అశాంత సింహపురి
నెల్లూరు(క్రైమ్): ప్రశాంతతకు మారుపేరైన సింహపురి క్రమేణా అశాంతపురిగా మారుతోంది. వరుస రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు, హత్యలతో జిల్లా వాసులు భయాందోళనకు గురవుతున్నారు. పారిశ్రామికంగా జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. అంతేవేగంగా ఆర్థిక నేరాలు పెరిగిపోతున్నాయి. మునుపెన్నడూలేని విధంగా కిరాయి హత్యలు, కిడ్నాప్‌ల సంస్కృతి పెచ్చుమీరుతోంది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమస్యల నేపథ్యంలో కొందరు ఆత్మహత్యకు పాల్పడుతుండగా మరికొందరు హత్యలకు గురవుతున్నారు.
చిన్నచిన్న సమస్యలకే కొందరు క్షణికావేశానికి లోనై బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇక రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు ఎవరిని ఎలా కబళిస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. మొత్తం మీద ప్రజలు క్షణక్షణం భయంభయంగా గడుపుతున్నారు. 15రోజుల వ్యవధిలో జిల్లాలో 13 మంది రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందగా 50మందికి పైగా క్షతగాత్రులయ్యారు. వేర్వేరు ఘటనల్లో రైలు ఢీకొని ముగ్గురు మృతిచెందారు. కన్నతండ్రి తీవ్ర అనారోగ్యం పాలవడాన్ని జీర్ణించుకోలేని ఇద్దరు అన్నదమ్ములు రైలుకిందపడి ఆత్మహత్యచేసుకున్నారు.
నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. అనుమానమో? కుటుంబకలహాలో? ఆర్థిక ఇబ్బందులో? మరే ఇతర కారణమో తెలియదు కాని తొమ్మిది మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. పరిణితి చెందని వయస్సులో ప్రేమ వ్యామోహంలో పడి ముగ్గురు యువతులు ఇళ్ల నుంచి వెళ్లిపోగా, కారణమేంటో తెలియదు కానీ మరో యువతి కళాశాల నుంచి ఎటో వెళ్లిపోయింది. ఆర్థిక లావాదేవీల్లో నెలకొన్న విబేధాల కారణంగా ఓ యువకుడ్ని కొందరు కిడ్నాప్ చేశారు.
మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. ఓ వ్యక్తిపై దాడిచేసిన కొందరు వ్యక్తులు అతడి భార్యపై లైంగికదాడికి యత్నించారు. కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ వృద్ధుడు(70) మునిమనమురాలి వయస్సు చిన్నారి(5)పై లైంగికదాడికి యత్నించాడు. వర్షాకాలం కావడంతో విద్యుదాఘాతం రూపంలో పలువురిని మృత్యువు బలితీసుకుంటోంది.
వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు విద్యుదాఘాతానికి గురై మృతిచెందారు. మరోవైపు దొంగలు చెలరేగిపోతున్నారు. ఓ వైపు పోలీసులు వివిధ రకాల చర్యలు చేపడుతున్నా, మరోవైపు యథేచ్ఛగా తమ హస్తలాఘవాన్ని ప్రదర్శిస్తున్నారు. 15 రోజుల వ్యవధిలో జిల్లాలో 315 సవర్ల బంగారు ఆభరణాలు, 13 కిలోల వెండి, రూ.6 లక్షల నగదు అపహరణకు గురయ్యాయి.
కొన్ని ఘటనలు
నవంబర్ 1వ తేదీ: కుటుంబకలహాల నేపథ్యంలో నెల్లూరు ట్రంకురోడ్డుకు సమీపంలోని ఓ లాడ్జిలో గోళ్ల గణేష్ ఆత్మహత్య.
- 5వ తేదీ : పొదలకూరు ఇనుకుర్తి దళితవాడ వద్ద ఆటోను ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో మస్తాన్, రామయ్య దుర్మరణం.
అదే రోజు కలిగిరి మండలం పెదపాడు సమీపంలో వ్యాను, ఆటో ఢీకొన్న ఘటనలో మహ్మద్ నిజార్, దరియాబీ, వినోద్, నాగిశెట్టి శ్రీనివాసులు మృతి.
7వ తేదీ: కుటుంబకలహాల నేపథ్యంలో నెల్లూరు వెంగళరావునగర్‌లో చాన్‌బాషా దారుణహత్య.
7వ తేదీ మనుబోలులోని పవర్‌గ్రిడ్ క్వార్టర్స్‌లో దొంగలు పడి రూ.కోటి విలువైన సొత్తు అపహరణ. అదే రోజు ఐటీ అధికారులమంటూ కోటలో వృద్ధ దంపతుల నుంచి నగదు, ఆభరణాల దోపిడీ.
8వ తేదీ నెల్లూరు రామ్మూర్తినగర్‌లో ఐదేళ్ల చిన్నారిపై రామసుబ్బయ్య(70) లైంగికదాడికియత్నం.
అదే రోజు గూడూరు మండలం వేములపాళెం సమీపంలో ఓ వ్యక్తిపై ఇద్దరు దాడి చేసి అతని భార్యపై లైంగికదాడికి యత్నం.
9వ తేదీ: ఓ యువతితో స్నేహం మానుకోకపోతే అంతుచూస్తామని బెదిరించడంతో జలదంకి మండలంలో చెక్కా చెన్నకేశవ ఆత్మహత్య.
10వ తేదీ నెల్లూరు మాగుంట లేఅవుట్‌లోని ఓ హాట్‌ఫుడ్స్ సెంటర్‌లో మోటారు వేసేందుకు మిద్దెపైకి వెళ్లి విద్యుదాఘాతానికి గురై మాతయ్య మృతి.
11వ తేదీ సైదాపురం మండలం ఊటుకూరులో వివాహిత సురేఖ అనుమానాస్పద మృతి.
11వ తేదీ తండ్రి తీవ్ర అనారోగ్యానికి గురవడంతో తమిళనాడుకు చెందిన ఇద్దరు యువకులు నెల్లూరు నక్కలోళ్ల సెంటర్ సమీపంలో రైలుకింద పడి ఆత్మహత్య
13వ తేదీ నెల్లూరులోని టీడీపీ కార్యాలయం సమీపంలో ఉన్న పాతకాలువ కట్ట ప్రాంతంలో దంపతుల ఆత్మహత్యాయత్నం.