విలేకరులతో మాట్లాడుతున్న ఎంపీలు మిథున్‌రెడ్డి,బాలశౌరి, లావు శ్రీకృష్ణదేవరాయలు
సాక్షి, అమరావతి: ఎంపీ రఘురామరాజును పోలీసులు కొట్టలేదని న్యాయస్థానం నియమించిన వైద్యుల కమిటీ నిగ్గు తేల్చడంతో ఆయనకు ప్రాణహాని ఉందంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు కొత్త డ్రామాకు తెరతీశారని వైఎస్సార్‌సీపీ ఎంపీలు మిథున్‌రెడ్డి, వల్లభనేని బాలశౌరి, లావు శ్రీకృష్ణదేవరాయలు విమర్శించారు. ‘ఈ వ్యవహారంపై తేల్చేందుకు హైకోర్టు.. మెడికల్ బోర్డుకు రిఫర్ చేసింది. వైద్యులను కూడా న్యాయస్థానమే నియమించింది. రఘురామను పరీక్షించిన అనంతరం వైద్య బృందం సీల్డ్ కవర్‌లో తన నివేదికను అందచేసింది.
ఈ మొత్తం ప్రక్రియలో అసలు రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం ఎక్కడుంది? టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు నిజమైతే ఆ పార్టీ నేతలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, అచ్చెన్నాయుడు విషయంలో కూడా ప్రభుత్వం అలాగే వ్యవహరించేది కదా? ఇదంతా చూస్తుంటే ఇందులో కుట్ర దాగుందని బోధపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపర్చేందుకు పన్నిన కుట్రలు వెలుగులోకి వస్తున్నాయనే భయంతోనే అరెస్టుపై చంద్రబాబు రాద్ధాంతం చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. రఘురామరాజును చంద్రబాబు పావులా వాడుకున్నారని చెప్పారు. కులమతాల చిచ్చు రగల్చడం, దిగజారుడు భాష మాట్లాడిన వారిని చట్టం ఎందుకు ఉపేక్షిస్తుందని ప్రశ్నించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ సీపీ ఎంపీలు సోమవారం విలేకరులతో మాట్లాడారు.
కేసుల భయంతో చంద్రబాబుతో కలిసి కుట్ర: మిథున్‌రెడ్డి
రఘురామరాజును పోలీసులు కొట్టలేదని న్యాయస్థానం నియమించిన వైద్యుల కమిటీనే నిగ్గు తేల్చింది. దీంతో ఆయనకు ప్రాణహాని ఉందంటూ చంద్రబాబు కొత్త డ్రామాకు తెరతీశారు. టీడీపీ నేతలు అరెస్టైనప్పుడు కూడా ఇంతగా స్పందించని వ్యక్తి ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా నానా హైరానా చేస్తున్నారు. నిజంగా పోలీసులు కొడితే రఘురామరాజు కోర్టుకు నడుచుకుంటూ రాగలరా? వైద్యం కోసం రమేష్ ఆస్పత్రికే వెళ్తానని ఎందుకు పట్టుబడుతున్నారు? అది టీడీపీ వారిది కావడం వల్లే. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టేందుకు గతంలో శంకర్రావును వాడుకున్నట్లే ఇప్పుడు ప్రభుత్వాన్ని అస్థిర పర్చేందుకు రఘురామరాజును పావుగా వినియోగించుకుంటున్నారు. ఆఖరుకు ఆయన కుటుంబాన్ని కూడా ఇందులోకి లాగారు. రఘురామపై సీబీఐ కేసులు నమోదైన తరువాత చంద్రబాబు వల వేశారు. తమ కుట్రలో పాలు పంచుకుంటే సీబీఐ కేసుల నుంచి బయటపడేస్తానని బీజేపీలో చేరిన తన మనుషుల ద్వారా లోబర్చుకున్నాడు. ఇవన్నీ ఎక్కడ బయటకొస్తాయోనని చంద్రబాబు భయపడుతున్నారు. సీఎం జగన్‌పై బురద జల్లేందుకు చంద్రబాబు గతంలో గుళ్లు, గోపురాలను వాడుకున్నాడు. ఇప్పుడు కులమతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. ఇందులో రఘురామ, ఓ వర్గం మీడియా భాగస్వాములే. చంద్రబాబు మార్గదర్శకత్వంలోనే బీజేపీలోని ఓ వర్గం మాట్లాడుతోంది.
అది ఓ ఎంపీ మాట్లాడే భాషేనా?: బాలశౌరి
రఘురామరాజు ఎంపీ కాకముందే ఐదుసార్లు పార్టీలు మారాడు. మొదటిసారి ఎంపీ అయినప్పటికీ ఆయన కోరిక మేరకు సీఎం జగన్ పార్లమెంట్ కమిటీకి చైర్మన్‌గా చేశాడు. మరో రెండు కమిటీల్లో సముచిత స్థానం కల్పించారు. ఇంత ప్రాధాన్యం మరే ఎంపీకి ఇవ్వలేదు. ఇంత చేస్తే పార్టీ ఎంపీలను, ఐఏఎస్ అధికారులను, సీఎంను దూషించడం దుర్మార్గం. మమ్మల్ని దూషిస్తే ఊరుకున్నాం. కానీ కులమతాల మధ్య చిచ్చు పెడితే చట్టం చూస్తూ కూర్చుంటుందా? పాస్టర్ల ఉచ్ఛారణను అనుకరిస్తూ వారి మనోభావాలను దెబ్బతీశాడు (ఆ వీడియోలు ప్రదర్శించారు). రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఏ ఎంపీ కూడా ఇంత అసభ్యంగా, అభ్యంతరకరంగా మాట్లాడలేదు. రఘురామను భుజానికెత్తుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వారి పార్టీల్లో ఎవరైనా ఇదే విధంగా మాట్లాడితే ఊరుకుంటారా? ఓ ఎంపీ ఇలా మాట్లాడటం తప్పని ఎప్పుడైనా ఈ విపక్ష నేతలు చెప్పారా? కుట్రలో భాగంగానే రాష్ట్రపతికి చంద్రబాబు లేఖ రాశారు. అచ్చెన్నాయుడు, ధూళిపాళ్ల అరెస్టు అయినప్పుడు కూడా ఆయన ఇలా స్పందించలేదు. చంద్రబాబు హయాంలో కాపు నేత ముద్రగడ పద్మనాభం అరెస్టు సందర్భంగా పోలీసులు ఎలా ప్రవర్తించారో ప్రజలకు ఇంకా గుర్తుంది. ఆయన భార్యను దుస్తులు పట్టుకుని, కొడుకును కాళ్లతో తన్నుకుంటూ తీసుకెళ్లిన విషయం చంద్రబాబు మర్చిపోయారా?
అరెస్టులో ఉల్లంఘన లేదు: శ్రీకృష్ణదేవరాయలు
రఘురామరాజు అరెస్టులో ఎక్కడా నిబంధన ఉల్లంఘన జరగలేదు. క్రిమినల్ కేసుల్లో ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చు. సివిల్ కేసుల్లో అయితే పార్లమెంట్ జరిగేప్పుడు, స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం ఉన్నప్పుడు మినహా ఎప్పుడైనా అరెస్టు చేయవచ్చు. రఘురామను రమేష్ ఆసుపత్రికే తరలించాలని టీడీపీ ఎందుకు పట్టుబడుతోంది? కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఎయిమ్స్ మంగళగిరిలో ఉంది. ఇంకా పలు ప్రైవేట్ ఆసుపత్రులున్నాయి. అక్కడికి తరలిస్తే నిజాలు బయటకొస్తాయని టీడీపీ కంగారు పడుతోంది. న్యాయస్థానాలపై వైఎస్సార్‌సీపీకి విశ్వాసం ఉంది. కోర్టు ఆదేశాల మేరకే జీజీహెచ్ ఆసుపత్రికి రఘురామరాజును పంపాం. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఏనాడూ నియోజకవర్గానికి వెళ్లని ఎంపీ.. చంద్రబాబు చెప్పినట్లు కుట్రలు పన్నడం, అసభ్యంగా మాట్లాడటం ఏమాత్రం క్షమించరాని నేరం. రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆయన భాష, దుర్మార్గపు చర్యలను అర్థం చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment