కళలకు పుట్టినిల్లు సింహపురి
నెల్లూరు(బారకాసు): కళారంగానికి పుట్టినిల్లు సింహపురి అని, ఇక్కడి నుంచి అనేక మంది కళాకారులు తమ ప్రతిభతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారని 25 కళాసంఘాల గౌరవాధ్యక్షుడు, రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అమరావతి కష్ణారెడ్డి పేర్కొన్నారు. టౌన్‌హాల్లో ఆదివారం జరిగిన శాంతి కల్చరల్స్ 14వ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. ప్రాధాన్యం ఉన్న కళలు ప్రస్తుతం కనుమరుగయ్యే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కళాకారులను ప్రభుత్వం ప్రోత్సాహించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఇంట్లో గజ్జెల సవ్వడి వినిపించాలని కాంక్షించారు. శాంతి కల్చరల్స్ అధినేత, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ అమానుల్లాఖాన్ తన వారుసుడ్ని కళారంగం వైపు ప్రోత్సహిస్తూ అందరికి స్ఫూర్తిగా నిలవడాన్ని అభినందించారు. అనంతరం వివిధ రంగాల్లో తమ వంతు సేవలందించిన ముగ్గురు ప్రముఖులు బాలబ్రహ్మయ్య, అబ్దుల్లా, వల్లూరు కొండపనాయుడ్ని ఘనంగా సత్కరించారు. సినీ గీతాలు, డ్యాన్స్‌లు, ఏకపాత్రాభినయ పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. సాయిరాగాంజలి ఆర్కెస్ట్రా వారితో నిర్వహించిన మెగా మ్యూజికల్ నైట్ అలరించింది. పవిత్ర చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు గాలి కిరణ్‌కుమార్, గజల్ గానలహరి నాగరాజారావు, రాజేశ్వరరావు, సురేష్‌బాబు, రమేష్‌బాబు, నల్లమల్లి సత్యనారాయణ, మదార్, మున్వర్‌ఖాన్, తదితరులు పాల్గొన్నారు.