సాక్షి, గుంటూరు: రాజకీయాల్లో ఉద్దండుడిగా పేరుగాంచిన రాయపాటి సాంబశివరావు...వైఎస్సార్ సీపీ ఫ్యాను గాలికి కొట్టుకుపోయారు. జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడిగా పేరుగాంచిన ఆయన ఐదు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా విజయం సాధించిన విషయం విదితమే. 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలను చూస్తే ఎంతటి సీనియర్ నాయకులైన సరే... మట్టి కరవక తప్పలేదు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో టీడీపీకి నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గం మంచి పట్టున్న ప్రాంతం. అక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా యువ విద్యావేత్త లావు శ్రీకృష్ణదేవరాయులు మొట్టమొదటి సారిగా పోటీ చేసి 1.53 లక్షల ఓట్ల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. జిల్లాలో అతి చిన్న వయస్సులో ఎంపీగా గెలుపొంది రికార్డు సృష్టించారు.
ఐదు సార్లు ఎంపీగా గెలిచిన రాయపాటిపై విజయం
రాయపాటి సాంబశివరావు గుంటూరు జిల్లాల్లో సీనియర్ రాజకీయ నాయకుడిగా మంచి పేరుంది. ఆయన జిల్లాలో ఎక్కడ నుంచి పోటీ చేసిన విజయం ఖాయం అంటూ జిల్లావాసులే చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. అటువంటి రాయపాటికి ఓ యువకుని చేతిలో ఓటమి పరాభవం తప్పలేదు. జిల్లాలో 1982 నుంచి జిల్లాలో రాజ్యసభకు, లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తూ సీనియర్ ఎంపీగా చలామణి అయ్యారు. అటువంటి నాయకుడిపై 37 ఏళ్ల యువ విద్యావేత్త లావు శ్రీకృష్ణదేవరాయులు అత్యధిక ఓట్ల మెజార్టీతో విజయం సాధించి, మట్టి కరిపించారు.
వైఎస్సార్ సీపీ క్లీన్ స్వీప్
నరసరావుపేట ఎంపీ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అన్ని చోట్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. నరసరావుపేట ఎంపీ అసెంబ్లీ స్థానాలైన నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, మాచర్ల, వినుకొండ, పెదకూరపాడు, చిలకలూరిపేట అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేసిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్ధి కూడా అత్యధిక మెజార్టీతో గెలుపొందడంతో పాటు, ఎంపీ స్థానాన్ని సైతం లక్షన్నర మెజార్టీతో గెలుపొందడం గుంటూరు చరిత్రలో ఇదే తొలిసారి.
పల్నాడులో వైఎస్సార్ సీపీకి బ్రహ్మరథం
రాజకీయాలకు కొత్త ముఖమైన యువకుడు లావు శ్రీకృష్ణదేవరాయులు.. రాజకీయాల్లో పండిపోయిన కురువృద్ధుడైన రాయపాటి సాంబశివరావును ఓడించడం, జిల్లాతో పాటు రాష్ట్రంలో కూడా సంచలనం కలిగించింది. ఇందిరాగాంధీ హయాం నుంచి రాజకీయాల్లో ఎదురులేని నేతగా ఉన్న రాయపాటి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోని లేని సమయంలో సైతం గుంటూరు పార్లమెంట్ ఎంపీగా గెలుపొంది ఉనికిని చాటుతూ వచ్చారు. కరుడు కట్టిన కాంగ్రెస్‌వాదిగా ఉన్న రాయపాటి రాష్ట్ర విభజన పరిస్థితుల్లో దానికి గుడ్ చెప్పి టీడీపీలో చేరి 2014లో నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు.
2019 ఎన్నికల్లో కూడా రాయపాటికే టీడీపీ ప్రభుత్వం ఎంపీ స్థానాన్ని కేటాయించింది. అయితే, టీడీపీపై వ్యతిరేకంగా ఉన్న పల్నాడు ప్రాంత వాసులు దానికి బుద్ధి చెప్పి వైఎస్సార్ సీపీకి పట్టం కట్టబెట్టారు. యువ విద్యావేత్త లావు కృష్ణదేవరాయులుకు నరసరావుపేట ఎంపీ స్థానాన్ని వైఎస్సార్ సీపీ కేటాయించడం.. 1.50లక్షల మెజార్టీతో గెలవడం లాంఛనప్రాయమైంది. లావు శ్రీకృష్ణదేవరాయులు గెలుపుతో రాయపాటి రాజకీయ జీవితానికి ఫుల్‌స్టాప్ పడినట్లే అయిందనే పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment