indukurpet
-
తండ్రికి కుమార్తె అంత్యక్రియలు
గంగపట్నం(ఇందుకూరుపేట): సంప్రదాయం ప్రకారం తండ్రి మరణిస్తే కుమారులు తలకొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించడం సర్వ సాధారణం. అందుకు భిన్నంగా కుమార్తె అంత్యక్రియలు నిర్వహించి తండ్రి రుణం తీర్చుకుందో కుమార్తె. ఈ సంఘటన మండలంలోని గంగపట్నం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గంగపట్నం గ్రామానికి చెందిన ఆలపాకల మల్లికార్జున(46) మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు బుధవారం నిర్వహిచేందుకు కుటుంబ సభ్యులు, బంధువులు ఏర్పాట్లు చేశారు. కాగా కుమారుడు పుట్టిన తరువాత భార్య చనిపోవడంతో మల్లికార్జున మరో వివాహం చేసుకున్నాడు. తొలి భార్య కుమారుడు అనిల్ తండ్రి నుంచి దూరమయ్యాడు. అదే గ్రామంలో ఉన్న అమ్మమ్మ దగ్గర పెరుగుతున్నాడు. మల్లికార్జున లక్ష్మమ్మ అనే మహిళను రెండో వివాహం చేసుకోవడంతో ఆమెకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ప్రియాంకకు ఆగస్టు మొదటి వారంలో వివాహం చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. చిన్న కుమార్తె ప్రవళిక ఇంటర్ చుదువుతోంది. కాగా హఠాన్మరణం చెందిన మల్లికార్జునకు తలికొరివి పెట్టేందుకు తొలి భార్య కుమారుడు అనిల్ నిరాకరించడంతో ఆ బాధ్యతను చిన్నకుమార్తె చేపట్టింది. తలకొరివి పెట్టి తండ్రి రుణం తీర్చుకుంది. ఈ సంఘటన చుట్టు ప్రక్కల గ్రామాలలో చర్చనీయాంశంగా మారింది. -
రెండు బైక్‌లు ఢీ : నలుగురికి తీవ్రగాయాలు
నరసాపురం(ఇందుకూరుపేట) : ప్రమాదవశాత్తు రెండు బైక్‌లు ఢీకొని నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డ సంఘటన మండలంలోని నరసాపురం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. భీమవరానికి చెందిన స్లీఫెన్, దినేష్ అనే ఇద్దరు నెల్లూరు నుంచి బైక్‌పై మండలంలోని మైపాడు బీచ్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో మైపాడు గ్రామంలోని సంగంకు చెందిన పవన్, శివ అనే ఇద్దరు గంగపట్నం నుంచి బైక్‌పై వస్తున్నారు. గంగపట్నం చీలురోడ్డు వద్ద రెండు బైక్‌లు ఢీకొన్నాయి. దీంతో నలుగురు తీవ్రగాయాలపాలయ్యారు. స్థానికులు వెంటనే స్పందించి 108కు సమాచారం అందించారు. వాహనం ఆలస్యంగా రావడంతో బాధితులు గాయాలతో తీవ్రవేదనకు గురయ్యారు. క్షతగాత్రులను నెల్లూరుకు తరలించారు. -
చేమ రైతు కుదేలు
ఇందుకూరుపేట : చేమ సాగు రైతులు నష్టాలతో కుదేలవుతున్నారు. మండలంలోని డేవిస్‌పేట, కొత్తూరు, ఇందుకూరుపేట, జగదేవిపేట తదితర గ్రామాలలో 300 ఎకరాల మేర అన్నదాతలు ఈ సంవత్సరం చేమ పంటను సాగు చేశారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో పంట దిగుబడి తగ్గింది. దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐదు నుంచి ఆరునెలల పాటు సాగుచేసే చేమ పంట ఎకరా సాగుకు సుమారు రూ.40 వేలు ఖర్చవుతుంది. పంట కోత తర్వాత వంద బస్తాల (బస్తా 73 కేజీలు) వరకు దిగుబడి వచ్చేది. అయితే ఈ సంవత్సరం అకాల వర్షాలు ముంచెత్తడంతో పంటకు కుళ్లు తెగులు సోకింది. దీంతో పంట దిగుబడి తగ్గినట్లుగా చెబుతున్నారు. సరాసరిగా 60 బస్తాలకు పడిపోయింది. దళారుల మాయాజాలం.. పంట దిగుబడి తగ్గి రైతులు బాధపడుతుంటే దళారులు వారిని మరింత నష్టాల్లోకి నెడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో చేమకు మంచి ధర పలుకుతోంది. అయితే దళారులు చేతివాటం ప్రదర్శిస్తూ రైతుల నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. రవాణా, ఇతర చార్జీలను దష్టిలో పెట్టుకుని అన్నదాతలు ఏం చేయలేక పంటను అమ్మేసుకుంటున్నారు. బస్తా రూ.1,100 వరకు పలుకుతోంది. ధర పెంచితే తాము కాస్త ఊరటకలుగుతుందని రైతులు చెబుతున్నారు. దిగుబడి తగ్గింది : మదుబాబు, డేవిస్‌పేట వాతావరణం అనుకూలించక ఈ ఏడాది చేమపంట దిగుబడి తగ్గింది. కుళ్లు తెగులు సోకడంతో ఎకరాకు 60 నుంచి 70 బస్తా మాత్రమే కాయలు ఉత్పత్తి అయ్యాయి. దీంతో రైతులకు నష్టాలు ఎదురయ్యాయి. దళారులు చేతివాటం : గిరీష్‌కుమార్, డేవిస్‌పేట పంట కొనుగోలులో దళారులు చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. మార్కెట్ లో చేమకు మంచి డిమాండు ఉన్నా ఇక్కడ మాత్రం తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. -
రొయ్యకు కొత్త రోగం
ఇందుకూరుపేట: ఆక్వా రంగాన్ని వైరస్లు వెంటాడుతున్నాయి. వైరస్‌లను తట్టుకునే కొత్త రకాలను తెచ్చినా కొద్దిరోజులకే కొత్త రకం వైరస్ ఆక్వాను చిన్నాభిన్నం చేస్తోంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దశాబ్ద కాలానికి పైగా రారాజుగా నిలిచి డాలర్ల వర్షం కురిపించి ఆక్వా రైతుల జీవితాలనే మార్చేసిన ‘టైగర్’ రొయ్యను వైట్‌స్పాట్, బ్లాక్‌స్పాట్, విబ్రియో వంటి వైరస్లు ఉనికే లేకుండా చేశాయి. తాజాగా మనుగడ సాగిస్తూ.. టైగర్‌తో రెండోదశలో దెబ్బతిన్న ఆక్వా రైతులను ఆదుకుంటున్న ‘వెనామీ’ని ప్రస్తుతం ‘వైట్‌గట్’ అనే కొత్త వైరస్ వణికిస్తోంది. జిల్లాలో తీరం వెంబడి కావలి నుంచి చిట్టమూరు వరకు ప్రస్తుతం 25 వేల ఎకరాల్లో వెనామీ సాగవుతోంది. నాసిరకం సీడ్.. ప్రధానంగా నాసిరకం సీడ్ వల్లే ఆక్వా రంగం కుదేలవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా పుట్టగొడుగుల్లా ఏర్పాటవుతున్న హేచరీలు స్థానికంగా రైతుల చెరువుల్లో నుంచి తల్లి రొయ్యలను సేకరించి సీడ్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. అనుమతులున్న హేచరీలకు ఎంపెడా తల్లి రొయ్యలను సరఫరా చేస్తోంది. జిల్లాలో 140కి పైగా హేచరీలున్నాయి. వీటిలో 30 హేచరీలకే ఎంపెడా అనుమతి ఉంది. ఈ వైరస్ సోకిన రొయ్యలు మేత సరిగా తినకపోవడంతో లూజ్‌షెల్‌కు గురవుతున్నాయి. లోలోపలే రొయ్యలు మృ త్యువాత పడుతున్నాయి. సీడ్ సర్వైవల్ శాతం తగ్గిపోతోం ది. పంట కాలపరిమితి పెరుగుతోంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న తల్లి రొయ్యల నుంచే ఈ వైరస్ వ్యాపిస్తోందని ఆక్వా నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నష్టాలబాటలో రైతులు వెనామీ సాగులో ఆశించిన ఫలితాలు లేకపోవడంతో రైతులకు దిక్కుతోచడంలేదు. రెండేళ్ల కిందట 30 కౌంట్ ధర రూ.600 నుంచి రూ.650 పలికింది. ప్రస్తుతం అదే కౌంట్ ధర ఇప్పుడు సగానికి పడిపోయింది. పంట చేతికి వచ్చినా నష్టాలు తప్పడం లేదు. సాగులో వ్యయ ప్రయాసలు పెరగడం, లాభాలు తగ్గుముఖం పట్టడంతో వెనామీ సాగు తగ్గుముఖం పట్టింది. ఇందుకూరుపేట మండలంలోని కుడితిపాళెం, రాముడుపాళెం, గంగపట్నం, మైపాడు, కొరుటూరు గ్రామాల్లో కొందరు రైతులు ఇప్పటికే స్వస్తి పలికారు. డాలర్ల పంట పండిస్తున్న వెనామీ సాగులో వైరస్‌ను అరికట్టే ప్రయత్నం చేయపోతే.. టైగర్, స్కాంపి రొయ్యల సాగుకు పట్టినగతే దీనికీ పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లి రొయ్యల నుంచే వైట్‌గట్ ప్రస్తుతం వెనామీ రొయ్యలకు వైట్‌గట్ సోకి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సీడ్లో ఎక్కువ శాతానికి ఈ వైరస్ ఉంది. ఇతర దేశాల నుంచి దిగుమతి అవుతున్న తల్లి రొయ్యల నుంచి ఇది వ్యాప్తి చెందుతోందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని అరికట్టేందుకు ల్యాబ్‌ల ద్వారా పరీక్షలు నిర్వహించిన తల్లి రొయ్యలనే దిగుమతి చేసుకోవాలి. నాణ్యమైన సీడ్‌నే రైతులకు అందజేయాలి. - హనుమంతునాయుడు, రైతు -
చేప పొట్టలో విలువైన సంపద?
ఇందుకూరుపేట: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం రాముడుపాళెం పల్లిపాళెం సముద్ర తీరానికి ఆదివారం సుమారు 35 అడుగుల పొడవు ఉన్న భారీ చేప కొట్టుకొచ్చింది. ఈ చేప నాలుగు నుంచి ఐదు టన్నులు బరువు ఉంటుందని మత్స్యకారులు తెలిపారు. రెండు మూడు రోజుల క్రితమే ఇది మృతిచెంది ఉంటుందని భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానికుల్లో కొందరు చేప పొట్ట భాగంలో కోసి చూడగా లక్షలాది రూపాయల విలువైన సంపద దొరికినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. నిజానిజాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.