ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలసిన వైఎస్సార్‌సీపీ ఎంపీల బృందం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఎంపీలు మిథున్‌రెడ్డి, వంగా గీత, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కేంద్రమంత్రితో భేటీ అయ్యారు. రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు. నిధులు ఎప్పటికప్పుడు విడుదలయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కార్డుల్లో అసమానత తొలగించండి
రెండు రాష్ట్రాల జీఎస్‌డీపీ భిన్నంగా ఉన్నప్పటికీ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కార్డుల అమలులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను ఒకేలా పరిగణిస్తున్నారని, అసమానతలు తొలగించాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్‌సీపీ చీఫ్ విప్ మార్గాని భరత్‌రామ్, ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, తలారి రంగయ్య, చింతా అనూరాధ, బి.వి.సత్యవతిలతో కూడిన బృందం బుధవారం కేంద్రమంత్రితో భేటీ అయింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆమోదించిన ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ ఫార్ములానే ఇంకా అనుసరిస్తున్నారని ఎంపీలు చెప్పారు. దాన్ని మార్చాలని కోరారు. విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని తెలిపారు. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కార్డుల వ్యవహారం పలుసార్లు కేంద్రం దృష్టికి తీసుకొచ్చినా చర్యలు తీసుకోలేదన్నారు. ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ కార్డుల వ్యత్యాసంపై దృష్టి సారించి వెంటనే సరిచేయాలని విజ్ఞప్తి చేశారు. 2021 జనాభా లెక్కల తర్వాతే ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ నిష్పత్తిని సవరిస్తామని కేంద్రమంత్రి వారికి తెలిపారు.
అరకు–భద్రాచలం రైల్వే లైను ఏర్పాటు చేయండి
అరకు–భద్రాచలం రైల్వే లైను ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు వైఎస్సార్‌సీపీ ఎంపీ గొడ్డేటి మాధవి విజ్ఞప్తి చేశారు. ఎంపీలు మార్గాని భరత్‌రామ్, చింతా అనూరాధ, వంగా గీతతో కలిసి ఆమె రైల్వే మంత్రితో సమావేశమయ్యారు. అరకు నుంచి పాడేరు మీదుగా భద్రాచలం రైల్వే లైను ఉత్తరాంధ్రకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు సాకారమయ్యేలా చొరవ చూపాలని కోరారు. ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన అరకు ఎంతోమంది పర్యాటకులను ఆకర్షిస్తోందని, రైల్వేస్టేషన్ సుందరీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆయా అంశాలపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని అనంతరం ఎంపీ మాధవి తెలిపారు.
ప్రధానిని కలిసిన ఎంపీలు
పార్లమెంటు శీతాకాల సమావేశాల ముగింపు అనంతరం ప్రధాని నరేంద్రమోదీని వైఎస్సార్‌సీపీ ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు. వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి, ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎన్.రెడ్డెప్ప, గోరంట్ల మాధవ్, వంగా గీత, బి.వి.సత్యవతి, చింతా అనూరాధ, గొడ్డేటి మాధవి తదితరులు ప్రధానమంత్రిని కలిశారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలసిన వైఎస్సార్‌సీపీ ఎంపీల బృందం
Comments
Please login to add a commentAdd a comment