రొయ్యల ధరల నియంత్రణకు ఎస్‌వోపీ | SPO For Control Of Shrimp Prices In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

రొయ్యల ధరల నియంత్రణకు ఎస్‌వోపీ

Published Tue, Nov 15 2022 8:52 AM | Last Updated on Tue, Nov 15 2022 9:05 AM

SPO For Control Of Shrimp Prices In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రొయ్య రైతులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. అంతర్జాతీయంగా మార్కెట్‌ ఒడుదొడుకుల నేపథ్యంలో రొయ్య రైతులకు నష్టం వాటిల్లకుండా అన్ని విధాలుగా కృషిచేస్తోంది. ధరల నియంత్రణ కోసం ఏపీ స్టేట్‌ ఆక్వాకల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (అప్సడా) చట్టం ప్రకారం స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్స్‌ (ఎస్‌వోపీ) రూపొందిస్తోంది. రోజూ  మార్కెట్‌ను సమీక్షించడమేగాక రొయ్య రైతుల కోసం ప్రత్యేకంగా కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తోంది. మరోపక్క రొయ్యల ఎగుమతులను ప్రోత్సహించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రత్యేక ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి పంపేందుకు సన్నాహాలు చేస్తోంది.  

అంతర్జాతీయ మార్కెట్‌ వల్లే.. 
ప్రధానంగా 100 కౌంట్‌ రొయ్యల ప్రధాన దిగుమతిదారైన చైనా కొనుగోలు ఆర్డర్లను పూర్తిగా నిలిపేసింది. రూ.వెయ్యి కోట్లకుపైగా చెల్లింపులను ఆపేసింది. మరోవైపు నాలుగులక్షల టన్నులకు మించి ఉత్పత్తి చేయని ఈక్వెడార్‌ దేశం ఈ ఏడాది 13 లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తూ మన రొయ్యల కంటే తక్కువ ధరకు అమెరికాకు ఎగుమతి చేస్తోంది. ఫలి తంగా దేశీయంగా రొయ్యల మార్కెట్‌ తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. పరిస్థితిని సమీక్షించేందుకు సీనియర్‌ మంత్రులతో ఏర్పాటు చేసిన సాధికారత కమిటీ పలుమార్లు సమావేశమై పెంచిన ఫీడ్‌ ధరలను తగ్గించడమేగాక తగ్గిన కౌంట్‌ ధరలను నియంత్రించేలా చర్యలు చేపట్టింది. దీంతో రొయ్యల మేత ధరను కిలోకు పెంచిన రూ.2.60ని మేత తయారీదారులు తగ్గించారు.

ఎగుమతి మార్కెట్‌కు అనుగుణంగా పంటల ప్రణాళిక  
ప్రాసెసింగ్‌ కంపెనీలు, ట్రేడర్లతో విస్తృతస్థాయిలో చర్చలు జరిపి ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన రీతిలో రొయ్యల ధరలను నిర్ణయించారు. ఈ ధరలు కనీసం 10 రోజులు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇకనుంచి సీజన్‌ ప్రారంభానికి ముందే ఎగుమతి మార్కెట్‌ పోకడలను అంచనావేస్తూ పంటల ప్రణాళికను రూపొందించి తదనుగుణంగా సాగుచేపట్టేలా రైతులను సన్నద్ధం చేయాలని నిర్ణయించారు. మరోవైపు రొయ్య రైతులు, మేత తయారీదారులు, సీ ఫుడ్‌ ప్రాసెసర్లు, ఎగుమతిదారులకు ప్రాతినిధ్యం వహించే సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక బృందాన్ని న్యూఢిల్లీ పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రొయ్యలు దిగుమతి చేసుకునే దేశాలతో స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం చేసుకోవడం, రొయ్యల ఎగుమతుల ప్రోత్సాహకాల (డ్యూటీ డ్రా బ్యాక్‌) శాతం పెరుగుదల, ఆక్వాఫీడ్‌ ఇన్‌పుట్‌లపై దిగుమతి సుంకాల తగ్గింపు తదితర విషయాలపై సంబంధిత కేంద్రమంత్రులతో చర్చించనున్నారు. స్థానిక వినియోగాన్ని పెంచడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చేసేందుకు రాష్ట్రంలోని ప్రతి నివాస ప్రాంతాల్లో మత్స్య ఉత్పత్తుల రిటైల్‌ అవుట్‌లెట్లు ఏర్పాటు చేస్తున్నారు. 

ఆక్వా రైతులకు రూ.2,377.52 కోట్ల సబ్సిడీ  
వాస్తవంగా యూనిట్‌ విద్యుత్‌ రూ.6.89 ఉండగా ఆక్వాజోన్‌ పరిధిలోని 10 ఎకరాల విస్తీర్ణంలో చెరువులకు యూనిట్‌ రూ.1.50, జోన్‌ వెలుపల ఉన్న చెరువులకు రూ.3.86 చొప్పున విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. ఈ విధంగా మూడేళ్లలో రూ.2,377.52 కోట్ల విద్యుత్‌ సబ్సిడీ ఇచ్చారు. వాస్తవాలు ఇలా ఉంటే.. రొయ్య రైతులు విలవిల అంటూ ఆక్వారంగంలో ఉన్న వారిని ఆందోళనకు గురిచేసేలా ఈనాడు తప్పుడు కథనాలు రాస్తుండడం పట్ల ఆక్వా రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ చర్యలు చూసి ఓర్వలేకనే ‘ఈనాడు విలవిల’లాడిపోతోందని పేర్కొంటున్నారు.

ప్రస్తుతం మార్కెట్‌లో రొయ్యల ధరలు ఇలా.. 

కౌంట్‌    ధర             (రూపాయల్లో) 
100     210 
90    220 
80    240 
70    250 
60    270 
50    290 
40    340 
30    380 

కష్టకాలంలో ప్రభుత్వం మేలు మరిచిపోలేం
నేను 30 ఎకరాల్లో రొయ్యలు సాగుచేస్తున్నా. 20టన్నుల ఉత్పత్తి వచ్చింది. ఇటీవల సాధికారత  కమిటీ నిర్ణయించిన రేట్ల ప్రకారం 30 కౌంట్‌ రూ.380 చొప్పున 6 టన్నులు, 40 కౌంట్‌ రూ.340 చొప్పున 5 టన్నులు, 50 కౌంట్‌ రూ.290 చొప్పున 3 టన్నులు, 60 కౌంట్‌ రూ.270 చొప్పున 6 టన్నులు విక్రయించా. గతంలో ఎన్నడూ ఇలాంటి కష్టకాలంలో ప్రభుత్వం అండగా నిలిచిన దాఖలాలు లేవు. ప్రభుత్వమే దగ్గరుండి మరీ ప్రాసెసింగ్‌ కంపెనీల ద్వారా కొనుగోలు చేసి మద్దతుధర లభించేలా చేసింది. అంతర్జాతీయంగా ధరలు పతనమైనప్పటికీ ప్రభుత్వం దగ్గరుండి మరీ అమ్మించడంతో రైతులు గట్టెక్కగలుగుతున్నారు.  
– త్సవటపల్లి నాగభూషణం, ఆక్వారైతు, చెయ్యేరు, కోనసీమ అంబేద్కర్‌ జిల్లా 

ప్రభుత్వం అండగా నిలుస్తోంది
అంతర్జాతీయ మార్కెట్‌ ఒడుదొడుకుల నేపథ్యంలో కౌంట్‌ ధరలు గణనీయంగా తగ్గినప్పటికీ, రాష్ట్రంలో మాత్రం రైతులకు నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సాధికారత కమిటీ ద్వారా రైతులను ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంటే రొయ్య రైతులను ప్రభుత్వం పట్టించుకోవడంలేదంటూ ఆరోపణలు చేయడం సరికాదు. ఈనాడు కథనంలో చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. 
– కె.కన్నబాబు, రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement