జిల్లాలో నీలి విప్లవం సృష్టించి, అంతర్జాతీయ ఆక్వా మార్కెట్‌లో మీసం మెలేసిన సింహపురి టైగర్ రొయ్యల సాగు శకం మళ్లీ ప్రారంభం కానుంది. సుమారు రెండు దశాబ్దాల క్రితం వరకు ఆక్వా రంగంలో తిరుగులేని రారాజుగా వెలుగొందిన టైగర్ రొయ్యలను వివిధ రకాల వైరస్‌లు వెంటాడడంతో కనుమరుగయ్యాయి. ఆ స్థానాన్ని వెనామీ రొయ్యలు ఆక్రమించాయి. తాజాగా వెనామీలోనూ వైరస్‌లు విజృంభిస్తుండటంతో రైతులు నష్టాల పాలవుతున్నారు. టైగర్ సరికొత్త బ్రీడర్‌తో తిరిగి రావడంతో రైతుల్లో ఆశలు మోసులు ఎత్తుతున్నాయి. వెనామీకి ప్రత్యామ్నాయంగా జిల్లాలోని ఆక్వా రైతులు టైగర్ సాగు వైపు అడుగులు వేశారు.
సాక్షి, చిల్లకూరు: సింహపురిలో 1990వ దశకంలో టైగర్ రొయ్యలు నీలి విప్లవం సృష్టించాయి. దాదాపు దశా బ్దానికి పైగా డాలర్లు, యూరోలు ఆర్జించి పెట్టింది. తొలిదశలో రైతులను కోటీశ్వరులను తయారు చేసింది. కొన్నేళ్లలో వైరస్‌లు చుట్టుముట్టడంతో ఎంతో మంది రైతులను బికారీలను చేసింది. ఆ తర్వాత కొత్త రకం వెనామీ రావడంతో ఆక్వా సాగుదారులు అటు వైపు మళ్లారు. 2003 నుంచి 2015 వరకు వెనామీ సాగు డాలర్ల వర్షం కురిపించింది. వెనామీని సైతం పలు రకాల వైరస్‌లు వెంటాడుతుండడంతో దిగుబడులు తగ్గుతూ వచ్చాయి. వైరస్‌లకు యాంటీబయోటిక్స్ వాడడంతో ఎగుమతులు సన్నగిల్లాయి. నాసిరకం సీడ్ కారణంగా 120 రోజులు దాటినా కనీసం 100 కౌంట్ కూడా రాని పరిస్థితితో పెట్టుబడులు రాక అప్పులపాలవుతున్నారు. గూడూరు నియోజకవర్గంలో చిల్లకూరు, కోట, వాకాడు, చిట ్టమూరు మండలాల్లో సుమారు 2,500 హెక్టార్లలో సాగు చేసిన రైతులు ప్రస్తుతం 500 హెక్టార్లలో కూడా సాగు చేయలేక చతికిలపడ్డారు.
చదవండి: (ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలు)
టైగర్ టు వెనామీ టు టైగర్
ఆంధ్రప్రదేశ్ నుంచే ఏటా 6.34 లక్షల టన్నుల (74 శాతం) రొయ్యలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో సింహపురిదే సింహభాగం వెనామీ రొయ్యలదే. అంతకు ముందు నాటు రొయ్య (టైగర్) హవా నడిచింది. ఆ తర్వాత టైగర్ రొయ్యలకు వైట్ స్పాట్ (తెల్లమచ్చ) వైరస్, ఇతరత్రా వ్యాధులు సోకడం, వ్యాధి రహిత తల్లి రొయ్యల (స్పెసిఫిక్ పాత్ జోన్ ఫ్రీ బ్రూడర్స్) ఉత్పత్తి లేకపోవడంతో “టైగర్’ శకం ముగిసింది. అదే సమయంలో విదేశాల నుంచి స్పెసిఫిక్ పాత్ జోన్ ఫ్రీ (ఎస్‌పీఎఫ్) వెనామీ బ్రూడర్స్ (తల్లి రొయ్యలు) రావడం, విస్తృత స్థాయిలో సీడ్ అందుబాటులోకి రావడంతో ఆక్వా రంగం పూర్తిగా వెనామీ వైపు మళ్లింది. ప్రస్తుతం వెనామీ రొయ్యలకు సైతం వైట్ స్పాట్, వెబ్రియా తదితర వైరస్‌లు, వ్యాధుల కారణంగా 40 కౌంట్‌లో పట్టాల్సిన 80–100 కౌంట్‌లో పట్టేయాల్సి వస్తోంది. దీంతో వెనామీ సాగు చేస్తున్న రొయ్యల రైతులు నష్టాలను చవి చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తిరిగి టైగర్ రొయ్యలు అందుబాటులోకి వస్తున్నాయి.
గుజరాత్‌లో తల్లి రొయ్యల పునరుత్పత్తి
అమెరికాలోని హవాయికి చెందిన ఓ సంస్థ ఎస్‌పీఎఫ్ టైగర్ తల్లి రొయ్యలను అభివృద్ధి పర్చడంతో తిరిగి టైగర్ శకం ప్రారంభమైంది. వాటి దిగుమతికి 2019లో కేంద్రం అనుమతి ఇవ్వడంతో దేశీయ అవసరాలకు సరిపడా బ్రూడర్స్ దిగుమతికి అవకాశాలు తక్కువగా ఉండడంతో తల్లి రొయ్యల పునరుత్పత్తి కోసం గుజరాత్‌లో బ్రూడర్ మల్టిప్లికేషన్ సెంటర్ (బీఎంసీ)ను ఆ ప్రైవేట్ సంస్థ ఏర్పాటు చేసింది. తల్లి రొయ్యల నుంచి ఉత్పత్తయ్యే సీడ్‌ను ఇక్కడ 4 నెలల పాటు పెంచి తద్వారా తల్లి రొయ్యలను పునరుత్పత్తి చేస్తోంది. వైట్‌స్పాట్‌తో పాటు ఇతర వ్యాధులను సైతం తట్టుకునేలా వాటిని అభివృద్ధి చేస్తారు. ఆ ప్రైవేట్ సంస్థ టైగర్ బ్రూడర్స్‌ను దిగుమతి చేసుకుని నెల్లూరు జిల్లాలోని వాకాడులో హేచరీ ద్వారా సీడ్ (రొయ్య పిల్లల)ను ఉత్పత్తి చేసింది. చిల్లకూరు మండలంలో కొంత మంది రైతులను ఎంపిక చేసుకుని వారికి సీడ్‌ను సరఫరా చేసి సుమారుగా 500 ఎకరాల వరకు తొలిసారిగా సాగు చేపట్టారు. 120 రోజుల క్రితం పిల్ల రొయ్యను వదలిన తర్వాత ఎలాంటి వైరస్‌లు సోకకుండా మేత సకాలం వేస్తుండడంతో అనుకున్న ఫలితం కన్నా రెట్టింపు దిగుబడి రావడంతో బ్లాక్ టైగర్ ఈ ప్రాంతంలో బాగా లాభాలు ఆర్జించి పెడుతుందన్న నమ్మకం ఏర్పడింది.
చదవండి: (సింహపురి సమరం.. టీడీపీలో ఎన్నికల భయం)
120 రోజుల్లో 15 కౌంట్ రొయ్యలు
తాజాగా అందుబాటులోకి వచ్చిన బ్లాక్ టైగర్ రొయ్యల సాగుకు ఎకరాకు లక్ష పిల్లలు మాత్రమే వదలితే సుమారు రూ.లక్ష వరకు పెట్టుబడి అవుతుంది. ఇవి 120 రోజుల్లో 15 కౌంట్ వస్తుండడంతో పాటు లాభాలు బాగా వస్తుండడంతో రైతులు పూర్తిగా టైగర్ సాగు వైపు మొగ్గు చూపేందుకు సిద్ధమవుతున్నారు. ఎకరాకు టన్ను నుంచి టన్నుర్నర దిగుబడి లభిస్తోంది. ప్రస్తుతం ఒక్కో రొయ్య పిల్ల రూపాయికి అందుబాటులో ఉంది.
లాభాలు బాగున్నాయి
పదేళ్లుగా వెనామీ సాగు చేసి ఒడిదొడుకులకు గురయ్యాం. ప్రస్తుతం బ్లాక్ టైగర్ సీడ్ అందుబాటులోకి రావడంతో సుమారు 100 ఎకరాల వరకు సాగు చేపట్టా, 120 రోజుల్లో చిన్న పాటి వైరస్ కూడా రాకపోగా 15 కౌంట్‌తో హార్వెస్ట్ చేసాను. వెనామీ 40 కౌంట్ రొయ్యలు రూ.460 ఉండగా టైగర్ 15 కౌంట్ రూ.780 ఉన్నాయి. దీంతో పెట్టుబడులు పోను లాభాలు బాగానే వస్తున్నాయి. – చిట్టేటి నారాయణ, ఆక్వా రైతు
హేచరీలు పెంచేలా ఆలోచన
బ్లాక్ టైగర్‌ను నెల్లూరు జిల్లాలో ప్రవేశ పెట్టాలని తొలిసారిగా వాకాడు ప్రాంతంలో ఒక హేచరీని లీజుకు తీసుకుని పిల్లను అందించే ప్రయత్నం చేశాం. అయితే ఆర్డర్‌లు భారీగా వస్తుండడంతో రాష్ట్రంలో విడవలూరు, విజయవాడ కరకట్ట, ఈతమొక్కల ప్రాంతాల్లో హేచరీలు ఏర్పాటు చేసి పిల్ల రొయ్యను ఉత్పత్తి చేసి రైతులకు సకాలంలో అందించేలా చేస్తాం . – జిగ్నేష్‌బాయి, హేచరీ నిర్వాహకులు
Comments
Please login to add a commentAdd a comment