సాక్షి, అమరావతి: ఈ రామోజీరావు పిచ్చి పతాకస్థాయికి చేరిపోయింది. దానికి తగ్గట్టే ‘ఈనాడు’ రాతలు కొత్త లోతులను తాకుతున్నాయి. అసలు 6 లక్షల మిలియన్ టన్నులంటే అర్థం తెలుసా రామోజీరావ్? అసలు ఇండియాలోని పోర్టులన్నీ కలిపినా ఆ స్థాయిలో సరకు రవాణా జరుగుతుందా? అసలు 6 లక్షల మిలియన్ టన్నులంటే ఎంత?... అక్షరాలా ఆరు లక్షల కోట్ల టన్నులు!!. పైపెచ్చు వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక అదేమో లక్ష మిలియన్ టన్నులకు.. అంటే లక్ష కోట్ల టన్నులకు పడిపోయిందట!!. మతిపోయిందా రామోజీరావ్? ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ద్వేషంతో అసలు నీ పత్రికలో ఏం రాస్తున్నావో తెలుస్తోందా? నీ రాతలతో పోతున్నది ఈ రాష్ట్ర ప్రతిష్ఠ కాదు... నీ పత్రిక పరువే!!.
కృష్ణపట్నం పోర్టులో ప్రస్తుతం జరుగుతున్న మొత్తం సరకు రవాణా 57.8 మిలియన్ టన్నులు. అసలు దేశంలోని మొత్తం మేజర్ పోర్టులన్నీ కలిపి గతేడాది చేసిన సరకు రవాణా 795 మిలియన్ టన్నులు. కానీ రామోజీరావు మాత్రం ఒక్క కృష్ణపట్నంలోనే సరకు రవాణా 6 లక్షల మిలియన్ టన్నుల నుంచి లక్ష మిలియన్ టన్నులకు పడిపోయిందని చేతికొచ్చిన దౌర్భాగ్యపు రాతలు రాసి పడేశారు. నిజానికి మూడేళ్ల కిందట కృష్ణపట్నం పోర్టులో 3.81 కోట్ల టన్నులుగా ఉన్న వార్షిక సరకు రవాణా ఇపుడు 5.78 కోట్ల టన్నులకు పెరిగింది. గతేడాదితో చూసినా... 4.82 కోట్ల టన్నుల నుంచి 5.78 కోట్ల టన్నులకు చేరి కొత్త రికార్డు సృష్టించింది. దేశంలో కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌ల నుంచి ఎగుమతులు క్షీణిస్తే... ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఈ ఏడాది తొలి ఆరునెలల్లో 2.77 శాతం వృద్ధి నమోదయింది. అదీ.. ఆంధ్రప్రదేశ్ ఘనత. ఎల్లో వైరస్‌తో కళ్లు మూసుకుపోయిన రామోజీరావుకు ఇవేమీ కనిపించవు మరి.
రాష్ట్రంలో పారిశ్రామిక రంగం తిరోగమనంలో ఉంటే కృష్ణపట్నం పోర్టును నిర్వహిస్తున్న అదానీ గ్రూపు గంగవరం పోర్టులో కొత్తగా రెండు కార్గో టెర్మినళ్లను ఎందుకు నిర్మిస్తుంది? సరుకు రవాణాలో కృష్ణపట్నం పోర్టు అంతకంతకూ పురోగమిస్తోందని సాక్షాత్తూ కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ లేదా ఏపీ మారిటైమ్ బోర్డు గణాంకాలే చెబుతున్నాయి కదా? కృష్ణపట్నంలో సరకు రవాణా ఏటేటా రెండంకెల వృద్ధిని నమోదు చేస్తూ వస్తుంటే... సరుకు రవాణా పడిపోయిందంటూ అబద్ధాలాడటం బహుశా... రామోజీకి మినహా ప్రపంచంలో మరెవరికీ సాధ్యం కాదేమో. నిజానికి సరుకు రవాణాపై రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వస్తున్న రాయల్టీనైనా చూడాలి కదా? 2020–21లో రాయల్టీగా రూ.46.06 కోట్లు వస్తే 2023–24లో అది రూ.88.91 కోట్లకు చేరుతోంది. మరి ఇవన్నీ ఏం చెబుతున్నాయో దిగజారుడు రామోజీరావే అర్థం చేసుకోవాలి.
రూ.54,539 కోట్ల మేర పెరిగిన ఎగుమతులు
రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల వాతావరణం దెబ్బతింటే సులభతర వాణిజ్య ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ వరుసగా మూడేళ్ల నుంచి మొదటి స్థానంలో ఎలా ఉంటుంది? పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతే ఏపీ పోర్టుల నుంచి సరుకు రవాణా నాలుగేళ్లలో రూ.54,539 కోట్లు అదనంగా ఎలా పెరుగుతుంది? 2019–20లో రూ.1,04,829.00 కోట్లుగా ఉన్న రాష్ట్ర వాణిజ్య ఎగుమతులు విలువ 2022–23 నాటికి రూ.1,59,368.02 కోట్లకు పెరగటం నిజం కాదా? ఇవన్నీ కేంద్ర వాణిజ్య శాఖ అధికారికంగా చెబుతున్న లెక్కలే కదా? ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఎగుమతులు తిరోగమనంలో ఉండగా తొలి ఆర్నెల్లలో రాష్ట్ర ఎగుమతులు మాత్రమే 2.77 శాతం వృద్ధితో రూ.85,021.74 కోట్లకు చేరాయి. కర్ణాటక ఎగుమతులు –9.06 శాతం, మహారాష్ట్రలో –7.04 శాతం, గుజరాత్‌లో –7.91 శాతం మేర క్షీణించాయి.
కొత్తగా రెండు కార్గో టెర్మినళ్లు
కృష్ణపట్నం పోర్టులో మా వ్యాపారం ప్రతి నెలా పెరుగుతోంది. అక్కడ మేం కంటైనర్ టెర్మినల్‌ను తొలగిస్తున్నామనటం అబద్ధం. మార్కెట్ ట్రెండ్ ఆధారంగా సరుకు రవాణాపై భిన్న వ్యూహాలు అనుసరిస్తూ ఉంటాం. మా పోర్టు నుంచి ఒక్కరిని కూడా తొలగించలేదు. గంగవరంలో కంటైనర్ టెర్మినల్ నిర్మించటం వల్ల మా వ్యాపారం మరింత పెరుగుతోంది. ప్రభుత్వానికి మేం చెల్లిస్తున్న రాయల్టీ గణాంకాలే రాష్ట్ర ఆదాయం ఎలా పెరుగుతోందో స్పష్టం చేస్తున్నాయి. ‘ఈనాడు’ పత్రికలో వెలువడ్డ కథనాన్ని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం.
– అదానీ పోర్ట్ అండ్ సెజ్
ఉద్యోగాలు పెరిగాయ్..
కృష్ణపట్నం పోర్టులో వ్యాపారం తగ్గడం వల్ల 10,000 మంది ఉపాధి కోల్పోయారనేది పచ్చి అబద్ధం. నిజానికి అక్కడ ఉద్యోగాలు పెరిగాయి. ఉత్తరాదిలో భూమి విస్తీర్ణం ఎక్కువ, తీర ప్రాంతం తక్కువ. దక్షిణాదిలో తీర ప్రాంతం అధికం. అందుకని పోర్టులు ఎక్కువ. కంటైనర్ల వ్యాపారానికి పోటీ ఎక్కువగా ఉంటుంది. గంగవరం పోర్టులో కొత్తగా రెండు కార్గో టెర్మినళ్లతో పాటు మూలపేట పోర్టులో కార్గో టెర్మినల్స్ అభివృద్ధి చేస్తున్నాం.
– రవీంద్రనాథ్‌రెడ్డి, డిప్యూటీ సీఈవో, ఏపీ మారిటైమ్ బోర్డు
Comments
Please login to add a commentAdd a comment