పూల ఉత్పత్తిలో ఏపీది మూడోస్థానం | YSR Congress Party MPs Comments In Lok Sabha | Sakshi
Sakshi News home page

పూల ఉత్పత్తిలో ఏపీది మూడోస్థానం

Published Wed, Dec 8 2021 5:16 AM | Last Updated on Wed, Dec 8 2021 5:18 AM

YSR Congress Party MPs Comments In Lok Sabha - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ముందస్తు అంచనాల ప్రకారం 2020–21లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోని మూడో అతిపెద్ద పూల ఉత్పత్తిదారుగా ఉందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ చెప్పారు. లోక్‌సభలో మంగళవారం వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్‌ ప్రశ్నకు ఆయన జవాబిచ్చారు. 2020–21లో ఆంధ్రప్రదేశ్‌లో 19.84 వేల హెక్టార్లలో 406.85 వేల టన్నుల పూల ఉత్పత్తి జరిగినట్లు అంచనా వేశారని తెలిపారు. 2020–21లో దేశంలో మొత్తం పూల ఉత్పత్తిలో 15.62 శాతం ఆంధ్రప్రదేశ్‌ అందించిందన్నారు. దేశంలోని ప్రధాన పుష్పాలను ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ అత్యధిక ఉత్పత్తిని కలిగి ఉందని చెప్పారు. 

35 వ్యవసాయ అటవీ నమూనాల అభివృద్ధి 
సబ్‌మిషన్‌ ఆన్‌ ఆగ్రోఫారెస్ట్రీ పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో 567.65 హెక్టార్లను ఆగ్రోఫారెస్ట్రీ కిందకు తెచ్చినట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. రైతుల ప్రయోజనం కోసం వివిధ వ్యవసాయ పర్యావరణ ప్రాంతాలు, భూ వినియోగ పరిస్థితులకు అనువైన 35 వ్యవసాయ అటవీ నమూనాలను అభివృద్ధి చేసినట్లు చెప్పారు.

ఏపీలో 3 మెగా ఫుడ్‌ పార్కులు
ఆంధ్రప్రదేశ్‌లో 3 మెగా ఫుడ్‌ పార్కులు, 28 కోల్డ్‌ చైన్‌ ప్రాజెక్ట్‌లు, 1 ఆగ్రో ప్రాసెసింగ్‌ క్లస్టర్, 4 ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, 1 ఆపరేషన్‌ గ్రీన్స్‌ ప్రాజెక్ట్, 4 ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబొరేటరీలను ఇప్పటికే ఆమోదించినట్లు కేంద్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్‌సింగ్‌ పటేల్‌ తెలిపారు. ప్రతి జిల్లాలో ఒక ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ ద్వారా నిర్వహించే మైక్రో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ స్కీమ్‌ను కేంద్ర ప్రాయోజిత ఫార్మలైజేషన్‌ ద్వారా ప్రతి జిల్లాలో ఒక ఇంక్యుబేషన్‌ సెంటర్, ఒక నైపుణ్య అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ యోచిస్తోందని వైఎస్సార్‌సీపీ ఎంపీ బాలశౌరి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

16.8 లక్షలమంది పాల ఉత్పత్తిదారులకు మార్కెట్‌ యాక్సెస్‌
పాల ఉత్పత్తిదారుల నికర రోజువారీ ఆదాయం రూ.25.52 పెరగడంతోపాటు కిలో పాలకు దాణా ఖర్చును తగ్గించడంలో జాతీయ డెయిరీ ప్రణాళిక దశ–1 దోహదపడిందని కేంద్ర పాడిపశుసంవృద్ధిశాఖ మంత్రి పురుషోత్తమ్‌ రూపాలా తెలిపారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ఈ ప్రాజెక్టులో అదనంగా నమోదు చేసుకున్న 16.8 లక్షల మంది పాల ఉత్పత్తిదారులకు మార్కెట్‌ యాక్సెస్‌ అందించినట్లు పేర్కొన్నారు. అందులో 7.65 లక్షల మంది మహిళా సభ్యులున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ 97 వేల గ్రామాల్లో 59 లక్షలమంది లబ్ధిదారులను కవర్‌ చేసిందని చెప్పారు.

శ్యామాప్రసాద్‌ ముఖర్జీ రూర్బన్‌ మిషన్‌ కింద అభివృద్ధి
శ్యామాప్రసాద్‌ ముఖర్జీ రూర్బన్‌ మిషన్‌ కింద దేశంలోని 28 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాల్లో 109 గిరిజన సమూహాలు, 191 గిరిజనేతర క్లస్టర్లలో అభివృద్ధి వివిధ దశల్లో ఉందని వైఎస్సార్‌సీపీ ఎంపీ తలారి రంగయ్య ప్రశ్నకు సమాధానంగా కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ సహాయమంత్రి సాధ్వి నిరంజన్‌జ్యోతి తెలిపారు. రూ.27,788.44 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడితో 300 రూర్బన్‌ క్లస్టర్లలో 291 ఇంటిగ్రేటెడ్‌ క్లస్టర్‌ యాక్షన్‌ ప్లాన్లు అభివృద్ధి చేశామని చెప్పారు.

6.50 లక్షల నీటిసేకరణ నిర్మాణాలు
జాతీయ మిషన్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ అగ్రికల్చర్‌ కింద వర్షాధార ప్రాంత అభివృద్ధి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ తెలిపారు. ఇప్పటివరకు ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలోని వాటర్‌షెడ్‌ డెవలప్‌మెంట్‌ కాంపోనెంట్‌ కింద దాదాపు 6.50 లక్షల నీటిసేకరణ నిర్మాణాలు సృష్టించినట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ వంగా గీత ప్రశ్నకు ఆయన జవాబుగా చెప్పారు. స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్‌ యోజన కింద ప్రారంభించిన సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూప్స్‌ పథకాన్ని ప్రస్తుతం దేశంలో 250 జిల్లాల్లో అమలు చేస్తున్నామనికేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు అందిస్తున్న వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకంలాంటి దాన్ని అమలు చేసే ఆలోచన కేంద్రానికి ఉందా అని ఎంపీ వంగా గీత అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.  

స్పెషల్‌ స్టేటస్‌ ఇవ్వాలన్న ప్రతిపాదన అందింది
ఆంధ్రప్రదేశ్, మరికొన్ని రాష్ట్రాల నుంచి ప్రత్యేక కేటగిరీ హోదా ఇవ్వాలన్న ప్రతిపాదన కేంద్రానికి అందిందని, అయితే 14వ ఆర్థికసంఘం రాష్ట్రాల మధ్య పంచుకోదగిన పన్నుల సమాంతర పంపిణీలో సాధారణ కేటగిరీ రాష్ట్రాలు, ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాల మధ్య వ్యత్యాసాన్ని చూపలేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ తెలిపారు. టీఆర్‌ఎస్‌ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. 14వ ఆర్థికసంఘం సిఫార్సుల ప్రకారం 2015–20 కాలానికి రాష్ట్రాలకు నికర భాగస్వామ్య పన్నుల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని వెనుకబడిన ప్రాంతాల్లో పారిశ్రామిక సంస్థల ఏర్పాటును ప్రోత్సహించేందుకు 2015 ఆర్థిక చట్టం ప్రకారం ఆదాయపన్నుకు సంబంధించి పన్ను ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement