
రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ ఉల్లంఘనలపై ప్రభుత్వం కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. వీటిని ఉల్లంఘించినవారికి జరిమానాలు విధిస్తోంది. అయితే ఇప్పుడున్న జరిమానాలను కేంద్ర ప్రభుత్వం సవరించిందని, తీవ్రమైన ఉల్లంఘనలకు జరిమానాలను 10 రెట్లు పెంచిందని చాలా జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి. రహదారి భద్రతను పెంచడం, ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ఈ కొత్త జరిమానాలకు కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేసిందంటూ నివేదించాయి.
ఆయా నివేదికల ప్రకారం.. ట్రాఫిక్ ఉల్లంఘనలకు పెంచిన జరిమానాలను మార్చి 1 నుంచే ప్రభుత్వం అమలు చేస్తోంది. భారీ జరిమానాలతోపాటు తీవ్రమైన ఉల్లంఘనలకు జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఉంది. రహదారి భద్రతను పెంపొందించడం,డ్రైవర్లలో నిర్లక్ష్య ప్రవర్తనను తగ్గించడం ఈ చొరవ లక్ష్యం. కొత్త నిబంధనలలో భాగంగా భారీ జరిమానాలు, జైలు శిక్ష విధించడంతో పాటు ఉల్లంఘనలకు పాల్పడినవారితో సమాజ సేవ చేయించే శిక్షలను సైతం అధికారులు విధించవచ్చు.
పేర్కొన్న కొత్త నిబంధనలు, జరిమానాలు ఇవే..
డ్రంక్ అండ్ డ్రైవ్: మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే రూ.10 వేలు చెల్లించి 6 నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. పదేపదే పాల్పడితే రూ.15,000 జరిమానాతో పాటు రెండేళ్ల వరకు జైలు శిక్ష కూడా పడుతుంది.
హెల్మెట్ లేకపోతే: హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే విధించే జరిమానాను గతంలో రూ.100 ఉండగా ఇప్పుడు రూ.1,000లకు పెంచారు. దీంతో పాటు మూడు నెలల పాటు మీ లైసెన్స్ ను రద్దు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా నాలుగు చక్రాల వాహనాలు నడిపేవారు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే రూ.1,000 జరిమానా విధిస్తారు.
డ్రైవింగ్ చేస్తూ ఫోన్ వాడకం: మొబైల్ ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేసేవారికి విధించే జరిమానా రూ. 500 నుంచి రూ.5000లకు పెరిగింది.
డాక్యుమెంట్లు లేకపోతే: చెల్లుబాటు కాని లైసెన్స్ లేదా ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే వరుసగా రూ.5,000, రూ.2,000 జరిమానా విధిస్తారు. దీంతోపాటు మూడు నెలల జైలు శిక్ష, కమ్యూనిటీ సర్వీస్ కూడా శిక్షగా విధించవచ్చు. బీమా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే 4,000 జరిమానా విధిస్తారు.
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోతే: రూ.10,000 లేదా ఆరు నెలల జైలు శిక్షతోపాటు కమ్యూనిటీ సర్వీస్ కూడా శిక్షగా విధించవచ్చు.
ట్రిపుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్: బైక్‌పై ట్రిపుల్ రైడింగ్ చేస్తే 1,000 జరిమానా, ప్రమాదకర డ్రైవింగ్ లేదా రేసింగ్ కు రూ.5,000 జరిమానా విధిస్తారు. అంబులెన్స్ వంటి అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకపోతే రూ.10 వేల జరిమానా విధిస్తారు.
సిగ్నల్ జంపింగ్, ఓవర్ లోడింగ్: సిగ్నల్ జంపింగ్ చేస్తే 5,000 జరిమానా, ఓవర్లోడ్ వాహనాలకు 2,000 జరిమానా విధిస్తారు.
పిల్లలకు వాహనమిస్తే: రూ.25 వేల జరిమానాతో పాటు మూడేళ్ల జైలు శిక్ష, వాహన రిజిస్ట్రేషన్ రద్దు, 25 ఏళ్ల వరకు లైసెన్స్‌పై నిషేధం విధిస్తారు.
రోడ్డు ప్రమాదాలను నివారించి, రోడ్డు భద్రతను పెంపొందించేందుకు కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే పలు కఠిన నిబంధనలు, జరిమానాలు, శిక్షలు అమలు చేస్తున్నాయి. ఇప్పుడు ఆ జరిమానాలు, శిక్షలు భారీగా పెంచారని నివేదికలు రావడంతో వాహనదారులకు మరింత ఆందోళన మొదలైంది. అయితే దీనిపై కేంద్ర రవాణా శాఖ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment