రొయ్య రైతుకు వెన్నుదన్ను: దేశంలో అత్యధిక రేట్లు ఏపీలోనే | AP Has The Highest Rates Prawns Purchase In The Country | Sakshi
Sakshi News home page

రొయ్య రైతుకు వెన్నుదన్ను: దేశంలో అత్యధిక రేట్లు ఏపీలోనే

Published Wed, Dec 14 2022 8:23 AM | Last Updated on Wed, Dec 14 2022 9:07 AM

AP Has The Highest Rates Prawns Purchase In The Country - Sakshi

సాక్షి, అమరావతి:  అంతర్జాతీయంగా రొయ్యల ధరలు తగ్గుతున్న ప్రస్తుత తరుణంలో రైతులకు ప్రభుత్వం బాసటగా నిలుస్తూ, వారికి మద్దతు ధర లభించేలా అహరహం కృషి చేస్తోందనడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చేపడుతున్న చర్యల ఫలితంగా రొయ్య రైతులకు దేశంలో మరే ఇతర రాష్ట్రంలోనూ దక్కనంత ధర ఒక్క ఏపీలోనే లభిస్తోంది. 

ఓ పక్క అంతర్జాతీయంగా రొయ్యల మార్కెట్‌ తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. వివిధ కారణాలతో ఎగుమతులు తగ్గుతున్నాయి. మరో పక్క మేత ధరలు పెరిగిపోతున్నాయి. వీటన్నింటినీ తట్టుకోవడం రాష్ట్రంలో రొయ్య రైతుకు కష్టంగా ఉంది. ఈ సమయంలో ఏ ఒక్క రైతూ ఆర్థికంగా నష్టపోకూడదన్న సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల సీనియర్‌ మంత్రులతో ఆక్వా సాధికారత కమిటీని నియమించారు.

రొయ్య రైతులకు మేలు చేయడానికి చర్యలు చేపట్టారు. పెరిగిన ఫీడ్‌ ధరలను నియంత్రించడంతోపాటు రొయ్య ధరలను క్రమబద్ధీకరించేందుకు కమిటీకి పూర్తిస్థాయి అధికారాలను అప్పగించారు. కమిటీ నిర్ణయాలు, చర్యలపై సీఎం వైఎస్‌ జగన్‌ నిరంతరం సమీక్షిస్తూనే ఉన్నారు. ప్రభుత్వ కృషి ఫలితంగా రెండుసార్లు పెంచిన ఫీడ్‌ ధరలను కంపెనీలు వెనక్కి తీసుకున్నాయి. ఇటీవల టన్నుకు రూ.2,600 చొప్పున పెంచగా, సీఎం ఆదేశాలతో సాధికారత కమిటీ ఆ కంపెనీలతో చర్చలు జరిపింది. ఫలితంగా పెంచిన ధరలను కంపెనీలు తగ్గించాయి. ఇది రైతులకు చాలా మేలు చేసింది. 

నెల రోజులుగా ప్రభుత్వ ధరకే కొనుగోలు 
ప్రాసెసింగ్‌ యూనిట్లతోనూ మంత్రుల కమిటీ చర్చలు జరిపింది. రొయ్య రైతులకు గిట్టుబాటు అయ్యేలా ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన రీతిలో ధరలను నిర్ణయించారు. వంద కౌంట్‌ రొయ్యలను రూ.210కు, 30 కౌంట్‌ రూ.380కు తక్కువ కాకుండా కొనాలని కమిటీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నెల రోజులుగా ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. ఫలితంగా ఇంతటి తీవ్ర సంక్షోభ సమయంలో కూడా దేశంలో మరెక్కడా లేని విధంగా ఒక్క ఏపీలోనే రొయ్యల ధరలు నిలకడగా ఉన్నాయి. రోజూ ప్రభుత్వం నిర్దేశించిన రేట్లు, మార్కెట్‌లో రేట్లను సమీక్షించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ప్రభుత్వం నియమించింది. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా టోల్‌ ఫ్రీ నంబర్‌తో కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. ధరల క్రమబద్ధీకరణకు ఏపీ స్టేట్‌ ఆక్వాకల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (అప్సడా) చట్టం ద్వారా «ప్రత్యేకంగా స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌ (ఎస్‌వోపీ) రూపొందిస్తున్నారు. 

14న మరోసారి భేటీ... 
ఆక్వా రైతులను ఆదుకునే క్రమంలో సీఎం ఆదేశాల మేరకు ఈ నెల 14వ తేదీన ఆక్వా ఫీడ్, సీడ్, ప్రాసెసింగ్‌ ప్లాంట్ల యజమానులతో సాధికారత కమిటీ మరోసారి భేటీ కానుంది. సమీప భవిష్యత్‌లో ధరల క్రమబద్ధీకరణకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనుంది. రైతులకు మేలు చేసే అంశాలపై చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోనుంది. .

నాడు జోన్లుగా విభజించి... నేడు రాజకీయాలు 
టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలో ఉండగా ఆక్వా రంగాన్ని, రైతులను ఏనాడూ పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి ఆక్వా జోన్, నాన్‌ ఆక్వా జోన్‌గా విభజిస్తూ 2018, ఏప్రిల్‌ 20వ తేదీన జీవో ఎంఎస్‌ నం.16 జారీ చేసింది చంద్రబాబు ప్రభుత్వమే. ఆహారం పండిస్తున్న భూములను కాపాడుకోవడం, కాలుష్యాన్ని నివారించడం, లవణీయత (సెలనిటీ) పెరగడం వల్ల భూములు నిరుపయోగంగా కాకుండా చూడడం, పర్యావరణ పరిరక్షణ తదితర కారణాలతో ఈ జోన్ల వర్గీకరణ జరిగింది. ఆక్వా జోనింగ్‌ చేయకపోతే భవిష్యత్‌ తరాలకు ముప్పు వాటిల్లడమే కాదు, ఆహార ఉత్పత్తులు పండించే భూములు తగ్గిపోయి, ఆహారం కొరత ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు పరిస్థితుల్లో వచ్చిన మార్పులేమిటి? అప్పట్లో చంద్రబాబు చేతిలో దగా పడ్డ ఆక్వా రైతులు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలతో మరింత మేలు పొందుతున్నారు. చంద్రబాబు జోన్‌ వ్యవస్థను మధ్యలోనే వదిలేశారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక జోన్‌ వ్యవస్థను పూర్తిచేసి, రైతులకు మేలు చేసేలా నిర్ణయం తీసుకున్నారు. అధికారంలో ఉండగా జోన్లతో సంబంధం లేకుండా ఆక్వా రైతులందరికీ రూ.3.86కు విద్యుత్‌ను సరఫరా చేసిన చంద్రబాబు, మళ్లీ అధికారంలోకి వస్తే తగ్గిస్తానంటూ కొత్త రాగం అందుకున్నారు.

వైఎస్‌ జగన్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత మూడున్నరేళ్లుగా ఆక్వా జోన్‌ పరిధిలోని రైతులకు విద్యుత్‌ ధరలు తగ్గించి, యూనిట్‌ రూ.1.50కే సరఫరా చేస్తోంది. నాన్‌ ఆక్వాజోన్‌లో అప్పటి నుంచి ఉన్న రేట్లు యథాతథంగా కొనసాగిస్తోంది. చంద్రబాబు హయాం­లో ఉన్న మాదిరిగా ఇప్పుడూæ యూనిట్‌ రూ.3.86కే  విద్యుత్‌ సరఫరా చేస్తోంది. పైగా, రైతులకు నాణ్యమైన ఫీడ్, సీడ్‌ తక్కువకు దొరికేలా చూస్తోంది. ఇంకోపక్క రైతులకు ఎక్కువ ధర దక్కేలా చర్యలు తీసుకుంటోంది. ఈ వాస్తవాలను మరిచిన చంద్రబాబు.. ఇప్పుడు ఎన్నికలు వస్తుండటంతో రాజకీయాలు చేయడానికి దీన్ని అజెండాగా తీసుకున్నారు. అబద్ధాలతో ప్రజలను వంచించే ప్రయత్నం చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement