సాక్షి, అమరావతి: ‘ఆక్వా రైతులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. 100 కౌంట్ రొయ్యలకు కనీసం రూ.210 తగ్గకుండా చెల్లించాల్సిందే. ఇదే రీతిలో మిగిలిన కౌంట్ ధరలు కూడా చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు కొనుగోలు చేయాల్సిందే. ఇష్టమొచ్చినట్టు రొయ్యల ధరలు తగ్గిస్తే చర్యలు తప్పవు’ అని ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకులను ఆక్వా సాధికార కమిటీ హెచ్చరించింది.
ఆక్వా రైతులు, ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వాహకులు, సీడ్, ఫీడ్ కంపెనీల ప్రతినిధులతో ఏపీఐఐసీ భవనంలో గురువారం ఆక్వా సాధికార కమిటీ భేటీ జరిగింది. రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ రైతులకు అండగా నిలిచే విషయంలో ప్రాసెసింగ్ కంపెనీలు పెద్ద మనసు చాటుకోవాలని కోరారు. కనీసం10 రోజులపాటు ఇవే ధరలు కొనసాగాలని, ప్రభుత్వం రోజూ కొనుగోళ్లు, ధరలను సమీక్షిస్తుందని చెప్పారు.
ధరల విషయంలో ప్రతి 10 రోజులకు ఒకసారి సమావేశమై తగిన నిర్ణయాలు తీసుకుందామని సూచించారు. మార్కెట్ బాగోలేదనే సాకుతో ధరలను తగ్గిస్తామంటే సహించేది లేదన్నారు. ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ అథారిటీ (అప్సడా) వైస్ చైర్మన్ వడ్డి రఘురామ్ మాట్లాడుతూ రైతులను గందరగోళపరిచేలా కంపెనీలు వ్యవహరించొద్దని హితవు పలికారు. ధరలు, మార్కెట్ పరిస్థితులపై ప్రతి రోజు మానిటరింగ్ చేస్తున్నామని చెప్పారు.
రైతుల వద్ద ఉన్న సరుకును పూర్తి స్థాయిలో నిర్దేశించిన ధరలకు కొనుగోలు చేయాలని కోరారు. కొనుగోళ్ల విషయంలో రైతుల నుంచి ఫిర్యాదులొస్తే చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం వెనుకాడదన్నారు. జాతీయ రొయ్య రైతుల సంఘం అధ్యక్షుడు ఐపీఆర్ మోహన్‌రాజు మాట్లాడుతూ ప్రాసెసింగ్ కంపెనీలను ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదని, వాళ్లెంత కొనుగోలు చేయగలరో ముందే చెబితే ఆ మేరకే ఇక నుంచి ఉత్పత్తి చేస్తామని చెప్పారు.
మార్కెట్ లేనప్పుడు ఎందుకు 80 బిలియన్ల సీడ్, 16 లక్షల టన్నుల ఫీడ్ ఉత్పత్తి చేస్తున్నారని ప్రశ్నించారు. యూఎస్ మార్కెట్ ఆగిపోయిందని, చైనా మార్కెట్ ఓపెన్ కాలేదని, అందువల్లే పూర్తి స్థాయిలో కొనుగోలు చేయలేకపోతున్నామని పలువురు ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వాహకులు సాధికార కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. అయినా రైతుల వద్ద ఉన్న సరుకును ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. మత్స్యశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, కమిషనర్ కన్నబాబు పాల్గొన్నారు.
ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు వద్దు
ప్రభుత్వంతో చర్చల అనంతరం నాలుగు నెలలుగా రాష్ట్రంలో రొయ్యల మేతల్ని తగ్గింపు ధరలకు సరఫరా చేస్తున్నామని రొయ్యల మేత తయారీదారుల సంఘం పేర్కొంది. ముడి సరుకుల ధరలు పెరిగినప్పటికీ రొయ్యల రైతుల అభ్యర్థన, ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. కానీ, రొయ్యల మేత తయారీదారుల నుంచి రూ.5 వేల కోట్లు వసూలు చేయడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కొందరు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని స్పష్టం చేసింది.
రాష్ట్రంలో రొయ్యల మేత తయారీ పరిశ్రమ ఏడాది టర్నోవరే రూ.5 వేల కోట్లు ఉంటుందని తెలిపింది. అలాంటిది ప్రభుత్వానికి రూ.5 వేల కోట్లు లంచంగా ఇవ్వనున్నారని కొందరు రాజకీయ నేతలు ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment