సాక్షి, అమరావతి: అంతర్జాతీయ ఆక్వా మార్కెట్‌లో మీసం మెలేసిన ఆంధ్రా టైగర్ రొయ్యలు తిరిగి సాగులోకి వస్తున్నాయి. సుమారు రెండు దశాబ్దాల క్రితం వరకూ ఆక్వా రంగంలో తిరుగులేని రారాజుగా వెలుగొందిన టైగర్ రొయ్యలపై వివిధ రకాల వైరస్‌లు ముప్పేట దాడితో మూలన పడ్డాయి. దాంతో ఆ స్థానాన్ని వెనామీ రొయ్యల రొయ్యలు ఆక్రమించాయి. తాజాగా వెనామీ సాగులోనూ వైరస్‌ల దాడి పెరగటం, వివిధ రకాల వ్యాధులు విజృంభిస్తుండటంతో నష్టాల పాలవుతున్న రైతులకు టైగర్ రొయ్యలు తిరిగి ఆశాదీపంలా కనిపిస్తున్నాయి. వెనామీకి ప్రత్యామ్నాయంగా టైగర్ సాగు ద్వారా సిరుల పంట పండించేందుకు రైతులు ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లాలోని సముద్ర తీర ప్రాంత రైతులు 4,500 ఎకరాల్లో ప్రయోగాత్మకంగా టైగర్ రొయ్యల సాగుకు శ్రీకారం చుట్టి మంచి ఫలితాలు సాధించారు. గుంటూరు జిల్లాతోపాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోని తీరప్రాంత ఆక్వా రైతులు సైతం టైగర్ రొయ్యల సాగు వైపు ఇప్పటికే అడుగులు వేశారు.
నష్టాల సాగు నుంచి గట్టెక్కేలా..
దేశవ్యాప్తంగా ఏటా 8.64 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తి అవుతుంటే.. అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 6.34 లక్షల టన్నుల (74 శాతం) రొయ్యలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇందులో సింహభాగం వెనామీ రొయ్యలదే. అంతకు ముందు మన ప్రాంత నాటు రొయ్య (టైగర్) హవా నడిచింది. ఆ తరువాత టైగర్ రొయ్యలకు వైట్ స్పాట్ (తెల్ల మచ్చ) వైరస్, ఇతరత్రా వ్యాధులు సోకడం, వ్యాధి రహిత తల్లి రొయ్యల (స్పెసిఫిక్ పాత్ జోన్ ఫ్రీ బ్రూడర్స్) ఉత్పత్తి లేకపోవడంతో ‘టైగర్’ శకం ముగిసింది. అదే సమయంలో విదేశాల నుంచి స్పెసిఫిక్ పాత్ జోన్ ఫ్రీ (ఎస్‌పీఎఫ్) వెనామీ బ్రూడర్స్ (తల్లి రొయ్యలు) రావడం, విస్తృత స్థాయిలో సీడ్ అందుబాటులోకి రావడంతో ఆక్వా రంగం పూర్తిగా వెనామీ వైపు మళ్లింది. ప్రస్తుతం వెనామీ రొయ్యలకు సైతం వైట్ స్పాట్, వెబ్రియా తదితర వైరస్‌లు, వ్యాధుల కారణంగా 40 కౌంట్‌లో పట్టాల్సిన 80–100 కౌంట్‌లో పట్టేయాల్సి వస్తోంది. దీంతో వెనామీ సాగు చేస్తున్న రొయ్యల రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తిరిగి టైగర్ రొయ్యలు అందుబాటులోకి వస్తున్నాయి.
గుజరాత్‌లో తల్లి రొయ్యల పునరుత్పత్తి
అమెరికాలోని హవాయికి చెందిన ఓ సంస్థ ఎస్‌పీఎఫ్ టైగర్ తల్లి రొయ్యలను అభివృద్ధిపర్చడంతో తిరిగి టైగర్ శకం ప్రారంభమైనట్టయ్యింది. వాటి దిగుమతికి 2019లో కేంద్రం అనుమతి ఇవ్వడంతో ఓ ప్రైవేట్ సంస్థ టైగర్ బ్రూడర్స్‌ను దిగుమతి చేసుకుని నెల్లూరు జిల్లాలో హేచరీ ద్వారా సీడ్ (రొయ్య పిల్లల)ను ఉత్పత్తి చేసింది. ఆ సీడ్‌తో గుంటూరు, నెల్లూరు, ఒంగోలు ప్రాంత రైతులు ప్రయోగాత్మకంగా సాగు చేపట్టి సత్ఫలితాలు సాధించారు. దేశీయ అవసరాలకు సరిపడా బ్రూడర్స్ దిగుమతికి అవకాశాలు తక్కువగా ఉండటంతో తల్లి రొయ్యల పునరుత్పత్తి కోసం గుజరాత్‌లో బ్రూడర్ మల్టిప్లికేషన్ సెంటర్ (బీఎంసీ)ను ఆ ప్రైవేటు సంస్థ ఏర్పాటు చేస్తోంది. తల్లి రొయ్యల నుంచి ఉత్పత్తయ్యే సీడ్‌ను ఇక్కడ 4 నెలల పాటు పెంచి.. వాటిద్వారా తిరిగి తల్లి రొయ్యలను పునరుత్పత్తి చేస్తారు. వైట్‌స్పాట్‌తో పాటు ఇతర వ్యాధులను సైతం తట్టుకునేలా వాటిని అభివృద్ధి చేస్తారు. ప్రస్తుతం ఒక్కో రొయ్య పిల్ల 99 పైసలకు అందుబాటులో ఉంది.
ప్రయోగం సక్సెస్
ఈ ఏడాది జనవరిలో ప్రైవేట్ సంస్థ ఏపీ మార్కెట్‌లోకి తీసుకొచ్చిన సీడ్‌ను గుంటూరు జిల్లా నిజాంపట్నం, రేపల్లె, కర్లపాలెం, పీవీ పాలెం ప్రాంత రైతులు ప్రయోగాత్మకంగా 4,500 ఎకరాల్లో సాగు చేశారు. రొయ్యలు ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా ప్రతిరోజు 0.3 గ్రాముల నుంచి 0.5 గ్రాముల వరకు పెరుగుతూ 120 రోజుల్లోనే 20 కౌంట్‌లోపే పంట చేతికొచ్చింది. ఊహించని రీతిలో ఫలితాలు రావడంతో సీడ్‌కు డిమాండ్ ఏర్పడింది.
70 ఎకరాల్లో రూ.1.40 కోట్ల ఆదాయం
నిజాంపట్నం మండలం లంకవానిదిబ్బలోని 70 ఎకరాల్లో టైగర్ రొయ్యలు సాగు చేశా. రూ.1.90 కోట్లు పెట్టుబడి పెట్టా. 13–15 కౌంట్‌లో 62 టన్నుల దిగుబడి వచ్చింది. వైట్ స్పాట్‌ను తట్టుకుంది. ఎలాంటి మందులు వాడలేదు. పెట్టుబడి పోను రూ.1.40 కోట్ల ఆదాయం వచ్చింది.
– కొక్కిలిగడ్డ ఐజాక్, ఆక్వా రైతు, నిజాంపట్నం, గుంటూరు
తీర ప్రాంత ఆక్వా రైతులకు వరం
టైగర్ రొయ్యలు తీరప్రాంత ఆక్వా రైతులకు వరం. వెనామీకి ప్రత్యామ్నాయంగా మారుతుంది. పెట్టుబడి తక్కువగా ఉండే టైగర్ సాగు సన్న, చిన్నకారు రైతులకు అనుకూలం. వెనామీ సాగుకు అనుకూలంగా లేని ఇసుక భూముల్లో టైగర్ సాగు లాభదాయకం. టైగర్ రొయ్యల పెంపకం విజయవంతం కొనసాగితే సాగు విస్తీర్ణం, ఉత్పత్తితోపాటు ఎగుమతులు కూడా గణనీయంగా పెరుగుతాయి.
– డాక్టర్ పి.సురేష్‌కుమార్, డిప్యూటీ డైరెక్టర్, మత్స్య శాఖ
Comments
Please login to add a commentAdd a comment