వైఎస్సార్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేస్తున్న ఎంపీ, ఎమ్మెల్యేలు
నరసరావుపేట రూరల్: ప్రశాంతంగా ఉన్న పల్నాడులో విగ్రహాలు మాయంతోపాటు శవ రాజకీయాలు చేయడం ద్వారా ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని వైఎస్సార్‌సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్‌రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, మేరుగ నాగార్జున పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం జొన్నలగడ్డ సొసైటీ కార్యాలయం వద్ద తొమ్మిదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని గత శుక్రవారం దుండగులు మాయం చేసిన విషయం తెలిసిందే.
తిరిగి ఇదే ప్రాంతంలో వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేసేందుకు సోమవారం భూమి పూజ నిర్వహించారు. తొలుత నరసరావుపేట 60 అడుగుల రోడ్డులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అక్కడ నుంచి సొసైటీ కార్యాలయం వద్దకు వెళ్లి భూమి పూజ చేశారు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. గత 15 రోజులుగా టీడీపీ నాయకులు హత్యా రాజకీయాలు, విగ్రహ రాజకీయాలతో నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గంలో అలజడులు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని మాయం చేయడమే కాకుండా ఘటనపై విచారణ జరగకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించడం వంటి చిల్లర రాజకీయాలకు టీడీపీ నేతలు పాల్పడుతున్నారని విమర్శించారు. నిందితులను కాపాడేందుకు తనమీద దాడి జరిగినట్టు సృష్టించుకుని టీడీపీ నేత అరవిందబాబు నాటకాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు.
గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ నేతలు శవ రాజకీయాలతో ముందుకు వెళ్లాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రానికి పట్టిన చీడపురుగు చంద్రబాబు అని అన్నారు. ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో చిచ్చుపెట్టేందుకు టీడీపీ కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నదని విమర్శించారు. కార్యక్రమంలో జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు మార్కెట్ కమిటీ చైర్మన్ ఎస్‌ఏ హనీఫ్, షేక్ కార్పొరేషన్ చైర్మన్ ఖాజావలి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment