మీసం మెలేసేందుకు ‘టైగర్‌’ రెడీ | Permission to produce Tiger prawns in 6 hatcheries across country | Sakshi
Sakshi News home page

మీసం మెలేసేందుకు ‘టైగర్‌’ రెడీ

Published Sun, Jan 23 2022 5:01 AM | Last Updated on Sun, Jan 23 2022 5:01 AM

Permission to produce Tiger prawns in 6 hatcheries across country - Sakshi

సాక్షి, అమరావతి: రెండు దశాబ్దాల క్రితం వరకు అంతర్జాతీయ ఆక్వా మార్కెట్‌లో మీసం మెలేసిన ‘ఆంధ్రా టైగర్‌’ రొయ్యలకు పూర్వవైభవం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాధిరహిత (స్పెసిఫిక్‌ పాత్‌ జోన్‌ ఫ్రీ బ్రూడర్స్‌) తల్లి రొయ్యలను దిగుమతి చేసుకుని.. వాటిద్వారా సీడ్‌ ఉత్పత్తి చేసేందుకు రాష్ట్రంలో ఐదు హేచరీలకు అనుమతి లభించింది. వీటినుంచి డిమాండ్‌కు సరిపడా సీడ్‌ అందుబాటులోకి రానుండడంతో సమ్మర్‌ క్రాప్‌ (వేసవి పంట)లో కనీసం 50 వేల ఎకరాల్లో టైగర్‌ రొయ్యలు సాగవుతాయని అంచనా వేస్తున్నారు. 

ఏపీలో 5 హేచరీలకు అనుమతి
అమెరికాలోని హవాయికి చెందిన ఓ సంస్థ అభివృద్ధి చేసిన ఎస్పీఎఫ్‌ బ్రూడర్స్‌ దిగుమతికి పచ్చజెండా ఊపిన కేంద్ర ప్రభుత్వం వాటిని కోస్టల్‌ ఆక్వాకల్చర్‌ అథారిటీ (సీఏఏ) ద్వారా నెల్లూరులోని వైష్ణవి ఆక్వాటెక్, తమిళనాడులోని యూని బయో (ఇండియా) హేచరీలకు ఇచ్చేందుకు అనుమతించింది. ఇక్కడ ఉత్పత్తి చేసిన సీడ్‌తో గతేడాది గుంటూరు, నెల్లూరు, ఒంగోలు ప్రాంతాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా సాగు చేపట్టి సత్ఫలితాలు సాధించడంతో వనామీ రొయ్యల సాగుకు టైగర్‌ ప్రత్యామ్నాయంగా మారింది. డిమాండ్‌కు తగ్గ సీడ్‌ అందుబాటులో లేకపోవడంతో రెండో పంట సమయంలో నకిలీల బారినపడి రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

వైల్డ్‌ బ్రూడర్స్‌ (సముద్రంలో సహజసిద్ధంగా దొరికే తల్లి రొయ్యల) నుంచి ఉత్పత్తి చేసిన సీడ్‌తోపాటు నకిలీ సీడ్‌ను ఎస్పీఎఫ్‌ బ్రూడర్‌ సీడ్‌గా అంటగట్టి దళారులు సొమ్ము చేసుకున్నారు. వీరికి అడ్డుకట్ట వేసేందుకు రంగంలోకి దిగిన సీఏఏ రాష్ట్ర మత్స్య శాఖతో కలిసి ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం చేయాల్సి వచ్చింది. నకిలీలకు చెక్‌ పెట్టడంతోపాటు టైగర్‌ రొయ్యల సాగును ప్రోత్సహించాలన్న సంకల్పంతో మరిన్ని హేచరీలకు అనుమతి ఇవ్వాలని సీఏఏ నిర్ణయించింది. కొత్తగా ఏపీకి చెందిన రెండు హేచరీలు, రెండు లార్వా రేరింగ్‌ హేచరీలకు అనుమతి ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో టైగర్‌ బ్రూడర్స్‌ దిగుమతి, సీడ్‌ ఉత్పత్తి కోసం అనుమతి పొందిన హేచరీల సంఖ్య మూడుకు చేరింది.

ఇక్కడ ఉత్పత్తి చేసిన నౌప్లీ (లార్వా) నుంచి సీడ్‌ ఉత్పత్తి చేసే రెండు యూనిట్లకు కొత్తగా అనుమతినివ్వడంతో టైగర్‌ సీడ్‌ ఉత్పత్తి, సాగులో దేశంలోనే ఏపీ కేరాఫ్‌ అడ్రస్‌గా మారబోతుంది. ప్రస్తుతం అనుమతి పొందిన హేచరీలన్నీ వంద మిలియన్‌ సీడ్‌ ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగినవే. అయితే, నిబంధనలకు లోబడే ఇవన్నీ సీడ్‌ ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. సీఏఏ అనుమతి లేకుండా ఇతర హేచరీల్లో సీడ్‌ ఉత్పత్తి చేసినా, అమ్మినా లైసెన్సులు రద్దు చేయడంతోపాటు క్రిమినల్‌ చర్యలు తీసుకుంటారు.

బ్రూడర్స్‌ దిగుమతి.. సీడ్‌ ఉత్పత్తికి అనుమతి పొందిన హేచరీలివీ..
యూని బయో (ఇండియా) హేచరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ముగైయూర్, తమిళనాడు
వైష్ణవి ఆక్వా టెక్, దుగరాజపట్నం, వాకాడు మండలం, నెల్లూరు జిల్లా
మున్నంగి హేచరీస్, రామచంద్రరావుపేట పంచాయతీ, నెల్లూరు జిల్లా
గాయత్రి బయో మెరైన్‌ యూనిట్‌–2, కొత్త ఓడరేవు, బాపట్ల మండలం, గుంటూరు జిల్లా
శ్రీ వైజయంతీ హేచరీస్‌ ఎల్‌ఎల్‌పీ, కారేడు, ఉలవపాడు మండలం, ప్రకాశం జిల్లా
బీకేఎంఎన్‌ ఆక్వా, రాముడుపాలెం, ఇందుకూరుపేట, నెల్లూరు జిల్లా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement