Lavu Sri Krishnadevaraya
-
కృష్ణదేవరాయలు తొందరపడ్డారా?
రాజకీయాలలో తొందరపాటు ఉండకూడదు. ఓర్పుతో వ్యవహరిస్తే ఫలితాలు ఎక్కువ సందర్భాలలో అనుకూలంగా ఉంటాయి. నరసరావుపేట వైఎస్సార్సీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు తన పదవికి, పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించడం తొందరపాటు చర్య అనిపిస్తుంది. ఎందుకంటే పార్టీ నాయకత్వంతో కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో కానీ ఆయనకు విబేధాలు ఏమీ లేవు. ఆయనకు పార్టీలో తగు గౌరవం లభించింది. ఎమ్మెల్యేల నుంచి సహకారం పొందగలిగారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. కాకపోతే ఈసారి గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేస్తే బాగుంటుందని కృష్ణదేవరాయలకు పార్టీ అధిష్టానం సూచించింది. దానికి కారణం ఈయన అభ్యర్ధిత్వం అక్కడ ఉపయోగపడుతుందనే కదా! కానీ రాయలకు ఇష్టం లేదు. నరసరావుపేట నుంచే పోటీచేస్తానని ఆయన పట్టుబడుతున్నారు. అంతవరకు తప్పు లేదు. దీనిపై ఒకటికి రెండు సార్లు పార్టీ నాయకత్వంతో చర్చించవచ్చు. సీఎం జగన్‌ను కలిసి తన వాదన వినిపించవచ్చు. అలా కాకుండా కృష్ణదేవరాయలు రాజీనామా ప్రకటన చేయడంలో ఆయన ఉద్దేశం ఏమిటో తెలియవలసి ఉంది. కానీ, ఇందుకు ఆయన చెప్పిన కారణాలు అంత సమర్ధనీయంగా లేవు. నరసరావుపేటలో బీసీ అభ్యర్ధిని పోటీలో దించాలని వైఎస్సార్సీపీ అధిష్టానం భావిస్తోందని, దాంతో రాజకీయంగా అనిశ్చితి ఏర్పడిందని ఆయన అంటున్నారు. క్యాడర్లో కన్ఫ్యూజన్ ఏర్పడిందని ఆయన చెప్పారు. అంటే కార్యకర్తలలో ఒక గందరగోళ పరిస్థితి ఉందని ఆయన అనుకుని ఉండవచ్చు. కానీ, దానికే రాజీనామా చేయవలసిన అవసరం ఏమిటో తెలియదు. ఆయన గందరగోళంలో ఉండి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనిపిస్తుంది. పార్టీ నాయకత్వంపైన, ముఖ్యమంత్రిపైన, ప్రభుత్వంపైన ఎలాంటి విమర్శలు చేయకపోవడం కొంతలో కొంత బెటర్. నిజానికి పార్టీకి కట్టుబడి ఉండటం అన్నది ఒక విధానం. విద్యాధికుడై, పలు విద్యా సంస్ధలను నిర్వహించే కృష్ణదేవరాయలు అందుకు భిన్నంగా కేవలం ఒక పదవిని ఆశించి ఇలా వ్యవహరించడం ఆయనకు అంత ప్రతిష్టకాదని చెప్పక తప్పదు. ఆయన తండ్రి లావు రత్తయ్య 1996లో ఎన్.టీ.ఆర్.టీడీపీ తరపున బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి చెందారు. ఆ తర్వాత ఆయన రాజకీయాలలో రానించలేకపోయారు. విద్యాసంస్థల వ్యవస్థాపకుడిగా మంచిపేరు తెచ్చుకున్నా, రాజకీయాలలో ఆయనకు ఉన్న ఆసక్తిని నెరవేర్చుకోలేకపోయారు. కానీ, వైఎస్సార్సీపీను స్థాపించిన సీఎం జగన్.. ఆయన కుమారుడు కృష్ణదేవరాయలకు అవకాశం ఇచ్చి నరసరావుపేట నుంచి పోటీకిగాను టిక్కెట్ ఇచ్చారు. విజయం సాధించి ఎంపీగా పేరు తెచ్చుకున్నారు. అంతవరకు ఓకే. కానీ, ఇప్పుడు సడన్‌గా పదవికి, పార్టీకి రాజీనామా చేయడం మాత్రం తొందరపాటే అనిపిస్తుంది. కొన్ని రోజుల క్రితమే లావు కృష్ణదేవరాయలు టీడీపీలోకి వెళతారని టీడీపీ మీడియా ప్రచారం చేసింది. అయినా రాయలు వంటి విద్యాధికులు అలా చేస్తారా అని అనుకునేవారు. ఒక వేళ ఆయన నిజంగానే అలా టీడీపీలోకి వెళితే రాజకీయాలలో విలువలు పాటించని వ్యక్తులలో ఈయన కూడా ఒకరు అవుతారు. విశేషం ఏమిటంటే వైఎస్సార్సీపీ నుంచి అయితే నరసరావుపేట టిక్కెట్ కావాలట. టీడీపీ అయితే గుంటూరు నుంచి పోటీకి దిగుతారట. ఇది వాస్తవమో, కాదో తెలియదు. కానీ, ఇప్పుడు రాజీనామా చేయడంతో ఆ దిశగానే ఆయన అడుగులు వేస్తారేమోనన్న అనుమానం వస్తుంది. కృష్ణదేవరాయలు ఇలా ఓపెన్ అయిపోవడంతో బహుశా రాజీ చర్చలు కూడా ఏమీ ముందుకు వెళ్లకపోవచ్చు. నరసరావుపేట సీటును వైఎస్సార్సీపీ ఒక బీసీ అభ్యర్ధికి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మరో ఎంపీ బాలశౌరిది మరో కధ. ఈయనకు పార్టీలో ఎనలేని గుర్తింపు ఉండేది. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి సమయంలో ఒకసారి తెనాలి నుంచి ఎంపీ అయ్యారు. ఆ తర్వాత సీఎం జగన్ ఆధ్వర్యంలో మరోసారి మచిలీపట్నం నుంచి ఎంపీ అయ్యారు. అయినా ఆ విశ్వాసాన్ని ఆయన నిలబెట్టుకోలేకపోయారు. మచిలీపట్నంలో కొత్త అభ్యర్దికి అవకాశం ఇస్తారన్న భావన ఆయనలో ఏర్పడి ఉండవచ్చు. దాంతో ఆయనకు అసంతృప్తి ఏర్పడినట్లు ఉంది. సామాజికవర్గం రీత్యా జనసేనకు వెళితే బెటర్ అని ఆయన అనుకున్నారు. ఆ వెంటనే పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఇప్పుడు టీడీపీ పొత్తులో ఆయనకు జనసేట టిక్కెట్ వస్తుందో, లేదో ఎవరూ చెప్పలేరు. అయినా ఆయన రాజకీయంగా తీసుకున్న నిర్ణయం గమనిస్తే పాలిటిక్స్‌లో విధేయతకు తక్కువ అవకాశం ఉంటుందని రుజువు చేసినట్లయింది. పార్టీలో కొంతమందితో విబేధాలు ఉంటే ఉండవచ్చు. అయినా పార్టీ నాయకత్వంతో సంబంధాలు బాగానే ఉన్నప్పుడు ఇలా నాయకులు నిర్ణయాలు తీసుకుంటే వారికే నష్టం కలిగే అవకాశం ఉంటుంది. బాలశౌరి భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి. ఇదే సమయంలో టీడీపీ ఎంపీ కేశినేని నాని వైఎస్సార్సీపీలోకి రాలేదా అన్న ప్రశ్న రావచ్చు. టీడీపీలో నాని అవమానాలకు గురవడం వల్ల పార్టీ మారక తప్పలేదు. సొంత తమ్ముడితోనే నానికి వ్యతిరేకంగా టీడీపీ నాయకత్వం కుంపటి పెట్టించింది. తిరువూరులో జరిగిన పార్టీ సభ ఏర్పాట్లకు రావద్దని ఎంపీగా ఉన్న నానికి చెప్పడం అంటే ఒకరకంగా అవమానించడమే. ఆ నేపథ్యంలో ఆయన వైఎస్సార్సీపీలోకి వచ్చి విజయవాడ నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక, లావు కృష్ణదేవరాయలకు కానీ, బాలశౌరికి కానీ పార్టీలో అలాంటి అవమానాలేమీ లేవు. పైగా వారికి మంచి గౌరవమే లభించింది. అయినా టిక్కెట్ విషయంలో భిన్నాభిప్రాయాలు ఏర్పడడంతో పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. అందువల్లే రాజకీయాలలో వీరు విలువలు పాటించలేదన్న అభిప్రాయానికి తావిచ్చారు. ఏది ఏమైనా ఇక్కడ ఒక విషయం చెప్పాలి. వైఎస్సార్సీపీ అధినేత, సీఎం జగన్ వీటిని ఏమీ పట్టించుకోకుండా, కేవలం జనాన్ని నమ్ముకుని రాజకీయాలను ముందుకు తీసుకువెళుతున్నారు. ఈ క్రమంలో అభ్యర్దులు ఎవరన్నదానికి కొంతమేరకే ప్రాముఖ్యత ఉంటుందనిపిస్తుంది. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ పనితీరుపైనే ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారనిపిస్తుంది. కాబట్టి సీఎం జగన్‌కు ఎవరూ ఎదురు చెప్పలేకపోతున్నారనిపిస్తుంది. ఒకవైపు తెలుగుదేశం, జనసేనల అధినేతలు చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్ ఇంతవరకు టిక్కెట్ల కేటాయింపు ఎలా చేయాలో తెలియక సతమతమవుతుంటే, ముఖ్యమంత్రి జగన్ మాత్రం తన పద్దతి ప్రకారం అభ్యర్ధులను ఖరారు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అదే సీఎం వైఎస్ జగన్ ప్రత్యేకత అని చెప్పాలి. -కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ పాత్రికేయులు -
ఆర్బిట్రేషన్ సెంటర్ బిల్లుకు వైఎస్సార్సీపీ మద్దతు
సాక్షి, ఢిల్లీ: ఆర్బిట్రేషన్ సెంటర్ బిల్లుకు వైఎస్సార్సీపీ మద్దతు ప్రకటించింది. సోమవారం ఈ బిల్లుపై చర్చ సందర్భంగా.. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడారు. ఆర్బిట్రేషన్ కేవలం కార్పొరేట్ల కంపెనీలకే పరిమితం కాకూడదన్న ఆయన.. కింది స్థాయి లో కూడా ఆర్బిట్రేషన్ వ్యవస్థ ఉండాలని అభిప్రాయపడ్డారు. కింద స్థాయిలో ఎన్నో కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్న సంగతిని వైఎస్సార్సీపీ ఎంపీ గుర్తు చేశారు. -
ఆర్థిక లోటులో ఉంటే వాటా అడుగుతారా?
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అనంతరం రూ.16 వేల కోట్ల ఆర్థికలోటులో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను రైల్వే ప్రాజెక్టుల నిమిత్తం వాటా ఇవ్వాలని ఎలా అడుగుతారని కేంద్రాన్ని వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నించారు. బడ్జెట్లో ఏపీలో రైల్వే పనుల నిమిత్తం రూ.9 వేల కోట్లు కేటాయించారని సంతోషించాలో బాధపడాలో అర్థంకావడం లేదన్నారు. రాష్ట్ర విభజనకన్నా ముందుగానే కోటిపల్లి–నరసాపురం, గూడూరు–దుగరాజపట్నం, నడికుడి–శ్రీకాళహస్తి ఖమ్మం–ప్రొద్దుటూరు, కొండపల్లి–కొత్తగూడెం, కడప–బెంగళూరు, భద్రాచలం–కొవ్వూరు, తుముకూరు–రాయగఢ, మరికుప్పం–కుప్పం రైల్వే లైన్లు అనుమతించారని వాటిలో చాలావరకు పురోగతిలో లేవని వివరించారు. లోక్‌సభలో మంగళవారం రైల్వే పద్దులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించారన్నారు. ఆంధ్రప్రదేశ్ రూ.16వేల కోట్ల రెవెన్యూ లోటుతో ఏర్పాటైందన్న విషయం గుర్తుంచుకోవాలని కోరారు. మూడేళ్ల కిందట ఏర్పాటు చేసిన సౌత్‌కోస్ట్ రైల్వేజోన్‌కు నిధులు కేటాయించి కార్యకలాపాలు ప్రారంభించాలని కోరారు. గుంటూరు రైల్వేస్టేషన్ ఆధునికీకరణకు కేటాయించిన రూ.80 కోట్లు ఇతర డివిజన్లకు మళ్లించారన్నారు. ఇలా ఎందుకు మళ్లించారో తేల్చాల్సి ఉందన్నారు. మిర్చి, పొగాకు, పత్తి తదితరాలు ఎగుమతి అయ్యే గుంటూరు రైల్వేస్టేషన్లో సదుపాయాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. గుంటూరు స్టేషన్‌కు తిరిగి నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని కోరారు. కరోనా పేరుతో నడికుడిలో పలు రైళ్లను ఆపడం లేదని అడిగితే ఆదాయం రావడం లేదని అధికారులు చెబుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి రాష్ట్రంలో రైల్వే సదుపాయాలు మెరుగుపరచాలని కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు. చిత్తూరులో కంటైనర్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ వైఎస్సార్సీపీ ఎంపీ చింతా అనూరాధ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో ఎన్టీపీసీ, బీహెచ్ఈఎల్కు కేటాయించిన భూముల్లో కంటైనర్ మ్యాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించేలా ఐఆర్సీటీసీ ప్యాకేజీలు లేవన్నారు. ఏపీలో తిరుపతి, శ్రీశైలం, అహోబిలం, కనకదుర్గ ఆలయం, శ్రీకాళహస్తి, లేపాక్షి, కాణిపాకం ఆలయాలకు పర్యాటకాన్ని ప్రోత్సహించేలా పర్యాటక ప్యాకేజీ రూపాందించాలని కోరారు. రాష్ట్రంలో ఆర్వోబీ, ఆర్యూబీల నిర్మాణానికి తగిన నిధులు కేటాయించాలన్నారు. ఈస్ట్‌కోస్ట్ రైల్వేజోన్‌లో ఖాళీలు భర్తీచేయాలని, నూతన సౌత్‌కోస్ట్ రైల్వేజోన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని, ఎస్సీ, ఎస్టీల నిమిత్తం ప్రత్యేక రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించాలని కోరారు. సౌత్‌కోస్ట్ జోన్ కార్యకలాపాలు త్వరగా ప్రారంభించాలని, వాల్తేరు డివిజన్‌ను దీన్లోనే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. కోటిపల్లి–నరసాపురం రైల్వే పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నిమిత్తం రాష్ట్రం సూచనలు పరిగణించి అమలు చేయాలని ఆమె కోరారు. ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించాలి వైఎస్సార్సీపీ ఎంపీ బి.వి.సత్యవతి మాట్లాడుతూ కరోనా సమయంలో రద్దుచేసిన ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పలాస–విశాఖ, విశాఖ–విజయవాడ, విశాఖ–రాజమండ్రి, విశాఖ–కాకినాడ ప్యాసింజర్ల రద్దువల్ల సామాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విశాఖ నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్ నడపాలని కోరారు. తద్వారా ఏపీ, తెలంగాణల్లో ఆర్థిక పురోగతి ఉంటుందన్నారు. నెల్లిమర్ల, గరివిడి, అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నం రోడ్ వంటి స్టేషన్లలో సదుపాయాలు మెరుగుపరచాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో గుర్తించిన 23 బౌద్ధ స్మారకాలు, ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి పర్యాటక రైళ్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీలో ఓడీవోఎఫ్పీలో పలు ఉత్పత్తుల గుర్తింపు ఒక జిల్లా దృష్టి సారించిన ఒక ఉత్పత్తి (ఓడీవోఎఫ్‌పీ)లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో 10 ఉత్పత్తులు గుర్తించినట్లు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్ పటేల్ చెప్పారు. పీఎం ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకంలో భాగంగా ఆర్థిక, సాంకేతిక, వ్యాపార సహకారం అందిస్తున్నట్లు వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ప్రశ్నకు జవాబుగా తెలిపారు. -
ఏపీకి తెలంగాణ విద్యుత్తు బకాయి రూ.6,111.88 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ ఇవ్వాల్సిన రూ.6,111.88 కోట్ల విద్యుత్తు బకాయిల అంశాన్ని ఆ రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు గురువారం లోక్‌సభలో మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకున్న విద్యుత్తుకు తెలంగాణ చెల్లించాల్సిన అసలు మొత్తంపై వివాదం లేదని, వడ్డీ విషయంలోనే సయోధ్య అవసరమని పేర్కొన్నారు. తెలంగాణ సొమ్ము ఇవ్వనందున ఏపీ.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిందని తెలిపారు. అంశం కోర్టులో ఉన్నందున్న పరిష్కారానికి ఎలాంటి కాలపరిమితి లేదని చెప్పారు. చెక్‌డ్యాంల బలోపేతానికి రెండేళ్లుగా నిధులివ్వలేదు ఆంధ్రపద్రేశ్లో చెక్‌డ్యాంల బలోపేతానికి వాటర్ బాడీస్ రిపేర్ రెన్నోవేషన్, రీస్టోరేషన్ నిమిత్తం 2019–20, 2020–21ల్లో నిధులు విడుదల చేయలేదని వైఎస్సార్సీపీ ఎంపీలు అవినాశ్‌రెడ్డి, వంగా గీతా విశ్వనాథ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తిశాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు సమాధానమిచ్చారు. హస్తకళల ప్రోత్సాహానికే హున్నార్‌హాట్‌లు దేశంలోని అన్ని ప్రాంతాల్లోని హస్తకళలను ప్రోత్సహించడానికే హున్నార్‌హాట్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాలశాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. హైదరాబాద్ సహా 35 ప్రాంతాల్లో హాట్లు నిర్వహించామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ హస్తకళల పోటీపై ఎలాంటి అధ్యయనం చేపట్టలేదని వైఎస్సార్సీపీ ఎంపీలు రెడ్డెప్ప, చింతా అనూరాధ, బి.వి.సత్యవతి, గోరంట్ల మాధవ్, సంజీవ్‌కుమార్, ఎం.వి.వి.సత్యనారాయణ, చంద్రశేఖర్ బెల్లాన అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. డీఆర్‌ఐపీలో 31 ప్రాజెక్టులు డ్యాం రిహ్యాబిలిటేషన్, ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు (డీఆర్ఐపీ)లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో 31 ప్రాజెక్టులకుగాను రూ.667 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ అడిగిన ప్రశ్నకు జవాబుగా కేంద్ర జలశక్తిశాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు తెలిపారు. ఉమ్మడి ఏపీలో 9 మిలియన్ హెక్టార్లలో వరద ప్రభావం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 9 మిలియన్ హెక్టార్లలో వరద ప్రభావం ఉందని వైఎస్సార్సీపీ ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, పి.వి.మిథున్‌రెడ్డి, ఎన్.రెడ్డెప్ప అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తిశాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు సమాధానమిచ్చారు. గ్రామ్ ఉజాలలో మూడు జిల్లాలు గ్రామ్‌ఉజాల ప్రోగ్రామ్‌లో ఏపీలోని కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలను గుర్తించినట్లు కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్ తెలిపారు. తొలిదశలో గుర్తించిన జిల్లాల్లో లబ్ధిదారుల అవగాహనకు కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సీసీఎస్‌ఎల్) చర్యలు తీసుకుంటోందని వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ట్రిబ్యునల్ కేటాయింపుల్లోనే అప్పర్‌భద్ర కృష్ణా ట్రిబ్యునల్ కేటాయించిన జలాల్లో భాగంగానే తెలంగాణలోని అప్పర్ భద్ర ప్రాజెక్టు ఉందని కేంద్ర జలశక్తిశాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు తెలిపారు. ఈ నేపథ్యంలో అంతర్రాష్ట్ర అంశం సమసినట్లేనని భావిస్తున్నట్లు వైఎస్సార్సీపీ ఎంపీ బాలశౌరి ప్రశ్నకు సమాధానమిచ్చారు. -
సంక్షేమానికి కోతలు సరికాదు
సాక్షి, న్యూఢిల్లీ: పరిమితికి మించి టీడీపీ హయాంలో చేసిన అప్పులకు ప్రస్తుతం నికర రుణపరిమితిలో ఆంక్షలు విధించడం సరికాదని వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. ఇదెక్కడి న్యాయమని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్లో సంక్షేమ పథకాలకు రాయితీలు తగ్గించడం సబబు కాదన్నారు. బుధవారం ఢిల్లీలోని ఏపీ భవన్లో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్ విప్ మార్గాని భరత్, ఎంపీ నందిగం సురేశ్‌లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్‌తో రాష్ట్ర ప్రజలు తీవ్ర నిరాశకు లోనయ్యారని చెప్పారు. ఎరువులు, ఉపాధి హామీ, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్య రంగంలో సబ్సిడీలను తగ్గిస్తే ప్రజలకు సంక్షేమం ఎలా అందుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బడ్జెట్లో పీఎం గరీబ్ కల్యాణ్ యోజన ప్రస్తావన లేకపోవడం విచారకరమన్నారు. మూలధన వ్యయం పెరిగిందని కేంద్రం చెబుతోందని, ప్రభుత్వ రంగ సంస్థల రుణాల చెల్లింపులు పోగా గతేడాదితో పోలిస్తే మూడు శాతం మాత్రమే పెంచారని తెలిపారు. రూ.7.5 లక్షల కోట్లకు పెంచినట్లు కేంద్రం ప్రకటించినందున ఏపీకి సాయం చేయాలని కోరారు. ఆ నిధులు సమకూరిస్తే విభజన హామీలన్నీ నెరవేరతాయన్నారు. జీఎస్టీ, పెట్రోలు, డీజిలు సెస్సులు బట్టి చూస్తే రాష్ట్రాలకు రూ.4 లక్షల కోట్లకుపైనే వడ్డీ రుణాలు అందించవచ్చన్నారు. ప్రత్యేక హోదా, రెవెన్యూలోటు, వెనకబడిన ప్రాంతాలకు నిధులు విషయంలోనూ ఏపీకి అన్యాయం చేశారన్నారు. ఇతర రాష్ట్రాల ఎంపీలను చూసైనా ఏపీ అభివృద్ధి కోసం కృషి చేయాలని టీడీపీ ఎంపీలకు హితవు పలికారు. చదవండి: AP: ఉపాధ్యాయ సంఘాల బండారం బయటపెట్టిన పీఆర్సీ స్టీరింగ్ కమిటీ టీడీపీ ఎంపీలు అడ్డుకోవడం సరికాదు.. రాష్ట్రానికి రావాల్సిన నిధులను టీడీపీ ఎంపీలు అడ్డుకోవడం సరికాదని ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజు ఓ బఫూన్ అని అభివర్ణించారు. మాట తీరు, వ్యవహార శైలి మార్చుకోకుంటే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ప్రజలంతా సంతోషంగా ఉంటే విపక్ష నేత చంద్రబాబు సహించలేకపోతున్నారని ఎంపీ నందిగం సురేశ్ విమర్శించారు. -
ఏపీకి ఎనిమిదేళ్లుగా అన్యాయం.. సభే సాక్షి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ఎనిమిదేళ్లుగా కేంద్రం అన్యాయం చేస్తూనే ఉందని, దీనికి సభే సాక్షి అని వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగంలో ఈశాన్య రాష్ట్రాల అభివృది గురించి ప్రస్తావించారుగానీ ఏపీకి ప్రత్యేకహోదా అంశం కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా న్యాయంగా రాష్ట్ర ప్రజలకు నెరవేర్చాల్సిన హామీ అని గుర్తుచేశారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్రం విస్మరించిందన్నారు. లోక్‌సభలో మంగళవారం బడ్జెట్‌పై జరిగిన సాధారణ చర్చలో ఆయన మాట్లాడారు. ఏపీ పరంగా చూస్తే ఈ బడ్జెట్ నిరుత్సాహపరిచిందని చెప్పారు. విభజన హామీలేవీ అమలు కాలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా రూ.55 వేల కోట్లు అయితే ఇప్పటికీ రూ.13 వేల కోట్లు మాత్రమే ఖర్చయిందని చెప్పారు. రూ.11 వేల కోట్లు మాత్రమే రాష్ట్రానికి రీయింబర్స్ చేశారని, సుమారు రూ.2 వేల కోట్లు విడుదల చేయాల్సి ఉందని గుర్తుచేశారు. టీడీపీ చేసిన తప్పులకు ప్రస్తుత ప్రభుత్వాన్ని శిక్షించడం తగదన్నారు. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఒక్కో వ్యక్తికి రూ.428 చొప్పున లెక్కిస్తే బుందేల్ ఖండ్‌కు మాత్రం పదిరెట్లు ఎక్కువగా ఇస్తున్నారని చెప్పారు. కెన్–బెత్వా ప్రాజెక్టుకు నిధులు కేటా యించినట్లే ఏపీలో నదుల అనుసంధానానికి చేసిన రాష్ట్రం చేసిన ఖర్చు తిరిగి ఇవ్వాలని కోరారు. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో జరిగిన దాడిని ఖండించారు. కడియం పూలపెంపకం ప్రాంతీయ స్టేషన్లో ఐదుగురు శాస్త్రవేత్తలు ఆంధ్రప్రదేశ్‌లోని కడియం నర్సరీల్లో సాంకేతిక సిబ్బందికి సహకరించడానికి పూలపెంపకం (ఫ్లోరీకల్చర్) ప్రాంతీయ స్టేషన్లో ఐదుగురు శాస్త్రవేత్తలను నియమించినట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ మంగళవారం లోక్‌సభలో తెలిపారు. కడియం నర్సరీ పరిశ్రమను దృష్టిలో ఉంచుకుని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చి (ఐకార్) కడియం మండలంలోని వేమగిరిలో ఐకార్–డైరెక్టరేట్ ఆఫ్ ఫ్లోరీకల్చర్ రీసెర్చి ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఏపీలో 266 ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఆంధ్రప్రదేశ్‌లో 266 ఎలక్ట్రిక్ వెహికల్స్ చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయని కేంద్ర భారీపరిశ్రమలశాఖ సహాయమంత్రి క్రిషన్‌పాల్ గుర్జర్ చెప్పారు. మరో 65 రిటైల్ అవుట్లెట్లు ఈ ఏడాది జనవరి 1వ తేది నుంచి అందుబాటులోకి వచ్చినట్లు వైఎస్సార్సీపీ ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, సంజీవ్‌కుమార్ అడిగిన ప్రశ్నకు జవాబుగా తెలిపారు. ఎన్జీరంగా వర్సిటీకి రూ.135 కోట్లు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ వర్సిటీ ప్రధాన కార్యాలయం, కళాశాలలు, సదుపాయాలు తదితరాలకు రూ.135 కోట్లు మూడు దశలుగా విడుదల చేసినట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీలు మద్దిళ్ల గురుమూర్తి, వంగా గీతావిశ్వనాథ్, చింతా అనూరాధ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ.. వర్సిటీ ఏర్పాటుకు సంబంధించి నిధుల విడుదలలో పెండింగ్ లేదని చెప్పారు. పీఎంఎఫ్ఎంఈలో ఏపీకి రూ.20.72 కోట్లు విడుదల ప్రధానమంత్రి మైక్రో, ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థల (పీఎంఎఫ్ఎంఈ) ఏర్పాటులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు రూ.20.72 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఫుడ్‌ప్రాసెసింగ్, పరిశ్రమలశాఖ సహాయమంత్రి ప్రహ్లాద్‌సింగ్ పటేల్ తెలిపారు. 2021–22 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్‌లోని 96 మంది లబ్ధిదారులకు ఈ పథకంలో భాగంగా రుణాలు పొడిగించినట్లు వైఎస్సార్సీపీ ఎంపీలు తలారి రంగయ్య, బి.వి.సత్యవతి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మహిళా వ్యాపారవేత్తలకు అదనంగా రుణాలివ్వడం ఈ పథకం మార్గదర్శకాల్లో లేదని తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. పథకంలో భాగంగా 2020–21లో కృష్ణాజిల్లాలో 23 మంది వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకుంటే ఒకరికి బ్యాంకు రుణం మంజూరు చేయగా క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ అందుతోందని, 2021–22లో 98 మంది దరఖాస్తు చేసుకుంటే 17 మందికి బ్యాంకు రుణాలు దక్కాయని, ఎనిమిది మందికి క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ అందుతోందని వివరించారు. ట్రాన్స్జెండర్ల జనాభాలో ఏపీది రెండోస్థానం 2011 జనాభా లెక్కల ప్రకారం ట్రాన్స్జెండర్లు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీది రెండోస్థానమని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారతశాఖ సహాయమంత్రి ఎ.నారాయణస్వామి.. వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఏపీలో అత్యధికంగా చేపల ఉత్పత్తి దేశవ్యాప్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్‌లోనే చేపల ఉత్పత్తి అత్యధికమని కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలా తెలిపారు. 2018–19లో 39.91 లక్షల టన్నులు ఉత్పత్తి అయితే, 2020–21లో 46.23 లక్షల టన్నులు ఉత్పత్తి అయినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ బి.వి.సత్యవతి ప్రశ్నకు జవాబుగా చెప్పారు. కోల్డ్ చైన్ యూనిట్లతో 38,208 మంది రైతులకు లబ్ధి ఆంధ్రప్రదేశ్‌లోని 38,208 మంది రైతులు 2021–22లో కోల్డ్ చైన్ యూనిట్ల ద్వారా లబ్ధిపొందుతున్నారని కేంద్ర ఫుడ్‌ప్రాసెసింగ్‌శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్‌సింగ్ పటేల్ తెలిపారు. ఏపీలో నాలుగు ప్రాజెక్టులు అమల్లో ఉండగా రెండు ప్రాజెక్టులు వేర్వేరు దశల్లో ఉన్నాయని వైఎస్సార్సీపీ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఏపీలో ఆక్వా అభివృద్ధికి రూ.108.95 కోట్లు విడుదల ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా అభివృద్ధికి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్వై) ద్వారా 2020–21, 2021–22 సంవత్సరాలకు రూ.657.11 కోట్లు అనుమతించి రూ.108.95 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలా తెలిపారు. రాష్ట్రంలో చేపల రిటైల్ మార్కెట్లను ఆక్వాహబ్‌ల పేరిట అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం, పాలకొండ, పలాసలను సంభావ్యత ప్రాంతాలుగా గుర్తించిందని వైఎస్సార్సీపీ ఎంపీలు గొడ్డేటి మాధవి, గోరంట్ల మాధవ్ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
పల్నాడులో ఉద్రిక్తతలకు టీడీపీ కుట్ర
నరసరావుపేట రూరల్: ప్రశాంతంగా ఉన్న పల్నాడులో విగ్రహాలు మాయంతోపాటు శవ రాజకీయాలు చేయడం ద్వారా ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్‌రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, మేరుగ నాగార్జున పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డ సొసైటీ కార్యాలయం వద్ద తొమ్మిదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గత శుక్రవారం దుండగులు మాయం చేసిన విషయం తెలిసిందే. తిరిగి ఇదే ప్రాంతంలో వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు సోమవారం భూమి పూజ నిర్వహించారు. తొలుత నరసరావుపేట 60 అడుగుల రోడ్డులోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అక్కడ నుంచి సొసైటీ కార్యాలయం వద్దకు వెళ్లి భూమి పూజ చేశారు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. గత 15 రోజులుగా టీడీపీ నాయకులు హత్యా రాజకీయాలు, విగ్రహ రాజకీయాలతో నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గంలో అలజడులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని మాయం చేయడమే కాకుండా ఘటనపై విచారణ జరగకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించడం వంటి చిల్లర రాజకీయాలకు టీడీపీ నేతలు పాల్పడుతున్నారని విమర్శించారు. నిందితులను కాపాడేందుకు తనమీద దాడి జరిగినట్టు సృష్టించుకుని టీడీపీ నేత అరవిందబాబు నాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ నేతలు శవ రాజకీయాలతో ముందుకు వెళ్లాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రానికి పట్టిన చీడపురుగు చంద్రబాబు అని అన్నారు. ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో చిచ్చుపెట్టేందుకు టీడీపీ కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నదని విమర్శించారు. కార్యక్రమంలో జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్ఏ హనీఫ్, షేక్ కార్పొరేషన్ చైర్మన్ ఖాజావలి తదితరులు పాల్గొన్నారు. -
మిర్చి రైతులను ఆదుకోండి
సాక్షి, న్యూఢిల్లీ/నరసరావుపేట: ఆంధ్రప్రదేశ్‌లో నష్టపోయిన మిరప రైతుల్ని ఆదుకోవాలని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌కు వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విజ్ఞప్తి చేశారు. ఆయన గురువారం న్యూఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. గుంటూరు మిర్చి సుమారు రూ.5 వేల కోట్లకు పైగా టర్నోవర్‌తో 40కి పైగా దేశాలకు ఎగుమతి అవుతోందని తెలిపారు. ఈ సీజన్లో రికార్డు స్థాయిలో 1.4 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు జరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇటీవల రెండు తుపాన్లతో విస్తృతంగా పంట నష్టం జరిగిందన్నారు. 14 వేల హెక్టార్లకుపైగా విస్తీర్ణంలోని పంటపై నల్లతామర తెగులు ప్రభావం చూపిందని, సుమారు రూ.500 కోట్ల నష్టం వచ్చిందని తెలిపారు. పురుగు ఎందు కు ఆశిస్తోందో అధ్యయనం చేసి నివారణ చర్యల గురించి రైతులకు మార్గనిర్దేశం చేయడానికి నిపుణుల బృం దాన్ని పంపాలని, నల్లతామర ప్రభావం తగ్గించడానికి అవసరమైన పురుగుమందులను ఏపీ ప్రభుత్వానికి అందించాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరు జిల్లాలో పీఎం ఫసల్ బీమా యోజన సార్వత్రిక కవరేజీ ముందస్తుగా నిర్ధారించాలని కోరారు. నేషనల్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా నష్టపోయిన పంటను సేకరించాలని విజ్ఞప్తి చేశారు. కమిటీ ఏర్పాటు చేసిన కేంద్రం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చేసిన అభ్యర్థనను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం గురువారం ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలోని ఐసీఏఆర్–ఎన్‌సీఐపీఎం సైంటిస్టు డాక్టర్ కె.రాఘవేంద్ర, బెంగళూరుకు చెందిన ఎంట మాలజీ సైంటిస్టు డాక్టర్ రచనారుమాణీ, ఫరీదా బాద్‌కు చెందిన డాక్టర్ ఒ.పి.వర్మ, విజయవాడ సీఐపీఎంఈ డిప్యూటీ డైరెక్టర్ ఎం.పి.గోస్వామి, రాష్ట్ర ఉద్యానవనశాఖ అధికారిని నియమించింది. -
పూల ఉత్పత్తిలో ఏపీది మూడోస్థానం
సాక్షి, న్యూఢిల్లీ: ముందస్తు అంచనాల ప్రకారం 2020–21లో ఆంధ్రప్రదేశ్ దేశంలోని మూడో అతిపెద్ద పూల ఉత్పత్తిదారుగా ఉందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చెప్పారు. లోక్‌సభలో మంగళవారం వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నకు ఆయన జవాబిచ్చారు. 2020–21లో ఆంధ్రప్రదేశ్‌లో 19.84 వేల హెక్టార్లలో 406.85 వేల టన్నుల పూల ఉత్పత్తి జరిగినట్లు అంచనా వేశారని తెలిపారు. 2020–21లో దేశంలో మొత్తం పూల ఉత్పత్తిలో 15.62 శాతం ఆంధ్రప్రదేశ్ అందించిందన్నారు. దేశంలోని ప్రధాన పుష్పాలను ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అత్యధిక ఉత్పత్తిని కలిగి ఉందని చెప్పారు. 35 వ్యవసాయ అటవీ నమూనాల అభివృద్ధి సబ్మిషన్ ఆన్ ఆగ్రోఫారెస్ట్రీ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో 567.65 హెక్టార్లను ఆగ్రోఫారెస్ట్రీ కిందకు తెచ్చినట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. రైతుల ప్రయోజనం కోసం వివిధ వ్యవసాయ పర్యావరణ ప్రాంతాలు, భూ వినియోగ పరిస్థితులకు అనువైన 35 వ్యవసాయ అటవీ నమూనాలను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ఏపీలో 3 మెగా ఫుడ్ పార్కులు ఆంధ్రప్రదేశ్‌లో 3 మెగా ఫుడ్ పార్కులు, 28 కోల్డ్ చైన్ ప్రాజెక్ట్‌లు, 1 ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్, 4 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, 1 ఆపరేషన్ గ్రీన్స్ ప్రాజెక్ట్, 4 ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీలను ఇప్పటికే ఆమోదించినట్లు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్‌శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్‌సింగ్ పటేల్ తెలిపారు. ప్రతి జిల్లాలో ఒక ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ద్వారా నిర్వహించే మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ స్కీమ్‌ను కేంద్ర ప్రాయోజిత ఫార్మలైజేషన్ ద్వారా ప్రతి జిల్లాలో ఒక ఇంక్యుబేషన్ సెంటర్, ఒక నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ యోచిస్తోందని వైఎస్సార్సీపీ ఎంపీ బాలశౌరి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 16.8 లక్షలమంది పాల ఉత్పత్తిదారులకు మార్కెట్ యాక్సెస్ పాల ఉత్పత్తిదారుల నికర రోజువారీ ఆదాయం రూ.25.52 పెరగడంతోపాటు కిలో పాలకు దాణా ఖర్చును తగ్గించడంలో జాతీయ డెయిరీ ప్రణాళిక దశ–1 దోహదపడిందని కేంద్ర పాడిపశుసంవృద్ధిశాఖ మంత్రి పురుషోత్తమ్ రూపాలా తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ఈ ప్రాజెక్టులో అదనంగా నమోదు చేసుకున్న 16.8 లక్షల మంది పాల ఉత్పత్తిదారులకు మార్కెట్ యాక్సెస్ అందించినట్లు పేర్కొన్నారు. అందులో 7.65 లక్షల మంది మహిళా సభ్యులున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ 97 వేల గ్రామాల్లో 59 లక్షలమంది లబ్ధిదారులను కవర్ చేసిందని చెప్పారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ కింద అభివృద్ధి శ్యామాప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ కింద దేశంలోని 28 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాల్లో 109 గిరిజన సమూహాలు, 191 గిరిజనేతర క్లస్టర్లలో అభివృద్ధి వివిధ దశల్లో ఉందని వైఎస్సార్సీపీ ఎంపీ తలారి రంగయ్య ప్రశ్నకు సమాధానంగా కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సహాయమంత్రి సాధ్వి నిరంజన్‌జ్యోతి తెలిపారు. రూ.27,788.44 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడితో 300 రూర్బన్ క్లస్టర్లలో 291 ఇంటిగ్రేటెడ్ క్లస్టర్ యాక్షన్ ప్లాన్లు అభివృద్ధి చేశామని చెప్పారు. 6.50 లక్షల నీటిసేకరణ నిర్మాణాలు జాతీయ మిషన్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్ కింద వర్షాధార ప్రాంత అభివృద్ధి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ తెలిపారు. ఇప్పటివరకు ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలోని వాటర్‌షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ కింద దాదాపు 6.50 లక్షల నీటిసేకరణ నిర్మాణాలు సృష్టించినట్లు వైఎస్సార్సీపీ ఎంపీ వంగా గీత ప్రశ్నకు ఆయన జవాబుగా చెప్పారు. స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ యోజన కింద ప్రారంభించిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పథకాన్ని ప్రస్తుతం దేశంలో 250 జిల్లాల్లో అమలు చేస్తున్నామనికేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు అందిస్తున్న వైఎస్సార్ సున్నా వడ్డీ పథకంలాంటి దాన్ని అమలు చేసే ఆలోచన కేంద్రానికి ఉందా అని ఎంపీ వంగా గీత అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. స్పెషల్ స్టేటస్ ఇవ్వాలన్న ప్రతిపాదన అందింది ఆంధ్రప్రదేశ్, మరికొన్ని రాష్ట్రాల నుంచి ప్రత్యేక కేటగిరీ హోదా ఇవ్వాలన్న ప్రతిపాదన కేంద్రానికి అందిందని, అయితే 14వ ఆర్థికసంఘం రాష్ట్రాల మధ్య పంచుకోదగిన పన్నుల సమాంతర పంపిణీలో సాధారణ కేటగిరీ రాష్ట్రాలు, ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాల మధ్య వ్యత్యాసాన్ని చూపలేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. టీఆర్ఎస్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. 14వ ఆర్థికసంఘం సిఫార్సుల ప్రకారం 2015–20 కాలానికి రాష్ట్రాలకు నికర భాగస్వామ్య పన్నుల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వెనుకబడిన ప్రాంతాల్లో పారిశ్రామిక సంస్థల ఏర్పాటును ప్రోత్సహించేందుకు 2015 ఆర్థిక చట్టం ప్రకారం ఆదాయపన్నుకు సంబంధించి పన్ను ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. -
శ్రీశైలం, సాగర్లకు ‘డ్రిప్’ అమలు చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: డ్యామ్‌ల భద్రత, కార్యాచరణ, పనితీరును మెరుగుపరచటానికి ఉన్న కేంద్ర పథకం డ్యామ్ రిహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్టు (డ్రిప్) కింద శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు సత్వరం మరమ్మతులు చేపట్టాలని, ప్రాజెక్టుల అభివృద్ధి పనులను మెరుగుపరచాలని వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రాన్ని కోరారు. మంగళవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ.. కృష్ణాబోర్డు పరిధిలోని ఈ డ్యామ్‌ల భద్రత, నిర్వహణ సక్రమంగా చేయాలని, ఇందుకోసం జలశక్తి శాఖ ప్రత్యేక నిర్వహణ బృందాన్ని నియమించాలన్నారు. ప్రస్తుతం శ్రీశైలం ఆనకట్ట వైండింగ్ పూల్ ప్రమాదస్థితిలో ఉందని తెలిపారు. 2020లో నీటి ఉధృతికి నాగార్జునసాగర్ కుడికాల్వ గేటు విరిగిపోవడంతో చాలా నీరు వృథాగా పోయిందని చెప్పారు. వీటి అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విశాఖ స్టీల్స్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలి: ఎంపీ సత్యనారాయణ విశాఖ స్టీల్స్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇటీవలే ప్రైవేటీకరణ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని అభ్యర్థిస్తూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం ఆమోదించిందని గుర్తుచేశారు. ఒడిశాలోని ఓఎండీసీలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ భారీ పెట్టుబడులు పెట్టిందని, కానీ నేటివరకు ముడిసరుకు ప్లాంటుకు చేరలేదని చెప్పారు. ప్రభుత్వ లేదా ప్రైవేట్ బ్యాంకుల నుంచి నిధులు పొందేందుకు అనుమతులు ఇవ్వడం లేదని, ఇది శోచనీయమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్లాంటుకు ఇనుప ఖనిజం గనులను కేటాయించి, ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. నిర్వహణకు అవసరమైన విడిభాగాలు, బ్యాటరీలు అందుబాటులో లేవని తెలిపారు. వీటిని సమకూర్చాలని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలి: ఎంపీ చింతా అనూరాధ రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరిచిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎంపీ చింతా అనూరాధ కేంద్రాన్ని కోరారు. ఏడేళ్లుగా విభజన చట్టంలోని హామీలను నెరవేర్చడం లేదన్నారు. రాష్ట్రంలోని వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. వరద నష్టపరిహారాన్ని వెంటనే విడుదల చేయండి: నందిగం సురేశ్ ఇటీవలి అకాల వర్షాలకు రాయలసీమ జిల్లాల్లో రోడ్లు, వంతెనలు, పంటలు భారీగా దెబ్బతిని ఆస్తి, ప్రాణనష్టం జరిగిందని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేశ్ చెప్పారు. వారిని వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుందన్నారు. దీనికి సంబంధించి కేంద్రం అందించాల్సిన నష్టపరిహారాన్ని వెంటనే ఇవ్వాలని కోరారు. కులగణన చేపట్టాలి: ఎంపీ తలారి రంగయ్య దేశ సంపద అన్ని వర్గాలకు సమానంగా వికేంద్రీకరణ జరగాలంటే తక్షణమే కులగణన చేపట్టాలని వైఎస్సార్సీపీ ఎంపీ తలారి రంగయ్య కేంద్రాన్ని కోరారు. దేశంలో 75 శాతం సంపద 10 శాతం జనాభా చేతిలో ఉందని చెప్పారు. ఈ అసమానతలు పోవాలంటే తక్షణమే కులగణన చేపట్టాలని కోరారు. -
కృష్ణా జలాల వివాదాన్ని పరిష్కరించండి
నరసరావుపేట: కృష్ణా జలాల వివాదాన్ని పరిష్కరించి ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు ఇబ్బందులను తొలగించాలని వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలోని జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సమావేశమయ్యారు. కృష్ణా బోర్డు ఆదేశాలకు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి చేస్తుండటంతో నీరు వృధాగా సముద్రంలో కలిసి ఏపీ రైతులకు తాగు, సాగునీటికి ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. కృష్ణా జలాలపై ఆధారపడిన నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల రైతులు తెలంగాణ వైఖరికి ఆందోళన చెందుతున్నారన్నారు. పల్నాడు ప్రాంతానికి నాగార్జున సాగర్ నీరే శరణ్యమని, దానిపై ఆధారపడి వరి, మిర్చి, పత్తి, పసుపు పంటలు పండిస్తున్నారన్నారు. నీరందకపోతే ఈ రైతులకు భారీ నష్టం కలుగుతుందన్నారు. -
నీటి తరలింపును ఆపండి
నరసరావుపేట: తెలంగాణ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ.. కృష్ణా జలాలను కిందకు వదలడం వల్ల ఏపీలోని రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతుందని, వెంటనే ఆ చర్యను నివారించాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా ప్రతిరోజూ శ్రీశైలం నుంచి నాలుగు టీఎంసీలు, సాగర్ నుంచి మూడు టీఎంసీలు, పులిచింతల నుంచి 1.8 టీఎంసీలు వినియోగించుకుంటూ విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. దీంతో ఏపీలో రాబోయే రోజుల్లో తాగు, సాగునీటికి కొరత ఏర్పడనుందని పేర్కొన్నారు. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల రైతుల మనుగడకు తీవ్ర విఘాతం ఏర్పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేసి ఉమ్మడి ప్రాజెక్టుల వద్ద సీఐఎస్ఎఫ్ బలగాలతో రక్షణ కల్పించాలని కేంద్రమంత్రిని కోరారు. -
బాబు కనుసన్నల్లోనే కుట్ర
సాక్షి, అమరావతి: ఎంపీ రఘురామరాజును పోలీసులు కొట్టలేదని న్యాయస్థానం నియమించిన వైద్యుల కమిటీ నిగ్గు తేల్చడంతో ఆయనకు ప్రాణహాని ఉందంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు కొత్త డ్రామాకు తెరతీశారని వైఎస్సార్సీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి, వల్లభనేని బాలశౌరి, లావు శ్రీకృష్ణదేవరాయలు విమర్శించారు. ‘ఈ వ్యవహారంపై తేల్చేందుకు హైకోర్టు.. మెడికల్ బోర్డుకు రిఫర్ చేసింది. వైద్యులను కూడా న్యాయస్థానమే నియమించింది. రఘురామను పరీక్షించిన అనంతరం వైద్య బృందం సీల్డ్ కవర్లో తన నివేదికను అందచేసింది. ఈ మొత్తం ప్రక్రియలో అసలు రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం ఎక్కడుంది? టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు నిజమైతే ఆ పార్టీ నేతలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, అచ్చెన్నాయుడు విషయంలో కూడా ప్రభుత్వం అలాగే వ్యవహరించేది కదా? ఇదంతా చూస్తుంటే ఇందులో కుట్ర దాగుందని బోధపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు పన్నిన కుట్రలు వెలుగులోకి వస్తున్నాయనే భయంతోనే అరెస్టుపై చంద్రబాబు రాద్ధాంతం చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. రఘురామరాజును చంద్రబాబు పావులా వాడుకున్నారని చెప్పారు. కులమతాల చిచ్చు రగల్చడం, దిగజారుడు భాష మాట్లాడిన వారిని చట్టం ఎందుకు ఉపేక్షిస్తుందని ప్రశ్నించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ సీపీ ఎంపీలు సోమవారం విలేకరులతో మాట్లాడారు. కేసుల భయంతో చంద్రబాబుతో కలిసి కుట్ర: మిథున్‌రెడ్డి రఘురామరాజును పోలీసులు కొట్టలేదని న్యాయస్థానం నియమించిన వైద్యుల కమిటీనే నిగ్గు తేల్చింది. దీంతో ఆయనకు ప్రాణహాని ఉందంటూ చంద్రబాబు కొత్త డ్రామాకు తెరతీశారు. టీడీపీ నేతలు అరెస్టైనప్పుడు కూడా ఇంతగా స్పందించని వ్యక్తి ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా నానా హైరానా చేస్తున్నారు. నిజంగా పోలీసులు కొడితే రఘురామరాజు కోర్టుకు నడుచుకుంటూ రాగలరా? వైద్యం కోసం రమేష్ ఆస్పత్రికే వెళ్తానని ఎందుకు పట్టుబడుతున్నారు? అది టీడీపీ వారిది కావడం వల్లే. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టేందుకు గతంలో శంకర్రావును వాడుకున్నట్లే ఇప్పుడు ప్రభుత్వాన్ని అస్థిర పర్చేందుకు రఘురామరాజును పావుగా వినియోగించుకుంటున్నారు. ఆఖరుకు ఆయన కుటుంబాన్ని కూడా ఇందులోకి లాగారు. రఘురామపై సీబీఐ కేసులు నమోదైన తరువాత చంద్రబాబు వల వేశారు. తమ కుట్రలో పాలు పంచుకుంటే సీబీఐ కేసుల నుంచి బయటపడేస్తానని బీజేపీలో చేరిన తన మనుషుల ద్వారా లోబర్చుకున్నాడు. ఇవన్నీ ఎక్కడ బయటకొస్తాయోనని చంద్రబాబు భయపడుతున్నారు. సీఎం జగన్‌పై బురద జల్లేందుకు చంద్రబాబు గతంలో గుళ్లు, గోపురాలను వాడుకున్నాడు. ఇప్పుడు కులమతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఇందులో రఘురామ, ఓ వర్గం మీడియా భాగస్వాములే. చంద్రబాబు మార్గదర్శకత్వంలోనే బీజేపీలోని ఓ వర్గం మాట్లాడుతోంది. అది ఓ ఎంపీ మాట్లాడే భాషేనా?: బాలశౌరి రఘురామరాజు ఎంపీ కాకముందే ఐదుసార్లు పార్టీలు మారాడు. మొదటిసారి ఎంపీ అయినప్పటికీ ఆయన కోరిక మేరకు సీఎం జగన్ పార్లమెంట్ కమిటీకి చైర్మన్‌గా చేశాడు. మరో రెండు కమిటీల్లో సముచిత స్థానం కల్పించారు. ఇంత ప్రాధాన్యం మరే ఎంపీకి ఇవ్వలేదు. ఇంత చేస్తే పార్టీ ఎంపీలను, ఐఏఎస్ అధికారులను, సీఎంను దూషించడం దుర్మార్గం. మమ్మల్ని దూషిస్తే ఊరుకున్నాం. కానీ కులమతాల మధ్య చిచ్చు పెడితే చట్టం చూస్తూ కూర్చుంటుందా? పాస్టర్ల ఉచ్ఛారణను అనుకరిస్తూ వారి మనోభావాలను దెబ్బతీశాడు (ఆ వీడియోలు ప్రదర్శించారు). రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఏ ఎంపీ కూడా ఇంత అసభ్యంగా, అభ్యంతరకరంగా మాట్లాడలేదు. రఘురామను భుజానికెత్తుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వారి పార్టీల్లో ఎవరైనా ఇదే విధంగా మాట్లాడితే ఊరుకుంటారా? ఓ ఎంపీ ఇలా మాట్లాడటం తప్పని ఎప్పుడైనా ఈ విపక్ష నేతలు చెప్పారా? కుట్రలో భాగంగానే రాష్ట్రపతికి చంద్రబాబు లేఖ రాశారు. అచ్చెన్నాయుడు, ధూళిపాళ్ల అరెస్టు అయినప్పుడు కూడా ఆయన ఇలా స్పందించలేదు. చంద్రబాబు హయాంలో కాపు నేత ముద్రగడ పద్మనాభం అరెస్టు సందర్భంగా పోలీసులు ఎలా ప్రవర్తించారో ప్రజలకు ఇంకా గుర్తుంది. ఆయన భార్యను దుస్తులు పట్టుకుని, కొడుకును కాళ్లతో తన్నుకుంటూ తీసుకెళ్లిన విషయం చంద్రబాబు మర్చిపోయారా? అరెస్టులో ఉల్లంఘన లేదు: శ్రీకృష్ణదేవరాయలు రఘురామరాజు అరెస్టులో ఎక్కడా నిబంధన ఉల్లంఘన జరగలేదు. క్రిమినల్ కేసుల్లో ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చు. సివిల్ కేసుల్లో అయితే పార్లమెంట్ జరిగేప్పుడు, స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం ఉన్నప్పుడు మినహా ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చు. రఘురామను రమేష్ ఆసుపత్రికే తరలించాలని టీడీపీ ఎందుకు పట్టుబడుతోంది? కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఎయిమ్స్ మంగళగిరిలో ఉంది. ఇంకా పలు ప్రైవేట్ ఆసుపత్రులున్నాయి. అక్కడికి తరలిస్తే నిజాలు బయటకొస్తాయని టీడీపీ కంగారు పడుతోంది. న్యాయస్థానాలపై వైఎస్సార్సీపీకి విశ్వాసం ఉంది. కోర్టు ఆదేశాల మేరకే జీజీహెచ్ ఆసుపత్రికి రఘురామరాజును పంపాం. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఏనాడూ నియోజకవర్గానికి వెళ్లని ఎంపీ.. చంద్రబాబు చెప్పినట్లు కుట్రలు పన్నడం, అసభ్యంగా మాట్లాడటం ఏమాత్రం క్షమించరాని నేరం. రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆయన భాష, దుర్మార్గపు చర్యలను అర్థం చేసుకోవాలి. -
కొండవీటి కోట.. అభివృద్ధి బాట
సాక్షి, అమరావతి బ్యూరో: ప్రకృతి అద్దిన సహజ సోయగాలతో అలరారుతున్న కొండవీటి కోట పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ కోటను అభివృద్ధి చేసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలంలోని కొండలపై దాదాపు 30 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న కొండవీటి కోటకు 650 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. కొండచుట్టూ ఎత్తైన రాతి గోడలు, కొండ కింద మట్టి గోడ, కోటపై కట్టడాలు, గోపీనాథపురంలో కత్తుల బావి, మూడు వైపులా దర్వాజాలు, బురుజులు, ఆలయాలు, మసీదు, చెరువులు, ఔషధ మొక్కలు ఇలా ఎన్నో కొండవీటి కోటపై ఉన్నాయి. కోటను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. అడుగడుగునా అభివృద్ధి కోట ప్రవేశ ద్వారాన్ని చెట్టు మాదిరిగా అటూ ఇటూ బురుజులతో మధ్యలో పులి బొమ్మతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధాన కోటను వేరుచేస్తూ కిలోమీటర్ మేర కంచె వేస్తున్నారు. కోటలోని చెరువును లోటస్ పాండ్ మాదిరిగా రూపొందిస్తున్నారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయం పనులు తుది దశకు చేరాయి. విగ్రహాన్ని టీడీడీ సిద్ధం చేసింది. ఓపెస్ ఎయిర్ థియేటర్, చిన్న పిల్లలకు వినోదం పంచేందుకు వీలుగా పార్క్‌ను సిద్ధం చేశారు. 2.5 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నారు. పుట్టలమ్మ, ముత్యాలమ్మ (కూనలమ్మ), వెదుళ్ల చెరువులను అభివృద్ధి చేశారు. చెరువు గట్లకు రివిట్మెంట్కు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కోట లోపల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం చెరువులో బోటింగ్ కోట లోపల చెరువులో పెడల్ బోటింగ్, పాత గెస్ట్ హౌస్‌ను పడగొట్టి ఎన్విరాన్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇక్కడ ఏడు ఆలయాలు, రెండు మసీదులు ఉన్నాయి. పశ్చిమ వైపు నుంచి 400 మీటర్ల మెట్ల నిర్మాణం చేపట్టాల్సింది. పుట్టకోట బైపాస్ రోడ్డు నిర్మాణానికి రూ.40లక్షలు అవసరమవుతాయని అంచనా వేశారు. పార్కింగ్ ఏరియాను ఇప్పటికే అభివృద్ధి చేశారు. కోట అభివృద్ధికి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రత్యేక చొరవ చూపారు. ఎమ్మెల్యే విడదల రజని, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోట అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారు. -
అనూష కుటుంబానికి ప్రభుత్వం అండదండలు
ముప్పాళ్ల (సత్తెనపల్లి): డిగ్రీ విద్యార్థిని కోట అనూష కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్లపాడులో అనూష తల్లిదండ్రులను ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌తో కలిసి ఆయన బుధవారం పరామర్శించి ధైర్యం చెప్పారు. ఎంపీ మాట్లాడుతూ అనూషను హత్య చేసిన నిందితుడికి కఠిన శిక్షపడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశ చట్టాన్ని తెచ్చారని వివరించారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా రూ.10 లక్షల చెక్కును తల్లిదండ్రులకు అందించారు. బాధితులు కోరుకున్న విధంగానే నరసరావుపేటలో ఇంటిస్థలం అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కుటుంబంలోని ఒకరికి ఉద్యోగం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
కేంద్రమంత్రిని కలిసిన శంకర నారాయణ
సాక్షి, ఢిల్లీ: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని ఏపీ రోడ్లు, భవనాల మంత్రి శంకర నారాయణ, ఎంపీ కృష్ణదేవరాయలు మంగళవారం కలిశారు. రాష్ట్రంలో 16 పోర్టులకు జాతీయ రహదారుల కనెక్టివిటీ చేయాలని కేంద్రమంత్రికి వినతించారు. అనంతరం మంత్రి శంకర నారాయణ మీడియాతో మాట్లాడుతూ విశాఖ పోర్టు-భోగాపురం ఎయిర్పోర్ట్ వరకు కోస్టల్ రోడ్ మంజూరు చేయాలని కేంద్రమంత్రిని కోరామని వెల్లడించారు. విజయవాడ-బెంగళూరు వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేను ఫేజ్-1లో చేపట్టాలని, విజయవాడ కాజా టోల్ ప్లాజా-ఒట్టిపాడు వరకు బైపాస్ మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. రైల్వే అండర్ బ్రిడ్జి, రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయాలని కోరామని మంత్రి శంకర నారాయణ తెలిపారు. -
అడ్డుకున్నది ఎవరో సమాధానం చెప్పాలి!
న్యూఢిల్లీ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక నిధులు ఇవ్వొద్దని ప్రతిపక్ష పార్టీ టీడీపీ కేంద్రానికి లేఖలు రాస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విమర్శించారు. నిర్మాణాత్మకంగా ఉండాల్సిన ప్రతిపక్షం అడ్డంకులు సృష్టిస్తూ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. నీరు-చెట్టు పథకం పనులను టీడీపీ కార్యకర్తలకు ఇచ్చి అక్రమాలకు పాల్పడ్డారని చంద్రబాబును ఉద్దేశిస్తూ దుయ్యబట్టారు. ఎన్ఆర్ఈజీఎస్ పనిదినాలు పెంచాలని కేంద్రాన్ని గట్టిగానే అడుగుతున్నామని, ఇచ్చిన 21 కోట్ల పనిదినాల్లో 19 కోట్ల పనిదినాలు వినియోగించామని చెప్పారు. (ప్రభుత్వ భూములపై టీడీపీ నేతల కన్ను) టీడీపీ నేతలు మెటీరియల్ కాంపోనెంట్ ఇచ్చే వరకు నిధులివ్వొద్దు అని కేంద్రానికి లేఖ రాయడంపై వైఎస్సార్సీపీ ఎంపీ తలారి రంగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. పనికి ఆహార పథకం కింద చేసిన అక్రమాల్లో మెటీరియల్ కాంపోనెంట్ నిధులు కాంట్రాక్టర్లకు ఇవ్వడం కోసం అడుగుతున్నారన్నారు. టీడీపీకి చివరి 6 నెలల పనికి నిధులు అడగడం, అవిచ్చే వరకు కొత్తగా నిధులివ్వొద్దని కోరడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అంగన్వాడీ సెంటర్లను విలేజ్ వెల్నెస్ సెంటర్లుగా మార్చిన క్రమంలో ఒక్కో సెంటర్ కి రూ.15 లక్షలు ఇవ్వాల్సిందిగా కోరినట్లుగా తెలిపారు. (ఆ దాడులు కుట్రలో భాగమే: సుచరిత) ‘స్మశానాలకు కాంపౌండ్ వాల్ నిర్మాణం గురించి కూడా అడిగాం. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు జరుగుతున్నాయి. వారం నుంచి 10 రోజుల్లోపే కూలీలకు డబ్బు అందుతోంది. లక్షన్నర ఇళ్లు రెడీగా ఉంటే అడ్డుకుంటున్నామని టీడీపీ అంటున్నారు. అవెక్కడ ఉన్నాయో చెప్పాలి. 30 లక్షల ఇళ్లస్థలాలు పంపకానికి సిద్ధంగా ఉంటే అడ్డుకున్నది ఎవరు?’ అని ఎంపీ తలారి రంగయ్య ప్రశ్నించారు. -
వైద్యులకు పీపీఈ కిట్లు పంపిణీ చేసిన ఎంపీ
-
‘ఈ సమయంలో ఎన్నికల వాయిదా సరైనది కాదు’
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక ఎన్నికలు ఏకపక్షంగా వాయిదా వేయడం సరికాదని వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవారాయలు వ్యాఖ్యానించారు. మంగళవారం లోక్‌సభలో జీరో అవర్‌లో ఎంపీ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషనర్ ప్రభుత్వ యంత్రాంగాన్ని సంప్రదించలేదని అన్నారు. ఎన్నికల కమిషన్ ఏకపక్ష నిర్ణయం తీసుకుందని తెలిపారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ అంతా పూర్తి చేశారని. జిల్లా కలెక్టర్లు యంత్రాంగాన్ని సిద్ధం చేసి ఉంచారని.. ఇలాంటి సమయంలో ఎన్నికలు వాయిదా వేయటం సరైన చర్య కాదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుందని, వ్యాధి వ్యాప్తి రేటు చాలా తక్కువగా ఉందని చెప్పారు. మూడు, నాలుగు వారాలపాటు వ్యాప్తి అదుపులో ఉంటుందని, ఈలోపు తగిన ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని వివరించారు. రాష్ట్రంలో ఏకపక్షంగా స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయడం వలన రాష్ట్రానికి రావాల్సిన 14వ ఆర్థిక సంఘం నిధులు రూ. 5100 కోట్లు ఆగిపోయే పరిస్థితి ఉందని తెలిపారు. -
వాల్తేర్ డివిజన్ ను పునరుద్ధరించాలి
-
‘ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తేనే అది సాధ్యం అవుతుంది’
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా సంక్షోభంలో ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు అన్నారు. సోమవారం లోక్‌సభలో బడ్జెట్‌పై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా.. ఏపీకి భారీ ఎత్తున నిధులు అందివ్వాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్రానికి లెవల్ ఫ్లేయింగ్ ఫీల్డ్‌లోకి తీసుకు రావాలంటే పరిశ్రయల స్థాపనకు రాయితీలు ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తేనే రాష్ట్రం కష్టాల నుంచి గట్టెక్కుతుందని, రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు భరోసా కింద రైతులకు ఏటా రూ.13,500 రూపాయలను అందిస్తోందని, రైతులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం ఇన్పుట్ సబ్సీడీని ఇస్తోందన్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా ప్రతి తల్లికి రూ. 15 వేలు అందజేస్తున్నామని, నాడు- నేడు పథకం కింద ప్రభుత్వ స్కూళ్లను ఆధునీకరణ చేస్తున్నామని తెలిపారు. ఈ పథకాలకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని కోరారు. ఆరోగ్య రంగానికి బడ్జెట్లో అతి తక్కువ నిధులు కేటాయించడం దారుణమని ఎంపీ విచారం వ్యక్తం చేశారు. రోజురోజుకీ వైద్యంపై ఖర్యులు పెరుగుతున్నాయని, బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలకు అవసరమైన నిధులు అందుబాటులో ఉంచాలన్నారు. 45 మిలియన్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్న టెక్స్టైల్స్ పరిశ్రమకు పెద్ద ఎత్తున నిధులు ఇవ్వాలని కోరారు. నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పథకం కింద ఏపి ప్రాజెక్టులను చేర్చాలని, పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను వెంటనే ఆమోదించాలని సూచించారు. నిధులు వెంటనే విడుదల చేయాలి రాష్ట్రంలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని, దానికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించాలని డిమాండ్ చేశారు. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి, కాకినాడ స్మార్ట్ సిటీలను చేస్తామని చెప్పారని.. దీని కోసం తొమ్మిది వేల కోట్లు ఇస్తామన్నారని.. వాటిని వెంటనే విడుదల చేయాలని కోరారు. విశాఖపట్నం, చెన్నై కారిడార్‌కు తక్షణమే నిధులు కేటాయించాలని, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తానన్న నాటి ప్రధాని హామీని అమలు చేయాలని ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలి: ఎంపీ మార్గాని భరత్ ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని బడ్జెట్ పై లోక్‌సభలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఇస్తానన్న వాగ్దానానికి ప్రధానమంత్రి నిలబెట్టుకోవాలని సూచించారు. ఏపీ విభజన చట్టంలోని వాగ్దానాలను అమలు చేయాలని, పోలవరం ప్రాజెక్టు కింద ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పూర్తి చేయాలన్నారు. పర్యాటక రంగానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని, దాని వల్ల పెద్దఎత్తున ఉద్యోగ ఉపాధి లభిస్తుందని తెలిపారు. నేచురల్ గ్యాస్ వాహనాలను ఇంప్లిమెంట్ చేయాలని సూచించారు. -
ఏపీకి భారీ ఎత్తున నిధులు కేటాయించాలి: ఎంపీ
-
అమరావతి రైతులకు అన్యాయం జరగదు
తుళ్లూరు రూరల్: అమరావతికి భూములు ఇచ్చిన రైతులెవరికీ అన్యాయం జరగదని గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ తుళ్లూరు మండలం మందడం, వెలగపూడి గ్రామాల్లో 45 రోజులుగా దీక్ష చేస్తున్న రైతుల వద్దకు శుక్రవారం ఆయన వెళ్లి వారితో మాట్లాడారు. భూ సమీకరణలో అమరావతికి భూములిచ్చిన రైతులెవరికీ అన్యాయం జరగనివ్వం అని ఆయన భరోసా ఇచ్చారు. త్వరలోనే రైతుల వద్దకు కమిటీ వస్తుందని, వారి ఎదుట తమ అభిప్రాయాలను తెలియజేయాలని ఎంపీ సూచించారు. కమిటీకి దూరంగా ఉండొద్దని ఆయన కోరారు. రైతుల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల పక్షపాతి అని గుర్తుచేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేడు అధికారంలో ఉందంటే అందుకు రైతుల సహకారమే కారణమని శ్రీకృష్ణదేవరాయలు వివరించారు. గత మూడేళ్లుగా తనతో కలిసి పార్టీ కోసం పనిచేసిన వాళ్లు, తమ విద్యా సంస్థలో విద్యను అభ్యసించి ఉన్నత స్థితిలో ఉన్నవారి తల్లిదండ్రులు కూడా ఇక్కడ ఉన్నారన్నారు. అందరూ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని రైతులకు ఆయన సూచించారు. మీ సహకారంవల్లే అధికారంలోకి వచ్చిన జగన్.. మిమ్మల్ని వదులుకునేదిలేదని ఆయన స్పష్టంచేశారు. -
రైతులకు సీఎం వైఎస్ జగన్ ఖచ్చితంగా న్యాయం చేస్తారు
-
నందిగం సురేష్‌కు మరో పదవి
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభాపక్ష ఉపనేతగా బాపట్ల ఎంపీ నందిగం సురేష్, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ కోశాధికారిగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు నియమితులయ్యారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి ఈ నియామకాలు చేసినట్టు పార్టీ కార్యాలయ కార్యదర్శి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బాపట్ల నుంచి పోటీ చేసిన నందిగం సురేష్.. టీడీపీ అభ్యర్థి మల్యాద్రి శ్రీరామ్‌పై 16,065 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. (చదవండి: ఆ నిబద్ధతే ‘నందిగం’ను ఎంపీని చేసింది..)