సాక్షి, అమరావతి: చింతకాయను ఎంత చితక్కొట్టినా.. ఉల్లిపాయను ఎంత ఉడకబెట్టినా వాటి సహజ లక్షణం కోల్పోవు. ఈనాడు రామోజీరావు తీరు కూడా అంతే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పైనా.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపైనా ఆయన నిత్యం వెళ్లగక్కుతున్న అక్కసు, చేస్తున్న విషప్రచారంపై ఎన్ని విమర్శలు ఎదురవుతున్నా ఆయనలో మార్పులేదు.. రాదు. ఎందుకంటే.. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలపై ఆయన పనిగట్టుకుని.. కళ్లు మూసుకుని చెప్పిన అబద్ధాలే చెప్పి రాసిన అబద్ధాలే రాస్తున్నారు కాబట్టి. తాజాగా.. రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై ఆయన గుండెలు బాదుకున్న తీరు జగన్‌పై రామోజీకున్న అక్కసును మరోసారి చాటిచెప్పింది.
రాష్ట్రంలో వంద శాతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు) 24/7 పనిచేస్తున్నాయని స్వయంగా కేంద్ర ఆరోగ్య శాఖ ప్రశంసలు కురిపించినా రామోజీకి వినిపించదు. నాడు–నేడు కార్యక్రమంలో కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా పీహెచ్‌సీలు రూపాంతరం చెందాయి. ఈ క్రమంలో దేశంలోనే అత్యధిక పీహెచ్‌సీలకు నేషనల్ క్వాలిటీ అసూ్యరెన్స్ సర్టిఫికేషన్‌తో ఏపీ అగ్రస్థానంలో ఉంది. అయినా, ఆయన విషపుత్రిక ఈనాడుకు అది కనిపించదు. ఎందుకంటే ఆయన లెక్కలు, ఎక్కాలు వేరే. సీఎం జగన్ ప్రభుత్వం మీద విషం చిమ్మడమే ఆయన జెండా.. ఎజెండా. అందుకే ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ వైద్య రంగం ఎంత మెరుగుపడినా ఆయనకు పట్టదు. నిజానికి.. గత టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో పీహెచ్‌సీలంటే నరకానికి నకళ్లు అన్నట్లుగా ఉండేవి.
ఒక్క పీహెచ్‌సీలే కాదు.. బోధనాస్పత్రుల వరకూ అన్ని ఆస్పత్రులది అదే దుస్థితి. అయినా, అప్పట్లో రామోజీరావుకు, ఈనాడుకు అంతా పచ్చగా కనిపించేది. ఆ తర్వాత సీఎంగా వైఎస్ జగన్ పగ్గాలు చేపట్టాక.. ప్రజారోగ్యం పట్ల చిత్తశుద్ధితో ఆయన ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమం అమలు, 53 వేలకు పైగా పోస్టుల భర్తీ, ఇతర విప్లవాత్మక చర్యలతో ప్రభుత్వ వైద్య రంగం రూపురేఖలను సమూలంగా మార్చినప్పటికీ ‘పచ్చ’కామెర్లతో రామోజీరావు కంటికి ఇవేమీ కనిపించడంలేదు. అందుకే ‘వైద్య రంగం బలోపేతమా.. ఎక్కడ?’ అంటూ ఈనాడులో మంగళవారం చేతికొచ్చింది రాసిపారేశారు. పీహెచ్‌సీల్లో అరకొర సేవలతో రోగుల వెతలు అంటూ ప్రభుత్వంపై ఇష్టానుసారం బురదజల్లారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వైద్యరంగంపై అసలు వాస్తవాలు ఏమిటంటే..
సిబ్బంది, వనరులు ఉండటం బలోపేతం కాదా?
టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పీహెచ్‌సీల్లో ఒకేఒక్క వైద్యుడు ఉండేవాడు. అతను సెలవుపై వెళ్తే ఇక వైద్యసేవల సంగతి దేవుడెరుగు. మందులు, వైద్య పరీక్షల గురించి అయితే చెప్పక్కర్లేదు. ఎందుకంటే.. పీహెచ్‌సీల్లో వైద్య పరీక్షల పేరిట ప్రజాధనాన్ని టీడీపీ పెద్దలు లూటీచేసిన విషయం జగమెరిగిన సత్యం. అప్పట్లో పీహెచ్‌సీ భవనాలు బూత్‌బంగ్లాలను తలపించేవి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక గ్రామీణ స్థాయిలో ప్రజలకు మెరుగైన వైద్యసేవలకు పెద్దపీట వేసింది. ఈ క్రమంలో.. రాష్ట్రంలోని 1,145 పీహెచ్‌సీల్లో ఇద్దరు వైద్యులు, ముగ్గురు స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్‌లతో కలిపి ప్రతిచోట 14 మందిని నియమించారు.
వీటిల్లో రూ.664.96 కోట్లతో నాడు–నేడు పనులను చేపట్టారు. 922 పీహెచ్‌సీలకు మరమ్మతులు పూర్తయ్యాయి. ఇక మరికొన్ని పీహెచ్‌సీలకు కొత్త భవనాల నిర్మాణం వచ్చే నవంబర్ నెలాఖరు నాటికి పూర్తికానున్నాయి. అంతేకాక.. ప్రతి మండలానికి రెండు పీహెచ్‌సీలు లేదా ఒక పీహెచ్‌సీ/ఒక సీహెచ్‌సీ ఉండేలా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా నూతనంగా 88 పీహెచ్‌సీలు, 63 కో–లోకేటేడ్ పీహెచ్‌సీలు ప్రారంభించారు. నూతన పీహెచ్‌సీలకు ప్రభుత్వం కొత్త భవనాలను నిర్మిస్తోంది. నాడు–నేడులో భాగంగా అన్ని వసతులతో పీహెచ్‌సీ భవనాలను తీర్చిదిద్దారు. అంతేకాక.. మానవ వనరుల కొరతకు తావులేకుండా ఎప్పటి ఖాళీలను అప్పుడే ప్రభుత్వం భర్తీచేస్తోంది.
ప్రతి పీహెచ్‌సీలో 172 రకాల మందులు, 67 పరీక్షలు నిర్వహించడానికి వీలుగా వైద్య పరికరాలను సమకూర్చడంతో పాటు, పరీక్షలు చేయడానికి అవసరమయ్యే రసాయనాలను ఎప్పటికప్పుడు సరఫరా చేస్తున్నారు. ఈ చర్యలన్నీ గమనించినా, పీహెచ్‌సీల్లో వచ్చిన మార్పులు చూసినా రాష్ట్రంలో ప్రాథమిక వైద్యం బలోపేతం అయిందని ఎవరైనా అంగీకరిస్తారు ఒక్క రామోజీ తప్ప. ఎందుకంటే జగన్ అన్నా.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అన్నా ఆయన ఉదరం నిత్యాగ్నిహోత్రంలా ఎప్పుడూ రగిలిపోతూ ఉంటుంది కాబట్టి.
24/7 సేవలపై దిగజారుడు రాతలు..
వంద శాతం పీహెచ్‌సీలను 24/7 నడుపుతున్న కొద్ది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని కేంద్ర ఆరోగ్య శాఖ పలుమార్లు తన నివేదికల్లో కొనియాడింది. అయినాసరే.. ఇవేమీ తనకు పట్టవనుకున్న రామోజీ 24 గంటల సేవలు అంతంత మాత్రమేనని దిగజారుడు రాతలు రాశారు. పీహెచ్‌సీలు 24/7 పనిచేసేలా వైద్య, ఆరోగ్య శాఖ పర్యవేక్షణ కొనసాగిస్తోంది. రాత్రి సమయంలో స్టాఫ్ నర్సు సహాయంగా, ఒక లాస్ట్ గ్రేడ్ కేడర్ సిబ్బందిని/ఎఫ్‌ఎన్‌ఓను ఉంచడం ద్వారా సేవలు అందుబాటులో ఉంచుతున్నారు. అలాగే..
► కర్నూల్ జిల్లా ఆస్పిరి పీహెచ్‌సీలో 15 రకాల పరీక్షలు మాత్రమే చేస్తున్నారని ఈనాడులో ఆరోపించారు. అయితే, ఈ పీహెచ్‌సీలో నిర్ధేశించిన అన్ని రకాల మందులు, వ్యాధి నిర్ధారణ పరీక్షల సదుపాయాలున్నాయి.
► విజయనగరం జిల్లా రామభద్రపురం పీహెచ్‌సీలో ఓపీ, ఇతర సేవలు పడిపోయాయి. ప్రజలు ఇతర ప్రభుత్వాస్పత్రులకు వెళ్తున్నట్టు ఆరోపించారు. అయితే, ఈ పీహెచ్‌సీలో నెలనెలా సుమారుగా 1,500–1,800 ఓపీలు నమోదవుతున్నాయి. పీహెచ్‌సీ పరిధిలోని గ్రామాలకు ఫ్యామిలీ డాక్టర్లు నెలలో రెండుసార్లు సందర్శించి అక్కడే ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్నారు. 10–20కి.మీ పరిధిలో మూడు సామాజిక ఆసుపత్రులు అందుబాటులో ఉండటంతో ప్రజలు అత్యవసర సేవల కోసం ఆయా ఆస్పత్రులకు వెళ్తున్నారు.
2019 నుంచి వైద్య రంగం బలోపేతానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు..
► నాలుగేళ్లలో దాదాపు 53 వేలకు పైగా వైద్య పోస్టుల భర్తీ. ఎప్పటి ఖాళీలకు అప్పుడే యుద్ధప్రాతిపదికన నియామకం. ఇందుకోసమే ప్రత్యేకంగా రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటు.
► రూ.16,800 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు, వివిధ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంతోపాటు నాడు–నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రుల బలోపేతం.
► గ్రామాల్లో 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు.. 12 రకాల వైద్యసేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులతో సొంత ఊళ్లలోనే ప్రజలకు వైద్యసేవలు.
► దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు. నెలకు రెండుసార్లు గ్రామాలకు పీహెచ్‌సీ వైద్యులు.
► టీడీపీ హయాంలో నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీ బలోపేతం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లు 1,059 నుంచి ఏకంగా 3,257కి పెంపు. 40 లక్షల మందికి ఉచిత వైద్యం కోసం రూ.8 వేల కోట్ల వ్యయం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ఆసరాతో విశ్రాంతి సమయంలో జీవన భృతి చెల్లింపు. ఇలా ఇప్పటివరకూ 17.25 లక్షల మందికి రూ.1,074.69 కోట్లు అందించిన ప్రభుత్వం.
► 108 (768 వాహనాలు), 104 (936) వాహనాలతో వైద్యసేవలు బలోపేతం. మరో 500 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలతో కలిపి మొత్తం 2,204 వాహనాలతో ప్రజలకు ఉచిత వైద్యసేవలు. ఈ విధంగా మరే ప్రభుత్వంలోనూ లేవు. టీడీపీ హయాంలో కేవలం 108 అంబులెన్స్‌లు 531 మాత్రమే ఉండగా ఇందులో 336 మాత్రమే మనుగడలో ఉండేవి.
► ప్రభుత్వాస్పత్రుల్లో జీఎంపీ, డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాలు కలిగిన మందులు ఉచితంగా అందించేలా ప్రభుత్వం చర్యలు.
Comments
Please login to add a commentAdd a comment