భార్యాపిల్లల హత్యతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న నల్లప్ప
ఎవరిది ప్రేమ.. ఏది ప్రేమ... పిల్లలు ప్రేమించుకుంటే పెద్దల ప్రేమ ప్రాణాలు తీస్తుందా? కంటి పాపలనే కాలరాస్తుందా? పెంచిన చేతులే పీకలు కోసే పగగా మారుతుందా? రోజులు.. నెలలు.. సంవత్సరాలు నిరీక్షించి మరీ విరుచుకుపడుతుందా? అవును.. ఆ ఇంట్లో ప్రేమ రక్తం చిందించింది. ప్రేమ పెళ్లి చేసుకున్న పాపానికి ఆ యువతి చిన్నాన్న కొడుకే యముడయ్యాడు. నాలుగేళ్ల తర్వాత కొడవలి పట్టి కసితీరా కుత్తుకలు కోశాడు. ఈ ఘటన శింగనమల నియోజకవర్గంలోని గార్లదిన్నెలో బుధవారం సాయంత్రం కలకలం రేపింది.
గార్లదిన్నె: ఓ దుండగుడు తల్లి, ఇద్దరు పిల్లలను గొంతులు కోసి హత్య చేసిన ఘటన అనంతపురం జిల్లా గార్లదిన్నెలో బుధవారం జరిగింది. గార్లదిన్నెకు చెందిన నారాయణ, సుబ్బమ్మ దంపతుల కుమారుడు బోయ నల్లప్ప నాలుగేళ్ల కిందట పామిడి మండలం కొత్తపల్లికి చెందిన శివయ్య, సరస్వతి దంపతుల చిన్న కుమార్తె మీనాక్షి(24)ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి వితేష్(3), కీర్తి(1) పుట్టారు. బుధవారం నల్లప్ప పని నిమిత్తం బస్టాండ్‌కు వెళ్లాడు. నల్లప్ప తల్లి సుబ్బమ్మ తమ ఇంటి సమీపాన గల పీహెచ్‌సీకి వెళ్లింది. ఇంట్లో మీనాక్షి, వితేష్, కీర్తి మాత్రమే ఉన్నారు. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి కత్తితో మీనాక్షి, వితేష్, కీర్తిల గొంతులు కోసి హత్య చేశాడు.
అక్కడకు వచ్చిన సుబ్బమ్మ.. తమ ఇంట్లో నుంచి రక్తపు మరకలతో వస్తున్న ఆ దుండగుడిని అడ్డుకోగా ఆ వ్యక్తి బైక్‌పై పారిపోయాడు. ఇంట్లోకి వెళ్లిన ఆమె.. మీనాక్షి, వితేష్, కీర్తి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి కేకలు వేసింది. చుట్టుపక్కల వాళ్లు వచ్చి చూసేసరికి వారు చనిపోయారు. ఎస్పీ అశోక్‌కుమార్, డీఎస్పీ వెంకట్రావ్, సీఐ ప్రసాద్‌రావు, ఎస్‌ఐ ఆంజనేయులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. మృతురాలి భర్త నల్లప్ప మాట్లాడుతూ.. మీనాక్షి చిన్నాన్న కుటుంబసభ్యులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని ఆరోపించాడు. తమ పెళ్లికి మీనాక్షి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో.. కసాపురం వెళ్లి ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలిపాడు. ఆ సమయంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగిందని చెప్పారు. కొన్నాళ్లకు మీనాక్షి తల్లిదండ్రులు తమ ఇంటికి వస్తూపోతుండేవారని వివరించాడు. మీనాక్షి చిన్నాన్న కొడుకు తమతో గొడవ పడ్డాడని, వారే ఈ హత్యలు చేయించి ఉంటారని ఆరోపించాడు.
డీఎస్పీ వెంకట్రావ్ మాట్లాడుతూ.. మీనాక్షి, నల్లప్పలది ప్రేమ వివాహమైనందున ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ముగ్గురిని హత్యచేసి పరారైన నిందితున్ని పోలీసులు గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి చిన్నాన్న కుమారుడు హరి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వెల్లడైంది. గార్లదిన్నె మండలంలోని ఉల్లికంట్టిపల్లి గ్రామంలోని తన అత్తగారింటి వద్ద అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకోవడంతోనే అంతమొందించినట్లు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
తల్లి ఇద్దరు పిల్లల హత్య
బుధవారం సాయంత్రం 5.30 గంటలకు : నిందితుడు గార్లదిన్నెలోని మీనాక్షి ఇంటి దగ్గరకు వచ్చాడు.
5.45: ఆ ఇంట్లోకి వెళ్లి తల్లి మీనాక్షితో
పాటు కుమారుడు వితేష్, కుమార్తె కీర్తిని కత్తితో హతమార్చాడు.
6.00: ఇంటి బయటకు వచ్చిన నిందితుడిని మీనాక్షి అత్త సుబ్బమ్మ చూసి.. ఎవరు బాబు నువ్వని ప్రశ్నించింది.
6.02: నిందితుడు ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు
6.05: సుబ్బమ్మ ఇంట్లోకి వెళ్లి హత్యలను చూసి కేకలు వేసింది
6.10: చుట్టు పక్కల ఉన్న జనమంతా పోగయ్యారు
6.25: స్థానిక ఎస్‌ఐ ఆంజనేయులు తన సిబ్బందితో వచ్చారు
6.50: డీఎస్పీ వెంకట్రావ్ , సీఐ ప్రసాద్‌రావులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
7.10: డాగ్ స్క్వాడ్ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది
7.45: డాగ్ స్క్వాడ్ తనిఖీలు పూర్తయ్యాయి
8.20: జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ ఘటనా స్థలానికి వచ్చారు
8.30: మీనాక్షి భర్త నల్లప్పను ఎస్పీ విచారించారు
9.30: నిందితుడు హరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment