చరిత్ర గడ్డగా మిగిలిపోయిన సింహపురి పోర్టుల ఖిల్లాగా మారనుంది. ఆ నాడు కృష్ణపట్నం పోర్టు, శ్రీసిటీ, మాంబట్టు, మేనకూరు సెజ్‌లతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఈ రోజు రామాయపట్నం పోర్టు, దగదర్తి ఎయిర్ పోర్టు, క్రిస్ సిటీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సింహపురిని ప్రపంచ పటంలో చేర్చారు. సీ, ఎయిర్‌పోర్టులతో జిల్లా పారిశ్రామికంగా, వ్యాపారపరంగా కొత్త పుంతలు తొక్కుతోంది. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, రామాయపట్నం పోర్టులతో కావలి కనకపట్నంగా మారనుంది.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: విశాలమైన సాగర తీరం.. మెండుగా ఉన్న భూములు సింహపురి చరిత్ర గతిని మార్చేసింది. ఓ వైపు కృష్ణపట్నం పోర్టు, సెజ్‌లతో సింహపురి కీర్తి ప్రపంచస్థాయికి చేరింది. తాజాగా రామాయపట్నం పోర్టు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ అందుబాటులోకి రానుండడంతో పారిశ్రామికాభివృద్ధికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే రోడ్డు జల, వాయు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. సరికొత్త హంగులతో కనెక్టివిటీ పెరగడంతో పారిశ్రామికవేత్తలు ఇటు వైపు చూస్తున్నారు. భవిష్యత్‌లో జిల్లా రూపురేఖలు మారనున్నాయి. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి.
జిల్లాకే తలమానికంగా సోమశిల, కండలేరు జలాశయాలు, కృష్ణపట్నం పోర్టు ఉన్నాయి. మరో వైపు రామాయపట్నం పోర్టు, దగదర్తి ఎయిర్‌పోర్టులు రానున్నాయి. 850 ఎకరాల విస్తీర్ణంలో రూ.3,736 కోట్లతో మొదటి దశ నిర్మాణ పనులకు బుధవారం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన చేపట్టనున్నారు. రూ.10,640 కోట్ల వ్యయంతో 3,437 ఎకరాల్లో 19 బెర్త్‌లతో రామాయపట్నం పోర్టు తుది రూపు దిద్దుకోనుంది. 36 నెలల్లో పూర్తి చేసేందుకు అధికారుల కసరత్తు ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల వారికి ఓడరేవు ప్రయోజనాలు మరింత అందుబాటులోకి రానున్నాయి. ఆక్వా, గ్రానైట్, పొగాకు, ఐరన్ ఓర్ అనేక ముడి ఖనిజాలు ఎగుమతులకు ఈ పోర్టు కీలకంగా మారనుంది.
నాడు కృష్ణపట్నం– నేడు రామాయపట్నం
నాడు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి కృష్ణపట్నం పోర్టు నిర్మించగా, నేడు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రామాయపట్నం పోర్టు నిర్మిస్తున్నారు. తండ్రి, తనయులు ఇద్దరు ఇటు ప్రజల మదిలో, అటు చరిత్రలో నిలిచేపోయేలా నౌకశ్రాయాలు ఏర్పాటు చేశారు. కందుకూరు, కావలి నియోజక వర్గాల సరిహద్దులోని రామాయపట్నం పోర్టు నిర్మాణానికి గుడ్లూరు మండలంలోని మొండివారిపాళెం, ఆవులపాళెం, కర్లపాళెం, సాలిపేట, రావూరు, చేవూరు గ్రామాల పరిధిలో మొదటి దశలో 850 ఎకరాల భూసేకరణను అధికారులు పూర్తి చేశారు.
కనకపట్నంగా కావలి
రామాయపట్నంపోర్టుతో ప్రధానంగా కావలి పట్టణం మరింతగా అభివృద్ధి చెందనుంది. రామాయపట్నం పోర్టు కందుకూరు నియోజకవర్గ పరిధిలో ఉన్నప్పటికీ కావలికి మరింత దగ్గరగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. కావలి తీరంలో దక్షిణం వైపు జువ్వలదిన్నె హార్బర్, ఉత్తరం వైపు రామాయపట్నం పోర్టులు నిర్మింతమవుతున్న నేపథ్యంలో ఆయా ప్రాజెక్ట్‌లకు అనుబంధంగా పరిశ్రమలు రానున్నాయి. త్వరలోనే దగదర్తి ఎయిర్‌పోర్టు కూడా అందుబాటులోకి రానున్న నేపథ్యంలో కావలి ప్రధాన పట్టణం కానుంది. భవిష్యత్‌లో కావలి కనక పట్నంగా మారుతుందని ఆ నాడు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారని, అది త్వరలోనే రుజువు కాబోతుందని గుర్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment