లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించి అన్నదాత ముఖాల్లో ఆనందం చూడాలనే సంకల్పంతో దివంగత నేత వైఎస్సార్ సంగం బ్యారేజ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అనంతరం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు వివిధ కారణాలతో బ్యారేజ్ నిర్మాణ పనులపై నిర్లక్ష్యం చూపాయి. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టాక తండ్రి ఆశయాన్ని నెరవేరుస్తూ రైతులకు అవసరమైన మేర సాగునీరందించాలనే లక్ష్యంతో సంగం బ్యారేజ్ నిర్మాణాన్ని పూర్తి చేసి రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
సంగం: రైతులకు ఇచ్చిన మాటను నెరవేర్చేందుకు అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశేష కృషి చేశారు. వీరి కృషి ఫలితంగానే సంగం వద్ద మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్ నిర్మితమై రైతుల పొలాలకు సాగునీరు అందుతుండడంతో వారి ఆనందానికి అవధులు లేవు. 2004వ సంవత్సరంలో సంగంకు వచ్చిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు, ప్రజలు సంగం వద్ద పెన్నానదిపై నిర్మించిన ఆనకట్ట శిథిలమైందని, బ్యారేజ్‌ను నిర్మించాలని విన్నవించారు.
అప్పటికే ఉన్న పాత ఆనకట్టను నిర్మించి 125 సంవత్సరాలు దాటడంతో ప్రమాదకరంగా తయారైంది. ఆనకట్ట దెబ్బతింటే లక్షలాది మంది రైతులు ఇబ్బందులు పడతారని గ్రహించిన ఆయన 2006లో సంగం వద్ద రూ.90 కోట్ల నిర్మాణ వ్యయంతో నూతన బ్యారేజ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టి శంకుస్థాపన చేశారు. మొదట్లో బ్యారేజ్ నిర్మాణం గిట్టుబాటు కాదని కాంట్రాక్టర్ నిర్మాణం చేపట్టకపోవడంతో వైఎస్సార్ అధికారులతో చర్చించి 2008లో బ్యారేజ్ నిర్మాణ వ్యయాన్ని రూ.110 కోట్లకు పెంచి మరో సంస్థకు పనులు అప్పగించారు. దీంతో నూతన బ్యారేజ్ నిర్మాణ పనులు జోరందుకున్నాయి. 2009లో వైఎస్సార్ అకాల మృతితో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం సంగం బ్యారేజ్ నిర్మాణంపై శీతకన్ను వేయడంతో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చెందారు.
టీడీపీ హయాంలో కాలయాపన
2009లో వైఎస్సార్ మృతి అనంతరం వచ్చిన ముఖ్యమంత్రులు బ్యారేజ్ నిర్మాణంపై సక్రమంగా దృష్టి సారించలేదు. దీంతో పనులు నత్తనడకన సాగాయి. తదుపరి 2014లో ఏర్పాటైన తెలుగుదేశం ప్రభుత్వం సైతం బ్యారేజ్ నిర్మాణం పూర్తయితే జిల్లాలోని 6 నియోజకవర్గాల్లోని అన్నదాతల దృష్టిలో వైఎస్సార్ దేవుడవుతారనే భయంతో పనులు సక్రమంగా జరగకుండా ప్లాన్, డిజైన్ల మార్పుల పేరుతో కాలయాపన చేసింది. దీంతో బ్యారేజ్ నిర్మాణం ఇక జరగదని రైతులు భావించారు.
హామీ ఇచ్చి.. ధైర్యం నింపి..
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా అప్పట్లో ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంగం వచ్చి అసంపూర్తిగా ఉన్న బ్యారేజ్ నిర్మాణ పనులను పరిశీలించారు. తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే త్వరగా బ్యారేజ్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఆత్మకూరు నియోజకవర్గ సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేసిన వైఎస్సార్‌సీపీ నేత మేకపాటి గౌతమ్‌రెడ్డి సైతం సంగం బ్యారేజ్‌ను తమ ప్రభుత్వంలో పూర్తి చేస్తామని చెప్పారు.
ఆనందంలో అన్నదాతలు
నూతన బ్యారేజ్‌ను ప్రారంభించిన తరువాత రెండు పంటలు పండించుకుంటున్న అన్నదాతల్లో ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. జిల్లాలోని ఆత్మకూరు, సర్వేపల్లి, కావలి, నెల్లూరు, నెల్లూరురూరల్, కోవూరు నియోజకవర్గాల్లో 5 లక్షల ఎకరాలకు పైగా అధికార ఆయకట్టు రైతులకు, అనధికారికంగా మరో లక్ష ఎకరాలకు పైగా ఆయకట్టుకు నూతన బ్యారేజ్ ద్వారా సాగునీటి సరఫరా జరుగుతోంది. కావలి, నెల్లూరు పట్టణ ప్రజలకు తాగునీరు సైతం ఇక్కడి నుంచే సరఫరా చేస్తున్నారు. దీంతోపాటు బ్యారేజ్ వద్ద 0.5 టీఎంసీల నీరు నిల్వ ఉండడంతో భూగర్భజలాలు పెరిగి సంగం ప్రాంతంలో సాగు, తాగునీటి సమస్యలు తొలగిపోయాయని రైతులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నూతన బ్యారేజ్ నిర్మాణ పనులు పరుగులు పెట్టాయి. తన తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను, కాంట్రాక్ట్ సంస్థలను సమన్వయపరిచి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తూ బ్యారేజ్ నిర్మాణ పనులను వేగవంతం చేశారు. అంతేకాకుండా 850 మీటర్లు ఉన్న బ్యారేజ్‌ను 1185 మీటర్లకు పైగా పెంచి రూ.340 కోట్ల వ్యయంతో నిర్మించేలా చర్యలు తీసుకున్నారు. అప్పటి ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సైతం ఆత్మకూరు తన నియోజకవర్గం కావడంతో సంగం బ్యారేజ్ నిర్మాణం త్వరగా పూర్తి చేసేందుకు పూనుకున్నారు. ఇరిగేషన్‌శాఖ మంత్రిగా ఉన్న పి.అనిల్‌కుమార్‌యాదవ్ సైతం బ్యారేజ్‌ను పరిశీలించి పనులు వేగవంతం చేశారు. తండ్రి వైఎస్సార్ ఇచ్చిన మాటను కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేరుస్తూ బ్యారేజ్ నిర్మాణాన్ని పూర్తి చేయించారు. ఈ సమయంలో ఐటీ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంతో సంగం బ్యారేజ్‌కు ఆయన పేరు పెడుతూ 2022 సెప్టెంబర్ 6వ తేదీన బ్యారేజ్‌ను ప్రారంభించి స్నేహధర్మాన్ని సైతం చాటుకున్నారు.
రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు
మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్ వల్ల జిల్లాలోని 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాం. పాత ఆనకట్ట శిథిలమైన సమయంలో సాగునీరు అందించాలంటే ఆనకట్ట వద్ద ఇసుక బస్తాలు వేసి నీరు సరఫరా పరిస్థితి ఉండేది. ప్రస్తుతం బ్యారేజ్ నిర్మాణం పూర్తి కావడం వల్ల జిల్లాలోని రైతాంగానికి పూర్తిగా సాగునీరు, అవసరమైన చోట్ల తాగునీటిని సైతం అందిస్తున్నాం.
– మేకల అనిల్‌కుమార్‌రెడ్డి,
రుణపడి ఉన్నారు
సంగం బ్యారేజ్‌కు శంకుస్థాపన చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డికి, బ్యారేజ్ నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జిల్లా రైతాంగం, ప్రజలు రుణపడి ఉన్నారు. 5 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు సరఫరా అవుతుండడం చాలా సంతోషకరం.
– పులగం శంకర్‌రెడ్డి. అన్నారెడ్డిపాళెం, సంగం
అపర భగీరథుడు వైఎస్సార్
సంగం వద్ద పాత ఆనకట్ట శిథిలావస్థకు చేరడంతో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నూతన బ్యారేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి మా ప్రాంతానికి నీరందించేలా కృషి చేసిన అపర భగీరథుడు. ఎన్ని ప్రభుత్వాలు మారినా బ్యారేజ్ నిర్మాణాన్ని ఆయన కుమారుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి చేసి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు.
– మెట్టుకూరు వాసుదేవరెడ్డి, సంగం
Comments
Please login to add a commentAdd a comment