నిందితుడు షఫీవుల్లాను తీసుకొస్తున్న పోలీసులు
అనంతపురం క్రైం: అనంతపురం జిల్లా కదిరి ఎన్జీవో కాలనీలో సంచలనం రేకెత్తించిన టీచర్ ఉషారాణిని హత్య చేసి.. మరో వివాహిత శివమ్మను తీవ్రంగా గాయపర్చి నగలు, నగదు ఎత్తుకెళ్లిన కేసును పోలీసులు ఛేదించారు. కరుడుగట్టిన దోపిడీ దొంగ షేక్ షఫీవుల్లా అలియాస్ షఫీ (35)ని అరెస్ట్ చేశారు. అతని నుంచి రూ.30 లక్షల విలువైన 58 తులాల బంగారం, రూ.97 వేల నగదు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ డాక్టర్ కాగినెల్లి ఫక్కీరప్ప బుధవారం వెల్లడించారు. కర్ణాటకలోని దేవనహళ్లికి చెందిన షేక్ షఫీవుల్లా (షఫీ) 2004 నుంచి 2009 వరకు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో బైక్ చోరీలకు పాల్పడ్డాడు. పలు కేసుల్లో జైలుకు వెళ్లొచ్చిన నిందితుడు 2010లో జిల్లాలోని ఓబుళాపురానికి చెందిన మహిళను వివాహం చేసుకుని కదిరిలో స్థిరపడ్డాడు. అప్పటి నుంచి వాహనాల్లో పెట్రోల్ దొంగిలిస్తూ.. ఎర్ర చందనం రవాణా వాహనాలకు డ్రైవర్‌గా పని చేసేవాడు.
‘దండుపాళ్యం’ చూసి..
దండుపాళ్యం సినిమా చూసిన తర్వాత అందులో చూపిన తరహాలో ఇళ్లలోకి ప్రవేశించి మహిళలను హతమార్చి చోరీలకు పాల్పడాలని నిర్ణయించుకున్నట్టు షఫీ పోలీసులకు తెలిపాడు. హత్యలు చేయడానికి బరువైన రాడ్‌ను తీసుకున్నాడు. 2019 ఆగస్టులో కదిరిలోని హిందూపురం రోడ్డులో నివాసముండే సావిత్రి, 2021లో అదే పట్టణంలోని హరూన్ వీధిలో ఉండే గంగాదేవి అనే మహిళలపై రాడ్‌తో దాడి చేయగా.. అదృష్టవశాత్తు వారు ప్రాణాలతో బయటపడ్డారు. 2019 జనవరిలోనూ స్థానిక రెవెన్యూ కాలనీలో ఇదే తరహాలో ఒకరిపై దాడి చేశాడు.
అదును చూసి మరీ..
గత ఏడాది నవంబర్‌లో కదిరి ఎన్జీవో కాలనీలో దోపిడీకి పాల్పడటానికి ఐదు రోజుల ముందు షఫీ ఆ వీధిలో రెక్కీ నిర్వహించాడు. టీస్టాల్ నిర్వాహకుడు రమణ వేకువజామునే వ్యాపారానికి వెళ్లడం, ఆ ఇంటి పక్కనే ఉండే ఉపాధ్యాయుడు శంకర్‌రెడ్డి మార్నింగ్ వాక్‌కు వెళ్లడం గమనించాడు. శంకర్‌రెడ్డి వాకింగ్‌కు వెళ్లే ముందు ఇంటి తాళం చెవి షూలో ఉంచేవాడు. దీన్ని గమనించిన షఫీ గతేడాది నవంబర్ 16 తెల్లవారుజామున దొంగతనానికి వెళ్లాడు. మొదట టీస్టాల్ రమణ ఇంటికి వెళ్లి అతని భార్య శివమ్మపై రాడ్డుతో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. ఆమె మెడలోని 5 తులాల చైన్, బీరువాలోని రూ.1.50 లక్షల నగదు చోరీ చేశాడు.
ఆ తరువాత పక్కనే ఉన్న శంకర్‌రెడ్డి ఇంటికి వెళ్లి షూలో ఉన్న తాళం చెవితో తలుపులు తెరిచి లోనికి ప్రవేశించాడు. నిద్రలో ఉన్న శంకర్‌రెడ్డి భార్య, ప్రభుత్వ ఉపాధ్యాయిని ఉషారాణి తలపై రాడ్‌తో కొట్టి హత్య చేశాడు. ఆమె మెడలోని నగలతోపాటు బీరువాలోని నగలు, నగదు ఎత్తుకెళ్లాడు. మార్నింగ్ వాక్ నుంచి తిరిగివచ్చిన శంకర్‌రెడ్డి ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించి లోనికి వెళ్లి చూడగా.. అప్పటికే ఉషారాణి ప్రాణాలొదిలింది. టీ స్టాల్ యజమాని రమణ ఇంట్లోనూ దోపిడీ జరిగినట్టు గుర్తించిన స్థానికులు అపస్మారక స్థితిలో ఉన్న అతడి భార్య శివమ్మను హుటాహుటిన ఆస్పత్రికి తరలించటంతో ఆమె కోలుకుంది. కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు 90 రోజుల్లో ఛేదించి షఫీని అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment