సాక్షి, అమరావతి: ఆర్టీసీ ఉద్యోగుల కష్టాలు చూసి ఆవేదన చెందిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని పాదయాత్ర సందర్భంగా చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే చెప్పిన మాట ప్రకారం 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కలను నిజం చేస్తూ ప్రభుత్వంలో విలీనం చేశారు. దీని ద్వారా ఆర్టీసీ ఉద్యోగులు అనేక ప్రయోజనాలు పొందుతున్నారు.
ప్రజల నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. స్వప్రయోజనాలే పరమావధిగా పనిచేసే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం కాదని చెప్పడమే కాదు.. ఆ సంస్థను అడగడుగునా నీరుగార్చే ప్రయత్నం చేశారు. ఇవి వాస్తవాలు.
కానీ, రామోజీరావుకు చంద్రబాబు ప్రయోజనాల పరిరక్షణ ఓ ‘పిచ్చి.’ చంద్రబాబు తప్ప ప్రజలు, ఉద్యోగులు సంతోషంగా ఉంటే సహించలేరు. అందుకే వాస్తవాలను విస్మరించి ఆర్టీసీ కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఓ విష కథనాన్ని ఈనాడులో ప్రచురించారు. అవాస్తవాలు, అభూతకల్పనలతో కథనాన్ని అల్లారు. విలీన ప్రక్రియ సందర్భంగా వివిధ దశల్లో ఉన్న అంశాలను వక్రీకరిస్తూ ఉద్యోగులను తప్పుదారి పట్టించేందుకు కుట్రలు పన్నారు.
కానీ వాస్తవాలు ఆర్టీసీ ఉద్యోగులకు తెలుసు. వారి సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కనబరుస్తున్న నిబద్ధత తెలుసు. ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం నుంచి ఇతరత్రా ఆర్థిక ప్రయోజనాలు కల్పించడం వరకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన కార్యాచరణ చేపట్టింది. ఆర్టీసీ ఉద్యోగులకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కల్పించిన ప్రయోజనాలను ఓసారి పరిశీలిద్దాం..
కార్పొరేట్ శాలరీ (ప్రమాద బీమా) ప్యాకేజీ
ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేట్ శాలరీ (ప్రమాద బీమా) ప్యాకేజీని మొదట రూ.45 లక్షలకు అనంతరం ఏకంగా రూ.1.10 కోట్లకు ప్రభుత్వం పెంచడం విశేషం. అందుకోసం ఎస్‌బీఐతో ఒప్పందం చేసుకుంది. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచింది.
జీతాలతోపాటు అలవెన్స్‌లు
డ్యూటీ సంబంధిత అలవెన్స్‌లను ఆర్టీసీ గతంలో జీతంతో కలిపి ఇచ్చేది. కానీ ప్రభుత్వ శాఖల్లో ఆ విధానం అమలులో లేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పటికీ, ఆ సంస్థ ఉద్యోగులకు మాత్రం జీతంతోపాటే అలవెన్స్‌లను కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం విశేషం. ఆ ఫైల్ ప్రస్తుతం ఆర్థిక శాఖ వద్ద ఉంది. త్వరలోనే ఉత్తర్వులు వెలువడతాయిని ప్రభుత్వం చెప్పింది.
సమగ్రంగా సర్వీసు నిబంధనలు
ఆర్టీసీ ఉద్యోగుల సర్వీసు నిబంధనలపైనా ఈనాడు వక్రభాష్యం చెప్పింది. గతంలోఆర్టీసీ రెగ్యులేషన్ నిబంధనలు అమలులో ఉండేవి. ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత ఆర్టీసీ ఉద్యోగుల సర్వీసు నిబంధనలపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు చేసింది. ఉద్యోగుల ప్రవర్తన, క్రమశిక్షణ నిబంధనలకు ఎలాంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా ఆచరణలోకి తెచ్చేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆ ప్రక్రియ తుది దశలో ఉంది. త్వరలోనే సర్వీసు నిబంధనలను ఖరారు చేయనున్నారు. ఆ నిబంధనలు విడుదలైన తరువాత ఆ ప్రకారం ప్రస్తుతం పెండింగులో ఉన్న అప్పీళ్లు అన్నీ పరిష్కరిస్తారు.
మెరుగైన పింఛన్ విధానం
ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ–2022 ను ఆర్టీసీ ఉద్యోగులకు కూడా సీఎం వైఎస్ జగన్ వర్తింపజేశారు. అదే సమయంలో ఆర్టీసీ ఉద్యోగులకు పీఎఫ్ సంస్థ ద్వారా అమలయ్యే పింఛన్‌ను కొనసాగించాలని నిర్ణయించారు. ఎందుకంటే అప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు అమలులో ఉన్న సీపీఎస్ పింఛన్ విధానంలో కూడా మార్పులు చేసేందుకు ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. జీపీఎస్‌ను అమలులోకి తేవడానికి సర్వం సిద్ధమైంది. జీపీఎస్ అమలుపై తుది ఆదేశాలు వచ్చిన తరువాత ఆర్టీసీ ఉద్యోగుల పింఛన్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.
మెరుగైన రీతిలో ఈహెచ్‌ఎస్
ప్రభుత్వ ఉద్యోగుల వైద్య సదుపాయం కోసం ఈహెచ్‌ఎస్‌ను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఆర్టీసీ ఉద్యోగుల పనివేళలు, ఉండే ప్రదేశాలు కాస్త భిన్నంగా ఉంటాయి. అందుకే ఆర్టీసీ ఉద్యోగులకు అమలు చేసే ఈహెచ్‌ఎస్ విధానంలో తగిన మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి.
పథకాలు
ఆర్టీసీ ఉద్యోగులకు గతంలో వర్తించిన ఎస్‌ఆర్‌బీఎస్, ఎస్‌బీటీ పథకాలను నిపుణుల కమిటీ రద్దు చేసింది. ఎందుకంటే ఆ పథకాలకు సరిసమానమైన పథకం ఏపీజీఎల్‌ఐ ప్రభుత్వ ఉద్యోగులకు అమలవుతోంది. వాటినే ఆర్టీసీ ఉద్యోగులకూ వర్తింపజేసింది. అందువల్ల 2026 ఏప్రిల్ వరకు ఉద్యోగ విరమణ చేసే ఉద్యోగులకు ‘ఎస్‌ఆర్‌ఎంబీ’ లో జమ అయిన మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించారు. 2030 ఏప్రిల్ వరకు ఉద్యోగ విరమణ చేసే ఉద్యోగులకు ‘ఎస్‌బీటీ’లో జమ అయ్యే మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించారు. మిగతా ఉద్యోగులకు కూడా చెల్లించాల్సిన మొత్తాన్ని వడ్డీతో సహా వారి ఖాతాల్లో జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
దీర్ఘకాలిక డిమాండ్ నెరవేరిన వేళ
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నది దీర్ఘకాలిక డిమాండ్. దశాబ్దాలు గడిచిపోతున్నా ఆ డిమాండ్ కలగానే మిగిలిపోతుందా అని ఆర్టీసీ ఉద్యోగులు నిర్వేదంలో కూరుకుపోయిన వేళ.. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న విధాన నిర్ణయం వారి జీవితాల్లో కొత్త వెలుగులు తెచ్చింది. పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడుతూ వైఎస్ జగన్ సీఎం అయిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ప్రజా రవాణా విభాగంగా మార్చారు. అంతకు ముందు సీఎంగా ఉన్న చంద్రబాబు ఆర్టీసీ విలీనం సాధ్యం కాదని నిర్ద్వందంగా తిరస్కరించిన అంశాన్ని వైఎస్ జగన్ సుసాధ్యం చేసి చూపించారు.
ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచే నెలనెలా జీతాలు అందుతున్నాయి. ఆర్టీసీ ఉద్యోగుల జీతాల కోసం ప్రతి నెలా రూ.275 కోట్ల ఆర్థిక భారాన్ని ప్రభుత్వం భరిస్తోంది. ఆ విధంగా ఇప్పటివరకు రూ.10,336 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది. దాంతో ఆర్టీసీపై ఆర్థిక భారం తగ్గి, దీర్ఘకాలికంగా ఉన్న అప్పులను తీరుస్తూ ఆ సంస్థ లాభాల బాటలో ప్రయాణిస్తోంది. సీసీఎస్ వంటి సంస్థల నుంచి తీసుకున్న రూ.2,415 కోట్ల అప్పులు తీర్చింది. ఆర్టీసీ ఉద్యోగులకు రూ.307 కోట్ల ఎరియర్స్‌ను కూడా చెల్లించింది.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే సంస్థను మూసుకోవాల్సిందే అని హేళన చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్.. నాలుగేళ్ల తరువాత తన మాటను వెనక్కి తీసుకున్నారు. ఏపీ సీఎం జగన్ బాటను అనుసరించి తెలంగాణ ఆర్టీసీని కూడా ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పారు. అదీ సీఎం వైఎస్ జగన్ దార్శనికత. ఇతర రాష్ట్రాలకు ఆదర్శం అంటే ఇదే అని వేల మంది ఆర్టీసీ ఉద్యోగులతో పాటు యావత్ రాష్ట్ర ప్రజలు గర్వంగా తమ ముఖ్యమంత్రి గురించి చెప్పుకునేలా చేశారు.
ప్రయాణికులకు మెరుగైన సేవలు
ఉద్యోగుల ప్రయోజనాలే కాదు ప్రయాణికులకు సౌకర్యాల కల్పనలోనూ ఆర్టీసీది అగ్రస్థానం. కొత్త విద్యుత్ బస్సులు కొనడంతోపాటు డీజిల్ బస్సులను విద్యుత్ బస్సులుగా మారుస్తోంది. 1,500 కొత్త డీజిల్ బస్సుల కొనుగోలు ప్రక్రియ మొదలు పెట్టింది. 2023–24లో కొత్తగా వేయి విద్యుత్ బస్సులు కొనాలని నిర్ణయించింది. దేశంలో వివిధ పుణ్య క్షేత్రాల సందర్శన, పుష్కరాల కోసం కొత్త బస్సులు నడుపుతోంది. రెండు వైపులా టికెట్లు తీసుకునే ప్రయాణికులకు 10 శాతం రాయితీ కల్పిస్తోంది. ఇలా ప్రయాణికులకు అనేక మెరుగైన సేవలతో వారి మన్ననలు పొందుతోంది.
Comments
Please login to add a commentAdd a comment