tiger prawn
-
ఆక్వానందం.. ‘టైగర్’ రీ ఎంట్రీ
పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో ఆక్వా సాగుకు మళ్లీ పూర్వవైభవం మొదలైంది. కొన్నేళ్లుగా తీవ్ర ఒడిదొడుకులతో నష్టాలు చవిచూసిన ఆక్వారైతులు ప్రకృతి అనుకూలం, ప్రభుత్వం ప్రోత్సాహంతో క్రమంగా లాభాలు చూస్తున్నారు. గతంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు, భారీగా కరెంట్ బిల్లులు, నకిలీల బెడదతో అక్వా సాగు అంటేనే రైతులు హడలెత్తిపోయే పరిస్థితులు ఉండేవి. చాలా మంది రైతులు నష్టాలు భరించలేక పంట విరామం ప్రకటించి సాగుకు దూరమయ్యారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆక్వా రంగానికి ప్రాధాన్యతనివ్వడంతో తిరిగి ఊపిరి పోసుకుంది. ఆక్వా సాగుకు విద్యుత్ రాయితీలు ప్రకటించడంతో పాటు ఏపీ ఆక్వా కల్చర్ యాక్ట్, ఫిష్ ఫీడ్ క్వాలిటీ కంట్రోల్ యాక్ట్–2020 ద్వారా నాణ్యమైన సీడ్, ఫీడ్‌కు అవకాశం కల్పించడం, నకిలీలపై ఉక్కుపాదం మోపడంతో జిల్లాలో మళ్లీ నీలివిప్లవం మొదలైంది. బిట్రగుంట: ఆక్వా సాగులో విప్లవం సృష్టించిన జిల్లా మరో ముందడుగు వేసింది. ప్రస్తుతం రాష్ట్రం నుంచి ఎగుమతవుతున్న ఆక్వా ఉత్పత్తుల్లో జిల్లాదే అగ్రస్థానం కావడం విశేషం. ఆక్వా సాగుకు మరింత ప్రోత్సాహం అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రెండేళ్ల నుంచి ఆక్వా సాగుతో పాటు దిగుబడులు, ఎగుమతులు కూడా గణనీయంగా పెరిగాయి. ప్రధానంగా కావలి, బోగోలు, అల్లూరు, విడవలూరు, ముత్తుకూరు, ఇందుకూరుపేట, కోట, చిట్టమూరు, వాకాడు, తడ, తదితర మండలాల్లో వెనామీ రొయ్యల సాగు ఊపందుకుంది. ఆయా మండలాల పరిధిలో సుమారు 20 వేల హెక్టార్లకు పైగా రొయ్యల సాగు జరుగుతున్నట్లు అంచనా. గడిచిన రెండేళ్లలోనే సాగు విస్తీర్ణం 20 శాతానికి పైగా పెరిగినట్లు ఆక్వా రైతులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆక్వా రంగానికి విద్యుత్ భారం తగ్గించడంతో సాగు వేగంగా ఊపందుకుంది. ఆక్వా విద్యుత్ సర్వీసులకు యూనిట్ 1.50 పైసలకే సరఫరా చేస్తుడడంతో రైతులకు లక్షల్లో ఆర్థిక ఊరట లభించింది. ఇప్పటి వరకు ఐదెకరాలకు మాత్రమే వర్తించే విద్యుత్ సబ్సిడీని ప్రభుత్వం పదెకరాలకు పెంచడంతో యువ రైతులు కూడా ఆక్వా సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో పాటు ఏపీ ఫిష్ ఫీడ్ (క్వాలిటీ కంట్రోల్) చట్టం, ఆంధ్రప్రదేశ్ ఆక్వా కల్చర్ సీడ్ (క్వాలిటీ కంట్రోల్, సవరణ) చట్టాలను తీసుకురావడంతో నకిలీ సీడ్, ఫీడ్‌లకు అడ్డుకట్ట పడి దిగుబడులు కూడా పెరిగాయి. క్షేత్ర స్థాయిలో అండగా ప్రభుత్వం ఆక్వా సాగు చేస్తున్న రైతులకు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించే దిశగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. సాగులో మెళకువలు, ఆధునిక పద్ధతులు, నకిలీలను గుర్తించడం, తదితర అంశాలపై ఆర్బీకేల ద్వారా విస్తృతంగా అవగాహనా కార్యక్రమాలు కల్పించింది. సచివాలయాల స్థాయిలో ‘ఈ–ఫిష్’ బుకింగ్ చేసి వైఎస్సార్ మత్స్య పొలంబడి ద్వారా ఆక్వా రైతులకు అవగాహన కల్పిస్తోంది. గతంలో రొయ్యల సాగుకు అనుమతుల కోసం ఆక్వా రైతులు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగేవారు. ప్రస్తుతం అధికారులే నేరుగా ఇంటి వద్దకు వచ్చి వివరాలు నమోదు చేసుకుని అనుమతులు మంజూరు చేస్తుండడం, విద్యుత్ రాయితీలు లభిస్తుండటంతో రైతులు ఉత్సాహంగా సాగుకు శ్రీకారం చుడుతున్నారు. నియోజకవర్గ స్థాయిలో వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ ఆక్వా ల్యాబ్‌లను తీసుకు వస్తుండడంతో రైతులకు మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆక్వా ల్యాబ్‌ల ద్వారా వాటర్, సాయిల్, మైక్రోబయాలజీ, ఫీడ్ అనాలసిస్ పరీక్షలు ఆక్వా రైతులకు అందుబాటులో ఉంటాయి. ల్యాబ్‌లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే రైతులు అనవసరంగా ప్రోబయాటిక్స్, యాంటీబయాటిక్స్ వాడే బాధ తప్పి ఖర్చులు ఆదావుతాయి. ఇంటికొచ్చి మరీ అనుమతులు గతంలో రొయ్యల సాగు చేయాలంటే అనుమతుల కోసం ప్రభుత్వాఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ప్రస్తుతం అధికారులే ఇంటి వద్దకు వచ్చి వివరాలు నమోదు చేసుకుని అనుమతులు ఇచ్చేస్తున్నారు. సబ్సిడీ కరెంట్ ఇస్తుండటంతో ఖర్చులు కూడా బాగా తగ్గాయి. మా ఏరియాలో సాగు విస్తీర్ణం కూడా బాగా పెరిగింది. ధరలు కూడా గత రెండు సంవత్సరాలుగా ఆశాజనకంగా ఉన్నాయి. – గుమ్మడి వెంకటేష్, ఇస్కపల్లి, ఆక్వా రైతు కరెంటు ఖర్చులు సగం తగ్గాయి ఆక్వా రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం చాలా బాగుంది. యూనిట్ కరెంట్ 1.50 పైసలకే ఇస్తుండడంతో కరెంట్ ఖర్చులు సగానికి తగ్గాయి. కరెంట్ సరఫరా కూడా బాగుంది. నేను మూడెకరాలు సాగు చేస్తున్నాను. గతంలో హేచరీలు నాసిరకం సీడ్ ఇచ్చేవి. ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టడంతో ఇప్పుడు మంచి సీడ్ లభిస్తోంది. ఫీడ్ ధరలపైన నియంత్రణ ఉంచితే బాగుంటుంది. – బత్తల ఆంజనేయులు, గోగులపల్లి, ఆక్వారైతు ‘టైగర్’ రీ ఎంట్రీ రాష్ట్రంలో ఆక్వా రంగానికి పెద్దపీట వేసే దిశగా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు వెనామీతో పాటు ‘టైగర్’ రొయ్యల సాగుకు కూడా మళ్లీ ఊపిరి పోస్తున్నాయి. వ్యాధి రహిత తల్లి రొయ్యలను (స్పెషిఫిక్ పాత్ జోన్ ఫ్రీ బ్రూడర్స్) దిగుమతి చేసుకుని వాటి ద్వారా సీడ్ ఉత్పత్తి చేసేందుకు రాష్ట్రంలో ఐదు హేచరీలకు అనుమతులు మంజూరు కాగా వీటిలో మూడు హేచరీలు జిల్లాకు చెందినవే కావడం విశేషం. వీటి ద్వారా డిమాండ్‌కు సరిపడా నాణ్యమైన సీడ్ అందుబాటులోకి రానుంది. నకిలీ సీడ్‌కు అడ్డుకట్టకు కూడా ప్రభుత్వం విస్తృతంగా చర్యలు చేపట్టింది. వైల్డ్ బ్రూడర్స్ (సముద్రంలో సహజ సిద్ధంగా దొరికే తల్లి రొయ్యల) నుంచి ఉత్పత్తి చేసిన సీడ్‌తో పాటు నకిలీ సీడ్‌ను ఎస్పీఎఫ్ బ్రూడర్ సీడ్‌గా అంటగట్టి దళారులు సొమ్ము చేసుకుంటున్న విషయాన్ని గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టింది. నకిలీలకు అడ్డుకట్ట వేసేందుకు రంగంలోకి దిగిన కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ రాష్ట్ర మత్స్య శాఖతో కలిసి ఆర్బీకేల ద్వారా ఆక్వా రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించింది. టైగర్ సాగుకు ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుండటంతో జిల్లాతో పాటు ఒంగోలు, గుంటూరు జిల్లాలో కూడా టైగర్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. -
మీసం మెలేసేందుకు ‘టైగర్’ రెడీ
సాక్షి, అమరావతి: రెండు దశాబ్దాల క్రితం వరకు అంతర్జాతీయ ఆక్వా మార్కెట్లో మీసం మెలేసిన ‘ఆంధ్రా టైగర్’ రొయ్యలకు పూర్వవైభవం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాధిరహిత (స్పెసిఫిక్ పాత్ జోన్ ఫ్రీ బ్రూడర్స్) తల్లి రొయ్యలను దిగుమతి చేసుకుని.. వాటిద్వారా సీడ్ ఉత్పత్తి చేసేందుకు రాష్ట్రంలో ఐదు హేచరీలకు అనుమతి లభించింది. వీటినుంచి డిమాండ్‌కు సరిపడా సీడ్ అందుబాటులోకి రానుండడంతో సమ్మర్ క్రాప్ (వేసవి పంట)లో కనీసం 50 వేల ఎకరాల్లో టైగర్ రొయ్యలు సాగవుతాయని అంచనా వేస్తున్నారు. ఏపీలో 5 హేచరీలకు అనుమతి అమెరికాలోని హవాయికి చెందిన ఓ సంస్థ అభివృద్ధి చేసిన ఎస్పీఎఫ్ బ్రూడర్స్ దిగుమతికి పచ్చజెండా ఊపిన కేంద్ర ప్రభుత్వం వాటిని కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ (సీఏఏ) ద్వారా నెల్లూరులోని వైష్ణవి ఆక్వాటెక్, తమిళనాడులోని యూని బయో (ఇండియా) హేచరీలకు ఇచ్చేందుకు అనుమతించింది. ఇక్కడ ఉత్పత్తి చేసిన సీడ్‌తో గతేడాది గుంటూరు, నెల్లూరు, ఒంగోలు ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా సాగు చేపట్టి సత్ఫలితాలు సాధించడంతో వనామీ రొయ్యల సాగుకు టైగర్ ప్రత్యామ్నాయంగా మారింది. డిమాండ్‌కు తగ్గ సీడ్ అందుబాటులో లేకపోవడంతో రెండో పంట సమయంలో నకిలీల బారినపడి రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వైల్డ్ బ్రూడర్స్ (సముద్రంలో సహజసిద్ధంగా దొరికే తల్లి రొయ్యల) నుంచి ఉత్పత్తి చేసిన సీడ్‌తోపాటు నకిలీ సీడ్‌ను ఎస్పీఎఫ్ బ్రూడర్ సీడ్‌గా అంటగట్టి దళారులు సొమ్ము చేసుకున్నారు. వీరికి అడ్డుకట్ట వేసేందుకు రంగంలోకి దిగిన సీఏఏ రాష్ట్ర మత్స్య శాఖతో కలిసి ఆర్బీకేల ద్వారా విస్తృత ప్రచారం చేయాల్సి వచ్చింది. నకిలీలకు చెక్ పెట్టడంతోపాటు టైగర్ రొయ్యల సాగును ప్రోత్సహించాలన్న సంకల్పంతో మరిన్ని హేచరీలకు అనుమతి ఇవ్వాలని సీఏఏ నిర్ణయించింది. కొత్తగా ఏపీకి చెందిన రెండు హేచరీలు, రెండు లార్వా రేరింగ్ హేచరీలకు అనుమతి ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో టైగర్ బ్రూడర్స్ దిగుమతి, సీడ్ ఉత్పత్తి కోసం అనుమతి పొందిన హేచరీల సంఖ్య మూడుకు చేరింది. ఇక్కడ ఉత్పత్తి చేసిన నౌప్లీ (లార్వా) నుంచి సీడ్ ఉత్పత్తి చేసే రెండు యూనిట్లకు కొత్తగా అనుమతినివ్వడంతో టైగర్ సీడ్ ఉత్పత్తి, సాగులో దేశంలోనే ఏపీ కేరాఫ్ అడ్రస్‌గా మారబోతుంది. ప్రస్తుతం అనుమతి పొందిన హేచరీలన్నీ వంద మిలియన్ సీడ్ ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగినవే. అయితే, నిబంధనలకు లోబడే ఇవన్నీ సీడ్ ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. సీఏఏ అనుమతి లేకుండా ఇతర హేచరీల్లో సీడ్ ఉత్పత్తి చేసినా, అమ్మినా లైసెన్సులు రద్దు చేయడంతోపాటు క్రిమినల్ చర్యలు తీసుకుంటారు. బ్రూడర్స్ దిగుమతి.. సీడ్ ఉత్పత్తికి అనుమతి పొందిన హేచరీలివీ.. యూని బయో (ఇండియా) హేచరీస్ ప్రైవేట్ లిమిటెడ్, ముగైయూర్, తమిళనాడు వైష్ణవి ఆక్వా టెక్, దుగరాజపట్నం, వాకాడు మండలం, నెల్లూరు జిల్లా మున్నంగి హేచరీస్, రామచంద్రరావుపేట పంచాయతీ, నెల్లూరు జిల్లా గాయత్రి బయో మెరైన్ యూనిట్–2, కొత్త ఓడరేవు, బాపట్ల మండలం, గుంటూరు జిల్లా శ్రీ వైజయంతీ హేచరీస్ ఎల్ఎల్పీ, కారేడు, ఉలవపాడు మండలం, ప్రకాశం జిల్లా బీకేఎంఎన్ ఆక్వా, రాముడుపాలెం, ఇందుకూరుపేట, నెల్లూరు జిల్లా -
టైగర్ రొయ్యపై పెరుగుతున్న ఆసక్తి
అంతర్జాతీయ ఆక్వా మార్కెట్లో రారాజుగా నిలిచి దాదాపు దశాబ్దానికి పైగా డాలర్ల వర్షం కురిపించిన టైగర్ రొయ్య తిరిగొస్తోంది. గతంలో వివిధ రకాల వైరస్లు చుట్టుముట్టడంతో ఆక్వా సాగులో అవి అంతర్ధానమయ్యాయి. తాజాగా టైగర్ రొయ్యల సాగు ప్రభ మళ్లీ ప్రారంభం కానుంది. టైగర్ సరికొత్త బ్రూడర్‌తో పునరాగమనంతో రైతుల్లో ఆశలు మోసులు ఎత్తుతున్నాయి. వెనామీకి ప్రత్యామ్నాయంగా ప్రకాశం జిల్లాలోని ఆక్వా రైతులు టైగర్ సాగు వైపు అడుగులు వేస్తున్నారు. నకిలీలపై దృష్టిసారించిన అధికార యంత్రాంగం హేచరీల్లో విస్తృత తనిఖీలు చేపట్టేందుకు ఎక్కడికక్కడ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: టైగర్ అంటే ఆక్వా రంగంలో రారాజు... నీలి విప్లవానికి నాంది. అంతర్జాతీయ మార్కెట్లో టైగర్ రొయ్యకు మంచి గిరాకీ ఉంది. కేవలం ఎగుమతి కోసమే ఉత్పత్తి చేసే టైగర్ రొయ్య పేరు రెండు దశాబ్దాల పాటు వినపడకుండా పోయింది. 1990 తరువాత వివిధ రకాల వైరస్లు సోకటంతో కనుమరుగైంది. ఆ తరువాత వెనామీదే రాజ్యం. తాజాగా వెనామీ కూడా వైరస్‌లా బారిపడి రైతులకు నష్టాలు తెచ్చిపెడుతోంది. ప్రస్తుతం ఎన్నో అధునాతన ప్రయోగాలు, పరిశోధనలతో వైరస్‌కు ఎలాంటి తావులేకుండా ఉండే సరికొత్త టైగర్ బ్రూడర్స్‌ను దేశానికి దిగుమతి చేసుకుంటున్నారు. ఆ బ్రూడర్స్ ద్వారా సీడ్‌ను ఉత్పత్తి చేసి ఆక్వా సాగు చేసే రైతులకు అందజేస్తున్నారు. దీంతో తిరిగి వెనామీకి ప్రత్యామ్నాయంగా టైగర్ రొయ్య పూర్వ వైభవాన్ని సంతరించుకోనుంది. నకిలీకి తావులేకుండా నిఘా.. టైగర్ రొయ్యల సాగు తిరిగి ప్రారంభం కానుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నకిలీ టైగర్ రొయ్యల సీడ్ బారిన పడకుండా ఆక్వా రైతులను కాపాడటానికి తనిఖీలను ఇప్పటికే ముమ్మరం చేసింది. టైగర్ సీడ్ ముసుగులో వెనామీ రొయ్య పిల్లలను రైతులకు అంటగట్టకుండా హేచరీలపై ప్రత్యేక నిఘా పెట్టింది. ప్రత్యేకంగా అధికారులతో కూడిన బృందాలను ఏర్పాటు చేసింది. జిల్లాలోని 41 హేచరీలపై కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ (సీఏఏ), జిల్లా మత్స్య శాఖ అధికారులు సంయుక్తంగా ఇటీవల దాడులు నిర్వహించారు. ఈతముక్కల గ్రామంలో ఒక హేచరీ నుంచి నకిలీ టైగర్ సీడ్ బయటకు వచ్చిందని సమాచారం రావటంతో అధికారులు తనిఖీలు చేసి దానిని మూసివేశారు. టైగర్ సీడ్ పేరుతో మోసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో రెండు హేచరీలకు అనుమతి.. టైగర్ రొయ్యల సీడ్ ఉత్పత్తికి దక్షిణ భారతదేశంలో రెండు హేచరీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. సరికొత్త బ్రూడర్‌తో సీడ్‌ను ఉత్పత్తి చేయటానికి తమిళనాడు చెంగల్పట్టులోని హేచరీ, నెల్లూరు జిల్లాలోని వైష్ణవి హేచరీలకు మాత్రమే అనుమతులిచ్చాయి. ఈ రెండు హేచరీలు సరికొత్త బ్రూడర్లను విదేశాల నుంచి దిగుమతి చేసుకొని సీడును ఉత్పత్తి చేస్తున్నాయి. అమెరికా నుంచి సరికొత్త బ్రూడర్స్‌ను దిగుమతి చేసుకొని కొన్ని రోజుల పాటు క్వారంటైన్లో ఉంచి అనేక పరీక్షల తరువాత అనుకూలంగా ఉంటేనే వాటి నుంచి సీడ్ ఉత్పత్తి చేస్తున్నారు. జిల్లాలో సాగు చేయాలనుకునే వారు నేరుగా ఈ రెండు హేచరీల నుంచి మాత్రమే కొనుగోలు చేయాల్సి ఉంది. అక్కడ నుంచి తీసుకొచ్చిన సీడ్ నేరుగా సాగు చేస్తున్న చెరువుల్లోనే వెయ్యాలి. వాటిని తీసుకొచ్చి స్థానికంగా ఉండే హేచరీలలో వెనామీ సీడ్‌తో కలిపి మొత్తం టైగర్ సీడేనని రైతులను మోసం చేయాలని చూసే వారిపై క్రిమినల్ చర్యలకు కూడా ప్రభుత్వం వెనకాడకుండా ఉండేలా అధికారులకు ఆదేశాలు వచ్చాయి. స్టేక్ హోల్డర్స్‌కు అవగాహన.. ఆక్వాకల్చర్ భాగస్వాముల సమావేశాలు (స్టేక్ హోల్డర్స్) ఏర్పాటు చేసి మత్స్య శాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఆక్వా రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఏపీ స్టేట్ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (ఏపీఎస్ఏడీఏ) యాక్ట్‌ను తీసుకొచ్చింది. ఆక్వాకల్చర్ భాగస్వాములు అంటే రైతులతో పాటు, ఫీడు, సీడు ఉత్పత్తిదారులు, హేచరీల యజమానులు, ట్రేడర్స్,ఎక్స్‌పోర్టర్లు, ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు దీనికిందకు వస్తారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే జిల్లా కేంద్రం ఒంగోలులో ఈ నెల 23న స్టేక్ హోల్డర్స్ సమావేశం నిర్వహించి నకిలీ టైగర్ రొయ్య సీడ్‌తో పాటు ఆక్వాకు సంబంధించిన అన్ని అంశాలపై లోతుగా అధికారులు అవగాహన కల్పించారు. నకిలీ సీడ్స్ సృష్టిస్తే కఠిన చర్యలు జిల్లాలో ఉన్న 41 హేచరీలపై ప్రత్యేక నిఘా ఉంటుంది. కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ (సీఏఏ) అధికారులు జిల్లా మత్స్య శాఖ అధికారులతో సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. ఎప్పటికప్పుడు సీఏఏ అధికారులకు సమాచారం అందిస్తున్నాం. అనుమతి ఉన్న రెండు హేచరీల నుంచి తీసుకొచ్చిన టైగర్ సీడ్ నేరుగా సాగు చేస్తున్న చెరువుల్లోకే వెళ్లాలి. హేచరీలకు వెళ్లకూడదు. అలా ఎవరైనా టైగర్ రొయ్య సీడ్‌ను తీసుకొచ్చి హేచరీల్లోని వెనామీ సీడ్‌తో కలిపి నకిలీగా సృష్టిస్తే క్రిమినల్ చర్యలకు కూడా వెనుకాడం. టైగర్ సీడ్ నకిలీ అన్న మాట ఏ ఒక్క ఆక్వా రైతు నోటి నుంచి రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. – ఆవుల చంద్ర శేఖర రెడ్డి, జాయింట్ డైరెక్టర్, జిల్లా మత్స్యశాఖ -
Tiger Prawn: మళ్లీ టైగర్ శకం
జిల్లాలో నీలి విప్లవం సృష్టించి, అంతర్జాతీయ ఆక్వా మార్కెట్లో మీసం మెలేసిన సింహపురి టైగర్ రొయ్యల సాగు శకం మళ్లీ ప్రారంభం కానుంది. సుమారు రెండు దశాబ్దాల క్రితం వరకు ఆక్వా రంగంలో తిరుగులేని రారాజుగా వెలుగొందిన టైగర్ రొయ్యలను వివిధ రకాల వైరస్లు వెంటాడడంతో కనుమరుగయ్యాయి. ఆ స్థానాన్ని వెనామీ రొయ్యలు ఆక్రమించాయి. తాజాగా వెనామీలోనూ వైరస్లు విజృంభిస్తుండటంతో రైతులు నష్టాల పాలవుతున్నారు. టైగర్ సరికొత్త బ్రీడర్తో తిరిగి రావడంతో రైతుల్లో ఆశలు మోసులు ఎత్తుతున్నాయి. వెనామీకి ప్రత్యామ్నాయంగా జిల్లాలోని ఆక్వా రైతులు టైగర్ సాగు వైపు అడుగులు వేశారు. సాక్షి, చిల్లకూరు: సింహపురిలో 1990వ దశకంలో టైగర్ రొయ్యలు నీలి విప్లవం సృష్టించాయి. దాదాపు దశా బ్దానికి పైగా డాలర్లు, యూరోలు ఆర్జించి పెట్టింది. తొలిదశలో రైతులను కోటీశ్వరులను తయారు చేసింది. కొన్నేళ్లలో వైరస్లు చుట్టుముట్టడంతో ఎంతో మంది రైతులను బికారీలను చేసింది. ఆ తర్వాత కొత్త రకం వెనామీ రావడంతో ఆక్వా సాగుదారులు అటు వైపు మళ్లారు. 2003 నుంచి 2015 వరకు వెనామీ సాగు డాలర్ల వర్షం కురిపించింది. వెనామీని సైతం పలు రకాల వైరస్లు వెంటాడుతుండడంతో దిగుబడులు తగ్గుతూ వచ్చాయి. వైరస్‌లకు యాంటీబయోటిక్స్ వాడడంతో ఎగుమతులు సన్నగిల్లాయి. నాసిరకం సీడ్ కారణంగా 120 రోజులు దాటినా కనీసం 100 కౌంట్ కూడా రాని పరిస్థితితో పెట్టుబడులు రాక అప్పులపాలవుతున్నారు. గూడూరు నియోజకవర్గంలో చిల్లకూరు, కోట, వాకాడు, చిట ్టమూరు మండలాల్లో సుమారు 2,500 హెక్టార్లలో సాగు చేసిన రైతులు ప్రస్తుతం 500 హెక్టార్లలో కూడా సాగు చేయలేక చతికిలపడ్డారు. చదవండి: (ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలు) టైగర్ టు వెనామీ టు టైగర్ ఆంధ్రప్రదేశ్ నుంచే ఏటా 6.34 లక్షల టన్నుల (74 శాతం) రొయ్యలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో సింహపురిదే సింహభాగం వెనామీ రొయ్యలదే. అంతకు ముందు నాటు రొయ్య (టైగర్) హవా నడిచింది. ఆ తర్వాత టైగర్ రొయ్యలకు వైట్ స్పాట్ (తెల్లమచ్చ) వైరస్, ఇతరత్రా వ్యాధులు సోకడం, వ్యాధి రహిత తల్లి రొయ్యల (స్పెసిఫిక్ పాత్ జోన్ ఫ్రీ బ్రూడర్స్) ఉత్పత్తి లేకపోవడంతో “టైగర్’ శకం ముగిసింది. అదే సమయంలో విదేశాల నుంచి స్పెసిఫిక్ పాత్ జోన్ ఫ్రీ (ఎస్పీఎఫ్) వెనామీ బ్రూడర్స్ (తల్లి రొయ్యలు) రావడం, విస్తృత స్థాయిలో సీడ్ అందుబాటులోకి రావడంతో ఆక్వా రంగం పూర్తిగా వెనామీ వైపు మళ్లింది. ప్రస్తుతం వెనామీ రొయ్యలకు సైతం వైట్ స్పాట్, వెబ్రియా తదితర వైరస్లు, వ్యాధుల కారణంగా 40 కౌంట్‌లో పట్టాల్సిన 80–100 కౌంట్‌లో పట్టేయాల్సి వస్తోంది. దీంతో వెనామీ సాగు చేస్తున్న రొయ్యల రైతులు నష్టాలను చవి చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తిరిగి టైగర్ రొయ్యలు అందుబాటులోకి వస్తున్నాయి. గుజరాత్లో తల్లి రొయ్యల పునరుత్పత్తి అమెరికాలోని హవాయికి చెందిన ఓ సంస్థ ఎస్పీఎఫ్ టైగర్ తల్లి రొయ్యలను అభివృద్ధి పర్చడంతో తిరిగి టైగర్ శకం ప్రారంభమైంది. వాటి దిగుమతికి 2019లో కేంద్రం అనుమతి ఇవ్వడంతో దేశీయ అవసరాలకు సరిపడా బ్రూడర్స్ దిగుమతికి అవకాశాలు తక్కువగా ఉండడంతో తల్లి రొయ్యల పునరుత్పత్తి కోసం గుజరాత్లో బ్రూడర్ మల్టిప్లికేషన్ సెంటర్ (బీఎంసీ)ను ఆ ప్రైవేట్ సంస్థ ఏర్పాటు చేసింది. తల్లి రొయ్యల నుంచి ఉత్పత్తయ్యే సీడ్‌ను ఇక్కడ 4 నెలల పాటు పెంచి తద్వారా తల్లి రొయ్యలను పునరుత్పత్తి చేస్తోంది. వైట్స్పాట్తో పాటు ఇతర వ్యాధులను సైతం తట్టుకునేలా వాటిని అభివృద్ధి చేస్తారు. ఆ ప్రైవేట్ సంస్థ టైగర్ బ్రూడర్స్‌ను దిగుమతి చేసుకుని నెల్లూరు జిల్లాలోని వాకాడులో హేచరీ ద్వారా సీడ్ (రొయ్య పిల్లల)ను ఉత్పత్తి చేసింది. చిల్లకూరు మండలంలో కొంత మంది రైతులను ఎంపిక చేసుకుని వారికి సీడ్‌ను సరఫరా చేసి సుమారుగా 500 ఎకరాల వరకు తొలిసారిగా సాగు చేపట్టారు. 120 రోజుల క్రితం పిల్ల రొయ్యను వదలిన తర్వాత ఎలాంటి వైరస్లు సోకకుండా మేత సకాలం వేస్తుండడంతో అనుకున్న ఫలితం కన్నా రెట్టింపు దిగుబడి రావడంతో బ్లాక్ టైగర్ ఈ ప్రాంతంలో బాగా లాభాలు ఆర్జించి పెడుతుందన్న నమ్మకం ఏర్పడింది. చదవండి: (సింహపురి సమరం.. టీడీపీలో ఎన్నికల భయం) 120 రోజుల్లో 15 కౌంట్ రొయ్యలు తాజాగా అందుబాటులోకి వచ్చిన బ్లాక్ టైగర్ రొయ్యల సాగుకు ఎకరాకు లక్ష పిల్లలు మాత్రమే వదలితే సుమారు రూ.లక్ష వరకు పెట్టుబడి అవుతుంది. ఇవి 120 రోజుల్లో 15 కౌంట్ వస్తుండడంతో పాటు లాభాలు బాగా వస్తుండడంతో రైతులు పూర్తిగా టైగర్ సాగు వైపు మొగ్గు చూపేందుకు సిద్ధమవుతున్నారు. ఎకరాకు టన్ను నుంచి టన్నుర్నర దిగుబడి లభిస్తోంది. ప్రస్తుతం ఒక్కో రొయ్య పిల్ల రూపాయికి అందుబాటులో ఉంది. లాభాలు బాగున్నాయి పదేళ్లుగా వెనామీ సాగు చేసి ఒడిదొడుకులకు గురయ్యాం. ప్రస్తుతం బ్లాక్ టైగర్ సీడ్ అందుబాటులోకి రావడంతో సుమారు 100 ఎకరాల వరకు సాగు చేపట్టా, 120 రోజుల్లో చిన్న పాటి వైరస్ కూడా రాకపోగా 15 కౌంట్‌తో హార్వెస్ట్ చేసాను. వెనామీ 40 కౌంట్ రొయ్యలు రూ.460 ఉండగా టైగర్ 15 కౌంట్ రూ.780 ఉన్నాయి. దీంతో పెట్టుబడులు పోను లాభాలు బాగానే వస్తున్నాయి. – చిట్టేటి నారాయణ, ఆక్వా రైతు హేచరీలు పెంచేలా ఆలోచన బ్లాక్ టైగర్‌ను నెల్లూరు జిల్లాలో ప్రవేశ పెట్టాలని తొలిసారిగా వాకాడు ప్రాంతంలో ఒక హేచరీని లీజుకు తీసుకుని పిల్లను అందించే ప్రయత్నం చేశాం. అయితే ఆర్డర్లు భారీగా వస్తుండడంతో రాష్ట్రంలో విడవలూరు, విజయవాడ కరకట్ట, ఈతమొక్కల ప్రాంతాల్లో హేచరీలు ఏర్పాటు చేసి పిల్ల రొయ్యను ఉత్పత్తి చేసి రైతులకు సకాలంలో అందించేలా చేస్తాం . – జిగ్నేష్బాయి, హేచరీ నిర్వాహకులు -
టైగర్ తిరిగొస్తోంది
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ ఆక్వా మార్కెట్లో మీసం మెలేసిన ఆంధ్రా టైగర్ రొయ్యలు తిరిగి సాగులోకి వస్తున్నాయి. సుమారు రెండు దశాబ్దాల క్రితం వరకూ ఆక్వా రంగంలో తిరుగులేని రారాజుగా వెలుగొందిన టైగర్ రొయ్యలపై వివిధ రకాల వైరస్లు ముప్పేట దాడితో మూలన పడ్డాయి. దాంతో ఆ స్థానాన్ని వెనామీ రొయ్యల రొయ్యలు ఆక్రమించాయి. తాజాగా వెనామీ సాగులోనూ వైరస్ల దాడి పెరగటం, వివిధ రకాల వ్యాధులు విజృంభిస్తుండటంతో నష్టాల పాలవుతున్న రైతులకు టైగర్ రొయ్యలు తిరిగి ఆశాదీపంలా కనిపిస్తున్నాయి. వెనామీకి ప్రత్యామ్నాయంగా టైగర్ సాగు ద్వారా సిరుల పంట పండించేందుకు రైతులు ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లాలోని సముద్ర తీర ప్రాంత రైతులు 4,500 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా టైగర్ రొయ్యల సాగుకు శ్రీకారం చుట్టి మంచి ఫలితాలు సాధించారు. గుంటూరు జిల్లాతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని తీరప్రాంత ఆక్వా రైతులు సైతం టైగర్ రొయ్యల సాగు వైపు ఇప్పటికే అడుగులు వేశారు. నష్టాల సాగు నుంచి గట్టెక్కేలా.. దేశవ్యాప్తంగా ఏటా 8.64 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తి అవుతుంటే.. అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 6.34 లక్షల టన్నుల (74 శాతం) రొయ్యలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో సింహభాగం వెనామీ రొయ్యలదే. అంతకు ముందు మన ప్రాంత నాటు రొయ్య (టైగర్) హవా నడిచింది. ఆ తరువాత టైగర్ రొయ్యలకు వైట్ స్పాట్ (తెల్ల మచ్చ) వైరస్, ఇతరత్రా వ్యాధులు సోకడం, వ్యాధి రహిత తల్లి రొయ్యల (స్పెసిఫిక్ పాత్ జోన్ ఫ్రీ బ్రూడర్స్) ఉత్పత్తి లేకపోవడంతో ‘టైగర్’ శకం ముగిసింది. అదే సమయంలో విదేశాల నుంచి స్పెసిఫిక్ పాత్ జోన్ ఫ్రీ (ఎస్పీఎఫ్) వెనామీ బ్రూడర్స్ (తల్లి రొయ్యలు) రావడం, విస్తృత స్థాయిలో సీడ్ అందుబాటులోకి రావడంతో ఆక్వా రంగం పూర్తిగా వెనామీ వైపు మళ్లింది. ప్రస్తుతం వెనామీ రొయ్యలకు సైతం వైట్ స్పాట్, వెబ్రియా తదితర వైరస్లు, వ్యాధుల కారణంగా 40 కౌంట్‌లో పట్టాల్సిన 80–100 కౌంట్‌లో పట్టేయాల్సి వస్తోంది. దీంతో వెనామీ సాగు చేస్తున్న రొయ్యల రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తిరిగి టైగర్ రొయ్యలు అందుబాటులోకి వస్తున్నాయి. గుజరాత్లో తల్లి రొయ్యల పునరుత్పత్తి అమెరికాలోని హవాయికి చెందిన ఓ సంస్థ ఎస్పీఎఫ్ టైగర్ తల్లి రొయ్యలను అభివృద్ధిపర్చడంతో తిరిగి టైగర్ శకం ప్రారంభమైనట్టయ్యింది. వాటి దిగుమతికి 2019లో కేంద్రం అనుమతి ఇవ్వడంతో ఓ ప్రైవేట్ సంస్థ టైగర్ బ్రూడర్స్‌ను దిగుమతి చేసుకుని నెల్లూరు జిల్లాలో హేచరీ ద్వారా సీడ్ (రొయ్య పిల్లల)ను ఉత్పత్తి చేసింది. ఆ సీడ్‌తో గుంటూరు, నెల్లూరు, ఒంగోలు ప్రాంత రైతులు ప్రయోగాత్మకంగా సాగు చేపట్టి సత్ఫలితాలు సాధించారు. దేశీయ అవసరాలకు సరిపడా బ్రూడర్స్ దిగుమతికి అవకాశాలు తక్కువగా ఉండటంతో తల్లి రొయ్యల పునరుత్పత్తి కోసం గుజరాత్లో బ్రూడర్ మల్టిప్లికేషన్ సెంటర్ (బీఎంసీ)ను ఆ ప్రైవేటు సంస్థ ఏర్పాటు చేస్తోంది. తల్లి రొయ్యల నుంచి ఉత్పత్తయ్యే సీడ్‌ను ఇక్కడ 4 నెలల పాటు పెంచి.. వాటిద్వారా తిరిగి తల్లి రొయ్యలను పునరుత్పత్తి చేస్తారు. వైట్స్పాట్తో పాటు ఇతర వ్యాధులను సైతం తట్టుకునేలా వాటిని అభివృద్ధి చేస్తారు. ప్రస్తుతం ఒక్కో రొయ్య పిల్ల 99 పైసలకు అందుబాటులో ఉంది. ప్రయోగం సక్సెస్ ఈ ఏడాది జనవరిలో ప్రైవేట్ సంస్థ ఏపీ మార్కెట్లోకి తీసుకొచ్చిన సీడ్‌ను గుంటూరు జిల్లా నిజాంపట్నం, రేపల్లె, కర్లపాలెం, పీవీ పాలెం ప్రాంత రైతులు ప్రయోగాత్మకంగా 4,500 ఎకరాల్లో సాగు చేశారు. రొయ్యలు ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా ప్రతిరోజు 0.3 గ్రాముల నుంచి 0.5 గ్రాముల వరకు పెరుగుతూ 120 రోజుల్లోనే 20 కౌంట్లోపే పంట చేతికొచ్చింది. ఊహించని రీతిలో ఫలితాలు రావడంతో సీడ్‌కు డిమాండ్ ఏర్పడింది. 70 ఎకరాల్లో రూ.1.40 కోట్ల ఆదాయం నిజాంపట్నం మండలం లంకవానిదిబ్బలోని 70 ఎకరాల్లో టైగర్ రొయ్యలు సాగు చేశా. రూ.1.90 కోట్లు పెట్టుబడి పెట్టా. 13–15 కౌంట్‌లో 62 టన్నుల దిగుబడి వచ్చింది. వైట్ స్పాట్‌ను తట్టుకుంది. ఎలాంటి మందులు వాడలేదు. పెట్టుబడి పోను రూ.1.40 కోట్ల ఆదాయం వచ్చింది. – కొక్కిలిగడ్డ ఐజాక్, ఆక్వా రైతు, నిజాంపట్నం, గుంటూరు తీర ప్రాంత ఆక్వా రైతులకు వరం టైగర్ రొయ్యలు తీరప్రాంత ఆక్వా రైతులకు వరం. వెనామీకి ప్రత్యామ్నాయంగా మారుతుంది. పెట్టుబడి తక్కువగా ఉండే టైగర్ సాగు సన్న, చిన్నకారు రైతులకు అనుకూలం. వెనామీ సాగుకు అనుకూలంగా లేని ఇసుక భూముల్లో టైగర్ సాగు లాభదాయకం. టైగర్ రొయ్యల పెంపకం విజయవంతం కొనసాగితే సాగు విస్తీర్ణం, ఉత్పత్తితోపాటు ఎగుమతులు కూడా గణనీయంగా పెరుగుతాయి. – డాక్టర్ పి.సురేష్‌కుమార్, డిప్యూటీ డైరెక్టర్, మత్స్య శాఖ -
రొయ్యకు కొత్త రోగం
ఇందుకూరుపేట: ఆక్వా రంగాన్ని వైరస్లు వెంటాడుతున్నాయి. వైరస్‌లను తట్టుకునే కొత్త రకాలను తెచ్చినా కొద్దిరోజులకే కొత్త రకం వైరస్ ఆక్వాను చిన్నాభిన్నం చేస్తోంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దశాబ్ద కాలానికి పైగా రారాజుగా నిలిచి డాలర్ల వర్షం కురిపించి ఆక్వా రైతుల జీవితాలనే మార్చేసిన ‘టైగర్’ రొయ్యను వైట్‌స్పాట్, బ్లాక్‌స్పాట్, విబ్రియో వంటి వైరస్లు ఉనికే లేకుండా చేశాయి. తాజాగా మనుగడ సాగిస్తూ.. టైగర్‌తో రెండోదశలో దెబ్బతిన్న ఆక్వా రైతులను ఆదుకుంటున్న ‘వెనామీ’ని ప్రస్తుతం ‘వైట్‌గట్’ అనే కొత్త వైరస్ వణికిస్తోంది. జిల్లాలో తీరం వెంబడి కావలి నుంచి చిట్టమూరు వరకు ప్రస్తుతం 25 వేల ఎకరాల్లో వెనామీ సాగవుతోంది. నాసిరకం సీడ్.. ప్రధానంగా నాసిరకం సీడ్ వల్లే ఆక్వా రంగం కుదేలవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా పుట్టగొడుగుల్లా ఏర్పాటవుతున్న హేచరీలు స్థానికంగా రైతుల చెరువుల్లో నుంచి తల్లి రొయ్యలను సేకరించి సీడ్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. అనుమతులున్న హేచరీలకు ఎంపెడా తల్లి రొయ్యలను సరఫరా చేస్తోంది. జిల్లాలో 140కి పైగా హేచరీలున్నాయి. వీటిలో 30 హేచరీలకే ఎంపెడా అనుమతి ఉంది. ఈ వైరస్ సోకిన రొయ్యలు మేత సరిగా తినకపోవడంతో లూజ్‌షెల్‌కు గురవుతున్నాయి. లోలోపలే రొయ్యలు మృ త్యువాత పడుతున్నాయి. సీడ్ సర్వైవల్ శాతం తగ్గిపోతోం ది. పంట కాలపరిమితి పెరుగుతోంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న తల్లి రొయ్యల నుంచే ఈ వైరస్ వ్యాపిస్తోందని ఆక్వా నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నష్టాలబాటలో రైతులు వెనామీ సాగులో ఆశించిన ఫలితాలు లేకపోవడంతో రైతులకు దిక్కుతోచడంలేదు. రెండేళ్ల కిందట 30 కౌంట్ ధర రూ.600 నుంచి రూ.650 పలికింది. ప్రస్తుతం అదే కౌంట్ ధర ఇప్పుడు సగానికి పడిపోయింది. పంట చేతికి వచ్చినా నష్టాలు తప్పడం లేదు. సాగులో వ్యయ ప్రయాసలు పెరగడం, లాభాలు తగ్గుముఖం పట్టడంతో వెనామీ సాగు తగ్గుముఖం పట్టింది. ఇందుకూరుపేట మండలంలోని కుడితిపాళెం, రాముడుపాళెం, గంగపట్నం, మైపాడు, కొరుటూరు గ్రామాల్లో కొందరు రైతులు ఇప్పటికే స్వస్తి పలికారు. డాలర్ల పంట పండిస్తున్న వెనామీ సాగులో వైరస్‌ను అరికట్టే ప్రయత్నం చేయపోతే.. టైగర్, స్కాంపి రొయ్యల సాగుకు పట్టినగతే దీనికీ పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లి రొయ్యల నుంచే వైట్‌గట్ ప్రస్తుతం వెనామీ రొయ్యలకు వైట్‌గట్ సోకి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సీడ్లో ఎక్కువ శాతానికి ఈ వైరస్ ఉంది. ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్న తల్లి రొయ్యల నుంచి ఇది వ్యాప్తి చెందుతోందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని అరికట్టేందుకు ల్యాబ్‌ల ద్వారా పరీక్షలు నిర్వహించిన తల్లి రొయ్యలనే దిగుమతి చేసుకోవాలి. నాణ్యమైన సీడ్‌నే రైతులకు అందజేయాలి. - హనుమంతునాయుడు, రైతు -
విదేశాల్లో ఆంధ్రా రొయ్య జోరు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర మత్స్య ఉత్పత్తులకు విదేశాల్లో డిమాండ్ పెరుగుతోంది. వెనామీ, టైగర్ రొయ్యల లభ్యత పెరగడంతో మత్స్య ఎగుమతులు బాగా పెరిగాయి. 2012-2013లో 9,28,215 టన్నుల విలువైన రూ.18,856 కోట్ల మత్స్య ఎగుమతులు సాధించామని విశాఖలోని సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివద్ధి సంస్థ(ఎంపెడా) తెలియజేసింది. 2011-12లో ఈ పరిమాణం 8,62,021 టన్నులు కాగా వీటి విలువ రూ.16,597 కోట్లు కావటం గమనార్హం. నిజానికి గత కొన్నేళ్లలో వెనామీ, టైగర్ రొయ్య లభ్యత బాగా పడిపోయింది. దీంతో ఎగుమతుల్లో వ్యాపార వృద్ధి అంతగా లేదు. ఇప్పుడు ఈ రెండూ దొరుకుండటంతో ఎగుమతులకు ఊపొచ్చింది. మొత్తం ఎగుమతుల్లో ఫ్రోజెన్ రొయ్యి వాటా 51%గా ఉంది. రొయ్య ఎగుమతులు గతేడాదితో పోల్చితే 20%నికి పెరిగాయని ఎంపెడా తెలిపింది. వీటి ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌దే సింహభాగం. ఏటా దేశవ్యాప్తంగా 2 లక్షల టన్నుల రొయ్య సాగు జరగ్గా, మన రాష్ట్ర వాటానే (ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, గుంటూరు, నెల్లూరు) 1.5 లక్షల టన్నులు. పెరుగుతున్న విదేశీ మార్కెట్... దేశీయ రొయ్యకు విదేశాల్లో డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా దక్షిణాసియా దేశాలు వీటి దిగుమతికి పోటీపడుతున్నాయి. మొత్తం ఎగుమతుల్లో 23% ఈ దేశాలకే వెళుతున్నాయి. యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఇప్పుడిప్పుడే ఈ ఉత్పత్తులకు ప్రాధాన్యం లభిస్తోంది. వాస్తవానికి థాయ్‌లాండ్, వియత్నాం, ఇండోనేషియాల్లో రొయ్యల ఉత్పత్తి అధికంగా ఉన్నప్పటికీ రుచి, నాణ్యత పరంగా మన రాష్ట్ర రొయ్యలే ముందుంటున్నాయి. అందుకే వీటికి అంత డిమాండ్.