వరుస హత్యలు, దాడులతో పేట్రేగిపోతున్న టీడీపీ గూండాలు
కూటమి ప్రభుత్వం వచ్చిన ఒక్క నెలలోనే 31 మంది హత్య
వేధింపులు తాళలేక మరో 35 మంది ఆత్మహత్య
1,050 దాడులు.. 300 హత్యాయత్నాలు
భయంతో గ్రామాలను విడిచిపెట్టేసిన వేలాది కుటుంబాలు
రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న టీడీపీ బీభత్సకాండ
గజినీ, ఘోరీలను తలదన్నే రీతిలో దురాగతాలు
తాలిబన్లను మించి కిరాతకాలు
చోద్యం చూస్తున్న పోలీసు శాఖ
రెడ్‌బుక్ రాజ్యాంగానికే సలాం
రాష్ట్రంలో రక్తం ఏరులైపారుతోంది.. మధ్యయుగాల నాటి మారణకాండను తలపిస్తూ నడిరోడ్డు పైనే, అదీ అందరూ చూస్తుండగానే మనుషులను నరికిపారేస్తున్నారు. తాలిబన్‌లను మించి అత్యంత పాశవికంగా మనుషుల ప్రాణాలు తీసేస్తున్నారు. దేశంలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో మారణకాండను సృష్టిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చింది మొదలు.. నెల రోజులుగా పచ్చ మూక ఉన్మాదానికి నెత్తురు కట్టలు తెంచుకుంటోంది.. తలకాయలు తెగిపడుతున్నాయి. వారి అధికార మదానికి ప్రాణాలు దూదిపింజల్లా రాలిపోతున్నాయి.
సాక్షి, అమరావతి: పల్నాడు జిల్లా వినుకొండలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త రషీద్‌ను బుధవారం రాత్రి టీడీపీ నేత జిలానీ కత్తితో దాడి చేసి రెండు చేతులు తెగనరికాడు.. అదే కత్తితో తలపైనా, మెడపైనా విచక్షణారహితంగా నరికాడు. ఇంతటి దారుణ హత్య ఎక్కడో చీకట్లోనో.. దొంగచాటుగానో చేయలేదు.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే బహిరంగంగానే ఇంతటి ఘోరానికి ఒడిగట్టాడు. రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు.. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తామని నారా లోకేశ్ హోర్డింగుల సాక్షిగా స్పష్టం చేశారు.. దీంతో పోలీసు యంత్రాంగం పక్కకు తప్పుకుని టీడీపీ అరాచకాలకు రాచబాట పరిచింది.. అంతకంటే ఇంకేం కావాలని టీడీపీ రౌడీలు మారణాయుధాలు చేతబట్టి కాలకేయుళ్లా రాష్ట్రంపై దండెత్తారు.
ఇదీ చంద్రబాబు రాక్షసపాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖచిత్రం.. రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో నెలకొన్న అరాచక రాజ్యం. మధ్యయుగాలనాటి గజినీ, ఘోరీల దురాగతాలను మించి టీడీపీ గూండాలు హత్యలకు తెగబడుతున్నారు. తాలిబన్ మూకలను మించి పచ్చ మూకలు స్వైరవిహారం చేస్తూ కర్కశంగా విరుచుకుపడుతున్నాయి. తమ పదఘట్టనల కింద యథేచ్ఛగా విధ్వంసకాండ కొనసాగిస్తున్నాయి. నడిరోడ్లపై రాక్షసరాజ్యం కరాళ నృత్యం చేస్తోంది.
75ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు చూడని రీతిలో హింసాకాండతో చంద్రబాబు ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోంది. చంద్రబాబు అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే టీడీపీ మూకల దాడుల్లో 31 మంది హత్యకు గురయ్యారు. మరో 35 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇలా హత్యలతో రాష్ట్రం అట్టుడికిపోతోంది. ఇళ్లు, ఆస్తులు, మహానేత విగ్రహాలను నేలమట్టం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యాలయాలను కూలుస్తున్నారు. ప్రభుత్వ ప్రేరేపిత దాడులతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారినా పట్టించుకునేవారే లేరు.
నెల రోజుల్లోనే 31 హత్యలు
మహాభారతంలో బకాసురుడి కథ అందరికీ తెలిసిందే. అతడికి ఒక ఎడ్ల బండి నిండుగా అన్ని రకాల ఆహార పదార్థాలను పంపేవారు. ఆ ఆహార పదార్థాలను, బండికి కట్టిన ఎద్దుల్ని, బండిని తోలుకొచ్చిన మనిషిని కూడా కరకరానమిలి పారేసేవాడు. ఇలా రోజూ ఎడ్లబండి నిండుగా ఆహార పదార్థాలను నింపి మనిషితో పంపాల్సిందే. భీముడు వెళ్లి బకాసురుడిని సంహరించే వరకు ఈ అరాచకం కొనసాగింది. ఇప్పుడు బకాసురుడి రీతిలోనే చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీ రౌడీలు రోజుకొకరిని అత్యంత కిరాతకంగా అంతమొందిస్తున్నారు.
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక్క నెల రోజుల్లోనే రాష్ట్రంలో 31 మందిని పచ్చ నేతలు, కార్యకర్తలు దారుణంగా హత్య చేశారు. వీరి దాడులు, వేధింపులను తట్టుకోలేక 35 మంది తమ ప్రాణాలను బలితీసుకున్నారు. ఇవన్నీ ఇప్పటివరకు నమోదైన అధికారిక లెక్కలు. కానీ వాస్తవంగా అంతకుమించిన రాక్షస కాండలో రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది. టీడీపీ ప్రభుత్వ ప్రోత్సాహంతో సాగుతున్న దౌర్జన్యకాండ కావడంతో ఫిర్యాదులు చేసేందుకు పలువురు బాధితులు వెనుకంజ వేస్తున్నారు. వీరంతా ఫిర్యాదు చేస్తే మరిన్ని కేసులు వెలుగుచూసేవి.
నెల రోజుల్లో వేయికిపైగా దాడులు.. 300 హత్యాయత్నాలు
టీడీపీ రౌడీ మూకలు రాష్ట్రవ్యాప్తంగా విధ్వంసకాండ కొనసాగిస్తున్నాయి. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలతోపాటు వ్యాపారులు, సాధారణ ప్రజలపై కర్కశంగా విరుచుకుపడుతున్నారు. నెల రోజుల్లోనే రాష్ట్రంలో 1,050 దాడులకు తెగబడటం టీడీపీ యథేచ్ఛగా కొనసాగిస్తున్న దౌర్జన్యకాండకు నిదర్శనం. వాటిలో 300కుపైగా హత్యాయత్నాలే కావడం గమనార్హం. అంటే టీడీపీ గూండాలు రోజుకు సగటున 100 దాడులు.. 10 హత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. ఒక్క ప్రాంతమని లేదు.. శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు రాష్ట్రవ్యాప్తంగా రాక్షస కాండను కొనసాగిస్తున్నారు. ఎస్సీ కాలనీలపై దాడులు చేస్తూ బీభత్సం సృష్టిస్తున్నారు. ఇళ్లు, ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో చీనీ తోటలను నరికేస్తున్నారు.
ఊళ్లు వదిలిపోయిన వేలాది కుటుబాలు
టీడీపీ రౌడీమూకలు హత్యాకాండకు తెగబడుతుండటంతో సామాన్యులు ప్రాణభయంతో తమ గ్రామాలు వదిలేసి వెళ్లిపోతున్నారు. ఒక్క పల్నాడు జిల్లాలోనే 1,500 కుటుంబాలు తెలంగాణకు వెళ్లి తలదాచుకోవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. చిత్తూరు జిల్లాలో దాదాపు 500, అనంతపురం జిల్లాలో 350, శ్రీసత్యసాయి జిల్లాలో 100, అన్నమయ్య జిల్లాలో 120, కర్నూలు జిల్లాలో 135 కుటుంబాలు తమ సొంత ఊళ్లను విడిచిపెట్టేశాయి. వ్యాపారులను కూడా టీడీపీ మూకలు వదిలిపెట్టడం లేదు. నెల రోజుల్లోనే రాష్ట్రంలో 560 ప్రైవేటు ఆస్తులు, 490 ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు.
రెడ్‌బుక్ రాజ్యాంగానికే పోలీస్ శాఖ సలాం..
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రూపొందించిన భారత రాజ్యాంగాన్ని పాటించాల్సిన పోలీసు శాఖ నారా లోకేశ్ విరచిత రెడ్‌బుక్ రాజ్యాంగానికే సలాం కొడుతోంది. రెడ్‌బుక్ పేరిట రాష్ట్రంలో హోర్డింగులు పెట్టి మరీ దౌర్జన్యాలకు పాల్పడుతున్నా పోలీసు శాఖ చోద్యం చూస్తోంది. రెడ్‌బుక్ రాజ్యాంగానికి సెల్యూట్ చేస్తూ టీడీపీ అరాచకాల అడుగులకు మడుగులొత్తుతోంది. రాష్ట్రస్థాయిలో లోకేశ్‌ను అనుసరిస్తూ నియోజకవర్గ స్థాయిల్లో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తలో రెడ్‌బుక్‌ను తెరపైకి తెచ్చి దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. తమ హింసాకాండను అడ్డుకుంటే పోలీసుల సంగతి తేలుస్తామని టీడీపీ ప్రభుత్వ పెద్దలు బహిరంగంగానే ప్రకటిస్తుండటం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment