సాక్షి, పల్నాడు జిల్లా: రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వైద్య, ఆరోగ్య రంగాన్ని నిర్వీర్యం చేస్తోందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ ఒకేసారి 17 మెడికల్ కాలేజీల పనులు మొదలుపెట్టి, ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లారని, వాటిలో 5 కాలేజీలు గత విద్యా సంవత్సరంలో ప్రారంభమయ్యాయని ఆయన వెల్లడించారు. అన్నీ సవ్యంగా జరిగి ఉంటే, ఈ ఏడాది మరో 5 కాలేజీలు కూడా మొదలై ఉండేవని తెలిపారు.
కానీ, సీఎం చంద్రబాబు నిర్వాకం వల్ల.. అవి ప్రారంభం కాకపోగా.. జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) పులివెందుల మెడికల్ కాలేజీకి ఇచ్చిన 50 మెడికల్ సీట్లు కూడా పోయాయని ఆక్షేపించారు. ఆ సీట్లు వద్దంటూ ఎన్‌ఎంసీకి ప్రభుత్వం లేఖ రాయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు కొత్తగా మెడికల్ సీట్లు వస్తే మీకు (ప్రభుత్వానికి) వచ్చిన నష్టమేమిటని.. ఒక డాక్టర్‌గా అడుగుతున్నానన్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, అందుకు సమాధానం చెప్పాలని నిలదీశారు.
40 ఏళ్ళుగా ఏపీలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కూడా ఏర్పాటు చేయలేదని గుర్తు చేశారు. వైద్య విద్య ఎంత కష్టమైందో.. మెడిసిన్ సీటు సంపాదించడం కూడా ఎంత ఇబ్బందో అందరికీ తెలిసిందేనన్న నరసారావుపేట మాజీ ఎమ్మెల్యే.. వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ మాటలు విస్మయం కలిగించాయని చెప్పారు.
ఇదీ చదవండి: తెల్ల ‘కోట్లు’!.. నీట్ ర్యాంకర్ల నిర్వేదం
గత ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ , వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడమే కాక.. పోస్టులన్నీ భర్తీ చేశారని స్పష్టం చేశారు. అందుకే.. మంత్రి సత్యకుమార్ సవాల్ స్వీకరిస్తున్నానని, ఎక్కడైనా చర్చకు సిద్ధమని ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో వైద్య ఆరోగ్య రంగంలో ఎంత అభివృద్ధి జరిగింది?. ఈ ప్రభుత్వం ఏం చేసిందో చర్చకు సిద్ధమని తేల్చి చెప్పారు. గ్రామాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సిబ్బంది ధర్నాతో పీహెచ్‌సీల్లో వైద్య సేవలు ఆగిపోయాయని, స్పెషలిస్ట్ వైద్యసేవలూ నిల్చిపోయాయని డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment