనం కోసం ఆర్.జి.సి.ఎ. అధికారి పాండ్యరాజన్‌ను 94437 24422లో సంప్రదించవచ్చు. ఫాక్స్: 04364–264502 seabasshatchery@gmail.com. -
ఆక్వా రైతులకు మేత భారం
పెరుగుతున్న మేత ధరలు ఆక్వా రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తృణ ధాన్యాల దిగుబడి విషయంలో గత ప్రభుత్వానికి సరైన రవాణా ప్రణాళిక లేకపోవడంతో వాటి ధరలను వ్యాపారులు అమాంతం పెంచేశారు. దీనికితోడు ఉప్పు నీటి ప్రభావంతో రొయ్యలు, చేపల దిగుబడులు తగ్గిపోవడం.. ఉత్పత్తికి తగ్గట్టుగా గిట్టుబాటు ధర లేకపోవడం.. వ్యాధులు, వైరస్ చుట్టుముట్టడంతో మరింత కుంగదీశాయి. ఏటా ఇలాంటి సంక్షోభాలను ఎదుర్కొంటున్న రైతులకు ఈసారి నష్టాలు తప్పేలా లేవు. గత నాలుగేళ్లలో చేపల మేత ధర రెట్టింపు కాగా.. రొయ్యల మేత ధర మూడొంతులు పెరిగింది. వీటి పెరుగుదల రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సాక్షి, కాకినాడ: జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 12,500 హెక్టార్లలో చేపలు, 6,200 వేల హెక్టార్లలో రొయ్యలను సాగు చేస్తున్నారు. నాలుగు కంపెనీల ద్వారా మేత ఉత్పత్తి చేస్తున్నారు. అక్కడ తయారైన వివిధ రకాల మేత చేపలు, రొయ్యలకు ఆహారంగా అందజేస్తున్నారు. మేత తయారీకి తృణ ధాన్యాలు వినియోగిస్తున్నారు. అయితే ఈ ధాన్యాల ధరలు గతంతో పోల్చుకుంటే కేజీ వేరుశనగ చెక్క ధర రూ.3, తవుడు రూ.6, డీవోపీ రూ.8 చొప్పున పెరిగాయి. డీవోపీ ధర రికార్డు స్థాయిని దాటిపోయింది. ప్రస్తుతం నాణ్యమైన టన్ను డీవోపీ ధర రూ.20 వేలు పలుకుతుండటం రైతులకు మింగుడు పడటం లేదు. మేతల రేట్లు పెరిగిన స్థాయిలో చేపల ధరల్లో మాత్రం మార్పు రాలేదు. నాలుగేళ్ల కిందట తవుడు ధర రూ.10 ఉన్నప్పుడు రోహూ రకం చేప కిలో రూ.100 ఉండేది. ప్రస్తుతం మేతల ధరలు రెట్టింపయినా చేప ధర రూ.110 వరకు మాత్రమే ఉంది. టన్ను చేపల రేట్లకు పది టన్నుల మేతల ధరలు ఉంటే రైతులకు గిట్టుబాటు అవుతుంది. ప్రస్తుతం టన్ను చేపలు సుమారు రూ.1.10 లక్షలుండగా టన్ను మేత రూ.20 వేలు పలుకుతోంది. కారణాలు ఏమిటంటే.. పెరిగిన మేత ధరలకు ప్రధాన కారణం దేశవ్యాప్తంగా తృణ ధాన్యాలకు అధిక డిమాండ్లే. రైస్ మిల్లర్లకు ప్రభుత్వ కన్సైన్మెంట్ లేకపోవడంతో తక్కువ పరిణామంలోనే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఎక్కడా రైస్ మిల్లులు తిరిగే పరిస్థితి లేదు. గోదాముల్లో ధాన్యం ఉన్నా ఆర్డర్లు లేకపోవడంతో వాటిని మిల్లు పట్టించడం లేదు. తవుడుకు తీవ్ర కొరత ఏర్పడింది. నూనె తీసిన డీవోపీ ధరలకు రెక్కలు వచ్చాయి. స్థానికంగా తవుడు కొరత ఏర్పడంతో డిమాండ్ పెరిగింది. ఏటా వర్షాకాలం ప్రారంభంలో రైతులందరూ ఒకేసారి సాగు పనులు మొదలు పెట్టడంతో ఈ కాలంలో మేతలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. జూలై నుంచి నవంబర్ వరకు ధరలు పెరుగుతాయి. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు సిండికేటుగా ఏర్పడి ధరలను ప్రభావితం చేస్తున్నారు. కృత్రిమ డిమాండ్‌ను సృష్టించి అమాంతంగా రేట్లు పెంచి విక్రయిస్తున్నారు. ఆక్వా సాగులో ముఖ్యమైన మేతలు లేకపోతే దిగుబడిపై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతో ధరలు పెంచినా ప్రశ్నించకుండానే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇబ్బందుల్లో రైతులు ఆక్వా సాగుదార్లకు మేతల ధరలు తలకుమించిన భారంగా పరిణమిస్తున్నాయి. చెరువుల్లో రొయ్యలు ఉన్నప్పుడు ఒకేసారి భారీ ఎత్తున మేతల ధరలు పెరుగుతున్నా తప్పక కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. గత ఏడాది నవంబర్ తర్వాత చేపల చెరువులకు చుక్కనీరు అందిన దాఖలాలు లేవు. ఓ పక్క నీరు లేక.. మరో పక్క పెరిగిన మేతల ధరలతో ఇబ్బందులు తప్ప లేదు. చెరువుల్లో నీరు అడుగంటి పోవడంతో పట్టుబడి సాధ్యం కాదు. చెరువులో వలను దింపితే చేపలు చనిపోయే ప్రమాదం ఉంది. పట్టుబడి చేయాలో..పెరిగిన మేతల ధరలతో సాగు చేసి నష్టాలు చవిచూడాలో అర్థం కాక ఆక్వా రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. కల్తీ కాటు మేతల ధరలు ఆకాశాన్ని అంటడంతో కొందరు వ్యాపారులు అత్యాశకు పోయి కల్తీకి పాల్పడుతున్నారు. చెరువుల్లో పిల్లల ను రక్షించుకోవడానికి ధరలు ఎంత పెరిగినా కొనుగోలు చేయక తప్పని పరిస్థితిలో రైతులున్నారు. కల్తీ చేసిన మేతల్ని కొనుగోలు చేసి నష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. వేరుశనగ చెక్కలో కంకర ఇసుక, చింతపిక్కల పొడి, వేరుసెనగ తొక్కల పొడిని కలుపుతున్నారు. తవుడులో రంపపు పొట్టు, సీరు నూకలు, ఊకదూగరతో కల్తీ చేస్తున్నారు. కొందరు మిల్లర్లే స్వయంగా తవుడును కల్తీ చేసి అమ్ముతున్నారు. పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల్లో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో మిల్లర్ల వద్ద నాణ్యమైన తవుడు దొరుకుతుందని వచ్చిన రైతులకు అక్కడా మోసం తప్పడం లేదు. గిట్టుబాటు కరువే ఎకరం చెరువులో 1.50 లక్షల పిల్లలు సాగు చేస్తే.. ప్రస్తుతం ఒక పిల్ల ధర 35 పైసలు పలుకుతోంది. అంటే 1.50 లక్షల పిల్లలకు రూ.45 వేలు, మందులు, మేత, విద్యుత్తు బిల్లులకు మరో రూ.4 లక్షలు అవుతోంది. ఆశించిన మేర పంట దిగుబడి అందితే.. అంటే రొయ్య 30 కౌంట్‌కు వచ్చి మూడు టన్నులు అయితే రూ.15 లక్షలు ఆదాయం వస్తుంది. లేని పక్షంలో పెట్టిన పెట్టుబడి సైతం చేతికందే పరిస్థితి ఉండదు. ప్రస్తుతం బహిరంగ విపణిలో సైతం రొయ్యల ధరలు ఆశించిన మేర లేకపోవడంతో రైతులు సాగుకు ముందుకు రావడం లేదు. -
తమిళ దేవుడికి.. ‘తెలుగు తంబిల’ టోపీ
ఎక్కడో తమిళనాడుకు చెందిన దేవుడికి ఓ భక్తుడు ఇచ్చిన భూములవి. విస్తీర్ణం ఒకటీ రెండూ కాదు.. ఏకంగా 26 ఎకరాలు. సుమారు రూ.50 కోట్ల విలువైన ఆ భూములపై రైతుల ముసుగులో ఉన్న ఇద్దరు అధికార పార్టీ నాయకుల కన్ను పడింది. ఇంకేముంది.. దేవుడికే శఠగోపం పెట్టేశారు. వాటిని ఎలాగోలా తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. వరిసాగుతో ఒరిగేదేమీ లేదనుకున్నారో ఏమో మరి! ఏకంగా ఆక్వా సాగు ప్రారంభించారు. చెరువులను తిరిగి లీజుకిచ్చేసి రూ.కోట్లలో ఆర్జిస్తున్నారు. అటు ఆలయానికి లీజు.. ఇటు రెవెన్యూకు శిస్తు చెల్లించకుండా.. దేవుడి సొమ్మును దర్జాగా దోచుకుంటూ.. అధికారం అండతో.. ఆ ‘తెలుగు తంబిలు’ సాగిస్తున్న దందా ఇదీ.. పిఠాపురం: తమిళనాడు రాష్ట్రంలోని శ్రీపెరంబు దూర్ అరుణ్ముగు ఆదికేశవ పెరుమాళ్ శ్రీభాస్కరాచార్యస్వామి ఆలయానికి పిఠాపురం రెవెన్యూ పరిధి లోని సర్వే నంబర్ 802–2లో సుమారు 26 ఎకరాల భూములు ఉన్నాయి. మా ర్కెట్ రేటు ప్రకారం ప్రస్తుతం వాటి విలువ సుమారు రూ.50 కోట్లు ఉంది. సుమారు 50 ఏళ్ల కిందట పిఠాపురానికి చెందిన ఒక దాత తనకు వారసులు లేకపోవడంతో.. తమ కులదైవమైన శ్రీపెరంబుదూర్ ఆదికేశవస్వామివారి ఆలయానికి ఈ భూములను విరాళంగా ఇచ్చారు. తమిళనాడు దేవాదాయ శాఖ అధికారులు ఆ భూములను స్థానిక రైతులకు లీజుకు ఇచ్చారు. ఈ భూ ములపై కన్ను వేసిన అధికార టీడీపీకి చెందిన ఇద్దరు వాటిని రెండేళ్ల లీజుకు తీసుకున్నారు. ఇదంతా పదిహేనేళ్ల కిందటి బా గోతం. లీజు కాలం పూర్తయిన తరువాత కూడా పంటలు దెబ్బ తిన్నాయని, నష్టం వచ్చిందని సాకులు చెబుతూ, వాటిని ఖాళీ చేయకుండా, రాజకీయ పలుకుబడితో ఆ భూములపై పెత్తనం సాగిస్తున్నారు. సుమారు 15 ఏళ్లుగా ఎటువంటి లీజూ చెల్లించకుండా, తమ సొం త భూముల మాదిరిగా పంటలు సాగు చేసుకుంటూ కోట్లాది రూపాయల ఆదాయాన్ని దిగమింగుతున్నారని, చివరకు రెవెన్యూకు చిల్లిగవ్వ కూడా భూమి శిస్తు చెల్లించడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారు అధికార టీడీపీకి చెందిన నియోజకవర్గ ముఖ్యనేత అనుచరులు కూడా అయినందువల్లనే అధికారులు మిన్నకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అక్రమ ఆక్వా చెరువులు తమిళ దేవుడికి ఇక్కడ భూములున్న విషయం ఎవ్వరికీ తెలియకపోవడంతో ఇక తమను అడిగేవారే లేరనుకున్న ఆ నేతలు ఏకంగా రొయ్యల చెరువులు తవ్వేశారు. తమిళనాడు దేవాదాయ శాఖ ఎటువంటి లీజుకూ ఇవ్వకపోయినా, ఎవరి అనుమతీ తీసుకోకుండానే ఏకంగా రొయ్యల సాగు చేపట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ భూములను వేలం ద్వారా లీజుకు ఇవ్వాలని తమిళనాడు దేవాదాయ శాఖ ప్రయత్నించింది. అయితే, ఆ భూములు ఖాళీగా లేవని, వాటిల్లో ఆక్వా చెరువులు తవ్వారనే విషయాలు బయటపడ్డాయి. దీంతో అక్కడి అధికారులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ సదరు నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని యథేచ్ఛగా రొయ్యల సాగు నిర్వహిస్తున్నారు. ఒకపక్క అక్కడ రొయ్యల సాగు చేస్తూనే అధికార పార్టీ ముఖ్య నేత అండతో రెవెన్యూ రికార్డుల్లో మాత్రం పంటభూములుగా చూపిస్తూ పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రైతుల ఆందోళన పచ్చని పంట పొలాల మధ్య చిచ్చు పెడుతూ రొయ్యల చెరువులు తవ్వుతున్నారని అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోలేదని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. రొయ్యల చెరువుల వల్ల చుట్టుపక్కల ఉన్న సారవంతమైన పంట పొలాలు చౌడుబారి పోతున్నాయని, తీవ్ర నష్టాల పాలవుతున్నామని వారు వాపోతున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా చెరువులు తవ్వేసినా, అధికార పార్టీ నాయకులు కావడంతో అధికారులు పట్టించుకోవడంలేదని, దీంతో తమ పొలాలు నాశనమవుతున్నాయని గగ్గోలు పెడుతున్నారు. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం ఆ భూములకు సంబంధించి కొన్ని సంవత్సరాలుగా లీజు రావడం లేదు. కొన్నేళ్లుగా శిస్తు చెల్లించడం లేదు. ఇటీవల ఆ భూములను లీజుకు ఇచ్చేందుకు వేలం వేయాలని ప్రయత్నించగా, ఎవరో ఆక్రమించుకుని రొయ్యల చెరువులు తవ్వినట్లు మా దృష్టికి వచ్చింది. దీనిపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు న్యాయస్థానంలో కేసు వేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. పిఠాపురంలో ఒక న్యాయవాది ద్వారా న్యాయపరమైన చర్యలకు ఉపక్రమిస్తున్నాం. – ఎ.నరసింహన్, దేవాదాయ శాఖ అధికారి, అరుణ్ముగు ఆదికేశవ పెరుమాళ్ శ్రీభాస్కరాచార్య స్వామివారి ఆలయం, శ్రీపెరంబుదూర్, తమిళనాడు అవి దేవుడి భూములే, ఆచెరువులు అక్రమ చెరువులే తమిళనాడు దేవస్థానానికి చెందిన భముల్లో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా రొయ్యల చెరువులు తవ్వినట్లు గుర్తించాము. ఈవిషయాన్ని ఆదేవస్థానం అధికారులకు నోటీసులు పంపించాము. ఆభూముల్లో రొయ్యల చెరువులు ఉండగా రెవిన్యూ రికారుండల్లో పంట భూములుగానే ఉన్నాయి. దీనిపై ప్రభుత్వానికి నివేదికలు పంపించాము. రెవిన్యూ శిస్తు సైతం గత మూడేళ్లుగా చెల్లించడం లేదు. పలుమార్లు నోటీసులు పంపినా సమాధానం లేదు. – బి.సుగుణ, తహసీల్దార్, పిఠాపురం -
సేంద్రియ ఆక్వా సాగుకు ఎంపెడా సమాయత్తం!
చేపలు, రొయ్యల సాగులో సేంద్రియ పద్ధతులను ప్రోత్సహించడానికి సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ(ఎంపెడా) సమాయత్తమవుతున్నది. సేంద్రియ ఆక్వా సాగులో ఖర్చు పెరుగుతుంది కాబట్టి సాధారణంగా ఆక్వా రైతులు వెనుకడుగు వేస్తుంటారు. అయితే, సేంద్రియ ఆక్వా ఉత్పత్తులకు 15 శాతం అధిక ధర చెల్లించి కొనుగోలు చేయడానికి విదేశీ సంస్థలు ముందుకొస్తున్నందున ఇక మీదట ఆ ఇబ్బంది ఉండబోదని ఎంపెడా చైర్మన్ ఎ.జయతిలక్ అంటున్నారు. స్విట్జర్లాండ్‌కు చెందిన అతిపెద్ద వినియోగదారుల సహకార సంస్థ ‘కూప్ కో–ఆపరేటివ్’కు అత్యంత నాణ్యమైన సేంద్రియ ఆక్వా సాగు, అంతర్జాతీయ సేంద్రియ ఆక్వా సర్టిఫికేషన్ పద్ధతులు తదితర అంశాల్లో పాతికేళ్ల అనుభవం ఉంది. గోవాలో ఇటీవల జరిగిన అంతర్జాతీయ సీఫుడ్ షో–2018లో కూప్ కోఆపరేటివ్‌తో ‘ఎంపెడా’ అవగాహన కుదుర్చుకుంది. దేశీయంగా ఆక్వా సంస్థలు, రైతులతో సేంద్రియ ఆక్వా సాగు చేయించడంతోపాటు 15% అదనపు ధరకు కొనుగోలు చేయడానికి కూప్ కో–ఆపరేటివ్ అంగీకరించిందని ఎంపెడా చైర్మన్ తెలిపారు. సేంద్రియ సాగుకు సీడ్‌ను అందించేందుకు హేచరీ, మేత తయారీ కర్మాగారం, సేంద్రియ సాగు పద్ధతులపై సాంకేతిక సహకారం, శిక్షణ, దేశ,విదేశీ మార్కెట్ల కోసం సర్టిఫికేషన్, ఒప్పంద కొనుగోళ్లు.. వీటన్నిటిలోనూ ఆ సంస్థ తోడ్పాటును అందించనుంది. వియత్నాంలో సేంద్రియ ఆక్వా సాగును ప్రోత్సహిస్తున్న కూప్ కో–ఆపరేటివ్.. దిగుమతి చేసుకున్న ఆక్వా ఉత్పత్తులను స్విట్జర్లాండ్‌లో తన 2,200 అవుట్లెట్ల ద్వారా విక్రయిస్తోంది. -
కోనసీమపై ఆక్వాపంజా
-
ఏరొయ్యలో ఏ"మందో"..!
భీమవరం టౌన్ : లొట్టలేసుకుని తినే రొయ్యల్లో ఏ ‘మందో’ తెలియదు. రొయ్యల్లో యాంటీ బయోటిక్స్ మనకు తెలియకుండా శరీరంలోకి ప్రవేశిస్తున్నా గుర్తించే వ్యవస్థ లేదు. జిల్లాలో ఆక్వా సాగులో యాంటీ బయోటిక్స్‌ను విచ్చలవిడిగా వినియోగిస్తూ వేలాది టన్నుల రొయ్యలు ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నా పట్టించుకునే వారు లేరు. ప్రజారోగ్యంతో చెలగాటమాడే మందులను తయారు చేసే సంస్థలపై చర్యలు లేవు. నిషేధిత యాంటీయోటిక్స్ గురించి అవగాహన లేని రైతులు దుకాణాల నుంచి వాటిని ద్రావణం, పొడి రూపంలో తెచ్చి చెరువుల్లో వినియోగిస్తున్నారు. ఇలా ఉత్పత్తి అయిన రొయ్యలు విదేశాలకు ఎగుమతి కాగా అక్కడ అవశేషాలను గుర్తించి తిరిగి పంపుతున్నారు. ఇలా ‘పశ్చిమ’ రొయ్యలను విదేశాలు తిరిగి వెనక్కి పంపడం కొత్తేమికాకపోయినా ఈ ఏడాది అమెరికా, యూరోపియన్ దేశాలు తిరస్కరించిన రొయ్యల కంటైనర్లలో 11 జిల్లాకు చెందినవి కావడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో కంటైనర్లు తిరిగి వచ్చినా ఒకేసారి ఇంత సంఖ్యలో ఎన్నడూ జరగలేదు. దశాబ్దన్నర క్రితం ఆస్ట్రేలియా మన రొయ్యల్లో యాంటీబయోటిక్స్ అవశేషాలను గుర్తించి ఇప్పటికీ దిగుమతి చేసుకోవడం లేదు. యాంటీబయోటిక్స్ అంటే.. యాంటీ బయోటిక్స్ అంటే కొన్ని జాతుల సూక్ష్మజీవులతో వాటి జీవన ప్రక్రియ ఆధారంగా తయారుచేసే రసాయనిక పదార్థాలు. మిగిలిన సూక్ష్మజీవుల పెరుగుదల ప్రక్రియను ఇవి నియంత్రిస్తాయి. వాటి ప్రభావం 21 రోజుల వరకూ ఉంటుంది. ప్రస్తుతం ఉంటున్న యాం టీబయోటిక్స్ ప్రభావం అంతకు మించి చూపుతోంది. యాంటీబయోటిక్స్ వాడిన రొయ్యలను తినడం ద్వారా అవి మానవ శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. రోగాలు తప్పవు క్లోరామ్ఫెనికాల్, ప్యూరాజోలిడాన్ తదితర మందుల వల్ల ఆప్లాస్టిక్ ఎనీమియా తరహా వ్యాధులు వస్తాయి. జీర్ణకోశంలో ఇబ్బందులు, ఎముక మూలుగులో రక్తం తయారీ నిలిచిపోతోంది. క్రమంగా రక్తహీనతకు గురవుతాం. నిషేధిత యాంటీబయోటిక్స్ శరీరంలో ఉండటం వల్లన మరే మందులు పనిచేయవు. చివరకు క్యాన్సర్‌కు దారి తీస్తుందని వైద్య నిపుణులు ఇప్పటికే గుర్తించారు. దీంతో 20 రకాల యాంటీ బయోటిక్స్‌ను ఆక్వా సాగులో నిషేధించారు. పరిజ్ఞానం.. అంతంతమాత్రం రొయ్యల ఉత్పిత్తిలో యాంటీబయోటిక్స్ అవశేషాలను గుర్తించే పరిజ్ఞానం అంతంతమాత్రంగా ఉంది. పట్టుబడికి ముందు ఫ్రీ హార్వెస్ట్ టెస్ట్ (పీహెచ్‌టీ) చేస్తారు. ఎంపెడా ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఏడు చోట్ల ఇటువంటి ప్రయోగశాలలున్నాయి. భీమవరం ఒకటి, నెల్లూరులో (లిక్విడ్ క్రొమిటోగ్రఫీ మాస్ స్పెక్ట్రోమెట్రిక్) ఒకటి ప్రయోగశాలలు ఉన్నాయి. అనుమతి లేకుండా.. రొయ్యలకు మేలు చేసేందుకు నీటిలో, మేతలో, చెరువు నేలలో వాడే ప్రోబయోటిక్స్ ఉన్నాయి. ఈ పేరు చెప్పి యాంటీబయోటిక్స్ కలిపిన వాటి అమ్మకాలు సాగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సరైన ప్రమాణాలు పా టించకుండా హేచరీల్లో రొయ్య పిల్లల ఉత్పత్తి వల్ల కూడా యాంటీ బయోటిక్ అవశేషాలు కనిపిస్తున్నాయి. పొలాల్లో పురుగుమందుల వాడకంతో వ్యర్థ జలాలు పంట కాలువలు, బోదెల్లోకి ప్రవేశించడం, ఆ నీరు రొ య్యల చెరువులకు మళ్లించడం వల్ల కూడా యాంటీ బయోటిక్స్ అవశేషాలు కనిపిస్తున్నట్టు గుర్తించారు. 20 రకాలపై నిషేధం ఆక్వా ఉత్పత్తుల పెంపకంలో వాడకంపై నిషేధం ఉన్న యాంటీబయోటిక్స్ మందులు, రసాయనాలు ఇవి క్లోరామ్ ఫెనికాల్ ∙నెట్రోప్యూరాన్స్, ప్యూరాజోలిడాన్, నెట్రోప్యూరాజోన్, ప్యూరాల్టోడాన్, నెట్రో ప్యూరాన్టాయిన్, ప్యూరైల్ప్యూరామైడ్, నెప్యూరటల్, నెపురోగ్జిమ్, నైఫర్ప్రజైన్, వాటి నుంచి వచ్చే ఉత్పాదనలు నియోమైసిన్ నాలిడిక్సిక్ ఆసిన్ సల్ఫా మిథాక్వోజిల్ అరిస్టాలోకియా జాతి మొక్కల నుంచి తయారు చేసిన మందులు క్లోరోఫాం క్లోర్ప్రోమజైన్ కోల్చిసిన్ డాప్సోన్ డైమిట్రీ డాజోల్ మెట్రోనిడాజోల్ రోనిడాజోల్ ఇప్రాని డాజోల్ ఇతర నైట్రోమిడాజోల్స్ క్లెన్ బ్యుటరాల్ డైఇథైల్ స్టిల్ బిన్స్టిరాల్ æ సల్ఫోనమైడ్ (అనుమతించబడని సల్ఫాడైమిథాక్సిన్, సల్ఫాబ్రోమో మిథాజైన్, సల్ఫా ఇథాక్సి, పైరిడాజైన్) ఫ్లోరిక్వినోలోన్స్ గ్లైకోపిప్టిడ్స్ -
తిలాపియా.. ఏం చేయాలయా!
ఐదు దేశాల్లోని చేపలకు వైరస్ నిర్ధారణ ► భారత్ సహా ఇతర దేశాలు అప్రమత్తం ► ఎలా సోకుతుంది.. వ్యాప్తి ఎలాపై పరిశోధన ► ప్రపంచ ఆక్వా సాగులో తిలాపియాది రెండోస్థానం ► కోట్లాది మందికి ఆహారం.. లక్షల మందికి ఉపాధి 2015లో ప్రపంచవ్యాప్తంగా తిలాపియా చేపల ఉత్పత్తి - 6.4 మిలియన్ టన్నులు వీటి విలువ - 66,000 రూ.కోట్లలో సాక్షి, అమరావతి: చేపల చెరువుల్లో కల్లోలం.. తిలాపియా చేపలకు వైరస్.. పెంపకందార్ల అయోమయం.. ప్రపంచంలో ఎక్కువగా తినే చేప జాతుల్లో ఒకటైన తిలాపియాకూ వైరస్ సోకడం పెంపకందారులను కుదిపేస్తుంది. ప్రజారోగ్యానికి ప్రస్తుతానికి ఎలాంటి ముప్పులేనప్పటికీ చేపల పెంపకంలో భారీ నష్టాలతో పాటు పౌష్టికాహారానికి తిప్పలు తప్పని పరిస్థితి. ఇప్పటికే ఈ వైరస్ ఐదు దేశాలను వణికిస్తోంది. మిగతా దేశాలు అప్రమత్తంగా ఉండాలని ఇవి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఇది ఎలా సోకుతుందన్నది, ఎలా వ్యాపిస్తుందీ ఇంకా నిర్ధారణ కాలేదు. ఇజ్రాయెల్ వైరస్ నిరోధానికి వ్యాక్సిన్‌ను కనిపెట్టే పనిలో పడింది. ఏఏ దేశాల్లో.. ప్రస్తుతం మూడు ఖండాలలోని ఐదు దేశాలలో తిలాపియా చేపలకు వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. కొలంబియా, ఈక్విడార్, ఈజిప్ట్, ఇజ్రాయెల్, థాయ్‌ల్యాండ్ దేశాలలో వైరస్‌ను గుర్తించారు. థాయ్‌ల్యాండ్‌లో ఈ వైరస్ వల్ల 90 శాతం వరకు తిలాపియా చేపలు చనిపోయాయి. ఇదే తొలిసారి... ఎక్కడి నుంచైనా చేపల్ని ఎగుమతి చేసేటప్పుడు ఐస్‌లో పెట్టి గడ్డకట్టించి మరీ పంపుతారు. ఇలా పంపే చేపల ద్వారా వైరస్ సోకుతుందా లేదా? అనే విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. అయితే తిలాపియాకు వైరస్ రావడం ఇదే తొలిసారి. వైరస్ సోకితే... వైరస్ సోకి¯è చేపలు తిండి తక్కువÐè తింటాయి. కదలిక తక్కువగా ఉంటుంది. మచ్చలు, పుండ్లు ఏర్పడతాయి. కళ్లు మూతలు పడుతుంటాయి. చూపు మందగిస్తుంది. దీన్ని ఆర్థోమైక్సోవిరిడియా (ఇదో వైరల్ వ్యాధి. వేగంగా సోకుతుంది)కు చెందిన వైరస్‌గా నిర్ధారించారు. ప్రజారోగ్యానికి ముప్పు లేనట్లే.. ప్రస్తుతానికి ప్రజారోగ్యానికి ఎటువంటి ముప్పు లేనప్పటికీ ఈ బెడద భవిష్యత్తులో మరింత తీవ్రమవుతుందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. దీంతో తిలాపియా దిగుమతి చేసుకునే దేశాలు అప్రమత్తమయ్యాయి. ప్రమాద నివారణ చర్యలు చేపట్టాయి. వ్యాధి నిర్ధారణ పరీక్షలు మెుదలుపెట్టాయి. విదేశాల నుంచి వచ్చిన చేపల్ని పరీక్షించడం, తాత్కాలిక నివారణ చర్యల్ని రూపొందించడం మొదలయ్యాయి. జీఐఈడబ్ల్యూఎస్ హెచ్చరిక... ముందస్తు హెచ్చరిక వ్యవస్థ (జీఐఈడబ్ల్యూఎస్) తిలాపియా పెంచే దేశాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తిలాపియాను పెంచే సరస్సులను, చెరువులను తరచూ తనిఖీ చేస్తూ ఎప్పటికప్పుడు రక్షణ చర్యలు చేపట్టాలని సలహా ఇచ్చింది. తిలాపియాది రెండో స్థానం... ప్రపంచంలోనే అత్యధికంగా సాగు చేసే ఆక్వా జాతుల్లో తిలాపియా రెండోది. ఈ సాగుతో కోట్ల మందికి ఆహారంతో పాటు లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. ఏ వ్యాధిని అయినా తట్టుకుని పెరిగే ఆక్వా జాతుల్లో తిలాపియా ఒకటి. ప్రత్యేకించి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని బడుగు బలహీన వర్గాలకు పౌష్టికాహారాన్ని అందించడంలో ఈ చేపది కీలక పాత్ర. భారత్‌లో తిలాపియా... కొన్ని షరతులతో తిలాపియా సాగును ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అనుమతి తెలిపింది. ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒడిశాలో సాగు చేస్తున్నారు. హెక్టార్‌కు 5 టన్నుల వరకు దిగుబడిని పొందుతున్నారు. కిలో సగటు ధర రు.150 నుంచి రూ.200 వరకు పలుకుతుంది. -
ఆక్వా సాగు అంపశయ్యపై..
⇒ సాగుకు సహకరించని వాతావరణం ⇒ శీతాకాలంలో పెరిగిన వ్యాధుల ఉధృతి ⇒ ఖాళీ అవుతున్న చెరువులు.. తగ్గిపోతున్న సాగు విస్తీర్ణం ⇒ మూతపడిన రొయ్య పిల్లల ఉత్పత్తి కేంద్రాలు ⇒ నాడు డాలర్లు కళ్లజూసిన రైతులు నేడు అప్పుల పాలు జిల్లాలో ఆక్వా సాగు తీవ్ర సంక్షోభంలో పడింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఆక్వారంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ప్రధానంగా రొయ్యలకు వైట్‌స్పాట్, స్లోమార్టాల్టీ, ఇబ్రాయిసిస్ వ్యాధులు పడగనీడలా వెంటాడుతున్నాయి. వీటి నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. శీతాకాలంలో రొయ్యలపై వ్యాధుల ఉధృతి మరింత పెరగడంతో రైతులకు సాగు కత్తిమీద సాములా తయారైంది. బాపట్ల: రెండు దశబ్దాల క్రితం జిల్లాలో ఆక్వారంగం టైగర్ రొయ్యల సాగు విదేశీమారక ద్రవ్యంతో డాలర్ల పంట పండించింది. ఆక్వా రైతుల ఇంట సిరుల వాన కురిపించింది. అనంతరం రొయ్యలను అంతుచిక్కని వ్యాధులు వెంటాడాయి. రొయ్యల మార్కెట్‌ను దెబ్బతినడం ప్రారంభమైంది. తొలిదశలో లక్షల రూపాయలు ఆర్జించిన రైతులు అప్పుల ఊబిలో కురుకుపోయారు. క్రమంగా రొయ్యల సాగు విస్తర్ణం తగిపోయింది. వందలాది చెరువులు ఖాళీ అయ్యాయి. వెనామీ సాగుతో కొంత ఊరట.. ఐదేళ్ల క్రితం వచ్చిన వెనామీ రకం ఆక్వా రైతుల్లో మళ్లీ ఆశలను చిగురింపచేసింది. వ్యాధులను తట్టుకోవటంతోపాటు భారీగా లాభాలను తెచ్చిపెట్టింది. ఈసాగువైపు అధికశాతం ఆక్వా రైతులు మొగ్గు చూపారు. రెండేళ్ల క్రితం విదేశాల్లో ఆక్వా సాగు ప్రతికూలత కారణంగా దేశీయంగా మనదేశానికి చెందిన ఆక్వా రంగానికి బాగాా కలిచొచ్చింది. రికార్డుస్థాయిలో ధరలు లభించాయి. దీంతో వేలంవెర్రిగా వెనామీ రొయ్యల సాగు చేపట్టారు. గతంలో పాడుపడిన చెరువులు సైతం వెనామీ రొయ్యల సాగుకు నోచుకున్నాయి. ఆ తరువాత సీజన్‌కు పరిస్థితి పూర్తి భిన్నంగా మారింది. ధరలు పూర్తిగా పడిపోవటంతో రైతులు తీవ్రంగా నష్టపోయ్యారు. మళ్లీ ఇప్పుడు శీతాకాలం సాగు వెనామీ సాగుకు ప్రతికూలంగా మారింది. వెనామీపై రైతులు పెట్టుకున్న ఆశలు ఆడియాసలయ్యాయి. తట్టుకోలేని విధంగా ఈరకంపై వైట్‌స్పాట్ విజృంభించటంతో చెరువులు నామరూపాల్లేకుండాపోతున్నాయి. ఇప్పటికే కొందరు రైతులు ప్రస్తుత తరుణంలో వెనామీ సాగు చేసి హెక్టారుకు మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు నష్టపోతున్నారు. మళ్లీ టైగర్ వైపు చూపు.. వెనామీ రొయ్యకు ప్రతికూల పరిస్థితులు వెన్నాడటంతో శీతాకాలం రొయ్యల సాగుకు స్వస్తి చెబుతున్నారు. చెరువులు ఆరబెట్టి మళ్లీ మేలురకం టైగర్ రొయ్యపిల్లతో సాగు చేసేందుకు చెరువులను సిద్ధం చేసుకుంటున్నారు. రొయ్యపిల్లలు ఉత్పత్తి రాష్ర్టంలో ఆశించిన మేర అందుబాటులో లేకపోవటంతో పాండిచ్చేరి ప్రాంతం నుంచి టైగర్ రొయ్యపిల్లలను తెచ్చుకునే ఆలోచనలో ఉన్నారు. దీని కోసం ఒక్కొక్క పిల్లను 40 నుంచి 60 పైసలు చెల్లించి దిగుమతి చేసుకునేందుకు ముందుగానే ఆడ్వాన్సులు చెల్లిస్తున్నారు. ఊరిస్తున్న ధరలు.. ఆక్వా రంగంలో ఉత్పత్తి గణనీయంగా ఉంటే ధరలు పడిపోతున్నాయి. ధరలు గణంగా ఉంటే ఉత్పాత్తి నామమాత్రంగా ఉంటుంది. ఈదశలో రైతాంగం కొట్టుమిట్టాడటంతోపాటు ధరలను దళారీలు నిర్ణయిస్తున్నారు. రైతులు పండించిన రొయ్యలకు ధర విషయంలో భరోసా లేకుండాపోతుంది. ప్రస్తుతం వెనామీ 30 కౌంట్ ధర రూ.500 నుంచి రూ.540 పలుకుతోంది. అదే 40 కౌంట్ ధర రూ.450, 50 కౌంట్ వస్తే రూ.400పైనే ధర ఉంది. అయితే ప్రతికూల వాతావరణం వైట్‌స్పాట్ వ్యాధి రైతుల ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. పెట్టుబడులు తేలక రైతులు నష్టాలబాటలో పయనిస్తున్నారు. ప్రభుత్వం ప్రోత్సాహం లేదు ప్రభుత్వం నుంచి ఆక్వారంగానికి ప్రోత్సాహం లేదు. విదేశీమారక ద్రవ్యం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఈరంగంపై చిన్నచూపు చూస్తోంది. సూర్యలంకలో రొయ్యపిల్లల ఉత్పత్తి కేంద్రం మూలన పడిపోయింది. గత ప్రభుత్వం హయాంలో బాపట్ల మార్కెట్‌యార్డులో రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని పంపిన ప్రతిపాదనలు పురోగతికి నోచుకోలేదు. రొయ్యలకు సోకే వ్యాధులకు సంబంధించి నిర్ధారణ చేసే ప్రభుత్వ నిపుణులు లేక ప్రైవేటు నిపుణులపై ఆధారపడాల్సి వస్తోంది. ఆక్వా చెరువులో రహదారి మార్గాలు సక్రమంగా లేకపోవటం, మురుగునీటి పారుదల ఇబ్బందిగా ఉండటంతో వ్యాధులు త్వరగా సోకుతున్నాయి.ప్రభుత్వం ఆక్వా అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి. - మంతెన గంగరాజు, ఆక్వా రైతు సబ్సిడీపై సోలార్ పంపు సెట్లు ఆక్వారంగాన్ని ప్రోత్సాహించేందుకు, విద్యుత్ సమస్యను నివారించేందుకు సోలార్పంపుసెట్లను 85శాతం సబ్సిడీ రైతులకు అందిస్తున్నాం. రూ.4.80లక్షలు విలువ చేసే సోలార్పంపుసెట్లుకు కేవలం 15శాతం రైతు చెల్లించగలిగితే ఆయూనిట్ను ప్రభుత్వం ద్వారా అందిస్తాం.రూ. 40విలువ చేసే ఎరియేటర్లు ఒక రైతుకు నాలుగు 50శాతం సబ్సిడీపై అందిస్తారు. రూ.16వేలు విలువ చేసే సొలార్లైట్ 50శాతం సబ్సిడీపై రైతులకు అందిస్తాం. - ఉషాకిరణ్, ఎఫ్‌డీవో -
తగ్గిన చికెన్, చేపల విక్రయాలు
=కార్తీక మాసం ఎఫెక్ట్ = చేపల ఎగుమతులు 30 శాతం తగ్గుముఖం = చిక్కిన చికెన్ ధర సాక్షి, మచిలీపట్నం : జిల్లాలో కోడిమాంసం, చేపల విక్రయాలు భారీగా తగ్గిపోయాయి. హిందువులు పరమ పవిత్రంగా భావించే కార్తీక మాసం ప్రభావం వీటి విక్రయాలపై పడింది. సాధారణంగా ఈ మాసంలో హిందువుల్లో చాలామంది శాకాహారమే తీసుకుంటారు. అయ్యప్ప, భవానీ దీక్షాధారణలు ఈ మాసంలో ఎక్కువగా ప్రారంభమవటం కూడా దీనికి మరో కారణం. ఎగుమతులు తగ్గిపోవటంతో పాటు స్థానికంగాను వినియోగం పడిపోవడంతో మార్కెట్లో వాటి ధరలు చిక్కిపోతున్నాయి. జిల్లాలో చేపలు, కోడి మాంసం విక్రయాలు దాదాపు 30 నుంచి 50 శాతం వరకు తగ్గిపోయినట్లు అంచనా వేస్తున్నారు. తగ్గిన చేపల ఎగుమతులు... కృష్ణాజిల్లాలో సుమారు లక్ష ఎకరాల్లో చేపలు, 40 వేల ఎకరాల్లో రొయ్యలు సాగవుతున్నట్లు అనధికారిక అంచనా. పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 1.70 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. ఈ రెండు జిల్లాల నుంచి రోజువారీగా 150 లారీల వరకు చేపలు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. చేపలు ఎగుమతి అయ్యే పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, అస్సాం తదితర రాష్ట్రాల్లో దసరా నవరాత్రులు, దీపావళి సమయంలో ఆల్‌ఖతా (జమా, ఖర్చుల చిట్టాలు పూర్తిచేసే) పద్ధతిని పాటిస్తారు. కార్తీక మాసాన్ని కూడా ఆయా రాష్ట్రాల్లో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. దీంతో దసరా సమయంలో దేవీ నవరాత్రులకు ఐదురోజుల ముందునుంచే కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి చేపల ఎగుమతులు తగ్గిపోతాయి. దీపావళి సమయంలో నిర్వహించే ఆల్‌ఖతా సందర్భంలోనూ ఆయా రాష్ట్రాల్లో దిగుమతులను నిలిపివేస్తారు. ఇదేవిధంగా కార్తీకమాసం మొదలయ్యే ఐదురోజుల ముందునుంచి చేపల విక్రయాలు ఆయా రాష్ట్రాల్లో తగ్గిపోతాయి. దీంతో ఈ మూడు సందర్భాల్లోనూ కృష్టా, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి చేపల ఎగుమతులపై ప్రభావం పడుతోంది. దీంతో కొద్దిరోజులుగా ఈ రెండు జిల్లాల నుంచి రోజుకు 100 నుంచి 120 వరకు మాత్రమే చేపలలోడు లారీలు వెళుతున్నట్లు చేపల రైతుల సంఘ జిల్లా అధ్యక్షుడు ముదునూరి సీతారామరాజు ‘సాక్షి’కి చెప్పారు. రొయ్యలు ఇతర దేశాలకు ఎగుమతి అవుతుండటంతో వాటిపై స్థానిక మార్కెట్లో మినహా ఈ ప్రభావం పెద్దగా కనిపించటం లేదు. చేప ధరకు దెబ్బ... ఎగుమతులు తగ్గిపోవడంతో చేపల ధరపై ప్రభావం పడుతోందని రైతులు చెబుతున్నారు. డిమాండ్ లేదని, ఎగుమతులు తగ్గిపోయాయని రకరకాల కారణాలు చెప్పి వ్యాపారులు వీటి ధరను తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండగ సీజన్లలో చేపల విక్రయాలు తగ్గిపోవటం వల్ల కూడా వీటి ధరపై ప్రభావం పడుతోంది. ఇటీవల బొచ్చె రకం చేప కేజీ ధర రైతు వద్ద రూ.120 వరకు పలకగా, తాజాగా అది రూ.90 నుంచి 110 వరకు మాత్రమే పలుకుతోంది. స్థానిక మార్కెట్లోనూ వీటికి సరైన ధర దక్కటం లేదు. డిమాండ్ లేకపోవటంతో చెరువుల్లోనే చేపలను ఉంచి అవసరమైన మేరకే స్థానిక మార్కెట్‌కు తీసుకురావటం ద్వారా రైతులు ధర దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు. చిక్కిన చికెన్ ధర... జిల్లాలో చికెన్ ధర అమాంతరం పడిపోయింది. జిల్లాలో మామూలు రోజుల్లో సుమారు 50 వేల కిలోలు, అదే ఆదివారం రోజున లక్ష కిలోలు చొప్పున చికెన్ విక్రయాలు జరుగుతుంటాయి. కార్తీక మాసం కావటంతో ప్రస్తుతం జిల్లాలో చికెన్ విక్రయాలు దాదాపు 45 శాతం పడిపోయాయి. దీంతో రిటైల్ మార్కెట్లో కిలో రూ.190 వరకు పలికిన చికెన్ ధర కార్తీకమాసంలో రూ.130కు పడిపోయింది. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో రూ.100కు కూడా చికెన్ అమ్మకాలు నిర్వహించారు. మటన్ ధరలో మాత్రం ఎలాంటి మార్పూ లేకపోవటం గమనార్హం.