simhapuri
-
చిన్న వయసు.. పెద్ద ఆలోచన
చిన్న హృదయంలో తట్టిన ఆలోచన ఎందరో మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. సేవా దృక్పథంతో 42 మంది విద్యార్థులు ఏకమై ఓ సంస్థను నెలకొల్పారు. సింహపురి చిన్నోడి మదిలో మెదిలిన ఆలోచన దేశ, విదేశాలల్లోని విద్యార్థులను కదిలించగా.. వారి దన్నుతో ఆర్థిక సంక్షోభంలో ఉన్న మహిళలను ఆదుకునేందుకు ‘స్విఫ్ట్’ సంస్థ వెలిసింది. రెండేళ్లుగా వడ్డీలేని సూక్ష్మ రుణాలను అందిస్తూ.. లండన్ ప్రిన్స్ విలియమ్స్ మనసు గెలుచుకుని.. ‘ప్రిన్స్ డయానా’ అవార్డు దక్కించుకున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు నగరంలోని రాంజీనగర్‌కు చెందిన కొరిశపాటి గోభాను శశాంకర్ అనే విద్యార్థికి పట్టుమని పదిహేడేళ్లు కూడా లేవు. మస్కట్‌లోని ఇంటర్నేషనల్ స్కూల్లో 11వ తరగతి చదువుతున్నాడు. మైక్రో ఫైనాన్స్‌పై ఆసక్తి పెంచుకుని వినూత్న సేవపై దృష్టి సారించాడు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న మహిళలను ఆదుకోవడం కోసం 2019 డిసెంబరులో ‘సస్టెయినింగ్ ఉమన్ ఇన్ మైక్రో ఫైనాన్స్ టర్మేయిల్’ (స్విఫ్ట్) పేరిట సూక్ష్మ రుణ సంస్థను ప్రారంభించాడు. దీనికి 42 మంది తోటి విద్యార్థుల మద్దతు లభించింది. వారంతా కలిసికట్టుగా పని చేస్తామని ధ్రువీకరిస్తూ విధి విధానాలను షేర్ చేసుకున్నారు. అలా ప్రారంభమైన స్విఫ్ట్ సంస్థ దినదినాభివృద్ధి చెందుతోంది. ఆన్లైన్ ద్వారా మహిళలకు వడ్డీలేని రుణాలందించాలనే లక్ష్యం మేరకు నిరాటంకంగా రుణాలందిస్తున్నారు. రెండేళ్లలో వ్యక్తిగత, గ్రూపులతో కలిసి 1,450 రుణాలను మంజూరు చేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలకు రూ.60 లక్షలను ఆన్లైన్ ద్వారా అందించారు. రూ.25 లక్షలతో ప్రారంభం విద్యార్థులతో ఏర్పాటైన ఈ సంస్థ రూ.25 లక్షలతో మైక్రో ఫైనాన్స్ కార్యకలాపాలను మొదలుపెట్టింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న మహిళలకు ఆ సంస్థ ఓ ప్రశ్నావళిని (క్వశ్చనీర్) ఆన్లైన్లోనే అందుబాటులో ఉంచుతోంది. రుణం అవసరమైన వారు దానిని నింపితే.. వారి బ్యాంక్ ఖాతాకు రుణం జమ అవుతోంది. ఇలా రుణం పొందిన మహిళలు వారు తీసుకున్న మొత్తం ఆధారంగా వాయిదాల రూపంలో తిరిగి చెల్లించాల్సి ఉంది. ఒక్కొక్కరికీ రూ.2,500 నుంచి రూ.40 వేల వరకు రుణం అందించారు. వారిలో గ్రూపులుగా ఏర్పడి రుణాలు పొందిన వారూ ఉన్నారు. స్విఫ్ట్ సంస్థకు రుణగ్రహీతల నుంచి కూడా మంచి సహకారం దక్కుతోంది. 98 శాతం మంది రుణాలు తిరిగి చెల్లిస్తున్నారు. ఇలా ప్రస్తుతం రూ.60 లక్షలను వివిధ వృత్తులు, వ్యాపారాల్లో ఉన్న మహిళలకు రుణాలుగా అందించారు. ప్రిన్స్ డయానా అవార్డుకు ఎంపిక సామాజిక దృక్పథం, మానవీయ విలువలు ఉన్న వారికి దివంగత లండన్ రాణి డయానా అవార్డును ప్రిన్స్ విలియమ్స్ ఏటా అందిస్తారు. విద్యార్థులతో ఏర్పాటైన స్విఫ్ట్ సంస్థ ఈసారి ప్రిన్స్ విలియమ్స్ మనసు గెల్చుకుంది. చిన్న వయసులో సామాజిక దృక్పథంతో.. లాభాపేక్ష లేకుండా సోషల్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా మహిళలకు అండగా నిలుస్తున్న స్విఫ్ట్ సంస్థను డయానా అవార్డుకు ఎంపిక చేశారు. ఈ విషయాన్ని స్విఫ్ట్ సంస్థకు ఈ–మెయిల్ ద్వారా తెలియజేశారు. మరింత బాధ్యత పెరిగింది ప్రిన్స్ డయానా అవార్డు దక్కడం సంతోషంగా ఉంది. మహిళలకు దన్నుగా నిలవాలనే దృక్పథంతో ఆర్థికంగా చేయూత అందిస్తూ వడ్డీ లేని సూక్ష్మ రుణాలు ఇస్తున్నాం. నా తోటి 42 మంది విద్యార్థులతో స్విఫ్ట్ సంస్థను ఏర్పాటు చేశాం. swiftmfi.org వెబ్సైట్ ద్వారా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాం. – గోభాను శశాంకర్, స్విఫ్ట్ ఫౌండర్ -
AP: పోర్టుల ఖిల్లాగా సింహపురి
చరిత్ర గడ్డగా మిగిలిపోయిన సింహపురి పోర్టుల ఖిల్లాగా మారనుంది. ఆ నాడు కృష్ణపట్నం పోర్టు, శ్రీసిటీ, మాంబట్టు, మేనకూరు సెజ్లతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఈ రోజు రామాయపట్నం పోర్టు, దగదర్తి ఎయిర్ పోర్టు, క్రిస్ సిటీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సింహపురిని ప్రపంచ పటంలో చేర్చారు. సీ, ఎయిర్‌పోర్టులతో జిల్లా పారిశ్రామికంగా, వ్యాపారపరంగా కొత్త పుంతలు తొక్కుతోంది. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, రామాయపట్నం పోర్టులతో కావలి కనకపట్నంగా మారనుంది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: విశాలమైన సాగర తీరం.. మెండుగా ఉన్న భూములు సింహపురి చరిత్ర గతిని మార్చేసింది. ఓ వైపు కృష్ణపట్నం పోర్టు, సెజ్లతో సింహపురి కీర్తి ప్రపంచస్థాయికి చేరింది. తాజాగా రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ అందుబాటులోకి రానుండడంతో పారిశ్రామికాభివృద్ధికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే రోడ్డు జల, వాయు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. సరికొత్త హంగులతో కనెక్టివిటీ పెరగడంతో పారిశ్రామికవేత్తలు ఇటు వైపు చూస్తున్నారు. భవిష్యత్‌లో జిల్లా రూపురేఖలు మారనున్నాయి. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. జిల్లాకే తలమానికంగా సోమశిల, కండలేరు జలాశయాలు, కృష్ణపట్నం పోర్టు ఉన్నాయి. మరో వైపు రామాయపట్నం పోర్టు, దగదర్తి ఎయిర్‌పోర్టులు రానున్నాయి. 850 ఎకరాల విస్తీర్ణంలో రూ.3,736 కోట్లతో మొదటి దశ నిర్మాణ పనులకు బుధవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన చేపట్టనున్నారు. రూ.10,640 కోట్ల వ్యయంతో 3,437 ఎకరాల్లో 19 బెర్త్‌లతో రామాయపట్నం పోర్టు తుది రూపు దిద్దుకోనుంది. 36 నెలల్లో పూర్తి చేసేందుకు అధికారుల కసరత్తు ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల వారికి ఓడరేవు ప్రయోజనాలు మరింత అందుబాటులోకి రానున్నాయి. ఆక్వా, గ్రానైట్, పొగాకు, ఐరన్ ఓర్ అనేక ముడి ఖనిజాలు ఎగుమతులకు ఈ పోర్టు కీలకంగా మారనుంది. నాడు కృష్ణపట్నం– నేడు రామాయపట్నం నాడు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి కృష్ణపట్నం పోర్టు నిర్మించగా, నేడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రామాయపట్నం పోర్టు నిర్మిస్తున్నారు. తండ్రి, తనయులు ఇద్దరు ఇటు ప్రజల మదిలో, అటు చరిత్రలో నిలిచేపోయేలా నౌకశ్రాయాలు ఏర్పాటు చేశారు. కందుకూరు, కావలి నియోజక వర్గాల సరిహద్దులోని రామాయపట్నం పోర్టు నిర్మాణానికి గుడ్లూరు మండలంలోని మొండివారిపాళెం, ఆవులపాళెం, కర్లపాళెం, సాలిపేట, రావూరు, చేవూరు గ్రామాల పరిధిలో మొదటి దశలో 850 ఎకరాల భూసేకరణను అధికారులు పూర్తి చేశారు. కనకపట్నంగా కావలి రామాయపట్నంపోర్టుతో ప్రధానంగా కావలి పట్టణం మరింతగా అభివృద్ధి చెందనుంది. రామాయపట్నం పోర్టు కందుకూరు నియోజకవర్గ పరిధిలో ఉన్నప్పటికీ కావలికి మరింత దగ్గరగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. కావలి తీరంలో దక్షిణం వైపు జువ్వలదిన్నె హార్బర్, ఉత్తరం వైపు రామాయపట్నం పోర్టులు నిర్మింతమవుతున్న నేపథ్యంలో ఆయా ప్రాజెక్ట్‌లకు అనుబంధంగా పరిశ్రమలు రానున్నాయి. త్వరలోనే దగదర్తి ఎయిర్‌పోర్టు కూడా అందుబాటులోకి రానున్న నేపథ్యంలో కావలి ప్రధాన పట్టణం కానుంది. భవిష్యత్‌లో కావలి కనక పట్నంగా మారుతుందని ఆ నాడు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారని, అది త్వరలోనే రుజువు కాబోతుందని గుర్తు చేస్తున్నారు. -
అజాతశత్రువుకు అశ్రునివాళి
నెల్లూరు నుంచి సాక్షి ప్రతినిధి, సాక్షి, నెల్లూరు/ ఉదయగిరి: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అకాల మృతితో సింహపురి కన్నీరుమున్నీరవుతోంది. తమ ప్రియతమ నేత పార్ధివదేహాన్ని చూసి అశేష అభిమాన జన సందోహం తల్లడిల్లిపోతోంది. అజాత శత్రువుకు అంతా అశ్రునయనాలతో శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. హైదరాబాద్‌లో హఠాన్మరణం చెందిన పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని ప్రత్యేక హెలికాప్టర్లో మంగళవారం ఉదయం 11.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి నెల్లూరుకు తరలించారు. ఆయన మాతృమూర్తి మణిమంజరి, సతీమణి శ్రీకీర్తి అదే హెలికాప్టర్లో వెంట ఉన్నారు. మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి విమానంలో తిరుపతి చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరు వచ్చారు. నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో గౌతమ్‌రెడ్డి పార్ధివ దేహం డైకాస్ రోడ్డులోని మేకపాటి కుటుంబం నివాసానికి మధ్యాహ్నం 12.15 గంటలకు చేరుకుంది. దారిపొడవునా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ‘గౌతమ్ రెడ్డి అమర్ రహే... జోహార్’ అని నివాళులర్పించారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులు తరలి రావడంతో నెల్లూరులోని దారులన్నీ మేకపాటి గృహానికే బారులు తీరాయి. ప్రజలు కడసారి సందర్శించి నివాళులు అర్పించేలా మేకపాటి నివాసం వద్ద రెండు వరుసల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. 'తల్లి'డిల్లిన కన్న పేగు గుండెలు పిండేసే శోకం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైకి గౌతమ్‌రెడ్డి భౌతిక కాయాన్ని తరలించగానే అప్పటివరకు అతికష్టం మీద నిగ్రహించుకున్న అభిమానులు, కార్యకర్తల్లో దుఃఖం కట్టలు తెంచుకుంది. తమ ప్రియతమ నేత ఆప్యాయతను తలచుకుని భోరున విలపించారు. శ్రీకీర్తి తన భర్త పార్థివ దేహాన్ని పట్టుకుని విలపించడం అందర్నీ కలచివేసింది. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. గౌతమ్‌రెడ్డి తల్లి మణిమంజరి దుఃఖంతో అడుగులు వేయలేకపోయారు. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆమెను పట్టుకుని ఇంటిలోకి తీసుకువెళ్లారు. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పరిస్థితి చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోక మానదు. విషణ్ణ వదనంతో ఉబికి వస్తున్న దుఃఖాన్ని అతికష్టం మీద నిగ్రహించుకుంటూ కూర్చుండిపోయారు. నేతలు, కార్యకర్తలు ఆయన వద్దకు వెళ్లి ఓదార్చేందుకు యత్నించారు. కాగా, ఉపముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి, జిల్లా ఇన్చార్జి మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్, శంకర్ నారాయణ, శ్రీరంగనాథరాజు, గుమ్మలూరు జయరాం, పేర్నినాని, సీదిరి అప్పలరాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం, ఏపీపీఏస్సీ చైర్మన్‌గా నియమితులైన గౌతమ్ సవాంగ్, తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతి, ఎంపీలు ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణ రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, జోగి రమేష్, అంబటి రాంబాబు, ప్రసన్నకుమార్‌రెడ్డి, కాకాణి గోవర్థన్‌రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డి, వరప్రసాద్, రాంరెడ్డి ప్రతాప్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, డా.సిద్ధారెడ్డి, ఆదిమూలం, మేరుగ నాగార్జున, శ్రీనివాసరెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, వెన్నపూస గోపాల్‌రెడ్డి, బల్లి కల్యాణ చక్రవర్తి, రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్, తదితరులు మంత్రి గౌతమ్‌రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించారు. టీడీపీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అమర్నాథ్రెడ్డి, బొజ్జల సుదీర్‌రెడ్డి, అజీజ్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సురేశ్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్‌యాదవ్ తదితరులు గౌతమ్ రెడ్డికి నివాళులర్పించారు. నేడు ఉదయగిరిలో అంత్యక్రియలు మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలను బుధవారం ఉదయగిరిలో నిర్వహించనున్నారు. నెల్లూరులోని మేకపాటి నివాసం నుంచి బుధవారం ఉదయం అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ (మెరిట్స్) ఆవరణలో ఉదయం 11.30 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. గంధపు చెక్కలతో మంత్రి పార్ధివదేహాన్ని దహనం చేస్తారు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్, కలెక్టర్ చక్రధర్‌బాబు అక్కడకు చేరుకుని ఏర్పాట్లు పూర్తి చేశారు. అంత్యక్రియలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరవుతున్న నేపథ్యంలో హెలిప్యాడ్‌ను పరిశీలించారు. గుంటూరు ఐజీ త్రివిక్రమ్‌వర్మ, ఎస్పీ విజయారావు పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. పలువురు ప్రముఖులతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉన్నందున ఉదయగిరిలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు చేపట్టారు. రూట్ మ్యాప్.. నెల్లూరులోని మేకపాటి నివాసం నుంచి ఉదయం 6 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. జొన్నవాడ మీదుగా బుచ్చి, సంగం, నెల్లూరుపాళెం, మర్రిపాడు, బద్వేలు సరిహద్దు జాతీయ రహదారి నుంచి బ్రాహ్మణపల్లి, కృష్ణాపురం, నందిపాడు మీదుగా ఉదయగిరికి చేరుకుంటుంది. సీఎం పర్యటన షెడ్యూల్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం పది గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి 10.45 గంటలకు కడప ఎయిర్‌పోర్టు చేరుకుంటారు. 10.55 గంటలకు కడప నుంచి హెలికాప్టర్లో బయల్దేరి 11.15కి అంత్యక్రియలు నిర్వహించే ఉదయగిరిలోని ఇంజనీరింగ్ కాలేజీ వద్దకు చేరుకుంటారు. 11.55 గంటలకు అక్కడి నుంచి బయల్దేరి కడప వెళతారు. నెల్లూరు చేరుకున్న కృష్ణార్జునరెడ్డి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కుమారుడు కృష్ణార్జున రెడ్డి మంగళవారం రాత్రి నెల్లూరు నగరంలోని నివాసానికి చేరుకున్నారు. అమెరికా నుంచి నేరుగా ఆయన చెన్నై చేరుకుని అక్కడి నుంచి నెల్లూరుకు వచ్చారు. తండ్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతితో కృష్ణార్జున రెడ్డి కన్నీరుమున్నీరుగా విలపించారు. గౌతమ్ మృతి రాష్ట్రానికి తీరనిలోటు ఉదయగిరి: మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం మేకపాటి కుటుంబంతో పాటు ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకేగాక రాష్ట్ర ప్రజలకు తీరని లోటని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన మంగళవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని మేకపాటి ఇంజినీరింగ్ కళాశాలలో మంత్రి అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ మేకపాటి కుటుంబంలో అత్యంత తెలివైనవాడిగా గౌతమ్‌రెడ్డికి గుర్తింపు ఉందని చెప్పారు. అతి పిన్నవయస్సులోనే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రివర్గంలో అతి ముఖ్యమైన శాఖకు మంత్రి పదవి చేపట్టి రాష్ట్రాన్ని పారిశ్రామిక అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లే తరుణంలో ఈ అకాల మరణం రాష్ట్ర ప్రజలను కలచివేసిందన్నారు. తన అన్న మేకపాటి రాజమోహన్‌రెడ్డికి అత్యంత ప్రీతిపాత్రమైన కొడుకుగా రాజకీయాల్లో ఎదుగుతున్న తరుణంలో ఈ విషాదవార్త తమ కుటుంబానికి తీరని లోటన్నారు. రాజకీయాల్లో చురుకైన వ్యక్తిగా, వివాదరహితుడిగా, నిజాయితీపరుడిగా, మచ్చలేని నాయకుడిగా ప్రతిపక్షాలు సైతం వేలెత్తి చూపలేని రాజకీయవేత్తగా గుర్తింపు పొందాడని చెప్పారు. -
శోకసంద్రంలో సింహపురి.. అజాతశత్రువు అకాల మృతితో తీవ్ర విషాదం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అజాత శత్రువుగా పేరు పొందిన మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో సింహపురి శోక సంద్రమైంది. కులమతాలు, ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా వ్యవహరించే మంత్రి గౌతమ్‌రెడ్డి ఆదర్శవంతమైన వ్యక్తిగా తనదైన ముద్ర వేసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి నచ్చిన వ్యక్తిగా, మెచ్చిన మంత్రిగా పేరు తెచ్చుకున్నారు. వివాదరహితుడిగా, విమర్శలకు దూరంగా ఉంటారు. కారు డ్రైవర్ నుంచి అధికారుల వరకు అందరినీ గౌరవించే విశిష్ట వ్యక్తిత్వం ఆయన సొంతం. నారంపేటలో పారిశ్రామికవాడ మేకపాటి గౌతమ్‌రెడ్డి తన తండ్రి రాజమోహన్‌రెడ్డి అడుగుజాడల్లో రాజకీయ రంగ ప్రవేశం చేసి 2014లో తొలిసారిగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో మరోమారు ఎమ్మెల్యేగా ఎన్నికై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టారు. మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లె ఆయన స్వగ్రామం. మేకపాటి రాజమోహన్‌రెడ్డికి ముగ్గురు కుమారులు కాగా గౌతమ్‌రెడ్డి అందరి కంటే పెద్ద. ఆయన సోదరులు విక్రమ్‌రెడ్డి, పృథీ్వరెడ్డి కేఎంసీ కాంట్రాక్టు సంస్థను నిర్వహిస్తున్నారు. బాబాయి మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. పారిశ్రామిక ప్రగతి కోసం మంత్రి గౌతమ్‌రెడ్డి విశేషంగా తపించారు. సొంత నియోజకవర్గంలో నారంపేట పారిశ్రామికవాడను నెలకొల్పారు. జిల్లా వాసులకు ఉపాధికి కొరత లేకుండా చూడాలనే సంకల్పంతో సెజ్ ఏర్పాటు చేశారు. తండ్రంటే ప్రాణం ఆత్మకూరు/మర్రిపాడు: తన తండ్రి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అంటే మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి పంచప్రాణాలు. ఆయన భావాలను పుణికి పుచ్చుకుని అదే అడుగుజాడల్లో నడిచారు. గతంలో రాజకీయాలతో పరిచయం లేకపోయినా తండ్రి పోటీ చేస్తున్న సమయంలో పలు నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతలు నిర్వహించి ప్రజలతో మమేకమయ్యారు. రాజకీయాల్లోకి ప్రవేశించాక వ్యాపార బాధ్యతలను సోదరులకు అప్పగించారు. ఏటా కుటుంబ సభ్యులతో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవటాన్ని గౌతమ్‌రెడ్డి ఆనవాయితీగా కొనసాగించారు. గత నెలలో సంక్రాంతి సందర్భంగా మూడు రోజుల పాటు ఆయన కుటుంబంతో కలసి తిరుమలలో గడిపారు. అమ్మ ఆశీర్వాదం తీసుకున్నాకే.. మంత్రి గౌతమ్‌రెడ్డికి తన తల్లి అంటే ఎంతో ప్రేమ. ఏ కార్యక్రమం చేయాలన్నా ముందు ఆమె ఆశీస్సులు తీసుకునేవారు. మాతృమూర్తి మాట జవదాటేవారు కాదు. అలాంటి అమ్మకు పుత్రశోకం కలగడంతో తీవ్ర విషాదం నెలకొంది. ట్రెక్కింగ్ ఆయన హాబీ చిన్ననాటి నుంచి స్నేహితులతో గడపడం మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి ఇష్టం. ఒకసారి మనసుకు నచ్చితే ఆ స్నేహాన్ని వదులుకోరు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఎంతో మంది స్నేహితులున్నారు. రాజకీయ, వ్యాపార, సినీ, పారిశ్రామిక రంగాల్లో ప్రముఖులంతా ఆయనకు చిరపరిచితులే. మేకపాటి గౌతమ్‌రెడ్డి నెల్లూరులో జన్మించినా బాల్యమంతా హైదరాబాద్‌లోనే గడిచింది. పదో తరగతి వరకు ఊటీలో, ఆపై హైదరాబాద్‌లో డిగ్రీ పూర్తి చేశారు. స్నేహితులతో కలసి నచ్చిన ప్రదేశాలను సందర్శించడం ఆయన అలవాటు. అంతేకాదు ట్రెక్కింగ్, హంటింగ్ , కారు ట్రక్కింగ్ ఆయన హాబీలు. రాజకీయాల్లోకి రాకముందు శనివారం సాయంత్రం నుంచి సోమవారం వరకు నచ్చిన ప్రాంతాలకు వెళ్లి గడిపేవారు. -
Tiger Prawn: మళ్లీ టైగర్ శకం
జిల్లాలో నీలి విప్లవం సృష్టించి, అంతర్జాతీయ ఆక్వా మార్కెట్లో మీసం మెలేసిన సింహపురి టైగర్ రొయ్యల సాగు శకం మళ్లీ ప్రారంభం కానుంది. సుమారు రెండు దశాబ్దాల క్రితం వరకు ఆక్వా రంగంలో తిరుగులేని రారాజుగా వెలుగొందిన టైగర్ రొయ్యలను వివిధ రకాల వైరస్లు వెంటాడడంతో కనుమరుగయ్యాయి. ఆ స్థానాన్ని వెనామీ రొయ్యలు ఆక్రమించాయి. తాజాగా వెనామీలోనూ వైరస్లు విజృంభిస్తుండటంతో రైతులు నష్టాల పాలవుతున్నారు. టైగర్ సరికొత్త బ్రీడర్తో తిరిగి రావడంతో రైతుల్లో ఆశలు మోసులు ఎత్తుతున్నాయి. వెనామీకి ప్రత్యామ్నాయంగా జిల్లాలోని ఆక్వా రైతులు టైగర్ సాగు వైపు అడుగులు వేశారు. సాక్షి, చిల్లకూరు: సింహపురిలో 1990వ దశకంలో టైగర్ రొయ్యలు నీలి విప్లవం సృష్టించాయి. దాదాపు దశా బ్దానికి పైగా డాలర్లు, యూరోలు ఆర్జించి పెట్టింది. తొలిదశలో రైతులను కోటీశ్వరులను తయారు చేసింది. కొన్నేళ్లలో వైరస్లు చుట్టుముట్టడంతో ఎంతో మంది రైతులను బికారీలను చేసింది. ఆ తర్వాత కొత్త రకం వెనామీ రావడంతో ఆక్వా సాగుదారులు అటు వైపు మళ్లారు. 2003 నుంచి 2015 వరకు వెనామీ సాగు డాలర్ల వర్షం కురిపించింది. వెనామీని సైతం పలు రకాల వైరస్లు వెంటాడుతుండడంతో దిగుబడులు తగ్గుతూ వచ్చాయి. వైరస్‌లకు యాంటీబయోటిక్స్ వాడడంతో ఎగుమతులు సన్నగిల్లాయి. నాసిరకం సీడ్ కారణంగా 120 రోజులు దాటినా కనీసం 100 కౌంట్ కూడా రాని పరిస్థితితో పెట్టుబడులు రాక అప్పులపాలవుతున్నారు. గూడూరు నియోజకవర్గంలో చిల్లకూరు, కోట, వాకాడు, చిట ్టమూరు మండలాల్లో సుమారు 2,500 హెక్టార్లలో సాగు చేసిన రైతులు ప్రస్తుతం 500 హెక్టార్లలో కూడా సాగు చేయలేక చతికిలపడ్డారు. చదవండి: (ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలు) టైగర్ టు వెనామీ టు టైగర్ ఆంధ్రప్రదేశ్ నుంచే ఏటా 6.34 లక్షల టన్నుల (74 శాతం) రొయ్యలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో సింహపురిదే సింహభాగం వెనామీ రొయ్యలదే. అంతకు ముందు నాటు రొయ్య (టైగర్) హవా నడిచింది. ఆ తర్వాత టైగర్ రొయ్యలకు వైట్ స్పాట్ (తెల్లమచ్చ) వైరస్, ఇతరత్రా వ్యాధులు సోకడం, వ్యాధి రహిత తల్లి రొయ్యల (స్పెసిఫిక్ పాత్ జోన్ ఫ్రీ బ్రూడర్స్) ఉత్పత్తి లేకపోవడంతో “టైగర్’ శకం ముగిసింది. అదే సమయంలో విదేశాల నుంచి స్పెసిఫిక్ పాత్ జోన్ ఫ్రీ (ఎస్పీఎఫ్) వెనామీ బ్రూడర్స్ (తల్లి రొయ్యలు) రావడం, విస్తృత స్థాయిలో సీడ్ అందుబాటులోకి రావడంతో ఆక్వా రంగం పూర్తిగా వెనామీ వైపు మళ్లింది. ప్రస్తుతం వెనామీ రొయ్యలకు సైతం వైట్ స్పాట్, వెబ్రియా తదితర వైరస్లు, వ్యాధుల కారణంగా 40 కౌంట్‌లో పట్టాల్సిన 80–100 కౌంట్‌లో పట్టేయాల్సి వస్తోంది. దీంతో వెనామీ సాగు చేస్తున్న రొయ్యల రైతులు నష్టాలను చవి చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తిరిగి టైగర్ రొయ్యలు అందుబాటులోకి వస్తున్నాయి. గుజరాత్లో తల్లి రొయ్యల పునరుత్పత్తి అమెరికాలోని హవాయికి చెందిన ఓ సంస్థ ఎస్పీఎఫ్ టైగర్ తల్లి రొయ్యలను అభివృద్ధి పర్చడంతో తిరిగి టైగర్ శకం ప్రారంభమైంది. వాటి దిగుమతికి 2019లో కేంద్రం అనుమతి ఇవ్వడంతో దేశీయ అవసరాలకు సరిపడా బ్రూడర్స్ దిగుమతికి అవకాశాలు తక్కువగా ఉండడంతో తల్లి రొయ్యల పునరుత్పత్తి కోసం గుజరాత్లో బ్రూడర్ మల్టిప్లికేషన్ సెంటర్ (బీఎంసీ)ను ఆ ప్రైవేట్ సంస్థ ఏర్పాటు చేసింది. తల్లి రొయ్యల నుంచి ఉత్పత్తయ్యే సీడ్‌ను ఇక్కడ 4 నెలల పాటు పెంచి తద్వారా తల్లి రొయ్యలను పునరుత్పత్తి చేస్తోంది. వైట్స్పాట్తో పాటు ఇతర వ్యాధులను సైతం తట్టుకునేలా వాటిని అభివృద్ధి చేస్తారు. ఆ ప్రైవేట్ సంస్థ టైగర్ బ్రూడర్స్‌ను దిగుమతి చేసుకుని నెల్లూరు జిల్లాలోని వాకాడులో హేచరీ ద్వారా సీడ్ (రొయ్య పిల్లల)ను ఉత్పత్తి చేసింది. చిల్లకూరు మండలంలో కొంత మంది రైతులను ఎంపిక చేసుకుని వారికి సీడ్‌ను సరఫరా చేసి సుమారుగా 500 ఎకరాల వరకు తొలిసారిగా సాగు చేపట్టారు. 120 రోజుల క్రితం పిల్ల రొయ్యను వదలిన తర్వాత ఎలాంటి వైరస్లు సోకకుండా మేత సకాలం వేస్తుండడంతో అనుకున్న ఫలితం కన్నా రెట్టింపు దిగుబడి రావడంతో బ్లాక్ టైగర్ ఈ ప్రాంతంలో బాగా లాభాలు ఆర్జించి పెడుతుందన్న నమ్మకం ఏర్పడింది. చదవండి: (సింహపురి సమరం.. టీడీపీలో ఎన్నికల భయం) 120 రోజుల్లో 15 కౌంట్ రొయ్యలు తాజాగా అందుబాటులోకి వచ్చిన బ్లాక్ టైగర్ రొయ్యల సాగుకు ఎకరాకు లక్ష పిల్లలు మాత్రమే వదలితే సుమారు రూ.లక్ష వరకు పెట్టుబడి అవుతుంది. ఇవి 120 రోజుల్లో 15 కౌంట్ వస్తుండడంతో పాటు లాభాలు బాగా వస్తుండడంతో రైతులు పూర్తిగా టైగర్ సాగు వైపు మొగ్గు చూపేందుకు సిద్ధమవుతున్నారు. ఎకరాకు టన్ను నుంచి టన్నుర్నర దిగుబడి లభిస్తోంది. ప్రస్తుతం ఒక్కో రొయ్య పిల్ల రూపాయికి అందుబాటులో ఉంది. లాభాలు బాగున్నాయి పదేళ్లుగా వెనామీ సాగు చేసి ఒడిదొడుకులకు గురయ్యాం. ప్రస్తుతం బ్లాక్ టైగర్ సీడ్ అందుబాటులోకి రావడంతో సుమారు 100 ఎకరాల వరకు సాగు చేపట్టా, 120 రోజుల్లో చిన్న పాటి వైరస్ కూడా రాకపోగా 15 కౌంట్‌తో హార్వెస్ట్ చేసాను. వెనామీ 40 కౌంట్ రొయ్యలు రూ.460 ఉండగా టైగర్ 15 కౌంట్ రూ.780 ఉన్నాయి. దీంతో పెట్టుబడులు పోను లాభాలు బాగానే వస్తున్నాయి. – చిట్టేటి నారాయణ, ఆక్వా రైతు హేచరీలు పెంచేలా ఆలోచన బ్లాక్ టైగర్‌ను నెల్లూరు జిల్లాలో ప్రవేశ పెట్టాలని తొలిసారిగా వాకాడు ప్రాంతంలో ఒక హేచరీని లీజుకు తీసుకుని పిల్లను అందించే ప్రయత్నం చేశాం. అయితే ఆర్డర్లు భారీగా వస్తుండడంతో రాష్ట్రంలో విడవలూరు, విజయవాడ కరకట్ట, ఈతమొక్కల ప్రాంతాల్లో హేచరీలు ఏర్పాటు చేసి పిల్ల రొయ్యను ఉత్పత్తి చేసి రైతులకు సకాలంలో అందించేలా చేస్తాం . – జిగ్నేష్బాయి, హేచరీ నిర్వాహకులు -
ఇదీ ఆ ఊరు కథ.. నెల్లి అంటే ఉసిరిక, నెల్లు అంటే వడ్లు!
నెల్లూరు సిటీ: నెల్లూరంటేనే మంచి ధాన్యం, నాణ్యమైన నాగరికత, పెన్నానదీ, ఆ నదీతీరాన వెలసిన రంగనాయకులస్వామీ గుర్తుకు వస్తారు. ఒకప్పుడు ఇదీ దండకారణ్యంలో ఒకభాగం. సింహాలు ఎక్కువగా ఉండేవని, అందువల్ల సింహాపురి అనే పేరు వచ్చిందని ఒక వాదన. నెల్లూరును ఎక్కువ కాలం పాలించిన పల్లవులకు ‘సింహా’ అనే బిరుదు ఉండేది. అందువల్ల ‘సింహాపురి’ అనే పేరు వచ్చిందనేది ఇంకో వాదన. బృహత్పల్లవుల్లో మొదటివాడైనా సింహవిష్ణువు తన పేరిట విక్రమ సింహపురాన్ని నిర్మించారనేది ఒక అభిప్రాయం. నెల్లూరు నగర వ్యూ ముక్కంటి రెడ్డి అనే అతడు ఒకప్పుడు ఈ ప్రాంతానికి నాయకుడిగా ఉండేవారు. అతడికి ఒకరోజు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఆ ప్రాంతంలో ఉసిరిక చెట్టు కింద గల శివలింగానికి ఆలయం కట్టించవలసిందిగా కోరాడు. ముక్కంటి రెడ్డి ఆలయం కట్టించి నిత్యోత్సవాలు జరిగే ఏర్పాటు చేశారు. ఆ ఆలయమే ఇప్పుడు మూలాపేటలో ఉన మూలస్థానేశ్వరాలయం. (చదవండి: స్టోన్‌హౌస్‌పేట.. ఆ కలెక్టర్ చేసిన సేవలకు గుర్తింపుగా) నెల్లూరు నగర వ్యూ అప్పట్లో నెల్లూరు పట్టణం మూలాపేట, రంగనాయకులపేట, సంతపేట, దర్గామిట్టలకు పరిమితమై ఉండేది. ‘నెల్లి’ అంటే ఉసిరిక చెట్టుగనుక ఆ విధంగా నెల్లూరు అనే పేరు వచ్చిందంటారు కొందరు. పినాకినీ నదీ తీరాన ఈ నగరం ఉండడంతో, వరి పంటకు ప్రసిద్ధి. నెల్లు అంటే వడ్లు గనుక వడ్లు ఎక్కువగా పండే ప్రాంతం కాబట్టి నెల్లూరు అనే పేరు వచ్చిందంటారు మరికొందరు. నెల్లూరు పట్ల ఇన్నీ రకాల అభిప్రాయాలు ఉండడం విశేషం. (చదవండి: AP Special: ప్రోత్సహిస్తే ఇత్తడి భవిత బంగారమే!) -
కరోనా: సింహపురి రెడ్‌జోన్
సాక్షి, నెల్లూరు(పొగతోట): నెల్లూరు జిల్లాను కేంద్ర ప్రభుత్వం జిల్లాలను యూనిట్‌గా తీసుకుని రెడ్‌జోన్‌గా పరిగణించింది. అయితే రాష్ట్ర స్థాయిలో భౌగోళికంగా, జనాభా పరంగా జిల్లాల విస్తీర్ణం అత్యధికం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం మండలాలను యూనిట్‌గా తీసుకుని కరోనా పాజిటివ్ కేసుల లెక్కల ప్రకారం గ్రీన్, రెడ్‌జోన్ మండలాలను విభజించింది. లాక్డౌన్ పొడిగించిన నేపథ్యంలో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఆంక్షల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సడలించిన ఆంక్షలు సోమవారం నుంచి అమలులోకి వస్తాయి. మద్యం విక్రయాలకు కంటైన్మెంట్ జోన్లలో మినహా మిగతా ప్రాంతాల్లో విక్రయించుకునేందుకు అనుమతులు ఇచ్చింది. రెడ్‌జోన్, కంటైన్మెంట్ జోన్లల్లో నిబంధనలు కఠినతరం చేయనున్నారు. కృష్ణపట్నంపోర్టు, విద్యుత్, ఆయిల్, నిత్యావసర సరుకుల పరిశ్రమలకు అనుమతి ఇచ్చింది. గ్రీన్, ఆరెంజ్ జోన్లల్లో నిత్యావసర సరుకుల షాపులు, మందుల షాపులు, అత్యవసర సేవలకు అనుమతి ఉంది. విద్యా సంస్థలు, సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్ తదితర వాటికి మాత్రం అనుమతి లేదు. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో నిత్యావసర సరుకులు, ఇతర వస్తువులు,. నాన్ ఎసెన్షియల్ వస్తువుల డెలివరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యవసర సరుకులు ఉత్పత్తి చేసే పరిశ్రమలు, మెడికల్, జూట్ మిల్లులు, ఐటీ హార్డ్‌వేర్ తదితర వాటికి అనుమతి ఇచ్చింది. పరిశ్రమల్లో పని చేసే కార్మికులందరూ మాస్క్‌లు ధరించి సామాజిక దూరం పాటించాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అన్ని పరిశ్రమలకు సడలింపులు ఇచ్చింది. పట్టణ ప్రాంతాల్లో భవన నిర్మాణ పనులు స్థానికంగా ఉండే కూలీలతో చేయించుకోవాల్సి ఉంది. ప్రైవేట్ కార్యాలయాలు 33 శాతం మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. వైద్య సేవలు, ఐటీ సేవలు, ఇంటర్ స్టేట్స్, ఇంటర్ డిస్ట్రిక్ గూడ్సు సేవలు, నిత్యావసర వస్తువుల రవాణా, బ్యాంకింగ్, కొరియర్, పోస్టల్, అంగన్వాడీ కేంద్రాలు, అత్యవసర సర్వీసులకు అనుమతి ఉంది. రెడ్జోన్లలో నాన్ ఎసెన్షియల్ వస్తువుల విక్రయాలు, ఈ–కామర్స్ సంస్థలకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు. 15 రెడ్‌జోన్ మండలాలు నెల్లూరు సిటీ, నెల్లూరురూరల్, నాయుడుపేట, వాకాడు, తడ, అల్లూరు, ఇందుకూరుపేట, బాలాయపల్లి, బోగోలు, బుచ్చిరెడ్డిపాళెం, గూడూరు, కావలి, ఓజిలి, తోటపల్లిగూడూరు, కోవూరు మండలాలు రెడ్‌జోన్ పరిధిలో ఉన్నాయి. మిగిలిన 32 మండలాలు గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ఉన్నాయి. -
ఏపీలో 300 కోట్లతో మెడికవర్ విస్తరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగంలో ఉన్న పోలండ్‌కు చెందిన మెడికవర్ ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. తాజాగా నెల్లూరులోని సింహపురి ఆసుపత్రిని కొనుగోలు చేసింది. 250 పడకల సామర్థ్యమున్న ఈ కేంద్రం కోసం సంస్థ రూ.150 కోట్లదాకా వెచ్చించింది. దీనిని 750 పడకల స్థాయికి చేర్చనున్నారు. మెడికవర్‌గా పేరు మారిన ఈ ఆసుపత్రిని సంస్థ బుధవారం ఆవిష్కరించింది. ఇక్కడే క్యాన్సర్ చికిత్సకై రూ.30 కోట్ల వ్యయంతో 100 పడకల అత్యాధునిక ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ను స్థాపించనున్నారు. ఇది సెప్టెంబరుకల్లా కార్యరూపంలోకి రానుందని మెడికవర్ సీఈవో ఫ్రెడ్రిక్ రాగ్మార్క్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో క్రియాశీలక ప్రభుత్వంతోపాటు ఉత్సాహవంతుడైన ముఖ్యమంత్రి ఉన్నారంటూ ఆయన కితాబిచ్చారు. ఏపీలో తొలుత విస్తరణ చేపడతామన్నారు. తొలి దశలో ఏపీలో రూ.300 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పారు. ఇప్పటివరకు రూ. 700 కోట్లు.. యూరప్ హెల్త్‌కేర్ దిగ్గజం మెడికవర్‌కు ఇప్పటికే వైజాగ్‌లో రెండు ఆసుపత్రులు ఉన్నాయి. ఇక్కడ 200 పడకల హాస్పిటల్‌ను కొత్తగా ఏర్పాటు చేయనుంది. దీంతో వైజాగ్‌లో సంస్థ కేంద్రాల సంఖ్య మూడుకు చేరనుంది. అలాగే శ్రీకాకుళంలో 300 పడకలతో హాస్పిటల్ రానుంది. ప్రస్తుతం మెడికవర్‌కు పలు రాష్ట్రాల్లో ఉన్న అన్ని కేంద్రాల్లో కలిపి 2,500 పడకలు ఉన్నాయి. వైజాగ్, శ్రీకాకుళం కొత్త కేంద్రాల చేరికతో 3,000 పడకల స్థాయికి చేరనుంది. అనంతపూర్, కడపలోనూ మెడికవర్ సెంటర్లు రానున్నాయి. హైదరాబాద్‌లో 500 బెడ్స్‌గల ఓ ఆసుపత్రి కొనుగోలుకై చర్చలు జరుపుతున్నట్టు మెడికవర్ ఇండియా చైర్మన్ అనిల్ కృష్ణ వెల్లడించారు. భారత్‌లో మెడికవర్ ఇప్పటి వరకు రూ.700 కోట్లు వెచ్చించిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మెడికవర్ సీఎఫ్‌వో జో ర్యాన్, సీవోవో జాన్ స్టబ్బింగ్టన్ పాల్గొన్నారు. -
సింహపురిలో ఫ్యాన్ జోరు
రాజకీయ ఉద్దండుల జిల్లా సింహపురి ఖిల్లాలో ఎన్నికల రాజకీయం వేడెక్కింది. అధికార టీడీపీ జిల్లాలో ఉనికి చాటుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతుండగా, ప్రతిపక్ష వైఎస్సార్సీపీ అన్ని స్థానాలూ గెలుచుకునేందుకు ప్రయత్నిస్తుండడంతో జిల్లాలో పూర్తిస్థాయి వాతావరణం వచ్చేసింది. 2014 ఎన్నికల్లో జిల్లా ఓటర్లు 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7 స్థానాల్లో వైఎస్సార్సీపీకి పట్టం కట్టి, టీడీపీని మూడు స్థానాలకే పరిమితం చేశారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ప్రజలనే నమ్ముకుని వైఎస్సార్సీపీ శ్రేణులు ముందుకు సాగుతుండగా, అధికార దర్పంతో, విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతూ, తద్వారా వచ్చిన డబ్బుతో ఓట్లు కొనడమే ఎజెండాగా టీడీపీ నేతలు జిల్లాలో రాజకీయాలు చేస్తున్నారు. ఇరు పార్టీలూ ఇప్పటికే బలాబలాలను బేరీజు వేసుకొని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. – సాక్షి ప్రతినిధి, నెల్లూరు రాజకీయ చరిత్ర శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు రాజకీయంగా ఘనమైన చరిత్ర ఉంది. ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులను అందించి రాష్ట్ర రాజకీయాలను అనేక సంవత్సరాల పాటు శాసించిన నేతలకు నెలవైన జిల్లాగా పేరుంది. రాజకీయంగా తొలి తరంలో బెజవాడ, ఆనం కుటుంబాలు జిల్లా రాజకీయాలపై బలమైన ముద్ర వేయగా, ఆ తరువాత ఆనం, నేదురుమల్లి, నల్లపరెడ్డి కుటుంబాలు జిల్లా రాజకీయాలను ప్రభావితం చేశాయి. ఈ జిల్లా బడా కాంట్రాక్టర్లకు ఖ్యాతి గాంచింది. ఇక్కడి బడా కాంట్రాక్టర్లు కొందరు మన దేశంతో పాటు విదేశాల్లోనూ భారీ కాంట్రాక్ట్‌లు చేస్తూ జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నారు. జిల్లాలో నెల్లూరు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నెల్లూరు పార్లమెంట్ స్థానం 1962 నుంచి 2009 వరకు ఎస్సీ రిజర్వు నియోజకవర్గంగా కొనసాగింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో జనరల్ స్థానంగా మారింది. నెల్లూరు పార్లమెంట్ పరిధిలోకి నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్, కోవూరు, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి , ప్రకాశం జిల్లాలోని కందుకూరు నియోజకవర్గం వస్తాయి. తిరుపతి పార్లమెంట్ పరిధిలో నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ సారి జిల్లాలో అధికార పార్టీ ఉనికిని బలంగా చాటుకోవడానికి కాంట్రాక్టర్లను, మంత్రులను రంగంలోకి దించింది. డబ్బుతో ఎన్నికల్లో గెలవడానికి అధికార పార్టీ అన్ని అడ్డదారులు తొక్కటం మొదలు పెట్టింది. అయితే ప్రతిపక్ష పార్టీ ప్రజాబలం ముందు ఈ ప్రయత్నాలు ఏ మేరకు నిలుస్తాయో వేచి చూడాలి. ఎందుకంటే 2014 ఎన్నికల్లో పది అసెంబ్లీ స్థానాలకు గాను 7 స్థానాలకు, రెండు పార్లమెంట్ స్థానాలకు నెల్లూరు నగర మేయర్ పీఠానికి, నెల్లూరు జిల్లా పరిషత్ పీఠానికి...ఇలా జిల్లాలో జరిగిన అన్ని ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్సీపీనే ఆదరించారు. జిల్లాలో ప్రస్తుతం అదే వాతావరణం కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి గెలుపొందిన ఏడుగురు ఎమ్మెల్యేలు కూడా మొదటి సారి అసెంబ్లీలో అడుగుపెట్టిన నేతలే కావడం గమనార్హం. నెల్లూరు నగరం నుంచి పి. అనిల్‌కుమార్ యాదవ్, నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కావలి నుంచి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి, ఆత్మకూరు నుంచి మేకపాటి గౌతమ్‌రెడ్డి, సర్వేపల్లి నుంచి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, సూళ్లూరుపేట నుంచి కిలివేటి సంజీవయ్య, గూడూరు నుంచి పాశం సునీల్‌కుమార్ గెలుపొందారు. వీరిలో పాశం సునీల్ కుమార్ తర్వాత అధికార పార్టీలోకి ఫిరాయించారు. నెల్లూరు నగర మేయర్‌గా గెలుపొందిన అబ్దుల్ అజీజ్, జిల్లా పరిషత్ చైర్మన్‌గా గెలుపొందిన బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి కూడా అధికార పార్టీలోకి ఫిరాయించారు. హోరాహోరీ పోరు నెల్లూరు పట్టణ స్థానానికి జరుగుతోన్న ఎన్నికల పోరు రాష్ట్ర స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ వైఎస్సార్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనీల్‌కుమార్ యాదవ్‌పైకి అధికార పార్టీ రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి, ఎమ్మెల్సీ పి.నారాయణను పోటీకి దించింది. గత ఐదేళ్లుగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, చిన్నపాటి సమస్యలపైన కూడా పోరాటం చేస్తూ ప్రజల పక్షాన ఉన్న ఎమ్మెల్యేగా అనిల్‌కు ప్రజల్లో మంచి పేరు ఉంది. ఎటువంటి అవినీతి ముద్ర లేని వ్యక్తిగా గుర్తింపు ఉంది. ఇక మంత్రి నారాయణ గత రెండు నెలలు మినహా మిగిలిన 4 ఏళ్ల 8 నెలల కాలం కూడా నగర ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి. జిల్లాలో మంత్రిగా ఉన్నప్పటికీ జిల్లా రాజకీయాలపై సమగ్ర అవగాహన లేకపోవడం, మంత్రి అనుచరగణం నగరంలో అందినంత వరకు దోచుకోవడం, దానికి మంత్రి పూర్తిగా మద్దతు ఇస్తుండటంతో కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అయితే ఇద్దరి మధ్య పోరు మాత్రం ఆసక్తిగా సాగే అవకాశం ఉందనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. నెల్లూరు రూరల్ బరిలో వైఎస్సార్సీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఉండగా అధికార పార్టీ నుంచి మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి బరిలోకి దిగారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజలతో మమేకమయ్యారు. గత నాలుగన్నరేళ్ల కాలంలో నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి మూడు, నాలుగు సార్లు వెళ్లడం, నిరంతరం కార్యక్రమాలు చేస్తుండటంతో నగరంలోని, డివిజన్లతో పాటు రూరల్ గ్రామాల్లో పార్టీకి బలమైన పట్టు ఉండటం ఇక్కడ వైఎస్సార్సీపీకి కలిసొచ్చే అంశం. 2014 ఎన్నికల్లో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా మాజీమంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి బరిలో నిలిచారు. ఆయన గత ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఆయన ఎంపీగా కాకుండా, ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. అయితే పార్టీలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో ఆదాలకు సుదీర్ఘకాలంగా వర్గపోరు ఉండడం, రూరల్ నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ బలంగా లేకపోవడం ఆయనకు కొంత ఇబ్బందికర వాతావరణం నెలకొంది. అయితే ఇద్దరి మధ్య పోరు ఆసక్తిగా సాగే అవకాశం ఉంది. సర్వేపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కాకాణి గోవర్థనరెడ్డి బరిలో ఉన్నారు. గతంలో జెడ్పీ చైర్మన్‌గా ఉన్న అనుభవం, సొంత ప్రాంతమే నియోజకవర్గం కావడంతో పాటు ఇక్కడ పార్టీ బలంగా ఉండడం ఆయనకు కలిసొచ్చే అంశాలు. నిరంతరం ప్రజలతో మమేకం అవుతూ క్రియాశీలక రాజకీయాలు సాగిస్తున్నారు. ఇక 2014లో ఓడిపోయి ప్రస్తుతం వ్యవసాయశాఖా మంత్రిగా ఉన్న సోమిరెడ్డి్డ మళ్లీ ఇక్కడ బరిలో నిలిచారు. ఆయన నియోజకవర్గంలో పార్టీని, క్యాడర్‌ను పూర్తిగా విస్మరించారనే అపవాదు ఉంది. దీనికి తోడు నియోజకవర్గంలో పనులు, పర్సంటేజ్లతో పాటు అవినీతి వరద పారడం ఇబ్బందికరంగా మారింది. కోవూరు వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా ఉన్న మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డికి పోటీ జరగబోతోంది. నల్లపరెడ్డి కుటుంబానికి మంచి పేరు ఉండడం, దశాబ్దాలుగా జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసిన కుటుంబానికి చెందిన నేత కావడం, నియోజకవర్గంలో పార్టీ బలంగా ఉండడం ప్రసన్న కుమార్‌కు కలిసొచ్చే అంశాలు. ఇప్పటికే అన్ని గ్రామాల్లో పర్యటించటంతో పాటు పార్టీ ఎంపీల నిధులతో అభివృద్ది కార్యక్రమాలు చేశారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి వచ్చిన నేత కావడంతో పాత టీడీపీ నేతలతో నిరంతరం విభేదాల కుంపటి కొనసాగుతూనే ఉంది. దీనికి తోడు అవినీతి కూడా తారస్థాయిలో ఉండడంతో ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కావలి వైఎస్సార్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే సభ్యుడు బీద మస్తానరావు పోటీ చేస్తున్నారు. వైఎస్సార్ సీపీకి అన్ని మండలాల్లో బలమైన క్యాడర్ ఉంది. దీంతో పాటు ఎమ్మెల్యేకి వివాదరహితుడిగా పేరుండడం కలిసొచ్చే అంశం. ఇక టీడీపీ అభ్యర్థి బీద మస్తానరావు రొయ్యల ఎగుమతి వ్యాపారంతో పాటు పలు వ్యాపారాల నిర్వహణలో ఉన్నారు. ఆయన సోదరుడు రవిచంద్ర నియోజకవర్గంలో పెత్తనం సాగించారు. ఈ క్రమంలో జలవనరుల శాఖ పనులు మొదలుకొని ప్రతి పనిలో భారీగా అవినీతి, భూఆక్రమణల వ్యవçహారాలు వారికి తలనొప్పిగా మారాయి. ఉదయగిరి వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డికి, టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకి పోటీ ఉంది. నియోజకవర్గంలోని 8 మండలాల్లో వైఎస్సార్సీపీకి మంచి పట్టు ఉండటం, చంద్రశేఖర రెడ్డి ఇక్కడ మాజీ ఎమ్మెల్యేగా పని చేసి ఉండటం కలిసొచ్చే అంశం. ఇక టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న బొల్లినేని రామారావు బడా కాంట్రాక్టర్‌గా ఉండడం, స్థానికంగా పార్టీ క్యాడర్‌కు పూర్తిగా అందుబాటులో లేకపోవడం, మçహారాష్ట్రలోని విదర్భలో కాంట్రాక్టు పనులకు సంబంధించి కేసులు, స్థానికంగా టీడీపీ నేతలకు సైతం బకాయిలు ఉండడం తదితర అంశాలు టీడీపీకి ఇబ్బందికరంగా ఉన్నాయి. దీంతో అభ్యర్థిని మారుస్తారనే ప్రచారం బలంగా సాగుతుండడంతో క్యాడర్లో గందరగోళం నెలకొంది. ఆత్మకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ ఎంపీ మేకపాటి తనయుడు గౌతమ్ రెడ్డి 2014లో ఘన విజయం సాధించారు. నియోజకవర్గంలో పార్టీకి మంచిపట్టు ఉంది. దీనికి తోడు మేకపాటి కుటుంబానికి కూడా మంచి పేరు ఉండడం కలిసొచ్చే అంశం. రెండు నెలల క్రితం వరకు కూడా టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ లేకపోవడంతో తీవ్ర గందరగోళ వాతావరణం కొనసాగింది. ఈ క్రమంలో రెండు నెలల కిత్రం టిక్కెట్ ఆశించి మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య టీడీపీ అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. అయితే ఆయనకు స్థానికంగా అందుబాటులో ఉండకపోవటం ఇబ్బందికరంగా ఉంది. వెంకటగిరి వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా ఉన్న మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణను ఢీకొట్టనున్నారు. నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకి మంచి పట్టు ఉండడం, జిల్లాలో ఆనం కుటుంబానికి రాజకీయంగా బలమైన వర్గంతో పాటు మంచి పేరు కూడా ఉండడం, ఆనం గతంలో ప్రాతినిధ్యం వహించిన రాపూరు నియోజకవర్గంలోని కొన్ని మండలాలు వెంకటగిరిలో ఉండడం ఆయనకు బాగా కలిసొచ్చే అంశాలు. సిట్టింగ్ ఎమ్మెల్యే రామకృష్ణ రెండు పర్యాయాలు వరుసగా ఎమ్మెల్యేగా ఉండి కూడా నియోజకవర్గాన్ని ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదన్న విమర్శ బలంగా ఉంది. దీనికి తోడు ఎమ్మెల్యే పెచ్చుమీరిన అవినీతి, నియోజకవర్గంలోని రెండు ప్రధాన కులాల్ని విస్మరించటం, ఆక్రమ రవాణా తదితర అంశాలు ఆయన్ను ఇబ్బంది పెడుతున్నాయి. గూడూరు ఎస్సీ వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా ప్రస్తుతం మేరిగ మురళి ఉన్నారు. 2014లో వైఎస్సార్సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది, టీడీపీలోకి ఫిరాయించిన పాశం సునీల్ కుమార్ ప్రస్తుతం అధికార పార్టీ తరుపున బరిలో నిలిచారు. ఈ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వైఎస్సార్సీపీకి బలమైన క్యాడర్ ఉంది. అలాగే ఇక్కడ బలమైన రాజకీయ కుటుంబాల వ్యక్తులు పార్టీ నేతలుగా ఉండటం పార్టీకి బాగా కలిసొచ్చే అంశం. సిట్టింగ్ ఎమ్మెల్యే పాశం అవినీతి, నియోజకవర్గంలో భూఆక్రమణలు, పాత టీడీపీ నేతలతో నిరంతర విభేదాలతో సతమతమవుతున్నారు. సూళ్లూరుపేట ఎస్సీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కిలివేటి సంజీవయ్య ఉన్నారు. నియోజకవర్గంలో పార్టీకి బలమైన క్యాడర్‌తో పాటు వైఎస్సార్ అభిమానులు ఎక్కువగా ఉన్నారు. వివాదరహిత ఎమ్మెల్యేగా, నిరంతరం ప్రజల్లో ఉండే నేతగా గుర్తింపు ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశం. టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న మాజీ మంత్రి పరసా రత్నం టీడీపీ నేతల అవినీతి, భూ ఆక్రమణలు, తారాస్థాయిలో కొనసాగుతున్న వర్గవిభేదాలు వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అలాగే రత్నంను మార్చాలని క్యాడర్ తీవ్రంగా ఆందోళన చేయడంతో ఆయన అభ్యర్థిత్వం పెండింగ్‌లో ఉంది. -
పోలీసుల అదుపులో బురిడీ బాబా
సాక్షి, నెల్లూరు : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన బురిడీ బాబా కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నెల్లూరులోని సింహపురి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బురిడీ బాబా అలియాస్ సుధాకర్ బాబాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 28 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే మిగిలిన వారిని కూడా అరెస్టు చేస్తామని, బాబా చేతిలో మోసపోయిన వారికి న్యాయం చేస్తామని డీఎస్పీ రాఘవరెడ్డి అన్నారు. నగరంలోని కిసాన్‌నగర్‌లో నివాసముంటున్న సుధాకర్ మహరాజ్ అలియాస్ టీచర్ సుధాకర్ గత ఏడాది డిసెంబర్ 13 నుంచి 108 రోజులు పాటు నిర్వహించే విధంగా నవనాథ సంప్రదాయ దత్తాత్రేయ మహామంత్ర ఇష్టకామ్య మహా యాగాన్ని ప్రారంభించారు. యాగం ప్రారంభం సమయంలో భక్తులకు వెయ్యి పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేశారు. పుస్తకంలో తాము ఇచ్చిన మంత్రం రాసి ఇవ్వాలని, హోమంలో వేయాలని ప్రచారం చేశారు. ఈ క్రమంలో భక్తుల నుంచి స్పందన తక్కువగా ఉండటంతో ఉచితంగా ఇవ్వడం ఆపేశారు. తర్వాత పుస్తకానికి వెయ్యి రూపాయల ధర నిర్ణయించారు. 14 రోజుల పాటు పుస్తకంలో మంత్రం రాసి తిరిగి పుస్తకం ఇస్తే వెయ్యికి నాలుగు వందలు అదనంగా కలిపి రూ.1,400 ఇస్తామని ప్రచారం చేశారు. ప్రచార తీవ్రతతో వేల మంది భక్తులు వచ్చారు. శివరాత్రి సమీపిస్తుండటంతో చివరి రెండు రోజుల్లో రూ.1,400ను రూ.1,500 గా ప్రకటించటంతో భక్తులు సుమారు రూ.3.70 కోట్ల విలువైన పుస్తకాలు కొనుగోలు చేశారు. దీంతో శివరాత్రికి ముందు రెండు రోజులు.. అంటే గత నెల 14,15 తేదీల్లో సుమారు రూ.2 కోట్లు వసూలు చేశారు. సుధాకర్‌కు సహాయకురాలిగా వచ్చిన వాసవి రూ. కోట్లు డబ్బు కనిపించటంతో 15వ తేదీ రాత్రి ఆ నగదుతో పరారైంది. దీంతో భక్తులంతా డబ్బుల కోసం ప్రశ్నించటంతో సుధాకర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. -
కోరలు చాస్తున్న నేర సంస్కృతి
► హత్యలతో అట్టుడుకుతోన్న సింహపురి ► నిఘా, దర్యాప్తుల్లో పోలీసు శాఖ వైఫల్యం ► భయం గుప్పెట్లో ప్రజలు జిల్లాలో నేరసంస్కృతి పడగ విప్పుతోంది. పోలీసు వ్యవస్థ మెతక వైఖరి, నిఘా, దర్యాప్తుల్లో వైఫల్యాలను ఆసరాగా చేసుకొని అసాంఘిక శక్తులు విజృంభిస్తున్నాయి. దోపిడీలు, హత్యలు, కిడ్నాప్లతో అట్టడుకుతోంది. పొట్టపోసుకొనే వృత్తుల్లాగే ప్రాణాలు తీసే నేర ప్రవృత్తి సమాజంలో వెళ్లూనుకుపోతోంది. దుండగులు నేరాలు చేసి సునాయాసంగా తప్పించుకొంటున్నారు. వీరిని పోలీసులు పట్టుకోలేకపోతున్నారు. కొన్ని ఘటనల్లో కొందరు నిందితులు వారికి వారే పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. నెల్లూరు(క్రైమ్) : జిల్లాలో నేరాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు భద్రత కరువైందన్న విషయం స్పష్టమవుతోంది. మారుమూల పల్లెలో శాంతిభద్రతల పరిరక్షణ సంగతి దేవుడెరుగు..హైటెక్ వసతులు..అధికార యంత్రాగంమంతా కేంద్రీకృతమైన నెల్లూరు నగరం, పట్టణాల్లో సైతం శాంతిభద్రతల పరిరక్షణ కష్టతరంగా మారింది. పాతకక్షలు, వివాహేతర సంబంధాలు, ఆస్థి తగాదాలు, సులభంగా డబ్బు సంపాదించాలనే తృష్ణతో హత్యలు చోటుచేసుకుంటున్నాయి. డబ్బుకోసం అయిన వారిని, స్నేహితులను కిడ్నాప్ చేసి కడతేర్చిన సంఘటనలు మానవీయ విలువల దిగజారుడు తనానికి పరాకాష్ణగా నిలుస్తున్నాయి. ఇక మహిళల భద్రత మిథ్యగా మారిందనే చెప్పాలి. ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకొని దుండగులు పెట్రేగిపోతున్నారు. వారిని కిరాతకంగా హతమార్చి ఒంటిపైనున్న నగలను దోచుకెళ్లిన ఘటనలు మహిళలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. క్రికెట్ బెట్టింగ్‌లు, మద్యానికి బానిసైన యువకులు నగదు కోసం వ్యక్తులను కిడ్నాప్ చేసి హత్యలకు తెగబడుతున్నారు. గడిచిన నెలన్నర రోజుల వ్యవధిలో 10కి పైగా హత్యలు, 32కు పైగా హత్యాయత్నాలు జరిగాయంటే పరిస్థితి తీవ్రత ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దిగజారిన మానవీయ విలువలు కడుపున పుట్టినవారు, జీవితాంతం బాసటగా ఉంటానన్నవారే తమ వారిని అతి కిరాతకంగా హత్యచేస్తున్నారు. విహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను భార్యే ప్రియునితో కలిసి దారుణంగా హత్యచేసిన సంఘటన మానవీయ విలువల పతనానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ముదిగేడు గ్రామంలో డబ్బుల కోసం యానాదిరెడ్డిని భార్య లీలమ్మ, కొడుకు శేఖర్‌రెడ్డి దారుణంగా హత్యచేశారు. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో ఆటోడ్రైవర్ నాగార్జునను భార్య కామేశ్వరి ఆమె ప్రియుడు వినోద్ దారుణంగా హత్యచేశారు. ఇక మహిళలు, చిన్నారులపై లైంగికదాడులు, దాడియత్నాలు సభ్యసమాజం తలదించుకొనేలా చేస్తున్నాయి. పెరుగుతోన్న కిరాయి సంస్కృతి కిరాయి హత్యలు రోజురోజుకూ పెరుగుతోన్నాయి. ఆర్థిక విబేధాలు, పాతకక్షల నేపథ్యంలో చిల్లకూరు మండలం ఉడతావారి పార్లపల్లికి చెందిన గొడ్డటి కోటేశ్వరరావును అదే గ్రామానికి చెందిన గొడ్డటి భరత్ కిరాయి హంతకులచే హత్యచేయించాడు. జలదంకి మండలం కమ్మవారిపాలెంకు చెందిన పరిమితి నాయుడుబాబును బ్రాహ్మణక్రాకకు చెందిన ఆదెమ్మ కిరాయి వ్యక్తులచే కిడ్నాప్ చేయించి డబ్బులు డిమాండ్ చేసింది. అతికష్టంపై నాయుడుబాబు వారినుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 26వ తేదిన సైదాపురానికి చెందిన కొప్పు వెంకటేశ్వర్లును అదే ప్రాంతానికి చెందిన యువకులు కిడ్నాప్‌చేశారు. అదే రోజు వెంకటేశ్వర్లు భార్య సుప్రజ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే అతను ప్రాణాలతో బయటపడి ఉండేవాడు. వెంకటాచలం మండలం గుడ్లూరువారిపాలెంకు చెందిన శ్రీనివాసులును పాతకక్షల నేపథ్యంలో ప్రత్యర్ధులు కిడ్నాప్‌చేసి దారుణంగా హత్యచేశారు. నెల్లూరు రూరల్ మండలం చింతారెడ్డిపాలెం డొంకకు చెందిన టి. నాగార్జునను దుండగులు కిడ్నాప్ చేసి దగతర్తి మండలం కొత్తపల్లికౌరుగుంట సమీపంలోని గ్రావెల్ క్వారీ సమీపంలో దారుణంగా హత్యచేశారు. ఆర్థికలావాదేవీల నేపథ్యంలో బంగ్లాతోటకు చెందిన ఆటోడ్రైవర్రాజేషన్ను స్నేహితులే మట్టుబెట్టారు. కునుకేసిన నిఘా.. అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు, నేరగాళ్లు జిల్లాలో పాగావేసి తమ నేరసామ్రాజ్యాన్ని విస్తృతం చేస్తున్నారు. నేరగాళ్ల కదలికలను పసిగట్టడంలో నిఘా వ్యవస్థ విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ వైపు పోలీసులు కేసు విచారణలో నిమగ్నమై ఉండగానే మరో వైపు దుండగులు పెట్రేగిపోతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. నగరంలోని ఉస్మాన్‌సాహెబ్‌పేటలో విశ్రాంత అధ్యాపకురాలిని దుండగులు దారుణంగా హత్యచేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను అపహరించుకొని వెళ్లారు. తడ మండలం తడకండ్రిగలో పట్టపగలు సావిత్రమ్మ అనే మహిళను గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్యచేశారు. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు నిఘా వ్యవస్థును మరింత పటిష్టం చేస్తే నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. -
కళలకు పుట్టినిల్లు సింహపురి
నెల్లూరు(బారకాసు): కళారంగానికి పుట్టినిల్లు సింహపురి అని, ఇక్కడి నుంచి అనేక మంది కళాకారులు తమ ప్రతిభతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారని 25 కళాసంఘాల గౌరవాధ్యక్షుడు, రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అమరావతి కష్ణారెడ్డి పేర్కొన్నారు. టౌన్హాల్లో ఆదివారం జరిగిన శాంతి కల్చరల్స్ 14వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. ప్రాధాన్యం ఉన్న కళలు ప్రస్తుతం కనుమరుగయ్యే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కళాకారులను ప్రభుత్వం ప్రోత్సాహించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఇంట్లో గజ్జెల సవ్వడి వినిపించాలని కాంక్షించారు. శాంతి కల్చరల్స్ అధినేత, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ అమానుల్లాఖాన్ తన వారుసుడ్ని కళారంగం వైపు ప్రోత్సహిస్తూ అందరికి స్ఫూర్తిగా నిలవడాన్ని అభినందించారు. అనంతరం వివిధ రంగాల్లో తమ వంతు సేవలందించిన ముగ్గురు ప్రముఖులు బాలబ్రహ్మయ్య, అబ్దుల్లా, వల్లూరు కొండపనాయుడ్ని ఘనంగా సత్కరించారు. సినీ గీతాలు, డ్యాన్స్‌లు, ఏకపాత్రాభినయ పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. సాయిరాగాంజలి ఆర్కెస్ట్రా వారితో నిర్వహించిన మెగా మ్యూజికల్ నైట్ అలరించింది. పవిత్ర చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు గాలి కిరణ్‌కుమార్, గజల్ గానలహరి నాగరాజారావు, రాజేశ్వరరావు, సురేష్‌బాబు, రమేష్‌బాబు, నల్లమల్లి సత్యనారాయణ, మదార్, మున్వర్‌ఖాన్, తదితరులు పాల్గొన్నారు. -
సింహపురిగా ఇక నెల్లూరు
నెల్లూరు: నెల్లూరు పేరు సింహపురిగా మారుస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు ప్రకటించారు. శనివారం నగరంలోని స్థానిక కరెంట్ ఆఫీస్ సెంటర్లో సర్థార్ వల్లభాయ్‌పటేల్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం వెంకయ్య మాట్లాడుతూ... నెల్లూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తామన్నారు. నెల్లూరు నగర అభివృద్దికి సహకరించాలని స్థానిక ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అభివృద్ధిలో భాగంగా రోడ్డు విస్తరణను అడ్డుకోవద్దని సూచించారు. అందరు సహకరిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని వెంకయ్యనాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, జడ్పీ ఛైర్మన్ రాఘవేంద్రరెడ్డితోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
అశాంత సింహపురి
నెల్లూరు(క్రైమ్): ప్రశాంతతకు మారుపేరైన సింహపురి క్రమేణా అశాంతపురిగా మారుతోంది. వరుస రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు, హత్యలతో జిల్లా వాసులు భయాందోళనకు గురవుతున్నారు. పారిశ్రామికంగా జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అంతేవేగంగా ఆర్థిక నేరాలు పెరిగిపోతున్నాయి. మునుపెన్నడూలేని విధంగా కిరాయి హత్యలు, కిడ్నాప్‌ల సంస్కృతి పెచ్చుమీరుతోంది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమస్యల నేపథ్యంలో కొందరు ఆత్మహత్యకు పాల్పడుతుండగా మరికొందరు హత్యలకు గురవుతున్నారు. చిన్నచిన్న సమస్యలకే కొందరు క్షణికావేశానికి లోనై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇక రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు ఎవరిని ఎలా కబళిస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. మొత్తం మీద ప్రజలు క్షణక్షణం భయంభయంగా గడుపుతున్నారు. 15రోజుల వ్యవధిలో జిల్లాలో 13 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందగా 50మందికి పైగా క్షతగాత్రులయ్యారు. వేర్వేరు ఘటనల్లో రైలు ఢీకొని ముగ్గురు మృతిచెందారు. కన్నతండ్రి తీవ్ర అనారోగ్యం పాలవడాన్ని జీర్ణించుకోలేని ఇద్దరు అన్నదమ్ములు రైలుకిందపడి ఆత్మహత్యచేసుకున్నారు. నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. అనుమానమో? కుటుంబకలహాలో? ఆర్థిక ఇబ్బందులో? మరే ఇతర కారణమో తెలియదు కాని తొమ్మిది మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. పరిణితి చెందని వయస్సులో ప్రేమ వ్యామోహంలో పడి ముగ్గురు యువతులు ఇళ్ల నుంచి వెళ్లిపోగా, కారణమేంటో తెలియదు కానీ మరో యువతి కళాశాల నుంచి ఎటో వెళ్లిపోయింది. ఆర్థిక లావాదేవీల్లో నెలకొన్న విబేధాల కారణంగా ఓ యువకుడ్ని కొందరు కిడ్నాప్ చేశారు. మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఓ వ్యక్తిపై దాడిచేసిన కొందరు వ్యక్తులు అతడి భార్యపై లైంగికదాడికి యత్నించారు. కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ వృద్ధుడు(70) మునిమనమురాలి వయస్సు చిన్నారి(5)పై లైంగికదాడికి యత్నించాడు. వర్షాకాలం కావడంతో విద్యుదాఘాతం రూపంలో పలువురిని మృత్యువు బలితీసుకుంటోంది. వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు విద్యుదాఘాతానికి గురై మృతిచెందారు. మరోవైపు దొంగలు చెలరేగిపోతున్నారు. ఓ వైపు పోలీసులు వివిధ రకాల చర్యలు చేపడుతున్నా, మరోవైపు యథేచ్ఛగా తమ హస్తలాఘవాన్ని ప్రదర్శిస్తున్నారు. 15 రోజుల వ్యవధిలో జిల్లాలో 315 సవర్ల బంగారు ఆభరణాలు, 13 కిలోల వెండి, రూ.6 లక్షల నగదు అపహరణకు గురయ్యాయి. కొన్ని ఘటనలు నవంబర్ 1వ తేదీ: కుటుంబకలహాల నేపథ్యంలో నెల్లూరు ట్రంకురోడ్డుకు సమీపంలోని ఓ లాడ్జిలో గోళ్ల గణేష్ ఆత్మహత్య. - 5వ తేదీ : పొదలకూరు ఇనుకుర్తి దళితవాడ వద్ద ఆటోను ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో మస్తాన్, రామయ్య దుర్మరణం. అదే రోజు కలిగిరి మండలం పెదపాడు సమీపంలో వ్యాను, ఆటో ఢీకొన్న ఘటనలో మహ్మద్ నిజార్, దరియాబీ, వినోద్, నాగిశెట్టి శ్రీనివాసులు మృతి. 7వ తేదీ: కుటుంబకలహాల నేపథ్యంలో నెల్లూరు వెంగళరావునగర్‌లో చాన్‌బాషా దారుణహత్య. 7వ తేదీ మనుబోలులోని పవర్‌గ్రిడ్ క్వార్టర్స్‌లో దొంగలు పడి రూ.కోటి విలువైన సొత్తు అపహరణ. అదే రోజు ఐటీ అధికారులమంటూ కోటలో వృద్ధ దంపతుల నుంచి నగదు, ఆభరణాల దోపిడీ. 8వ తేదీ నెల్లూరు రామ్మూర్తినగర్‌లో ఐదేళ్ల చిన్నారిపై రామసుబ్బయ్య(70) లైంగికదాడికియత్నం. అదే రోజు గూడూరు మండలం వేములపాళెం సమీపంలో ఓ వ్యక్తిపై ఇద్దరు దాడి చేసి అతని భార్యపై లైంగికదాడికి యత్నం. 9వ తేదీ: ఓ యువతితో స్నేహం మానుకోకపోతే అంతుచూస్తామని బెదిరించడంతో జలదంకి మండలంలో చెక్కా చెన్నకేశవ ఆత్మహత్య. 10వ తేదీ నెల్లూరు మాగుంట లేఅవుట్లోని ఓ హాట్ఫుడ్స్ సెంటర్లో మోటారు వేసేందుకు మిద్దెపైకి వెళ్లి విద్యుదాఘాతానికి గురై మాతయ్య మృతి. 11వ తేదీ సైదాపురం మండలం ఊటుకూరులో వివాహిత సురేఖ అనుమానాస్పద మృతి. 11వ తేదీ తండ్రి తీవ్ర అనారోగ్యానికి గురవడంతో తమిళనాడుకు చెందిన ఇద్దరు యువకులు నెల్లూరు నక్కలోళ్ల సెంటర్ సమీపంలో రైలుకింద పడి ఆత్మహత్య 13వ తేదీ నెల్లూరులోని టీడీపీ కార్యాలయం సమీపంలో ఉన్న పాతకాలువ కట్ట ప్రాంతంలో దంపతుల ఆత్మహత్యాయత్నం. -
శాంతాసిన్హాకు ‘బెగోరె’ అవార్డు ప్రదానం
నెల్లూరు, న్యూస్‌లైన్ : ప్రముఖ సామాజిక కార్యకర్త, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, పద్మశ్రీ శాంతాసిన్హాకు మాజీ ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్‌రెడ్డి స్మారక అవార్డును ఆదివారం నెల్లూరులోని పురమందిరంలో అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, సింహపురి ఆడపడచు శాంతాసిన్హాకు ఇలాంటి గొప్ప అవార్డును ప్రదానం చేయడం సింహపురికే గర్వకారణమన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు శాంతాసిన్హా చేస్తున్న సేవలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతిఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అవార్డు గ్రహీత శాంతాసిన్హా మాట్లాడుతూ, తన జీవితంలో ఎన్నో అవార్డులను అందుకున్నానని, ఈ అవార్డు మాత్రం మనసుకు హత్తుకుందన్నారు. బెజవాడ గోపాల్‌రెడ్డితో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అవార్డు ప్రదానం చేసిన వారిలో ప్రముఖ పారిశ్రామిక వేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.