
రెండేళ్ల క్రితం తీరప్రాంతం వెంబడి 7,200 ఎకరాల్లో సాగుచేసిన రైతులు
ఆశాజనకంగా ఉండటంతో పెరుగుతున్న సాగు విస్తీర్ణం
సీడ్ కోసం రెండు నెలల ముందే చెల్లింపులు
సాక్షి, భీమవరం: రెండు దశాబ్దాల క్రితం ఆక్వా రంగంలో రారాజుగా వెలుగొందిన మోనోడాన్ (టైగర్ రొయ్య) మళ్లీ వచ్చేసింది. గత సీజన్‌లో ప్రయోగాత్మకంగా సాగు చేసిన మడగాస్కర్ సీడ్ మోనోడాన్ (Penaeus Monodon) రైతులకు కాసుల వర్షం కురిపించింది. దీంతో తీరం వెంబడి ఈ ఏడాది అధిక శాతం సాగు చేసేందుకు ఆక్వా రైతులు సన్నాహాలు చేస్తున్నారు. ఆక్వాలో 2002 సంవత్సరానికి పూర్వం టైగర్ రొయ్యదే హవా. ఈ రొయ్యకు లోకల్ మార్కెట్‌తోపాటు అంతర్జాతీయంగా ఎగుమతులకు బాగా డిమాండ్ ఉండేది. క్రమంగా టైగర్ రొయ్యపై వైట్‌స్పాట్ వైరస్ దాడి తీవ్రం కావడంతో ఆక్వా రైతులు నష్టాల్లో కూరుకుపోయారు.
ఆ తర్వాత 2011లో వచ్చిన వనామీ (Vannamei Prawn) మూడేళ్లపాటు రైతులకు అధిక లాభాలు తెచ్చిపెట్టింది. ఫలితంగా చాలామంది రైతులు తమ పొలాలను ఆక్వా చెరువులుగా మార్చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సాగు విస్తీర్ణం 4.66 లక్షల ఎకరాలకు పెరగ్గా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే 2.5 లక్షల ఎకరాలు ఉంది. రాష్ట్రంలోని సముద్ర తీరం వెంబడి 1.05 లక్షల ఎకరాల్లో ఉప్పునీటి చెరువులు ఉన్నాయి. వనామీపైనా 2014 నుంచి వైట్ స్పాట్, విబ్రియో, వైట్‌గట్, ఈహెచ్‌పీ వైరస్‌ల దాడి మొదలైంది. రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. ఆక్వా రైతులకు గత వైఎస్సార్‌సీపీ (YSRCP) ప్రభుత్వం అప్సడా ఏర్పాటుచేసి కొండంత అండగా నిలిచింది.
తీరం వెంబడి మొదలైన సాగు
చెన్నైకి చెందిన హేచరీలు మూడేళ్ల క్రితం మడగాస్కర్ ప్రాంతంలోని సముద్ర జలాల నుంచి నాణ్యమైన మేల్, ఫిమేల్ మోనోడాన్ బ్రూడర్స్‌ను సేకరించి సీడ్ ఉత్పత్తిని ప్రారంభించాయి. 2023లో కృష్ణా, పశ్చిమ గోదావరి, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి, కాకినాడ జిల్లాల్లోని సముద్రతీరం వెంబడి 7,200 ఎకరాల్లో మోనోడాన్ సీడ్‌ను రైతులు సాగు చేశారు. వైరస్ బెడద లేకపోవడం, ఆరు నెలల పంట కాలానికి కేజీకి 20 కౌంట్‌తో రూ.1,050 వరకు ధర పలికి మంచి లాభాలు వచ్చాయి. దీంతో గత ఏడాది దాదాపు రెట్టింపు స్థాయిలో ఈ సీడ్‌ను సాగు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని బియ్యపుతిప్ప, చినమైనవానిలంక, దర్భరేవు తదితర ప్రాంతాల్లో 520 ఎకరాల్లో సాగు చేశారు.

ఆరు నెలల్లో అధికంగా 20 కౌంట్ తీయగా, కొందరు ఎనిమిది నెలల కాలానికి 10.5 నుంచి 11 కౌంట్ కూడా తీశారు. సాగు పెట్టుబడులకు రెట్టింపు లాభాలు వస్తుండటంతో ఈ సీజన్‌లో ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఆరు వేల ఎకరాలకు పైగా సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. కాగా, చెన్నైతోపాటు మన రాష్ట్రంలోని ఐదారు హేచరీల్లో మాత్రమే మోనోడాన్ సీడ్ లభిస్తోంది. రొయ్య పిల్ల ధర రూపాయి వరకు ఉంది. ఈ సీడ్ కావాల్సిన రైతులు రెండు నెలల ముందే డబ్బులు చెల్లించి బుకింగ్ చేసుకుంటున్నారు. మోనోడాన్ 15 నుంచి 20 శాతం వరకు ఉప్పు సాంద్రత ఉన్న నీటిలో సాగుకు అనుకూలమని నిపుణులు చెబుతున్నారు.
లాభాలు బాగున్నాయి
గత ఏడాది 12.5 ఎకరాల్లో మడగాస్కర్ సీడ్ మోనోడాన్ సాగుచేసి 10.5 కౌంట్ తీశాను. పెట్టుబడులు పోను రెట్టింపు ఆదాయం వచ్చింది. ఈ ఏడాది మా ప్రాంతంలో చాలామంది రైతులు మోనోడాన్ సీడ్ సాగు చేసేందుకు అప్పుడే హేచరీలకు అడ్వాన్స్‌లు చెల్లించారు.
– వాతాడి కృష్ణారావు, ఆక్వా రైతు, చినమైనవానిలంక, పశ్చిమ గోదావరి జిల్లా
సాగు విస్తీర్ణం పెరుగుతోంది
పశ్చిమ గోదావరి జిల్లాలోని తీర ప్రాంత గ్రామాల చెరువుల్లో రైతులు మోనోడాన్ సీడ్ సాగు చేసి లాభాలు ఆర్జిస్తున్నారు. లాభదాయకంగా ఉండటంతో మిగిలిన రైతులు ఈ సీడ్ సాగుపట్ల ఆకర్షితులవుతున్నారు. తీరప్రాంత గ్రామాల్లో ఈ ఏడాది మోనోడాన్ సాగు విస్తీర్ణం బాగా పెరుగుతుందని అంచనా వేస్తున్నాం.
– ఎన్‌డీవీ ప్రసాద్, మత్స్యశాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment