చేమ రైతు కుదేలు
చేమ రైతు కుదేలు
Published Sun, Jul 17 2016 11:15 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM
ఇందుకూరుపేట : చేమ సాగు రైతులు నష్టాలతో కుదేలవుతున్నారు. మండలంలోని డేవిస్‌పేట, కొత్తూరు, ఇందుకూరుపేట, జగదేవిపేట తదితర గ్రామాలలో 300 ఎకరాల మేర అన్నదాతలు ఈ సంవత్సరం చేమ పంటను సాగు చేశారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో పంట దిగుబడి తగ్గింది. దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐదు నుంచి ఆరునెలల పాటు సాగుచేసే చేమ పంట ఎకరా సాగుకు సుమారు రూ.40 వేలు ఖర్చవుతుంది. పంట కోత తర్వాత వంద బస్తాల (బస్తా 73 కేజీలు) వరకు దిగుబడి వచ్చేది. అయితే ఈ సంవత్సరం అకాల వర్షాలు ముంచెత్తడంతో పంటకు కుళ్లు తెగులు సోకింది. దీంతో పంట దిగుబడి తగ్గినట్లుగా చెబుతున్నారు. సరాసరిగా 60 బస్తాలకు పడిపోయింది.
దళారుల మాయాజాలం..
పంట దిగుబడి తగ్గి రైతులు బాధపడుతుంటే దళారులు వారిని మరింత నష్టాల్లోకి నెడుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో చేమకు మంచి ధర పలుకుతోంది. అయితే దళారులు చేతివాటం ప్రదర్శిస్తూ రైతుల నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. రవాణా, ఇతర చార్జీలను దష్టిలో పెట్టుకుని అన్నదాతలు ఏం చేయలేక పంటను అమ్మేసుకుంటున్నారు. బస్తా రూ.1,100 వరకు పలుకుతోంది. ధర పెంచితే తాము కాస్త ఊరటకలుగుతుందని రైతులు చెబుతున్నారు.
దిగుబడి తగ్గింది : మదుబాబు, డేవిస్‌పేట
వాతావరణం అనుకూలించక ఈ ఏడాది చేమపంట దిగుబడి తగ్గింది. కుళ్లు తెగులు సోకడంతో ఎకరాకు 60 నుంచి 70 బస్తా మాత్రమే కాయలు ఉత్పత్తి అయ్యాయి. దీంతో రైతులకు నష్టాలు ఎదురయ్యాయి.
దళారులు చేతివాటం : గిరీష్‌కుమార్, డేవిస్‌పేట
పంట కొనుగోలులో దళారులు చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. మార్కెట్ లో చేమకు మంచి డిమాండు ఉన్నా ఇక్కడ మాత్రం తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు.
Advertisement