దొంగల చేతిలో హత్యకు గురైన టీచర్ ఉషారాణి ఇల్లు ఇదే..
కదిరి: దోపిడీలు, దొంగతనాలు, గుట్కా, మట్కా, లాటరీ టికెట్‌ల అమ్మకాలకు తోడు వరుస హత్యలతో కదిరి వాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవల కదిరి ఎంజీ రోడ్డులో బంగారు నగల తయారీదారు కిరణ్‌ని హతమార్చారు. ఈ ఘటన జరిగి రెండు నెలలు గడుస్తున్నా నిందితులెవరో అంతు చిక్కడం లేదు. తాజాగా మంగళవారం తెల్లవారుజామున ఎన్‌జీఓ కాలనీలో టీచర్ శంకర్‌రెడ్డి ఇంట్లో దోపిడీ దొంగలు చొరబడి, ఆయన భార్య టీచర్ ఉషారాణిని హతమార్చి విలువైన నగలు, నగదు దోచుకెళ్లారు. నలుగురు సీఐలు, ఐదుగురు ఎస్‌ఐలు, ఆరుగురు కానిస్టేబుళ్లు కాపురముంటున్న ఎన్‌జీఓ కాలనీలోనే ఈ ఘటన జరిగితే.. ఇక మిగిలిన వీధుల పరిస్థితేంటని జనం బెంబేలెత్తిపోతున్నారు. ఆయా కేసుల్లో నిందితులను వెంటనే గుర్తించి, శిక్షించి ఉంటే ఈ తరహా ఘటనలకు తావుండేది కాదని అంటున్నారు. కేసుల దర్యాప్తులో పోలీసుల మెతక వైఖరే ఇందుకు కారణంగా విమర్శలు వెల్లువెత్తాయి.
భవంతులు సరే.. సీసీ కెమెరాలేవీ?
ఇంటి ఆవరణలో సీసీ కెమెరాలు ఉన్నట్లైతే కదిరి ఎన్‌జీఓ కాలనీలోని రెండిళ్లలో చోరీతో పాటు టీచర్ ఉషారాణి హత్య జరిగేది కాదని పోలీసులు చెబుతున్నారు. రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చుతో పెద్ద భవంతులు నిర్మించుకుని వాటి ముందు రూ.వేలు విలువ చేసే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోకపోవడాన్ని ఈ సందర్భంగా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఘటన జరిగిన తర్వాత బాధాపడేదానికన్నా.. ముందస్తు జాగ్రత్తగా సీసీ కెమెరాల ఏర్పాటు చేసుకుంటే ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొంటున్నారు. ప్రతి మహిళా దిశ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని ఇంటింటికీ తిరిగి చెబుతున్నా కొందరు మాత్రమే స్పందిస్తున్నారని, మిగిలిన వారు పట్టించుకోవడం లేదని పోలీసులు అంటున్నారు.
దర్యాప్తు ముమ్మరం
దోపిడీ, మహిళా టీచర్ హత్య (మనీ ఫర్ గెయిన్) కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. అడిషనల్ ఎస్పీ రామకృష్ణ ప్రసాద్ నేతృత్వంలో నలుగురు డీఎస్పీలు, పలువురు సీఐలు, ఎస్‌ఐలు బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లోని లాడ్జీలు, రైల్వేస్టేషన్‌లు, బస్‌స్టాండ్‌లు, హోటళ్లు, పెట్రోలు బంకుల్లో ఆరా తీస్తున్నారు. కదిరి ప్రాంతాన్ని డీఎస్పీ భవ్యకిషోర్ నేతృత్వంలో పోలీసు బృందాలు జల్లెడ పట్టాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి శివారు ప్రాంతాల్లో గుడారాలు వేసుకున్న వారి వేలిముద్రలు సేకరించి, హత్య జరిగిన ప్రాంతంలోని వేలి ముద్రలతో పోల్చి చూస్తున్నారు. కదిరికి చేరుకునే అన్ని మార్గాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌కు ప్రత్యేక బృందాలు
అనంతపురం క్రైం: కదిరి ఘటనను జిల్లా పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఆదేశాలతో బుధవారం ప్రత్యేక బృందాలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రాంతాలకు బయలుదేరి వెళ్లాయి. సీసీఎస్ డీఎస్పీ మహబూబ్‌బాషా, హిందూపురం సీఐ హమీద్‌ఖాన్, ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు ఈ బృందాల్లో ఉన్నారు. సాధ్యమైనంత తొందరగా కేసును ఛేదించాలనే ధృడనిశ్చయం పోలీసుల్లో వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ‘మనీ ఫర్ గెయిన్’ పాత కేసుల్లో నిందితులుగా ఉన్న 37 మంది కదలికలపై ప్రత్యేక దృష్టి సారించారు.
అలాగే అనంతపురం, పెనుకొండ, కదిరి, కళ్యాణదుర్గం, గుంతకల్లు, తాడిపత్రి, పుట్టపర్తి, ధర్మవరం సబ్‌డివిజన్ల పరిధిలో ఆయా డీఎస్పీల పర్యవేక్షణలో దొంగతనాల నియంత్రణకు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. శివారు ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. ఇళ్లకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అనుమానితులు కన్పిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment