ఏపీకి ఎనిమిదేళ్లుగా అన్యాయం.. సభే సాక్షి | Lavu Sri Krishna Devarayalu Comments On Central Govt | Sakshi
Sakshi News home page

ఏపీకి ఎనిమిదేళ్లుగా అన్యాయం.. సభే సాక్షి

Published Wed, Feb 9 2022 5:10 AM | Last Updated on Wed, Feb 9 2022 1:31 PM

Lavu Sri Krishna Devarayalu Comments On Central Govt - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ఎనిమిదేళ్లుగా కేంద్రం అన్యాయం చేస్తూనే ఉందని, దీనికి సభే సాక్షి అని వైఎస్సార్‌సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగంలో ఈశాన్య రాష్ట్రాల అభివృది గురించి ప్రస్తావించారుగానీ ఏపీకి ప్రత్యేకహోదా అంశం కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా న్యాయంగా రాష్ట్ర ప్రజలకు నెరవేర్చాల్సిన హామీ అని గుర్తుచేశారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్రం విస్మరించిందన్నారు. లోక్‌సభలో మంగళవారం బడ్జెట్‌పై జరిగిన సాధారణ చర్చలో ఆయన మాట్లాడారు.  ఏపీ పరంగా చూస్తే ఈ బడ్జెట్‌ నిరుత్సాహపరిచిందని చెప్పారు. విభజన హామీలేవీ అమలు కాలేదన్నారు.

పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా రూ.55 వేల కోట్లు అయితే ఇప్పటికీ రూ.13 వేల కోట్లు మాత్రమే ఖర్చయిందని చెప్పారు. రూ.11 వేల కోట్లు మాత్రమే రాష్ట్రానికి రీయింబర్స్‌ చేశారని, సుమారు రూ.2 వేల కోట్లు విడుదల చేయాల్సి ఉందని గుర్తుచేశారు. టీడీపీ చేసిన తప్పులకు ప్రస్తుత ప్రభుత్వాన్ని శిక్షించడం తగదన్నారు.  వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఒక్కో వ్యక్తికి రూ.428 చొప్పున లెక్కిస్తే బుందేల్‌ ఖండ్‌కు మాత్రం పదిరెట్లు ఎక్కువగా ఇస్తున్నారని చెప్పారు. కెన్‌–బెత్వా ప్రాజెక్టుకు నిధులు కేటా యించినట్లే ఏపీలో నదుల అనుసంధానానికి చేసిన రాష్ట్రం చేసిన ఖర్చు తిరిగి ఇవ్వాలని కోరారు.   ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీపై ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో జరిగిన దాడిని ఖండించారు.  

కడియం పూలపెంపకం ప్రాంతీయ స్టేషన్‌లో ఐదుగురు శాస్త్రవేత్తలు
ఆంధ్రప్రదేశ్‌లోని కడియం నర్సరీల్లో సాంకేతిక సిబ్బందికి సహకరించడానికి పూలపెంపకం (ఫ్లోరీకల్చర్‌) ప్రాంతీయ స్టేషన్‌లో ఐదుగురు శాస్త్రవేత్తలను నియమించినట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ మంగళవారం లోక్‌సభలో తెలిపారు. కడియం నర్సరీ పరిశ్రమను దృష్టిలో ఉంచుకుని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ రీసెర్చి (ఐకార్‌) కడియం మండలంలోని వేమగిరిలో ఐకార్‌–డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఫ్లోరీకల్చర్‌ రీసెర్చి ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఏపీలో 266 ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు
ఆంధ్రప్రదేశ్‌లో 266 ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ చార్జింగ్‌ స్టేషన్లు ఉన్నాయని కేంద్ర భారీపరిశ్రమలశాఖ సహాయమంత్రి క్రిషన్‌పాల్‌ గుర్జర్‌ చెప్పారు. మరో 65 రిటైల్‌ అవుట్‌లెట్లు ఈ ఏడాది జనవరి 1వ తేది నుంచి అందుబాటులోకి వచ్చినట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, సంజీవ్‌కుమార్‌ అడిగిన ప్రశ్నకు జవాబుగా తెలిపారు. 

ఎన్జీరంగా వర్సిటీకి రూ.135 కోట్లు
ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీ ప్రధాన కార్యాలయం, కళాశాలలు, సదుపాయాలు తదితరాలకు రూ.135 కోట్లు మూడు దశలుగా విడుదల చేసినట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు మద్దిళ్ల గురుమూర్తి, వంగా గీతావిశ్వనాథ్, చింతా అనూరాధ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. వర్సిటీ ఏర్పాటుకు సంబంధించి నిధుల విడుదలలో పెండింగ్‌ లేదని చెప్పారు.

పీఎంఎఫ్‌ఎంఈలో ఏపీకి రూ.20.72 కోట్లు విడుదల
ప్రధానమంత్రి మైక్రో, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సంస్థల (పీఎంఎఫ్‌ఎంఈ) ఏర్పాటులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు రూ.20.72 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఫుడ్‌ప్రాసెసింగ్, పరిశ్రమలశాఖ సహాయమంత్రి ప్రహ్లాద్‌సింగ్‌ పటేల్‌ తెలిపారు. 2021–22 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌లోని 96 మంది లబ్ధిదారులకు ఈ పథకంలో భాగంగా రుణాలు పొడిగించినట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీలు తలారి రంగయ్య, బి.వి.సత్యవతి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మహిళా వ్యాపారవేత్తలకు అదనంగా రుణాలివ్వడం ఈ పథకం మార్గదర్శకాల్లో లేదని తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. పథకంలో భాగంగా 2020–21లో కృష్ణాజిల్లాలో 23 మంది వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకుంటే ఒకరికి బ్యాంకు రుణం మంజూరు చేయగా క్రెడిట్‌ లింక్డ్‌ సబ్సిడీ అందుతోందని, 2021–22లో 98 మంది దరఖాస్తు చేసుకుంటే 17 మందికి బ్యాంకు రుణాలు దక్కాయని, ఎనిమిది మందికి క్రెడిట్‌ లింక్డ్‌ సబ్సిడీ అందుతోందని వివరించారు. 

ట్రాన్స్‌జెండర్ల జనాభాలో ఏపీది రెండోస్థానం
2011 జనాభా లెక్కల ప్రకారం  ట్రాన్స్‌జెండర్లు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీది రెండోస్థానమని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారతశాఖ సహాయమంత్రి ఎ.నారాయణస్వామి.. వైఎస్సార్‌సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఏపీలో అత్యధికంగా చేపల ఉత్పత్తి
దేశవ్యాప్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌లోనే చేపల ఉత్పత్తి అత్యధికమని కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలా తెలిపారు. 2018–19లో 39.91 లక్షల టన్నులు ఉత్పత్తి అయితే, 2020–21లో 46.23 లక్షల టన్నులు ఉత్పత్తి అయినట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ బి.వి.సత్యవతి ప్రశ్నకు జవాబుగా చెప్పారు. 

కోల్డ్‌ చైన్‌ యూనిట్లతో 38,208 మంది రైతులకు లబ్ధి
ఆంధ్రప్రదేశ్‌లోని 38,208 మంది రైతులు 2021–22లో కోల్డ్‌ చైన్‌ యూనిట్ల ద్వారా లబ్ధిపొందుతున్నారని కేంద్ర ఫుడ్‌ప్రాసెసింగ్‌శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్‌సింగ్‌ పటేల్‌ తెలిపారు. ఏపీలో నాలుగు ప్రాజెక్టులు అమల్లో ఉండగా రెండు ప్రాజెక్టులు వేర్వేరు దశల్లో ఉన్నాయని వైఎస్సార్‌సీపీ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్‌ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

ఏపీలో ఆక్వా అభివృద్ధికి రూ.108.95 కోట్లు విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా అభివృద్ధికి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) ద్వారా 2020–21, 2021–22 సంవత్సరాలకు రూ.657.11  కోట్లు అనుమతించి రూ.108.95 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలా తెలిపారు. రాష్ట్రంలో చేపల రిటైల్‌ మార్కెట్లను ఆక్వాహబ్‌ల పేరిట అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం, పాలకొండ, పలాసలను సంభావ్యత ప్రాంతాలుగా గుర్తించిందని వైఎస్సార్‌సీపీ ఎంపీలు గొడ్డేటి మాధవి, గోరంట్ల మాధవ్‌ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement