ఆర్థిక లోటులో ఉంటే వాటా అడుగుతారా? | YSRCP MP Srikrishnadevarayalu in discussion on railway bills | Sakshi
Sakshi News home page

ఆర్థిక లోటులో ఉంటే వాటా అడుగుతారా?

Published Wed, Mar 16 2022 5:40 AM | Last Updated on Wed, Mar 16 2022 3:06 PM

YSRCP MP Srikrishnadevarayalu in discussion on railway bills - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అనంతరం రూ.16 వేల కోట్ల ఆర్థికలోటులో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను రైల్వే ప్రాజెక్టుల నిమిత్తం వాటా ఇవ్వాలని ఎలా అడుగుతారని కేంద్రాన్ని వైఎస్సార్‌సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నించారు. బడ్జెట్‌లో ఏపీలో రైల్వే పనుల నిమిత్తం రూ.9 వేల కోట్లు కేటాయించారని సంతోషించాలో బాధపడాలో అర్థంకావడం లేదన్నారు. రాష్ట్ర విభజనకన్నా ముందుగానే కోటిపల్లి–నరసాపురం, గూడూరు–దుగరాజపట్నం, నడికుడి–శ్రీకాళహస్తి ఖమ్మం–ప్రొద్దుటూరు, కొండపల్లి–కొత్తగూడెం, కడప–బెంగళూరు, భద్రాచలం–కొవ్వూరు, తుముకూరు–రాయగఢ,  మరికుప్పం–కుప్పం రైల్వే లైన్లు అనుమతించారని వాటిలో చాలావరకు పురోగతిలో లేవని వివరించారు.

లోక్‌సభలో మంగళవారం రైల్వే పద్దులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రూ.16వేల కోట్ల రెవెన్యూ లోటుతో ఏర్పాటైందన్న విషయం గుర్తుంచుకోవాలని కోరారు. మూడేళ్ల కిందట ఏర్పాటు చేసిన సౌత్‌కోస్ట్‌ రైల్వేజోన్‌కు నిధులు కేటాయించి కార్యకలాపాలు ప్రారంభించాలని కోరారు. గుంటూరు రైల్వేస్టేషన్‌ ఆధునికీకరణకు కేటాయించిన రూ.80 కోట్లు ఇతర డివిజన్లకు మళ్లించారన్నారు. ఇలా ఎందుకు మళ్లించారో తేల్చాల్సి ఉందన్నారు.

మిర్చి, పొగాకు, పత్తి తదితరాలు ఎగుమతి అయ్యే గుంటూరు రైల్వేస్టేషన్‌లో సదుపాయాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. గుంటూరు స్టేషన్‌కు తిరిగి నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని కోరారు. కరోనా పేరుతో నడికుడిలో పలు రైళ్లను ఆపడం లేదని అడిగితే ఆదాయం రావడం లేదని అధికారులు చెబుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి రాష్ట్రంలో రైల్వే సదుపాయాలు మెరుగుపరచాలని కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు.
  
చిత్తూరులో కంటైనర్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌  
వైఎస్సార్‌సీపీ ఎంపీ చింతా అనూరాధ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో ఎన్‌టీపీసీ, బీహెచ్‌ఈఎల్‌కు కేటాయించిన భూముల్లో కంటైనర్‌ మ్యాన్యుఫాక్చరింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించేలా ఐఆర్‌సీటీసీ ప్యాకేజీలు లేవన్నారు. ఏపీలో తిరుపతి, శ్రీశైలం, అహోబిలం, కనకదుర్గ ఆలయం, శ్రీకాళహస్తి, లేపాక్షి, కాణిపాకం ఆలయాలకు పర్యాటకాన్ని ప్రోత్సహించేలా పర్యాటక ప్యాకేజీ రూపాందించాలని కోరారు.

రాష్ట్రంలో ఆర్‌వోబీ, ఆర్‌యూబీల నిర్మాణానికి తగిన నిధులు కేటాయించాలన్నారు. ఈస్ట్‌కోస్ట్‌ రైల్వేజోన్‌లో ఖాళీలు భర్తీచేయాలని, నూతన సౌత్‌కోస్ట్‌ రైల్వేజోన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేయాలని, ఎస్సీ, ఎస్టీల నిమిత్తం ప్రత్యేక రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహించాలని కోరారు. సౌత్‌కోస్ట్‌ జోన్‌ కార్యకలాపాలు త్వరగా ప్రారంభించాలని, వాల్తేరు డివిజన్‌ను దీన్లోనే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. కోటిపల్లి–నరసాపురం రైల్వే పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి నిమిత్తం రాష్ట్రం సూచనలు పరిగణించి అమలు చేయాలని ఆమె కోరారు.   

ప్యాసింజర్‌ రైళ్లను పునరుద్ధరించాలి  
వైఎస్సార్‌సీపీ ఎంపీ బి.వి.సత్యవతి మాట్లాడుతూ కరోనా సమయంలో రద్దుచేసిన ప్యాసింజర్‌ రైళ్లను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. పలాస–విశాఖ, విశాఖ–విజయవాడ, విశాఖ–రాజమండ్రి, విశాఖ–కాకినాడ ప్యాసింజర్ల రద్దువల్ల సామాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విశాఖ నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్‌కు బుల్లెట్‌ ట్రైన్‌ నడపాలని కోరారు. తద్వారా ఏపీ, తెలంగాణల్లో ఆర్థిక పురోగతి ఉంటుందన్నారు. నెల్లిమర్ల, గరివిడి, అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నం రోడ్‌ వంటి స్టేషన్లలో సదుపాయాలు మెరుగుపరచాల్సి ఉందన్నారు.  రాష్ట్రంలో గుర్తించిన 23 బౌద్ధ స్మారకాలు, ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి పర్యాటక రైళ్లు ఏర్పాటు చేయాలని కోరారు. 

ఏపీలో ఓడీవోఎఫ్‌పీలో పలు ఉత్పత్తుల గుర్తింపు 
ఒక జిల్లా దృష్టి సారించిన ఒక ఉత్పత్తి (ఓడీవోఎఫ్‌పీ)లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో 10 ఉత్పత్తులు గుర్తించినట్లు కేంద్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌ చెప్పారు. పీఎం ఫార్మలైజేషన్‌ ఆఫ్‌ మైక్రో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పథకంలో భాగంగా ఆర్థిక, సాంకేతిక, వ్యాపార సహకారం అందిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ప్రశ్నకు జవాబుగా తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement