గౌతమ్‌రెడ్డి పార్థివదేహాన్ని నెల్లూరులోని నివాసంలోకి తరలిస్తున్న ప్రజలు
నెల్లూరు నుంచి సాక్షి ప్రతినిధి, సాక్షి, నెల్లూరు/ ఉదయగిరి: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అకాల మృతితో సింహపురి కన్నీరుమున్నీరవుతోంది. తమ ప్రియతమ నేత పార్ధివదేహాన్ని చూసి అశేష అభిమాన జన సందోహం తల్లడిల్లిపోతోంది. అజాత శత్రువుకు అంతా అశ్రునయనాలతో శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. హైదరాబాద్‌లో హఠాన్మరణం చెందిన పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని ప్రత్యేక హెలికాప్టర్‌లో మంగళవారం ఉదయం 11.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి నెల్లూరుకు తరలించారు.
ఆయన మాతృమూర్తి మణిమంజరి, సతీమణి శ్రీకీర్తి అదే హెలికాప్టర్‌లో వెంట ఉన్నారు. మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి విమానంలో తిరుపతి చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరు వచ్చారు. నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లో గౌతమ్‌రెడ్డి పార్ధివ దేహం డైకాస్ రోడ్డులోని మేకపాటి కుటుంబం నివాసానికి మధ్యాహ్నం 12.15 గంటలకు చేరుకుంది. దారిపొడవునా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ‘గౌతమ్ రెడ్డి అమర్ రహే... జోహార్’ అని నివాళులర్పించారు. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రజా ప్రతినిధులు తరలి రావడంతో నెల్లూరులోని దారులన్నీ మేకపాటి గృహానికే బారులు తీరాయి. ప్రజలు కడసారి సందర్శించి నివాళులు అర్పించేలా మేకపాటి నివాసం వద్ద రెండు వరుసల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు.
'తల్లి'డిల్లిన కన్న పేగు
గుండెలు పిండేసే శోకం
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపైకి గౌతమ్‌రెడ్డి భౌతిక కాయాన్ని తరలించగానే అప్పటివరకు అతికష్టం మీద నిగ్రహించుకున్న అభిమానులు, కార్యకర్తల్లో దుఃఖం కట్టలు తెంచుకుంది. తమ ప్రియతమ నేత ఆప్యాయతను తలచుకుని భోరున విలపించారు. శ్రీకీర్తి తన భర్త పార్థివ దేహాన్ని పట్టుకుని విలపించడం అందర్నీ కలచివేసింది. ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. గౌతమ్‌రెడ్డి తల్లి మణిమంజరి దుఃఖంతో అడుగులు వేయలేకపోయారు. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆమెను పట్టుకుని ఇంటిలోకి తీసుకువెళ్లారు. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి పరిస్థితి చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోక మానదు. విషణ్ణ వదనంతో ఉబికి వస్తున్న దుఃఖాన్ని అతికష్టం మీద నిగ్రహించుకుంటూ కూర్చుండిపోయారు.
నేతలు, కార్యకర్తలు ఆయన వద్దకు వెళ్లి ఓదార్చేందుకు యత్నించారు. కాగా, ఉపముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, ఆదిమూలపు సురేష్, శంకర్ నారాయణ, శ్రీరంగనాథరాజు, గుమ్మలూరు జయరాం, పేర్నినాని, సీదిరి అప్పలరాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం, ఏపీపీఏస్సీ చైర్మన్‌గా నియమితులైన గౌతమ్ సవాంగ్, తెలుగు అకాడమీ చైర్‌పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతి, ఎంపీలు ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యేలు ఆనం రాంనారాయణ రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, జోగి రమేష్, అంబటి రాంబాబు, ప్రసన్నకుమార్‌రెడ్డి, కాకాణి గోవర్థన్‌రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డి, వరప్రసాద్, రాంరెడ్డి ప్రతాప్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, డా.సిద్ధారెడ్డి, ఆదిమూలం, మేరుగ నాగార్జున, శ్రీనివాసరెడ్డి, జొన్నలగడ్డ పద్మావతి, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, వెన్నపూస గోపాల్‌రెడ్డి, బల్లి కల్యాణ చక్రవర్తి, రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్, తదితరులు మంత్రి గౌతమ్‌రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించారు. టీడీపీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, బొజ్జల సుదీర్‌రెడ్డి, అజీజ్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సురేశ్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్‌యాదవ్ తదితరులు గౌతమ్ రెడ్డికి నివాళులర్పించారు.
నేడు ఉదయగిరిలో అంత్యక్రియలు
మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలను బుధవారం ఉదయగిరిలో నిర్వహించనున్నారు. నెల్లూరులోని మేకపాటి నివాసం నుంచి బుధవారం ఉదయం అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. ఉదయగిరిలోని మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ (మెరిట్స్) ఆవరణలో ఉదయం 11.30 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. గంధపు చెక్కలతో మంత్రి పార్ధివదేహాన్ని దహనం చేస్తారు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్, కలెక్టర్ చక్రధర్‌బాబు అక్కడకు చేరుకుని ఏర్పాట్లు పూర్తి చేశారు. అంత్యక్రియలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హాజరవుతున్న నేపథ్యంలో హెలిప్యాడ్‌ను పరిశీలించారు. గుంటూరు ఐజీ త్రివిక్రమ్‌వర్మ, ఎస్పీ విజయారావు పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. పలువురు ప్రముఖులతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉన్నందున ఉదయగిరిలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు చేపట్టారు.
రూట్ మ్యాప్..
నెల్లూరులోని మేకపాటి నివాసం నుంచి ఉదయం 6 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. జొన్నవాడ మీదుగా బుచ్చి, సంగం, నెల్లూరుపాళెం, మర్రిపాడు, బద్వేలు సరిహద్దు జాతీయ రహదారి నుంచి బ్రాహ్మణపల్లి, కృష్ణాపురం, నందిపాడు మీదుగా ఉదయగిరికి చేరుకుంటుంది.
సీఎం పర్యటన షెడ్యూల్..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం పది గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయల్దేరి 10.45 గంటలకు కడప ఎయిర్‌పోర్టు చేరుకుంటారు. 10.55 గంటలకు కడప నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 11.15కి అంత్యక్రియలు నిర్వహించే ఉదయగిరిలోని ఇంజనీరింగ్ కాలేజీ వద్దకు చేరుకుంటారు. 11.55 గంటలకు అక్కడి నుంచి బయల్దేరి కడప వెళతారు.
నెల్లూరు చేరుకున్న కృష్ణార్జునరెడ్డి
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కుమారుడు కృష్ణార్జున రెడ్డి మంగళవారం రాత్రి నెల్లూరు నగరంలోని నివాసానికి చేరుకున్నారు. అమెరికా నుంచి నేరుగా ఆయన చెన్నై చేరుకుని అక్కడి నుంచి నెల్లూరుకు వచ్చారు. తండ్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతితో కృష్ణార్జున రెడ్డి కన్నీరుమున్నీరుగా విలపించారు.
గౌతమ్ మృతి రాష్ట్రానికి తీరనిలోటు
ఉదయగిరి: మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం మేకపాటి కుటుంబంతో పాటు ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకేగాక రాష్ట్ర ప్రజలకు తీరని లోటని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన మంగళవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని మేకపాటి ఇంజినీరింగ్ కళాశాలలో మంత్రి అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ మేకపాటి కుటుంబంలో అత్యంత తెలివైనవాడిగా గౌతమ్‌రెడ్డికి గుర్తింపు ఉందని చెప్పారు. అతి పిన్నవయస్సులోనే రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రివర్గంలో అతి ముఖ్యమైన శాఖకు మంత్రి పదవి చేపట్టి రాష్ట్రాన్ని పారిశ్రామిక అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లే తరుణంలో ఈ అకాల మరణం రాష్ట్ర ప్రజలను కలచివేసిందన్నారు. తన అన్న మేకపాటి రాజమోహన్‌రెడ్డికి అత్యంత ప్రీతిపాత్రమైన కొడుకుగా రాజకీయాల్లో ఎదుగుతున్న తరుణంలో ఈ విషాదవార్త తమ కుటుంబానికి తీరని లోటన్నారు. రాజకీయాల్లో చురుకైన వ్యక్తిగా, వివాదరహితుడిగా, నిజాయితీపరుడిగా, మచ్చలేని నాయకుడిగా ప్రతిపక్షాలు సైతం వేలెత్తి చూపలేని రాజకీయవేత్తగా గుర్తింపు పొందాడని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment