మీడియా సమావేశంలో అనిల్ కృష్ణ, ఫ్రెడ్రిక్ రాగ్‌మార్క్, జో ర్యాన్, జాన్ స్టబ్బింగ్‌టన్ (ఎడమ నుంచి)
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య సేవల రంగంలో ఉన్న పోలండ్‌కు చెందిన మెడికవర్ ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. తాజాగా నెల్లూరులోని సింహపురి ఆసుపత్రిని కొనుగోలు చేసింది. 250 పడకల సామర్థ్యమున్న ఈ కేంద్రం కోసం సంస్థ రూ.150 కోట్లదాకా వెచ్చించింది. దీనిని 750 పడకల స్థాయికి చేర్చనున్నారు. మెడికవర్‌గా పేరు మారిన ఈ ఆసుపత్రిని సంస్థ బుధవారం ఆవిష్కరించింది. ఇక్కడే క్యాన్సర్ చికిత్సకై రూ.30 కోట్ల వ్యయంతో 100 పడకల అత్యాధునిక ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించనున్నారు. ఇది సెప్టెంబరుకల్లా కార్యరూపంలోకి రానుందని మెడికవర్ సీఈవో ఫ్రెడ్రిక్ రాగ్‌మార్క్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో క్రియాశీలక ప్రభుత్వంతోపాటు ఉత్సాహవంతుడైన ముఖ్యమంత్రి ఉన్నారంటూ ఆయన కితాబిచ్చారు. ఏపీలో తొలుత విస్తరణ చేపడతామన్నారు. తొలి దశలో ఏపీలో రూ.300 కోట్లు పెట్టుబడి పెడతామని చెప్పారు.
ఇప్పటివరకు రూ. 700 కోట్లు..
యూరప్ హెల్త్‌కేర్ దిగ్గజం మెడికవర్‌కు ఇప్పటికే వైజాగ్‌లో రెండు ఆసుపత్రులు ఉన్నాయి. ఇక్కడ 200 పడకల హాస్పిటల్‌ను కొత్తగా ఏర్పాటు చేయనుంది. దీంతో వైజాగ్‌లో సంస్థ కేంద్రాల సంఖ్య మూడుకు చేరనుంది. అలాగే శ్రీకాకుళంలో 300 పడకలతో హాస్పిటల్ రానుంది. ప్రస్తుతం మెడికవర్‌కు పలు రాష్ట్రాల్లో ఉన్న అన్ని కేంద్రాల్లో కలిపి 2,500 పడకలు ఉన్నాయి. వైజాగ్, శ్రీకాకుళం కొత్త కేంద్రాల చేరికతో 3,000 పడకల స్థాయికి చేరనుంది. అనంతపూర్, కడపలోనూ మెడికవర్ సెంటర్లు రానున్నాయి. హైదరాబాద్‌లో 500 బెడ్స్‌గల ఓ ఆసుపత్రి కొనుగోలుకై చర్చలు జరుపుతున్నట్టు మెడికవర్ ఇండియా చైర్మన్ అనిల్ కృష్ణ వెల్లడించారు. భారత్‌లో మెడికవర్ ఇప్పటి వరకు రూ.700 కోట్లు వెచ్చించిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మెడికవర్ సీఎఫ్‌వో జో ర్యాన్, సీవోవో జాన్ స్టబ్బింగ్‌టన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment