ఆక్వానందం.. ‘టైగర్‌’ రీ ఎంట్రీ | Aquaculture Josh Again In SPSR Nellore District | Sakshi
Sakshi News home page

ఆక్వానందం.. ‘టైగర్‌’ రీ ఎంట్రీ

Published Sat, Jul 9 2022 6:43 PM | Last Updated on Sat, Jul 9 2022 7:05 PM

Aquaculture Josh Again In SPSR Nellore District - Sakshi

పీఎస్‌ఆర్‌ నెల్లూరు జిల్లాలో ఆక్వా సాగుకు మళ్లీ పూర్వవైభవం మొదలైంది. కొన్నేళ్లుగా తీవ్ర ఒడిదొడుకులతో నష్టాలు చవిచూసిన ఆక్వారైతులు ప్రకృతి అనుకూలం, ప్రభుత్వం ప్రోత్సాహంతో క్రమంగా లాభాలు చూస్తున్నారు. గతంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు, భారీగా కరెంట్‌ బిల్లులు, నకిలీల బెడదతో అక్వా సాగు అంటేనే రైతులు హడలెత్తిపోయే పరిస్థితులు ఉండేవి. చాలా మంది రైతులు నష్టాలు భరించలేక పంట విరామం ప్రకటించి సాగుకు దూరమయ్యారు. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆక్వా రంగానికి ప్రాధాన్యతనివ్వడంతో తిరిగి ఊపిరి పోసుకుంది. ఆక్వా సాగుకు విద్యుత్‌ రాయితీలు ప్రకటించడంతో పాటు ఏపీ ఆక్వా కల్చర్‌ యాక్ట్, ఫిష్‌ ఫీడ్‌ క్వాలిటీ కంట్రోల్‌ యాక్ట్‌–2020 ద్వారా నాణ్యమైన సీడ్, ఫీడ్‌కు అవకాశం కల్పించడం, నకిలీలపై ఉక్కుపాదం మోపడంతో జిల్లాలో మళ్లీ నీలివిప్లవం మొదలైంది. 

బిట్రగుంట:  ఆక్వా సాగులో విప్లవం సృష్టించిన జిల్లా మరో ముందడుగు వేసింది. ప్రస్తుతం రాష్ట్రం నుంచి ఎగుమతవుతున్న ఆక్వా ఉత్పత్తుల్లో జిల్లాదే అగ్రస్థానం కావడం విశేషం. ఆక్వా సాగుకు మరింత ప్రోత్సాహం అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రెండేళ్ల నుంచి ఆక్వా సాగుతో పాటు దిగుబడులు, ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయి. ప్రధానంగా కావలి, బోగోలు, అల్లూరు, విడవలూరు, ముత్తుకూరు, ఇందుకూరుపేట, కోట, చిట్టమూరు, వాకాడు, తడ, తదితర మండలాల్లో వెనామీ రొయ్యల సాగు ఊపందుకుంది. ఆయా మండలాల పరిధిలో సుమారు 20 వేల హెక్టార్లకు పైగా రొయ్యల సాగు జరుగుతున్నట్లు అంచనా. గడిచిన రెండేళ్లలోనే సాగు విస్తీర్ణం 20 శాతానికి పైగా పెరిగినట్లు ఆక్వా రైతులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆక్వా రంగానికి విద్యుత్‌ భారం తగ్గించడంతో సాగు వేగంగా ఊపందుకుంది. ఆక్వా విద్యుత్‌ సర్వీసులకు యూనిట్‌ 1.50 పైసలకే సరఫరా చేస్తుడడంతో రైతులకు లక్షల్లో ఆర్థిక ఊరట లభించింది. ఇప్పటి వరకు ఐదెకరాలకు మాత్రమే వర్తించే విద్యుత్‌ సబ్సిడీని ప్రభుత్వం పదెకరాలకు పెంచడంతో యువ రైతులు కూడా ఆక్వా సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో పాటు ఏపీ ఫిష్‌ ఫీడ్‌ (క్వాలిటీ కంట్రోల్‌) చట్టం, ఆంధ్రప్రదేశ్‌ ఆక్వా కల్చర్‌ సీడ్‌ (క్వాలిటీ కంట్రోల్, సవరణ) చట్టాలను తీసుకురావడంతో నకిలీ సీడ్, ఫీడ్‌లకు అడ్డుకట్ట పడి దిగుబడులు కూడా పెరిగాయి.  

క్షేత్ర స్థాయిలో అండగా ప్రభుత్వం  
ఆక్వా సాగు చేస్తున్న రైతులకు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. సాగులో మెళకువలు, ఆధునిక పద్ధతులు, నకిలీలను గుర్తించడం, తదితర అంశాలపై ఆర్బీకేల ద్వారా విస్తృతంగా అవగాహనా కార్యక్రమాలు కల్పించింది. సచివాలయాల స్థాయిలో ‘ఈ–ఫిష్‌’ బుకింగ్‌ చేసి వైఎస్సార్‌ మత్స్య పొలంబడి ద్వారా ఆక్వా రైతులకు అవగాహన కల్పిస్తోంది. గతంలో రొయ్యల సాగుకు అనుమతుల కోసం ఆక్వా రైతులు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగేవారు. ప్రస్తుతం అధికారులే నేరుగా ఇంటి వద్దకు వచ్చి వివరాలు నమోదు చేసుకుని అనుమతులు మంజూరు చేస్తుండడం, విద్యుత్‌ రాయితీలు లభిస్తుండటంతో రైతులు ఉత్సాహంగా సాగుకు శ్రీకారం చుడుతున్నారు. నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్‌ ఇంటిగ్రేటెడ్‌ ఆక్వా ల్యాబ్‌లను తీసుకు వస్తుండడంతో రైతులకు మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆక్వా ల్యాబ్‌ల ద్వారా వాటర్, సాయిల్, మైక్రోబయాలజీ, ఫీడ్‌ అనాలసిస్‌ పరీక్షలు ఆక్వా రైతులకు అందుబాటులో ఉంటాయి. ల్యాబ్‌లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే రైతులు అనవసరంగా ప్రోబయాటిక్స్, యాంటీబయాటిక్స్‌ వాడే బాధ తప్పి ఖర్చులు ఆదావుతాయి.    

ఇంటికొచ్చి మరీ అనుమతులు
గతంలో రొయ్యల సాగు చేయాలంటే అనుమతుల కోసం ప్రభుత్వాఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ప్రస్తుతం అధికారులే ఇంటి వద్దకు వచ్చి వివరాలు నమోదు చేసుకుని అనుమతులు ఇచ్చేస్తున్నారు. సబ్సిడీ కరెంట్‌ ఇస్తుండటంతో ఖర్చులు కూడా బాగా తగ్గాయి. మా ఏరియాలో సాగు విస్తీర్ణం కూడా బాగా పెరిగింది. ధరలు కూడా గత రెండు సంవత్సరాలుగా ఆశాజనకంగా ఉన్నాయి. 
– గుమ్మడి వెంకటేష్, ఇస్కపల్లి, ఆక్వా రైతు

కరెంటు ఖర్చులు సగం తగ్గాయి
ఆక్వా రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం చాలా బాగుంది. యూనిట్‌ కరెంట్‌ 1.50 పైసలకే ఇస్తుండడంతో కరెంట్‌ ఖర్చులు సగానికి తగ్గాయి. కరెంట్‌ సరఫరా కూడా బాగుంది. నేను మూడెకరాలు సాగు చేస్తున్నాను. గతంలో హేచరీలు నాసిరకం సీడ్‌ ఇచ్చేవి. ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టడంతో ఇప్పుడు మంచి సీడ్‌ లభిస్తోంది. ఫీడ్‌ ధరలపైన నియంత్రణ ఉంచితే బాగుంటుంది. 
– బత్తల ఆంజనేయులు, గోగులపల్లి, ఆక్వారైతు  

‘టైగర్‌’ రీ ఎంట్రీ 

రాష్ట్రంలో ఆక్వా రంగానికి పెద్దపీట వేసే దిశగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు వెనామీతో పాటు ‘టైగర్‌’ రొయ్యల సాగుకు కూడా మళ్లీ ఊపిరి పోస్తున్నాయి. వ్యాధి రహిత తల్లి రొయ్యలను (స్పెషిఫిక్‌ పాత్‌ జోన్‌ ఫ్రీ బ్రూడర్స్‌) దిగుమతి చేసుకుని వాటి ద్వారా సీడ్‌ ఉత్పత్తి చేసేందుకు రాష్ట్రంలో ఐదు హేచరీలకు అనుమతులు మంజూరు కాగా వీటిలో మూడు హేచరీలు జిల్లాకు చెందినవే కావడం విశేషం. వీటి ద్వారా డిమాండ్‌కు సరిపడా నాణ్యమైన సీడ్‌ అందుబాటులోకి రానుంది. నకిలీ సీడ్‌కు అడ్డుకట్టకు కూడా ప్రభుత్వం విస్తృతంగా చర్యలు చేపట్టింది. వైల్డ్‌ బ్రూడర్స్‌ (సముద్రంలో సహజ సిద్ధంగా దొరికే తల్లి రొయ్యల) నుంచి ఉత్పత్తి చేసిన సీడ్‌తో పాటు నకిలీ సీడ్‌ను ఎస్పీఎఫ్‌ బ్రూడర్‌ సీడ్‌గా అంటగట్టి దళారులు సొమ్ము చేసుకుంటున్న విషయాన్ని గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టింది. నకిలీలకు అడ్డుకట్ట వేసేందుకు రంగంలోకి దిగిన కోస్టల్‌ ఆక్వా కల్చర్‌ అథారిటీ రాష్ట్ర మత్స్య శాఖతో కలిసి ఆర్బీకేల ద్వారా ఆక్వా రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించింది. టైగర్‌ సాగుకు ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుండటంతో జిల్లాతో పాటు ఒంగోలు, గుంటూరు జిల్లాలో కూడా టైగర్‌ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement