రొయ్యకు కొత్త రోగం
ఇందుకూరుపేట: ఆక్వా రంగాన్ని వైరస్‌లు వెంటాడుతున్నాయి. వైరస్‌లను తట్టుకునే కొత్త రకాలను తెచ్చినా కొద్దిరోజులకే కొత్త రకం వైరస్ ఆక్వాను చిన్నాభిన్నం చేస్తోంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దశాబ్ద కాలానికి పైగా రారాజుగా నిలిచి డాలర్ల వర్షం కురిపించి ఆక్వా రైతుల జీవితాలనే మార్చేసిన ‘టైగర్’ రొయ్యను వైట్‌స్పాట్, బ్లాక్‌స్పాట్, విబ్రియో వంటి వైరస్‌లు ఉనికే లేకుండా చేశాయి. తాజాగా మనుగడ సాగిస్తూ.. టైగర్‌తో రెండోదశలో దెబ్బతిన్న ఆక్వా రైతులను ఆదుకుంటున్న ‘వెనామీ’ని ప్రస్తుతం ‘వైట్‌గట్’ అనే కొత్త వైరస్ వణికిస్తోంది. జిల్లాలో తీరం వెంబడి కావలి నుంచి చిట్టమూరు వరకు ప్రస్తుతం 25 వేల ఎకరాల్లో వెనామీ సాగవుతోంది.
నాసిరకం సీడ్..
ప్రధానంగా నాసిరకం సీడ్ వల్లే ఆక్వా రంగం కుదేలవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా పుట్టగొడుగుల్లా ఏర్పాటవుతున్న హేచరీలు స్థానికంగా రైతుల చెరువుల్లో నుంచి తల్లి రొయ్యలను సేకరించి సీడ్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. అనుమతులున్న హేచరీలకు ఎంపెడా తల్లి రొయ్యలను సరఫరా చేస్తోంది. జిల్లాలో 140కి పైగా హేచరీలున్నాయి. వీటిలో 30 హేచరీలకే ఎంపెడా అనుమతి ఉంది. ఈ వైరస్ సోకిన రొయ్యలు మేత సరిగా తినకపోవడంతో లూజ్‌షెల్‌కు గురవుతున్నాయి. లోలోపలే రొయ్యలు మృ త్యువాత పడుతున్నాయి. సీడ్ సర్వైవల్ శాతం తగ్గిపోతోం ది. పంట కాలపరిమితి పెరుగుతోంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న తల్లి రొయ్యల నుంచే ఈ వైరస్ వ్యాపిస్తోందని ఆక్వా నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
నష్టాలబాటలో రైతులు
వెనామీ సాగులో ఆశించిన ఫలితాలు లేకపోవడంతో రైతులకు దిక్కుతోచడంలేదు. రెండేళ్ల కిందట 30 కౌంట్ ధర రూ.600 నుంచి రూ.650 పలికింది. ప్రస్తుతం అదే కౌంట్ ధర ఇప్పుడు సగానికి పడిపోయింది. పంట చేతికి వచ్చినా నష్టాలు తప్పడం లేదు. సాగులో వ్యయ ప్రయాసలు పెరగడం, లాభాలు తగ్గుముఖం పట్టడంతో వెనామీ సాగు తగ్గుముఖం పట్టింది. ఇందుకూరుపేట మండలంలోని కుడితిపాళెం, రాముడుపాళెం, గంగపట్నం, మైపాడు, కొరుటూరు గ్రామాల్లో కొందరు రైతులు ఇప్పటికే స్వస్తి పలికారు. డాలర్ల పంట పండిస్తున్న వెనామీ సాగులో వైరస్‌ను అరికట్టే ప్రయత్నం చేయపోతే.. టైగర్, స్కాంపి రొయ్యల సాగుకు పట్టినగతే దీనికీ పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తల్లి రొయ్యల నుంచే వైట్‌గట్
ప్రస్తుతం వెనామీ రొయ్యలకు వైట్‌గట్ సోకి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సీడ్‌లో ఎక్కువ శాతానికి ఈ వైరస్ ఉంది. ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్న తల్లి రొయ్యల నుంచి ఇది వ్యాప్తి చెందుతోందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని అరికట్టేందుకు ల్యాబ్‌ల ద్వారా పరీక్షలు నిర్వహించిన తల్లి రొయ్యలనే దిగుమతి చేసుకోవాలి. నాణ్యమైన సీడ్‌నే రైతులకు అందజేయాలి.
- హనుమంతునాయుడు, రైతు