సాక్షి, అమరావతి: కళ్ల ముందు వాస్తవాలు స్పష్టంగా కనిపిస్తున్నా అవేవీ తెలీనట్లు కళ్లున్న కబోదిలా వ్యవహరిస్తూ అబద్ధాలను అడ్డగోలుగా అచ్చేయడంలో ఈనాడు రామోజీకే చెల్లింది. పైపెచ్చు పచ్చ పార్టీని జాకీలు పెట్టి మరీ పైకి లేపేందుకు తెగ ప్రయాసపడుతోంది. ఇందులో భాగంగా తన ప్రతి కథనంలోనూ గత ప్రభుత్వాన్ని ఆహా ఓహో అంటూ కీర్తించేందుకు నానాపాట్లు పడుతోంది. పత్రికా విలువలు ఎలాగూ లేవు.. కనీసం ప్రజలు నవ్వుతారనే ఇంగిత జ్ఞానం కూడా లేదు.
ఆక్వా రైతులకు సబ్సిడీ ఇస్తానని మోసంచేసి, ఎన్నికలు సమీపించిన వేళ కొన్నిరోజులు మాత్రమే సబ్సిడీ ఇస్తున్నట్లు నటించి ఆ సొమ్మునూ డిస్కంలకు ఎగ్గొట్టిన గత టీడీపీ ప్రభుత్వ భాగోతాలను ఆ పత్రిక నిస్సిగ్గుగా దాచిపెట్టింది. ‘‘ఆక్వారైతు బరువయ్యాడా’’.. అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఇష్టారాజ్యంగా విషం కక్కింది.
నిజానికి.. అధికారంలోకి వచ్చిన నాటి నుంచే సబ్సిడీ ఇచ్చి ఆక్వా రైతులను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆదుకుంది. ఆక్వా రైతేకాదు.. రాష్ట్రంలోని ఏ రైతూ తమకు బరువు కాదని, వారందరి సంక్షేమం తమ బాధ్యతని ప్రభుత్వం తన చేతల ద్వారా చాటిచెబుతోంది. పచ్చ పత్రిక రాయని వాస్తవాలను ఇంధన శాఖ శనివారం మీడియాకు వెల్లడించింది. ఆ వివరాలివీ..
ఆరోపణ: ఆక్వా విద్యుత్ సర్వీసులకు యూనిట్ ధరను రూ.7 నుంచి రూ.2కు తగ్గించిన గత ప్రభుత్వం..
వాస్తవం: గత ప్రభుత్వం 2014 నుంచి 2016 వరకు ఆక్వా సాగుకు స్లాట్ల ఆధారంగా విద్యుత్ టారిఫ్‌ను యూనిట్‌కు రూ.4.63 నుంచి రూ.7.00 వరకూ వేసి అత్యధిక భారం మోపింది. 2016 నుంచి 2018 మే వరకూ యూనిట్ రేటు రూ.3.86 చొప్పున సరఫరా చేసింది. ఇక ఎన్నికలకు కొద్దినెలల ముందు యూనిట్‌కు రూ.2 చొప్పున ఇచ్చింది.
అందుకోసం ఇవ్వాల్సిన సబ్సిడీ భారం రూ.312.05 కోట్లను విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు చెల్లించకుండా బాకీ పెట్టింది. దానిని ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రస్తుత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం భరించాల్సి వచ్చింది. అంటే.. గత ప్రభుత్వం ఆక్వా రైతులకు రాయితీతో కూడిన విద్యుత్ సరఫరా చేయలేదనేది స్పష్టంగా తెలుస్తోంది. కానీ, ఈనాడు మాత్రం ఈ నిజాన్ని దాచేసి, గత ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చిందని ఎడాపెడా రాసేసింది.
ఆరోపణ: అర్హుల గుర్తింపు పేరుతో రాయితీ నిలిపేశారు..
వాస్తవం: ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జూలై 2019 నుండి అన్ని ఆక్వా కనెక్షన్లకు యూనిట్ రూ.1.50 పైసలకే విద్యుత్ సరఫరా చేస్తోంది. అప్పటి నుంచి మార్చి 2023 వరకూ ప్రతి యూనిట్‌పై రూ.2.36 పైసలు చొప్పున మొత్తం రూ.2,792.88 కోట్లు విద్యుత్ సబ్సిడీ భారం మోస్తూ ఆక్వా రైతులను ఆదుకుంటోంది. 2022 జూలై నుంచి ఆక్వా కల్చర్ డెవలప్‌మెంట్ జోన్లలో ఆక్వాసాగు చేస్తున్న రైతులకు యూనిట్‌ను రూ.1.50 పైసలకు విద్యుత్ సరఫరా చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
నాన్–ఆక్వా జోన్లలోనూ అర్హత కలిగిన ఆక్వా జోన్లను గుర్తించి ఆయా చెరువులను ఆక్వా జోన్లుగా పరిగణిస్తూ జిల్లా గెజిట్లలో నోటిఫై చేసింది. తద్వారా మొత్తం ఈ సర్వే ద్వారా గుర్తించిన 4.66 లక్షల ఎకరాల ఆక్వా సాగులో 4.22 లక్షల ఎకరాలను ఆక్వా జోన్లలో చేరుస్తూ నోటిఫై చేసింది. వీటిలో మొత్తం 63,754 ఆక్వా కనెక్షన్లలో 46,445 ఆక్వా కనెక్షన్లను అర్హత కలిగినవిగా గుర్తించి ఆ కనెక్షన్లు కలిగిన ఆక్వా రైతులకు యూనిట్‌ను రూ.1.50 పైసలకు విద్యుత్ సరఫరా చేస్తోంది.
యూనిట్ సర్వీస్ ధర రూ.6.89 పైసలకు పెరిగిన నేపథ్యంలో ఆక్వా, నాన్–ఆక్వా జోన్లలో ఉన్న 10 ఎకరాలపైన ఆక్వా చెరువులు కలిగి ఉన్న అధిక సాగు రైతులకు చెందిన 17,309 కనెక్షన్లకు యూనిట్‌ను రూ.3.85 పైసలకు విద్యుత్ సరఫరా చేస్తోంది. ఆక్వా రైతులకు రాయితీపై విద్యుత్ సరఫరా చేస్తున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి. అసలు ఇవ్వడంలేదని ఎలా రాస్తారు రామోజీ?
ఆరోపణ: అధికారంలోకి వచ్చాక ఆక్వా రైతుల గోడు పట్టించుకోవడంలేదు..
వాస్తవం: ఆక్వా రైతులు తమ రొయ్య ఉత్పత్తులను అంతర్జాతీయ విపణిలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చేది. కానీ, ఆ అవసరంలేకుండా రాష్ట్ర ప్రభుత్వం సాధికార కమిటీ ద్వారా వివిధ కౌంట్‌ల రొయ్యలకు కనీస కొనుగోలు ధరలను నిర్ణయించింది. ఆ ధరలకు తగ్గకుండా కొనుగోలు చేసేట్లుగా చర్యలు తీసుకుని అమలుచేస్తోంది. రైతుభరోసా (ఆర్బీకే) కేంద్రాల్లో కొనుగోలు ధరల పట్టిక, కాల్ సెంటర్ నెంబర్‌ను అందుబాటులో ఉంచింది.
ఏ రైతుకైనా రొయ్యల అమ్మకంలో ఇబ్బంది ఎదురైతే తమ సమస్యలను, ఫిర్యాదులను ప్రభుత్వానికి తెలియజేసేలా ఏర్పాటుచేసింది. రొయ్య మేత ధరలను కూడా మేత ఉత్పత్తిదారులు ఇష్టానుసారం పెంచకుండా, సంప్రదింపుల ద్వారా మాత్రమే పెంచడానికి అనుమతి తీసుకునేలా కట్టుబాటు విధించింది. ఆక్వాసాగు రైతుల ప్రయోజనం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాలన్నీ పట్టించుకోవడంలో భాగం కాదా రామోజీ? మీ కళ్లకు ఇవేమీ ఎందుకు కనిపించడంలేదు??
Fact Check: ఆక్వా రైతు బరువు కాదు.. బాధ్యత
Published Sun, Jun 4 2023 2:20 AM | Last Updated on Sun, Jun 4 2023 7:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment