సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అజాత శత్రువుగా పేరు పొందిన మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో సింహపురి శోక సంద్రమైంది. కులమతాలు, ప్రాంతాలు, రాజకీయాలకు అతీతంగా వ్యవహరించే మంత్రి గౌతమ్‌రెడ్డి ఆదర్శవంతమైన వ్యక్తిగా తనదైన ముద్ర వేసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి నచ్చిన వ్యక్తిగా, మెచ్చిన మంత్రిగా పేరు తెచ్చుకున్నారు. వివాదరహితుడిగా, విమర్శలకు దూరంగా ఉంటారు. కారు డ్రైవర్ నుంచి అధికారుల వరకు అందరినీ గౌరవించే విశిష్ట వ్యక్తిత్వం ఆయన సొంతం.
నారంపేటలో పారిశ్రామికవాడ
మేకపాటి గౌతమ్‌రెడ్డి తన తండ్రి రాజమోహన్‌రెడ్డి అడుగుజాడల్లో రాజకీయ రంగ ప్రవేశం చేసి 2014లో తొలిసారిగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019లో మరోమారు ఎమ్మెల్యేగా ఎన్నికై సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టారు. మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లె ఆయన స్వగ్రామం. మేకపాటి రాజమోహన్‌రెడ్డికి ముగ్గురు కుమారులు కాగా గౌతమ్‌రెడ్డి అందరి కంటే పెద్ద. ఆయన సోదరులు విక్రమ్‌రెడ్డి, పృథీ్వరెడ్డి కేఎంసీ కాంట్రాక్టు సంస్థను నిర్వహిస్తున్నారు. బాబాయి మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. పారిశ్రామిక ప్రగతి కోసం మంత్రి గౌతమ్‌రెడ్డి విశేషంగా తపించారు. సొంత నియోజకవర్గంలో నారంపేట పారిశ్రామికవాడను నెలకొల్పారు. జిల్లా వాసులకు ఉపాధికి కొరత లేకుండా చూడాలనే సంకల్పంతో సెజ్ ఏర్పాటు చేశారు.
తండ్రంటే ప్రాణం
ఆత్మకూరు/మర్రిపాడు: తన తండ్రి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అంటే మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి పంచప్రాణాలు. ఆయన భావాలను పుణికి పుచ్చుకుని అదే అడుగుజాడల్లో నడిచారు. గతంలో రాజకీయాలతో పరిచయం లేకపోయినా తండ్రి పోటీ చేస్తున్న సమయంలో పలు నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతలు నిర్వహించి ప్రజలతో మమేకమయ్యారు. రాజకీయాల్లోకి ప్రవేశించాక వ్యాపార బాధ్యతలను సోదరులకు అప్పగించారు. ఏటా కుటుంబ సభ్యులతో కలసి తిరుమల శ్రీవారిని దర్శించుకోవటాన్ని గౌతమ్‌రెడ్డి ఆనవాయితీగా కొనసాగించారు. గత నెలలో సంక్రాంతి సందర్భంగా మూడు రోజుల పాటు ఆయన కుటుంబంతో కలసి తిరుమలలో గడిపారు.
అమ్మ ఆశీర్వాదం తీసుకున్నాకే..
మంత్రి గౌతమ్‌రెడ్డికి తన తల్లి అంటే ఎంతో ప్రేమ. ఏ కార్యక్రమం చేయాలన్నా ముందు ఆమె ఆశీస్సులు తీసుకునేవారు. మాతృమూర్తి మాట జవదాటేవారు కాదు. అలాంటి అమ్మకు పుత్రశోకం కలగడంతో తీవ్ర విషాదం నెలకొంది.
ట్రెక్కింగ్ ఆయన హాబీ
చిన్ననాటి నుంచి స్నేహితులతో గడపడం మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి ఇష్టం. ఒకసారి మనసుకు నచ్చితే ఆ స్నేహాన్ని వదులుకోరు. అందుకే తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఎంతో మంది స్నేహితులున్నారు. రాజకీయ, వ్యాపార, సినీ, పారిశ్రామిక రంగాల్లో ప్రముఖులంతా ఆయనకు చిరపరిచితులే. మేకపాటి గౌతమ్‌రెడ్డి నెల్లూరులో జన్మించినా బాల్యమంతా హైదరాబాద్‌లోనే గడిచింది. పదో తరగతి వరకు ఊటీలో, ఆపై హైదరాబాద్‌లో డిగ్రీ పూర్తి చేశారు. స్నేహితులతో కలసి నచ్చిన ప్రదేశాలను సందర్శించడం ఆయన అలవాటు. అంతేకాదు ట్రెక్కింగ్, హంటింగ్ , కారు ట్రక్కింగ్ ఆయన హాబీలు. రాజకీయాల్లోకి రాకముందు శనివారం సాయంత్రం నుంచి సోమవారం వరకు నచ్చిన ప్రాంతాలకు వెళ్లి గడిపేవారు.
Comments
Please login to add a commentAdd a comment