Shrimp prices
-
రొయ్యల ధరల నియంత్రణకు ఎస్వోపీ
సాక్షి, అమరావతి: రొయ్య రైతులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. అంతర్జాతీయంగా మార్కెట్ ఒడుదొడుకుల నేపథ్యంలో రొయ్య రైతులకు నష్టం వాటిల్లకుండా అన్ని విధాలుగా కృషిచేస్తోంది. ధరల నియంత్రణ కోసం ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) చట్టం ప్రకారం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్వోపీ) రూపొందిస్తోంది. రోజూ మార్కెట్‌ను సమీక్షించడమేగాక రొయ్య రైతుల కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తోంది. మరోపక్క రొయ్యల ఎగుమతులను ప్రోత్సహించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రత్యేక ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి పంపేందుకు సన్నాహాలు చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ వల్లే.. ప్రధానంగా 100 కౌంట్ రొయ్యల ప్రధాన దిగుమతిదారైన చైనా కొనుగోలు ఆర్డర్లను పూర్తిగా నిలిపేసింది. రూ.వెయ్యి కోట్లకుపైగా చెల్లింపులను ఆపేసింది. మరోవైపు నాలుగులక్షల టన్నులకు మించి ఉత్పత్తి చేయని ఈక్వెడార్ దేశం ఈ ఏడాది 13 లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తూ మన రొయ్యల కంటే తక్కువ ధరకు అమెరికాకు ఎగుమతి చేస్తోంది. ఫలి తంగా దేశీయంగా రొయ్యల మార్కెట్ తీవ్ర ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. పరిస్థితిని సమీక్షించేందుకు సీనియర్ మంత్రులతో ఏర్పాటు చేసిన సాధికారత కమిటీ పలుమార్లు సమావేశమై పెంచిన ఫీడ్ ధరలను తగ్గించడమేగాక తగ్గిన కౌంట్ ధరలను నియంత్రించేలా చర్యలు చేపట్టింది. దీంతో రొయ్యల మేత ధరను కిలోకు పెంచిన రూ.2.60ని మేత తయారీదారులు తగ్గించారు. ఎగుమతి మార్కెట్‌కు అనుగుణంగా పంటల ప్రణాళిక ప్రాసెసింగ్ కంపెనీలు, ట్రేడర్లతో విస్తృతస్థాయిలో చర్చలు జరిపి ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన రీతిలో రొయ్యల ధరలను నిర్ణయించారు. ఈ ధరలు కనీసం 10 రోజులు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇకనుంచి సీజన్ ప్రారంభానికి ముందే ఎగుమతి మార్కెట్ పోకడలను అంచనావేస్తూ పంటల ప్రణాళికను రూపొందించి తదనుగుణంగా సాగుచేపట్టేలా రైతులను సన్నద్ధం చేయాలని నిర్ణయించారు. మరోవైపు రొయ్య రైతులు, మేత తయారీదారులు, సీ ఫుడ్ ప్రాసెసర్లు, ఎగుమతిదారులకు ప్రాతినిధ్యం వహించే సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక బృందాన్ని న్యూఢిల్లీ పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రొయ్యలు దిగుమతి చేసుకునే దేశాలతో స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందం చేసుకోవడం, రొయ్యల ఎగుమతుల ప్రోత్సాహకాల (డ్యూటీ డ్రా బ్యాక్) శాతం పెరుగుదల, ఆక్వాఫీడ్ ఇన్పుట్లపై దిగుమతి సుంకాల తగ్గింపు తదితర విషయాలపై సంబంధిత కేంద్రమంత్రులతో చర్చించనున్నారు. స్థానిక వినియోగాన్ని పెంచడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చేసేందుకు రాష్ట్రంలోని ప్రతి నివాస ప్రాంతాల్లో మత్స్య ఉత్పత్తుల రిటైల్ అవుట్లెట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆక్వా రైతులకు రూ.2,377.52 కోట్ల సబ్సిడీ వాస్తవంగా యూనిట్ విద్యుత్ రూ.6.89 ఉండగా ఆక్వాజోన్ పరిధిలోని 10 ఎకరాల విస్తీర్ణంలో చెరువులకు యూనిట్ రూ.1.50, జోన్ వెలుపల ఉన్న చెరువులకు రూ.3.86 చొప్పున విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. ఈ విధంగా మూడేళ్లలో రూ.2,377.52 కోట్ల విద్యుత్ సబ్సిడీ ఇచ్చారు. వాస్తవాలు ఇలా ఉంటే.. రొయ్య రైతులు విలవిల అంటూ ఆక్వారంగంలో ఉన్న వారిని ఆందోళనకు గురిచేసేలా ఈనాడు తప్పుడు కథనాలు రాస్తుండడం పట్ల ఆక్వా రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ చర్యలు చూసి ఓర్వలేకనే ‘ఈనాడు విలవిల’లాడిపోతోందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో రొయ్యల ధరలు ఇలా.. కౌంట్ ధర (రూపాయల్లో) 100 210 90 220 80 240 70 250 60 270 50 290 40 340 30 380 కష్టకాలంలో ప్రభుత్వం మేలు మరిచిపోలేం నేను 30 ఎకరాల్లో రొయ్యలు సాగుచేస్తున్నా. 20టన్నుల ఉత్పత్తి వచ్చింది. ఇటీవల సాధికారత కమిటీ నిర్ణయించిన రేట్ల ప్రకారం 30 కౌంట్ రూ.380 చొప్పున 6 టన్నులు, 40 కౌంట్ రూ.340 చొప్పున 5 టన్నులు, 50 కౌంట్ రూ.290 చొప్పున 3 టన్నులు, 60 కౌంట్ రూ.270 చొప్పున 6 టన్నులు విక్రయించా. గతంలో ఎన్నడూ ఇలాంటి కష్టకాలంలో ప్రభుత్వం అండగా నిలిచిన దాఖలాలు లేవు. ప్రభుత్వమే దగ్గరుండి మరీ ప్రాసెసింగ్ కంపెనీల ద్వారా కొనుగోలు చేసి మద్దతుధర లభించేలా చేసింది. అంతర్జాతీయంగా ధరలు పతనమైనప్పటికీ ప్రభుత్వం దగ్గరుండి మరీ అమ్మించడంతో రైతులు గట్టెక్కగలుగుతున్నారు. – త్సవటపల్లి నాగభూషణం, ఆక్వారైతు, చెయ్యేరు, కోనసీమ అంబేద్కర్ జిల్లా ప్రభుత్వం అండగా నిలుస్తోంది అంతర్జాతీయ మార్కెట్ ఒడుదొడుకుల నేపథ్యంలో కౌంట్ ధరలు గణనీయంగా తగ్గినప్పటికీ, రాష్ట్రంలో మాత్రం రైతులకు నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సాధికారత కమిటీ ద్వారా రైతులను ఆదుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంటే రొయ్య రైతులను ప్రభుత్వం పట్టించుకోవడంలేదంటూ ఆరోపణలు చేయడం సరికాదు. ఈనాడు కథనంలో చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదు. – కె.కన్నబాబు, రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ -
నిర్దేశించిన ధరలకు రొయ్యలు కొనాల్సిందే
సాక్షి, అమరావతి: ‘ఆక్వా రైతులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. 100 కౌంట్ రొయ్యలకు కనీసం రూ.210 తగ్గకుండా చెల్లించాల్సిందే. ఇదే రీతిలో మిగిలిన కౌంట్ ధరలు కూడా చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు కొనుగోలు చేయాల్సిందే. ఇష్టమొచ్చినట్టు రొయ్యల ధరలు తగ్గిస్తే చర్యలు తప్పవు’ అని ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకులను ఆక్వా సాధికార కమిటీ హెచ్చరించింది. ఆక్వా రైతులు, ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వాహకులు, సీడ్, ఫీడ్ కంపెనీల ప్రతినిధులతో ఏపీఐఐసీ భవనంలో గురువారం ఆక్వా సాధికార కమిటీ భేటీ జరిగింది. రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ రైతులకు అండగా నిలిచే విషయంలో ప్రాసెసింగ్ కంపెనీలు పెద్ద మనసు చాటుకోవాలని కోరారు. కనీసం10 రోజులపాటు ఇవే ధరలు కొనసాగాలని, ప్రభుత్వం రోజూ కొనుగోళ్లు, ధరలను సమీక్షిస్తుందని చెప్పారు. ధరల విషయంలో ప్రతి 10 రోజులకు ఒకసారి సమావేశమై తగిన నిర్ణయాలు తీసుకుందామని సూచించారు. మార్కెట్ బాగోలేదనే సాకుతో ధరలను తగ్గిస్తామంటే సహించేది లేదన్నారు. ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) వైస్ చైర్మన్ వడ్డి రఘురామ్ మాట్లాడుతూ రైతులను గందరగోళపరిచేలా కంపెనీలు వ్యవహరించొద్దని హితవు పలికారు. ధరలు, మార్కెట్ పరిస్థితులపై ప్రతి రోజు మానిటరింగ్ చేస్తున్నామని చెప్పారు. రైతుల వద్ద ఉన్న సరుకును పూర్తి స్థాయిలో నిర్దేశించిన ధరలకు కొనుగోలు చేయాలని కోరారు. కొనుగోళ్ల విషయంలో రైతుల నుంచి ఫిర్యాదులొస్తే చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం వెనుకాడదన్నారు. జాతీయ రొయ్య రైతుల సంఘం అధ్యక్షుడు ఐపీఆర్ మోహన్‌రాజు మాట్లాడుతూ ప్రాసెసింగ్ కంపెనీలను ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదని, వాళ్లెంత కొనుగోలు చేయగలరో ముందే చెబితే ఆ మేరకే ఇక నుంచి ఉత్పత్తి చేస్తామని చెప్పారు. మార్కెట్ లేనప్పుడు ఎందుకు 80 బిలియన్ల సీడ్, 16 లక్షల టన్నుల ఫీడ్ ఉత్పత్తి చేస్తున్నారని ప్రశ్నించారు. యూఎస్ మార్కెట్ ఆగిపోయిందని, చైనా మార్కెట్ ఓపెన్ కాలేదని, అందువల్లే పూర్తి స్థాయిలో కొనుగోలు చేయలేకపోతున్నామని పలువురు ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వాహకులు సాధికార కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. అయినా రైతుల వద్ద ఉన్న సరుకును ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. మత్స్యశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, కమిషనర్ కన్నబాబు పాల్గొన్నారు. ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు వద్దు ప్రభుత్వంతో చర్చల అనంతరం నాలుగు నెలలుగా రాష్ట్రంలో రొయ్యల మేతల్ని తగ్గింపు ధరలకు సరఫరా చేస్తున్నామని రొయ్యల మేత తయారీదారుల సంఘం పేర్కొంది. ముడి సరుకుల ధరలు పెరిగినప్పటికీ రొయ్యల రైతుల అభ్యర్థన, ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. కానీ, రొయ్యల మేత తయారీదారుల నుంచి రూ.5 వేల కోట్లు వసూలు చేయడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కొందరు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని స్పష్టం చేసింది. రాష్ట్రంలో రొయ్యల మేత తయారీ పరిశ్రమ ఏడాది టర్నోవరే రూ.5 వేల కోట్లు ఉంటుందని తెలిపింది. అలాంటిది ప్రభుత్వానికి రూ.5 వేల కోట్లు లంచంగా ఇవ్వనున్నారని కొందరు రాజకీయ నేతలు ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొంది. -
Prawns Price: నిలకడగా రొయ్యల ధరలు
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల ధరలు నిలకడగా ఉన్నప్పటికీ కోవిడ్ పరిస్థితులను ఆసరాగా తీసుకుని తక్కువ ధరలకు రొయ్యలు కొనుగోలు చేస్తున్న దళారులు, వ్యాపారులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. దళారుల ఉచ్చులో పడి అయినకాడికి అమ్ముకోవద్దని ఆక్వా రైతులను కోరుతోంది. సీ ఫుడ్ ఎగుమతిదారుల అసోసియేషన్ నిర్ధారించిన ధరలకే అమ్ముకోవాలని సూచిస్తోంది. రాష్ట్రంలో మొదటి పంట ప్రస్తుతం మార్కెట్లోకి వస్తోంది. రోజుకు ఐదు నుంచి ఆరువేల టన్నుల రొయ్యలు జూన్ వరకు మార్కెట్‌కు వస్తాయి. ప్రస్తుతం కౌంట్‌ను బట్టి కిలో రూ.200 నుంచి రూ.340 వరకు ధర పలుకుతోంది. రోజుకు 15–20 టన్నుల చొప్పున కృష్ణపట్నం, విశాఖ, కాకినాడ పోర్టుల నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్‌ను సాకుగా చూపి మార్కెట్లో రేటు పడిపోయిందని, లాక్డౌన్ విధిస్తే ఎగుమతులు నిలిచిపోతాయంటూ కొంతమంది దళారులు, వ్యాపారులు దుష్ప్రచారం చేస్తూ రైతుల వద్ద కిలోకి రూ.20 నుంచి రూ.30 వరకు తగ్గించి కొంటున్నారు. దీంతో దళారులు, వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరించాలని సర్కార్ నిర్ణయించింది. ఇదే సమయంలో ఆందోళనకు గురికాకుండా రైతులను అప్రమత్తం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. మీడియా ద్వారా ధరలపై విస్తృత ప్రచారం: కమిషనర్ కన్నబాబు ప్రభుత్వ ఆదేశాల మేరకు మత్స్యశాఖ కమిషనర్ కె.కన్నబాబు ఆదివారం ఉత్పత్తిదారులు, ఎగుమతిదారులు, కోస్తా జిల్లాల ఆక్వా రైతులు, మత్స్యశాఖాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉత్పత్తిదారులు, ఎగుమతిదారులు కౌంట్ వారీగా నిర్ధారించే ధరలను మీడియా ద్వారా సీఫుడ్ ఎగుమతిదారుల అసోసియేషన్ విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. తక్కువ ధరలకు కొనుగోలు చేసే వ్యాపారుల సమాచారం జిల్లా మత్స్యశాఖాధికారులకు ఇవ్వాలన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు నిలకడగా ఉన్నాయని, తగ్గే అవకాశాలు ఎంతమాత్రం లేవని స్పష్టం చేశారు. -
తస్సాదియ్యా.. రొయ్య..
రైతులకు డాలర్ల పంట పండించిన రొయ్యలు.. కొన్నేళ్లుగా ఆటు పోటు ధరలతో కుదేలయ్యారు. తాజాగా వారం రోజులుగా రొయ్యల ధరలు ఊపందుకుంటున్నాయి. గత వారంతో పోల్చితే ప్రస్తుతం అన్ని కౌంట్లపై టన్నుకు రూ.30 వేలు పెరిగింది. పెరుగుతున్న పెట్టుబడుల వ్యయం, నిలకడలేని ధరలతో పాటు తీవ్ర వర్షాభావ పరిస్థితులతో సాగు విస్తీర్ణం సగానికి తగ్గింది. ఈ నేపథ్యంలో రొయ్యల ధరలు ఆశాజనకంగా ఉండడంతో రైతులు తస్సాదియ్యా.. రొయ్య.. అంటున్నారు. ప్రస్తుతం ధరలు చూసి సాగుకు దూరంగా ఉన్న రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండడంతో సాగుకు సమాయత్తం అవుతున్నారు. సాక్షి, గూడూరు(నెల్లూరు): జిల్లాలోని 12 తీరప్రాంత మండలాల్లో సుమారు 1.25 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది. ధరలు నిలకడగా లేకపోవడం, వైరస్లు విజృంభించడం, వాతావరణం ప్రతికూలంగా ఉండడంతో ఈ సీజన్లో సాగు విస్తీర్ణం సగానికి తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 60 వేల ఎకరాల్లోనే సాగు చేపట్టారు. ఒకప్పుడు సాగు వ్యయం తక్కువతో డాలర్ల పంట పండింది. ప్రస్తుతం రొయ్యల సాగు వ్యయం గణనీయంగా పెరిగింది. కానీ ధరలు మాత్రం నిలకడగా లేక రైతాంగం నష్టాలపాలవుతున్నారు. 2013 తర్వాత రొయ్యల ధరలు ఆశించిన మేర లేకపోవడం, నిలకడగా ఉండకపోవడంతో సాగు విస్తీర్ణం తగ్గుతూ వచ్చింది. సొంత గుంతలున్న రైతులు ప్రత్యామ్నాయం లేక సాగు కొనసాగిస్తుంటే, లీజుదారులు పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనే ఆశతో సాగు పోరాటం చేస్తున్నారు. వెంటాడిన వైరస్లు నాసిరకం సీడ్‌తో రొయ్యలను వైరస్లు వెంటాయి. వైట్‌గట్, ఈహెచ్‌పీ అనే ప్రోటోజోవా తాకిడితో పెరుగుదల ఆగిపోవడంతో కౌంట్‌కు చేరని పరిస్థితి. వైట్ పీకల్, విబ్రియో వంటి వైరస్లు సోకడంతో కూడా సాగు వ్యయం బాగా పెరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఫీడ్ ధరలు, ప్రోటిన్లు, కెమికల్స్ ధరలు పెరగడంతో పెట్టుబడి వ్యయం గణనీయంగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో నిలకడ లేని ధరలతో రైతులు తీవ్రంగా నష్టాలపాలవుతున్నారు. ఈ సీజన్లో వరద తాకిడి ఉన్న తీరప్రాంత మండలాల్లో రొయ్యల సాగు గణనీయంగా పడిపోయింది. జిల్లాలోని కొన్ని మండలాలతో పాటు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో సైతం రొయ్యల ధరలు అంతంత మాత్రంగానే ఉండడంతో రొయ్యల గుంతల్లో చేపలు వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చినట్లు తెలుస్తోంది. చిగురిస్తున్న ఆశలు ఆక్వా సాగు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాలు, ధరల పెరుగుదల, వాతావరణం అనుకూలతలు వెరసి సాగుపై ఆశలు చిగురిస్తున్నాయి. సాగులో ప్రధానంగా విద్యుత్ వినియోగం ఖర్చులు రైతులకు పెనుభారంగా మారాయి. గతంలో యూనిట్ విద్యుత్ చార్జీ రూ.3.80 ఉండేది. ఆక్వా రైతులను కష్టాలను పాదయాత్రలో తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యుత్ చార్జీలను యూనిట్ రూ.1.50 తగ్గించారు. ఇదే సమయంలో ఈ ఏడాది ప్రస్తుత సీజన్లో ధరలు ఆశాజనకంగా పెరిగాయి. ప్రస్తుతం వాతావరణం కూడా అనుకూలంగా ఉండడంతో మంచి దిగుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆశిస్తున్నారు. సాగు తగ్గిపోవడంతోనే ధరలు పెరిగాయి వర్షాలు లేకపోవడంతో నీటిలో సెలినిటీ శాతం బాగా పెరిగిపోతోంది. ఈ వాతావరణానికి సీడ్ సర్వైవల్ తగ్గిపోతోంది. వరద తాకిడి ఉన్న ప్రాంతాల్లో సాగు చేపట్టలేదు. ఇలాంటి పరిస్థితుల్లో రొయ్యల దిగుబడులు తగ్గాయి. ఉత్పత్తి తక్కువగా ఉండడం, డిమాండ్ అధికంగా ఉండడంతో ధరలు పెరిగాయి. – ఎస్కే నూర్ అహ్మద్, దుగరాజపట్నం, వాకాడు మండలం -
వెనామీ రైతు విలవిల
సాక్షి, ఒంగోలు/ వేటపాలెం: ఒకనాడు సిరులు కురిపించిన వెనామీ రొయ్య ప్రస్తుతం రైతుల కంట కన్నీరు తెప్పిస్తోంది. అధిక పెట్టుబడితో రంగంలోకి దిగిన రైతుకు కనీస ఖర్చులు కూడా రాకుండా చేస్తోంది. వ్యవసాయంలో ఆటుపోట్లు ఎదుర్కొన్న అనేక మంది రైతులు ఆ నష్టాలను పూడ్చుకోవాలన్న ఉద్దేశంతో ఈ రంగంలోకి దిగి చేతులు కాల్చుకున్నారు. చివరకు వాటిని సాగు చేయలేక చెరువులను ఖాళీగా వదిలేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో ఖాళీ గుంటలు రైతు నష్టాలకు సాక్ష్యంగా నిలిచాయి. కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ అనుమతితో జిల్లాలో 12 హేచరీలు రొయ్య పిల్లల్ని అభివృద్ధి చేస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో మూడు వేల హెక్టార్లలో దాదాపు 1500 మంది రైతులు వెనామీ రొయ్యను అధికారికంగా సాగు చేస్తున్నారు. మరో 500 హెక్టార్లలో అనధికారికంగా సాగవుతోంది. ఆటుపోట్లు... వెనామీ రొయ్య రైతులు గతంలో ఎన్నడూ లేనివిధంగా తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కొంటున్నారు. చెరువులోకి పిల్లలను వదిలే క్రమం నుంచి వాటిని హార్వెస్టింగ్ చేసే వరకు భరించాల్సిన ఖర్చులు అమాంతంగా పెరిగిపోవడం, దిగుబడులు మాత్రం పూర్తిగా పడిపోవడంతో ఆక్వారైతుల పరిస్థితి దయనీయమైంది. భారీగా పెరిగిన పెట్టుబడులు.. రొయ్యల చెరువుల లీజులు గణనీయంగా పెరిగాయి. గత ఏడాది ఎకరా లక్షరూపాయలు పలకగా ప్రస్తుతం వేసవి పంటలు లాభాలు వస్తాయనే నమ్మకంతో లీజులు ఎకరాకి రూ.1.80 లక్షలు పెట్టి చెరువులు చేజిక్కించుకున్నారు. దీంతో పాటు రొయ్యపిల్లలు ధరలు 50 శాతం పెరిగాయి. = జనవరిలో రొయ్యపిల్ల ఖరీదు 40 పైసలు పలకగా ప్రస్తుతం 80 పైసలు పెరిగింది. వీటితో రొయ్యలకు అందించే దాణా ధరలు టన్నుకు రూ.6 వేల పెరిగాయి. గత ఏడాది టన్ను దాణా రూ.60 వేలు పలకగా ప్రస్తుతం రూ.66 పెరిగింది. = రొయ్యలకు వాడే మందులు 25 శాతం పెరిగాయి. = హెక్టారు సాగుకు దాదాపు రూ.12 లక్షలు పెట్టుబడి పెడుతుండగా, దిగుబడులు తగ్గి రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. దిగుబడిపై ఉష్ణోగ్రతల ప్రభావం: = జిల్లాలో రోజురోజుకూ తీవ్రమవుతున్న ఉష్ణోగ్రతలు కూడా వెనామీ సాగుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎకరా చెరువులో లక్ష పిల్లల వెనామీ సీడ్ పోస్తే.. అవి 40 కౌంట్ సైజ్‌కు వచ్చేసరికి 50 శాతం మాత్రమే మిగులుతున్నాయి. మిగతా సీడ్ ఎదుగుదల లేకుండానే వృథా అవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేని వెనామీ రొయ్య 15 గ్రాములు బరువు పెరిగేసరికి చనిపోతున్నాయి. వాటిని బతికించుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. వేసవి సాగును మార్చి నెలలో దాదాపు 20 శాతం మంది ప్రారంభించారు. ప్రస్తుతం సాగు ప్రారంభించిన వాటిల్లో 80 శాతం చెరువుల్లోని రొయ్యలు వైరస్ బారిన పడ్డాయి. ఎండవేడి విపరీతంగా పెరిగిపోవడం వంటి వాతావరణ మార్పులతో పాటు రొయ్యపిల్లల ఎన్నికల్లో తేడాల కారణంగా అవి తక్కువ కాలంలోనే వైరస్‌బారిన పడుతున్నాయి. పడిపోయిన రొయ్యల ధరలు.. వర్షాకాలంతో పోలిస్తే రొయ్యల ధరలు భారీగా పడిపోయాయి. జనవరి నెలలో 30 కౌంటు రొయ్యలు ధర కిలో రూ.660 పలకగా ప్రస్తుతం అదే రకం రొయ్యల ధరలు రూ.500 పడిపోయింది. 40 కౌంటు రొయ్యలు జనవరిలో రూ.560 ఉంది. ప్రస్తుతం అదే రకం రూ.370కి తగ్గింది. 50 కౌంటు రకం జనవరిలో రూ.450 ఉంది. ప్రస్తుతం అదే రకం రూ.300 కు దిగజారింది. రైతులను పీడిస్తున్న కరెంటు కోతలు... = అప్రకటిత కరెంటు కోతలతో ఆక్వా రైతులు విలవిల్లాడుతున్నారు. కరెంటు కోతల కారణంగా డీజిల్ ఇంజన్లను వినియోగిస్తున్నారు. దీంతో ఖర్చు భారీగా పెరిగిపోయింది. = రైతులకు క రెంటుకి యూనిట్‌కి రూ.6 ఖర్చు కాగా అదే డీజిల్ వాడకంతో రూ.19 ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ వేసవిలో ఆక్వారైతులు భారీ నష్టాలు చవిచూశారు. = ఆయిల్ ఇంజిన్లు పెట్టుకోవడం, జనరేటర్ల సాయంతో ఒక్కో హెక్టారుకు రూ.2.50 లక్షలు వెచ్చించే పరిస్థితి వచ్చింది. = ఆక్వా రంగాన్ని కూడా వ్యవసాయం కింద పరిగణించి విద్యుత్ టారిఫ్ తగ్గిస్తే కొంతమేర రైతులు తట్టుకోగలుగుతారనే అభిప్రాయం వినిపిస్తోంది. అలాకాని పక్షంలో వ్యవసాయ రైతు మాదిరిగానే భవిష్యత్‌లో వెనామీ రైతులు కూడా అప్పుల బాధతో ఆత్మహత్యల బాట పట్టే ప్రమాదం పొంచిఉందని రైతుసంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.