ఏపీకి తెలంగాణ విద్యుత్తు బకాయి రూ.6,111.88 కోట్లు | RK Singh Comments On Telangana electricity arrears to Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీకి తెలంగాణ విద్యుత్తు బకాయి రూ.6,111.88 కోట్లు

Published Fri, Feb 11 2022 5:10 AM | Last Updated on Fri, Feb 11 2022 5:10 AM

RK Singh Comments On Telangana electricity arrears to Andhra Pradesh - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ ఇవ్వాల్సిన రూ.6,111.88 కోట్ల విద్యుత్తు బకాయిల అంశాన్ని ఆ రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి ఆర్కే సింగ్‌ తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు గురువారం లోక్‌సభలో మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి తీసుకున్న విద్యుత్తుకు తెలంగాణ చెల్లించాల్సిన అసలు మొత్తంపై వివాదం లేదని, వడ్డీ విషయంలోనే సయోధ్య అవసరమని పేర్కొన్నారు. తెలంగాణ సొమ్ము ఇవ్వనందున ఏపీ.. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిందని తెలిపారు. అంశం కోర్టులో ఉన్నందున్న పరిష్కారానికి ఎలాంటి కాలపరిమితి లేదని చెప్పారు. 

చెక్‌డ్యాంల బలోపేతానికి రెండేళ్లుగా నిధులివ్వలేదు
ఆంధ్రపద్రేశ్‌లో చెక్‌డ్యాంల బలోపేతానికి వాటర్‌ బాడీస్‌ రిపేర్‌ రెన్నోవేషన్, రీస్టోరేషన్‌ నిమిత్తం 2019–20, 2020–21ల్లో నిధులు విడుదల చేయలేదని వైఎస్సార్‌సీపీ ఎంపీలు అవినాశ్‌రెడ్డి, వంగా గీతా విశ్వనాథ్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తిశాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్‌ తుడు సమాధానమిచ్చారు. 

హస్తకళల ప్రోత్సాహానికే హున్నార్‌హాట్‌లు
దేశంలోని అన్ని ప్రాంతాల్లోని హస్తకళలను ప్రోత్సహించడానికే హున్నార్‌హాట్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాలశాఖ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ తెలిపారు. హైదరాబాద్‌ సహా 35 ప్రాంతాల్లో హాట్‌లు నిర్వహించామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో భారతీయ హస్తకళల పోటీపై ఎలాంటి అధ్యయనం చేపట్టలేదని వైఎస్సార్‌సీపీ ఎంపీలు రెడ్డెప్ప, చింతా అనూరాధ, బి.వి.సత్యవతి, గోరంట్ల మాధవ్, సంజీవ్‌కుమార్, ఎం.వి.వి.సత్యనారాయణ, చంద్రశేఖర్‌ బెల్లాన అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.


డీఆర్‌ఐపీలో 31 ప్రాజెక్టులు
డ్యాం రిహ్యాబిలిటేషన్, ఇంప్రూవ్‌మెంట్‌ ప్రాజెక్టు (డీఆర్‌ఐపీ)లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో 31 ప్రాజెక్టులకుగాను రూ.667 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్‌ అడిగిన ప్రశ్నకు జవాబుగా కేంద్ర జలశక్తిశాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్‌ తుడు తెలిపారు. 

ఉమ్మడి ఏపీలో 9 మిలియన్‌ హెక్టార్లలో వరద ప్రభావం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 9 మిలియన్‌ హెక్టార్లలో వరద ప్రభావం ఉందని వైఎస్సార్‌సీపీ ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, పి.వి.మిథున్‌రెడ్డి, ఎన్‌.రెడ్డెప్ప అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తిశాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్‌ తుడు సమాధానమిచ్చారు.

గ్రామ్‌ ఉజాలలో మూడు జిల్లాలు
గ్రామ్‌ఉజాల ప్రోగ్రామ్‌లో ఏపీలోని కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలను గుర్తించినట్లు కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ తెలిపారు. తొలిదశలో గుర్తించిన జిల్లాల్లో లబ్ధిదారుల అవగాహనకు కన్వర్జెన్స్‌ ఎనర్జీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (సీసీఎస్‌ఎల్‌) చర్యలు తీసుకుంటోందని వైఎస్సార్‌సీపీ ఎంపీ లావు  శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ట్రిబ్యునల్‌ కేటాయింపుల్లోనే అప్పర్‌భద్ర
కృష్ణా ట్రిబ్యునల్‌ కేటాయించిన జలాల్లో భాగంగానే తెలంగాణలోని అప్పర్‌ భద్ర ప్రాజెక్టు ఉందని కేంద్ర జలశక్తిశాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్‌ తుడు తెలిపారు. ఈ నేపథ్యంలో అంతర్‌రాష్ట్ర అంశం సమసినట్లేనని భావిస్తున్నట్లు  వైఎస్సార్‌సీపీ ఎంపీ బాలశౌరి ప్రశ్నకు సమాధానమిచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement