సాక్షి, అమరావతి: ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు బుకాయించడంలో రామోజీ దిట్ట. అలా చేయకపోతే ఆయన కంటి మీద కునుకు పట్టదు. ఇలా బుకాయించడంలో ఆయన గిన్నీస్‌బుక్ రికార్డు కూడా ఇప్పటికే నెలకొల్పి ఉంటారు. ఎందుకంటే.. రాష్ట్ర ప్రభుత్వంపై నిత్యం ఆయన విషం కక్కడమే లక్ష్యంగా పెట్టుకున్నారు కాబట్టి. తాజాగా.. సీఎం జగన్ ప్రభుత్వంపై ఎప్పటిలాగే ఆయన మరోమారు తన కడుపుమంటను చాటుకున్నారు.
గతంలో తన ఆత్మబంధువు చంద్రబాబు పాలన ఎంతో ఘనంగా ఉండేదని, ఇప్పుడే ఏమీ జరగడం లేదన్నట్లుగా ‘మొహం చాటేసిన సీఎం’ అంటూ ఈనాడులో ఆదివారం ఓ అబద్ధాల మాలికను అల్లారు. అప్పట్లో ప్రభుత్వాసుపత్రుల్లో అందే సేవలకూ, ప్రస్తుత ప్రభుత్వం హయాంలో అందుతున్న సేవలకూ మధ్య తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుండడంతో దిక్కతోచని స్థితిలోనే తాజా కథనం రాసినట్లు దానిని చదివిన వారికి ఇట్టే అర్థమవుతుంది.
విప్లవాత్మక మార్పులపై విషం..
నిజానికి.. సీఎం జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏకంగా 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటుచేస్తుండగా, అందులో ఐదు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మరోవైపు.. పీహెచ్‌సీల నుంచి బోధనాసుపత్రుల వరకూ నాడు–నేడు కింద అభివృద్ధి పరచడంతోపాటు ఎక్కడా ఖాళీల్లేకుండా 53,126 సిబ్బందిని వైద్య, ఆరోగ్య శాఖలో కొత్తగా నియమించారు.
గ్రామాల్లో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఉద్దేశించిన విలేజ్ క్లినిక్ వ్యవస్థ, దేశంలోనే పలువురి ప్రశంసలు అందుకున్న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, కొత్త వైద్య కళాశాలలుం ఇలా ప్రజారోగ్య రంగంలో ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి విప్లవాత్మక మార్పు పైనా రాజగురువు వరుసగా తప్పుడు కథనాలు రాస్తున్నారు. తాజా కథనం కూడా ఈ కోవకు చెందినదే.
నిత్యం 2,204 వాహనాల పరుగులు..
గతంలో ఎన్నడూ లేనట్లుగా రాష్ట్రంలో ‘108’ వాహనాలు 768 ఉన్నాయి. మొబైల్ మెడికల్ యూనిట్స్ (ఎంఎంయూ) ‘104’లు 936, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ కింద 500 వాహనాలు నిత్యం పరుగులు పెడుతున్నాయి. ఇలా మొత్తం 2,204 వాహనాల ద్వారా వేగవంతమైన, ప్రజల ప్రాణాలను కాపాడే వ్యవస్థ దేశంలో మరెక్కడా లేదు. ఇది చూసి ప్రభుత్వానికి ప్రజల్లో ఎక్కడ మంచి పేరు వస్తుందోనని తొలి నుంచీ ఈ సేవలపై రామోజీ విషం కక్కుతూనే ఉన్నారు. ఆదివారం నాటి కథనంలోనూ ఆయన అలాగే తన అక్కసును వెళ్లగక్కారు.
నాడు దైన్యం.. నేడు ధైర్యం..
గత టీడీపీ ప్రభుత్వంలో 108, 104 సేవలను పూర్తిగా నిర్వీర్యం చేశారు. అత్యవసర సమయంలో ఫోన్‌చేస్తే 108 అంబులెన్సు వస్తుందో రాదో తెలియని దుస్థితి. అయితే, అప్పట్లో సీఎం కుర్చీలో తమ బాబు ఉన్నాడు కాబట్టి రామోజీకి సహజంగా ఇవేమీ కనపడేవి కావు. టీడీపీ ప్రభుత్వంలో దైన్యంగా మారిన ఈ సేవలను సీఎం జగన్ పట్టాలెక్కించి ప్రజల్లో ధైర్యం నింపారు. మరోవైపు.. 2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చేనాటికి 108 అంబులెన్సులు 531 ఉండగా వీటిలో 336 వాహనాలు అరకొరకగా రోడ్లపై కనిపించేవి. అంటే.. అప్పట్లో 679 మండలాలు (ప్రస్తుతం 686) ఉంటే మండలానికి ఒక అంబులెన్స్ కూడా లేని పరిస్థితి.
ఈ నేపథ్యంలో.. ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించిన సీఎం జగన్ 2020 జూలై 1న 412 కొత్త 108 అంబులెన్సులను ప్రారంభించారు. 26 నియోనాటల్ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఒక్కసారిగా ప్రభుత్వ అంబులెన్సుల సంఖ్య 748కు పెరిగింది. ఇందుకోసం మొత్తం రూ.96.5 కోట్లు ఖర్చుచేశారు. 2022 అక్టోబరులో అదనంగా మరో 20 అంబులెన్సులను (108 వాహనాలు) గిరిజన ప్రాంతాలకు కేటాయించారు.
వీటి కోసం రూ.4.76 కోట్లు వెచ్చించారు. దీంతో 108 అంబులెన్సుల సంఖ్య 768కి చేరింది. అంతేకాక.. ఈ ఏడాదే 2.5 లక్షల కిలో మీటర్లకుపైగా తిరిగిన పాత వాహనాలను తొలగించి వాటి స్థానంలో 146 కొత్త అంబులెన్సులను ప్రవేశపెట్టారు. వీటి కోసం రూ.34.79 కోట్లు ప్రభుత్వం ఖర్చుచేసింది. ఈ లెక్కన 2020 నుంచి ఇప్పటివరకు కొత్త అంబులెన్సుల కొనుగోలుకు రూ.135.05 కోట్లు ఖర్చుచేసినట్లయింది.
‘108’ల కోసం ఏటా రూ.188 కోట్ల ఖర్చు
ఇక ఈ అంబులెన్స్ల నిర్వహణ కోసం నెలకు రూ.14.39 కోట్లు చొప్పున ఏడాదికి రూ.172.68 కోట్లు కేవలం 108 అంబులెన్సుల నిర్వహణ కోసం కేటాయిస్తోంది. వీటికి తోడు ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ కోసం ఏడాదికి రూ.15.88 కోట్లు వెచ్చిస్తోంది. అంటే మొత్తంగా ఒక ఏడాదిలో 108 వాహనాలు కోసం చేస్తున్న ఖర్చు రూ.188.56 కోట్లు. ఇదంతా పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో భాగంగానే జరుగుతోంది.
ఇంత చిత్తశుద్ధితో 108 సేవలు అమలుచేస్తుంటే రామోజీరావు బురద జల్లే రాతలు రాయడమే పనిగా పెట్టుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో అర్బన్ ప్రాంతాల్లో నిర్దేశించుకున్న 15 నిమిషాలు, రూరల్ ప్రాంతాల్లో నిర్దేశించుకున్న 20 నిమిషాల్లోపే 108 అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకుని ఆపన్న హస్తం అందిస్తున్నాయి. ఇదీ 108 సేవల సమర్థతకు నిదర్శనం.
సొంత ఊర్లలోనే ‘104’ సేవలు..
ఇక సీఎం జగన్ ప్రభుత్వంలో 104 సర్వీసుల స్వరూపానికి పూర్తిగా మార్పులు చేశారు. జూలై 2020లో 656 ఎంఎంయూ (104)లను సీఎం జగన్ ప్రారంభించారు. ఇందుకు రూ.108 కోట్లు ఖర్చుచేశారు. రూ.4 కోట్లతో మరో 20 వాహనాలను గిరిజన ప్రాంతాల్లో సేవల కోసం కొనుగోలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 10,032 వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలుచేయడానికి వీలుగా అదనంగా 260 (104) వాహనాలను ప్రవేశపెట్టారు. వీటికోసం రూ.58 కోట్లు వెచ్చించారు. ఈ మొత్తం 936 మొబైల్ మెడికల్ యూనిట్ల ద్వారా కోట్లాది మంది ప్రజలు తమ సొంత ఊర్లలోనే వైద్యసేవలు పొందారు.
ఒప్పందం ప్రకారం వేతనాలు చెల్లిస్తున్నా..
108, 104 సిబ్బందికి ఒప్పందం ప్రకారం సర్వీస్ ప్రొవైడర్ నుంచి వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిని కూడా రామోజీ తట్టుకోలేకపోతున్నారు. గత సంవత్సరం ఉద్యోగులకు నిర్దేశించిన బేసిక్ పే పై 8 శాతం ఇంక్రిమెంట్‌తో జీతాలు పెంచేలా చర్యలు తీసుకున్నారు. అదే విధంగా ఈ ఏడాది కూడా ఇంక్రిమెంట్ ఇచ్చి, ఆ ఇంక్రిమెంట్ ఎరియర్స్‌ను చెల్లించేలా ఆదేశాలిచ్చారు.
ఉద్యోగులకు ప్రతినెలా జీతాలను జమచేయడంలో ఎప్పుడన్నా జాప్యం జరిగినా వెంటనే వేతనాలు అందేలా చర్యలు ఉంటున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరాన్ని పరిశీలిస్తే సెప్టెంబరు వరకూ వేతనాలు పూర్తిగా చెల్లించారు. అయినా జీతాలు ఇవ్వలేదని ఈనాడు పెడబొబ్బలు పెడుతోంది. అలాగే, అక్టోబరు నెల వేతనం నవంబరులో ఇస్తారు. ఇవన్నీ ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా రామోజీ రోత రాతలు లేనిపోని సమస్యలను సృష్టించేందుకు తప్ప మరొకటి కాదు.
‘తల్లీబిడ్డ’ సేవల్లోనూ ఎంతో మార్పు
► గతంలో కేవలం 279 తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్‌లు ఉంటే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక వాటి సంఖ్య 500కు పెరిగింది.
► అప్పట్లో తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్ పేరిట ఓమ్నీ వాహనాలను వినియోగించేవారు. ఒక్కో దానిలో ఇద్దరు గర్భిణులను తరలించేవారు. ఏసీ సదుపాయం కూడా లేదు.
► కానీ, ప్రస్తుత ప్రభుత్వంలో విశాలమైన ఎకో మోడల్ ఏసీ వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. ఒక్కో దాంట్లో ఒకరిని మాత్రమే తరలిస్తున్నారు.
► గత ప్రభుత్వ హయాంలో ఒక ట్రిప్పునకు కేవలం రూ.499లు మాత్రమే ఖర్చుచేయగా.. ఈ ప్రభుత్వం రూ.895లు వెచ్చిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment